ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 : భౌగోళికంగా ఉత్తర, దక్షణ ప్రాంతాలను కలుపుతున్న తెలంగాణ రాష్ట్రం రైల్వే కనెక్టివిటీలో మాత్రం పదో స్థానంలో ఉందని, జిల్లాలు, గ్రామాలను కలుపుతూ నెట్‌వర్క్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ‘చర్లపల్లి రైల్వే టెర్మినల్’ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన హాజరై ప్రసంగించారు. వెనకబడిన రాజస్థాన్ రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడి నెట్‌వర్క్ అందులో సగం మాత్రమే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ‘అభివృద్ధి, తలసరి ఆదాయంలో తెలంగాణ వేగంగా దూసుకెళ్తుంది. కానీ.. రైల్వే నెట్ వర్క్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ పరిస్థితి మారాలి. కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయాలి.
అలాగే ప్రస్తుతమున్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చొరవ చూపాలి’ అని కోరారు. ‘అత్యాధునిక హంగులతో కూడిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే రోజుల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల కంటే చర్లపల్లిలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశముందన్నారు. ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అప్రోచ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని, ఈ విషయంలో కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇందుకు ప్రత్యేక గ్రాంట్ ను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఈడీ పవన్ కుమార్, సీఈ శ్యాం సుందర్, జోనల్ మేనేజర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే