భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
హంసవాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తరించిన భక్తులు
ఇసుక తిన్నెలపై స్వామివారిని వీక్షించిన భక్త జనం
భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 9 :భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్ధానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం సాయంకాలం సంధ్యా సమయాన భద్రాచల పవిత్ర పావన గౌతమి నదీ తీరంలో సీతారామచంద్ర స్వామి వారి జలవిహారం వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. గోదావరి నదీ తీరం ఒక్కసారిగా పులకించింది. సీతారామచంద్రస్వామి వారిని సాయంత్రం 5 గంటల సమయంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య మేళ తాళాలతో ఉత్సవ మూర్తులను బయటకు ఊరేగింపుగా తీసుకొచ్చి పవిత్ర గోదావరి నది తీరంలో వేంచేసి ఉన్న హంసవాహనంపై కూర్చుండబెట్టారు. భద్రాచలం రామాలయంలో తొలుత వేద పండితులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజాభజంత్రీల సందడి నడుమ, పల్లకిపై సీతారామచంద్ర స్వామి వారిని వేంచేయింపచేసి, భక్తుల జయ జయ ధ్వానాలతో ఊరేగింపుగా పవిత్ర గౌతమీనది తీరానికి తీసుకొచ్చారు.
ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంస వాహనంపై సీతారామ చంద్ర స్వామి వారిని కూర్చుండబెట్టి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నదికి హారతులిచ్చారు. వేద మంత్రాలను పఠించారు. విద్యుత్ కాంతులు మిరుముట్లు గొలుపుతుండగా, గోదారమ్మ పులకిస్తుండగా, శ్రీరామ జయరామ అంటూ భక్తులు నినదిస్తుండగా, వేదఘోష పరిమళాలు వెదజల్లుతుండగా ఆ చూడముచ్చటైన అపురూప జంట సీతారామచంద్ర స్వామి వారు జలవిహారం చేసిన తీరు భక్తులను తన్మయానికి గురిచేసింది. బాణసంచా సందడి భక్తులను అలరించింది. అంతేకాకుండా హంస వాహనాన్ని మామిడి ఆకులు, పూల మాలలతో సుందరంగా అలంకరించారు. హంసవాహనంపై సీతారామచంద్రస్వాములను ప్రతిష్ఠించారు. విద్యుత్ దీపాల కాంతులతో హంసవాహనంపై కూర్చున్న స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. గోదావరి నదీ తీరమంతా మామిడి తోరణాలతో కళకళలాడింది. హంసవాహనంపై ఉన్న స్వామివారిని చూసి తరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది భక్తులు తరలివొచ్చారు. భక్తులతో భదాద్రి రహదారులు కిక్కిరిసిపోయాయి. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

హంసవాహనంలో ఉన్న స్వామివారిని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దంపతులు, రాష్ట్ర హౌసింగ్ ఎండి విపి గౌతమ్, భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య 6 గంటలకు స్వామివారి హంసవాహనం గోదావరి నదిలో విహరించేందుకు బయలుదేరింది. స్వామివారు కూర్చున్న హంసవాహనం ఐదుసార్లు గోదావరిలో ప్రదక్షిణలు చేసింది. గోదావరి ఇసుక తిన్నెలపై కూర్చొని కనులారా ఈ వేడుక తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి. శ్రీరామ..జయ రామ అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలు మిన్నంటాయి.
గోదావరి తీరమంతా జనసంద్రమైంది. గోదావరి తీరం వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఈసారి అధికారులు తీసుకున్న చర్యలు భక్తులను ఆకర్షించాయి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ భక్తులు నినదించడం తో గోదావరి నదీ తీర మారుమోగింది. అంతేకాకుండా వివిధ ఆకారాల్లో తయారు చేసిన బాణాసంచాలు కాల్చడంతో ఆ సుందర దృశ్యాన్ని భక్తులు కనులారా చూసి తరించారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన బాణసంచా విన్యాసాలను భక్తులు ఎంతో ఓపికతో చూసి ఆనందించారు. ఈ ఉత్సవానికి సుమారు 20 వేల మంది భక్తులు వొచ్చారు. ప్రముఖులు సైతం స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రసాదాలు అందించింది. అలాగే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. అధికారులు భదాద్రి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అలాగే భక్తులకు అసౌకర్యం కల్గకుండా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, మంచినీటి సౌకర్యం కల్పించారు.





