“చైనాలో నన్ను ఆశ్చర్యపరచిన మరో విషయం.. అక్కడ ఎవరికీ వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు లేకపోవడం. అక్కడ ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటివి అక్కడక్కడా కూడళ్లలో పెట్టి ఉన్నాయి. అవసరమైన వాళ్ళు అక్కడే పోల్ కు ఏర్పాటు చేసిన స్కానర్ లో స్కాన్ చేసి తీసుకెళ్ళవచ్చు. తమ పని అయి పోయాక మరో స్టాండులో ఎక్కడైనా పెట్టొచ్చు. అందుకు గాను స్వల్ప మొత్తం చెల్లించాలి. ద్వి చక్ర వాహనాల పైన వెళ్ళే వాళ్ళు ఎవరూ హెల్మెట్ పెట్టుకోలేదు..”
గిరియానం – 11
నేను వచ్చి నెలన్నర దాటినా నా స్మృతి పథం నుంచి చైనా పోవడం లేదు. పైగా అనుక్షణం గుర్తుకు వస్తోంది. చైనాలో జనాభా రీత్యా పెద్ద నగరం షాంఘై అయినా బీజింగ్ రాజధాని . మావో స్మారక స్తూపం కూడా బీజింగ్ లోనే ఉంది. చారిత్రక నగరం కావడం వల్ల కాబోలు ఈ నాటికీ బీజింగ్ నగరమే రాజధానిగా ఉంది. కమ్యూనిష్టు పార్టీ ఒక్కటే అధికారంలో ఉంటుంది. ప్రస్తుత ప్రసిడెంట్ జీ జిన్ పింగ్. భావ స్వేచ్ఛ అని ఎవరైనా ప్రెసిడెంట్ ను కాని, దేశాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడితే కఠినమైన శిక్షలున్నాయని మొదటి రోజే గైడ్ చెర్రీ చెప్పాడు. అయితే ప్రజలకు ఏ ఇబ్బందులూ లేనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడవలసిన అవసరం ఉండదు కదా..
ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. జనాభా రీత్యా భారత దేశం తర్వాత రెండో స్థానంలో ఉన్నా అభివృద్ధి లో మాత్రం అస్తిమ శతాంశం అంతరం ఉంది. నేను అక్కడ ఉన్న పది రోజుల్లో ఒక్కసారి, ఒక్క నిమిషం కూడా ట్రాఫిక్ జాం కాలేదు. అతి పురాతనమైన చరిత్ర కలిగిన దేశం. తన వారసత్వ సంపద పట్ల అత్యంత శ్రద్ధతో చిన్నగీత కూడా పడకుండా కాపాడుకుంటున్నది. నేను వెళ్ళిన ప్రతి చారిత్రక ప్రదేశంలో మన దేశంలో లాగా పిచ్చి రాతలు, పిచ్చి గీతలు కనిపిస్తాయేమోనని వెతికి, కనిపించక ఆనందించాను. అభివృద్ధిలో అమెరికాలాంటి అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ వేగంగా ముందుకు పోతున్నది. అభివృద్ధి పేరుతో సంప్రదాయాన్ని వదులుకునే సంస్కారo లేని దేశం కాదు చైనా. వాళ్ళ సంస్కృతీ సాంప్రదాయాలు చాలా గొప్పవి. స్థానిక చైనీయులు సాయంత్రం ఆరుగంటలకే రాత్రి భోజనం ముగిస్తారని గైడ్ చెర్రీ మొదటి రోజే చెప్పాడు. వాళ్ళకు టీ అలవాటు కూడా లేదట. అందరూ శ్రమిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. మాన్యుమెంట్స్ మీద పిచ్చి గీతలను వెతికి నట్లే అక్కడ ఉన్నన్ని రోజులు పొట్ట ఉన్న మనుషుల కొరకు వెతికాను. అలాంటి వారు ఒకరిద్దరు కనిపించినప్పుడు వాళ్ళను సంప్రదించి స్థానిక చైనీయులు కాదని తెలుసుకున్నాను. వయసుతో సంబంధం లేకుండా అందరూ కష్టపడడం
అక్కడి ఆనవాయితీ.. అక్కడి వ్యవసాయ క్షేత్రాలను దర్శించడానికి ప్రయత్నించాను. కానీ వీలు కాలేదు. నాణ్యమైన పళ్ళు, కూరగాయలు పుష్కలంగా లభిస్తాయి. చైనాలో నన్ను ఆశ్చర్యపరచిన మరో విషయం.. అక్కడ ఎవరికీ వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు లేకపోవడం. అక్కడ ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటివి అక్కడక్కడా కూడళ్లలో పెట్టి ఉన్నాయి. అవసరమైన వాళ్ళు అక్కడే పోల్ కు ఏర్పాటు చేసిన స్కానర్ లో స్కాన్ చేసి తీసుకెళ్ళవచ్చు. తమ పని అయి పోయాక మరో స్టాండులో ఎక్కడైనా పెట్టొచ్చు. అందుకు గాను స్వల్ప మొత్తం చెల్లించాలి. ద్వి చక్ర వాహనాల పైన వెళ్ళే వాళ్ళు ఎవరూ హెల్మెట్ పెట్టుకోలేదు. మా బృందంలో కూడా ఒకరిద్దరు వాటిని తీసుకు వెళ్ళే ప్రయత్నం చేసారు. కానీ యువాన్ లు వాళ్ళ ఫోన్ తో పే చెయ్యడం సాధ్యం కాలేదు. మన హైదరాబాదులో కనిపించే పల్సర్ లాంటి బైక్స్ అక్కడ కనిపించలేదు.
చైనా ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే ముందుందని చెప్పొచ్చు. వాణిజ్య పరంగా ఎగుమతి దిగుమతుల్లో కూడా అంతేనట. చైనా మాల్ అని ప్రచారంలో ఉన్నటువంటి వస్తువులు మాకు ఏ షాపింగ్ మాల్ లోనూ కనిపించలేదు. అన్నీ ఖరీదు ఎక్కువగానే ఉన్నాయి. వ్యాపారం కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు వస్తాయని తెలిసింది.భాష విషయానికి వస్తే గైడ్ జాన్ చెప్పినట్లుగా ఈ మధ్య చైనీయులు కూడా ఇంగ్లీషు చదువుకుంటున్నారు. ( జాన్ ఇంగ్లీష్ టీచర్ కూడా ) అయితే స్వదేశంలోనే స్థిరపడ్డ వాళ్ళకు ఇంగ్లీషు భాష వాడకం అవసరముండదు కాబట్టి నేర్చుకున్న ఆ కొద్దిపాటి భాషను మర్చిపోతు న్నారు.చాలా మంది స్వదేశంలోనే స్థిర పడుతున్నారట. దానికి కారణం స్వదేశంలోనే వాళ్ళకు ఉపాధి లభిస్తోందట. చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నత విద్యకోసం ఇతర దేశాలకు వెళుతున్నారట.ప్రపంచంలో చైనా దేశం ఉన్నత విద్యలో మొదటి పది స్థానాలలో ఉందట. ఉన్నత విద్య కోసం విద్యార్థులను ఇతర దేశాలనుంచి ఆహ్వానిస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మాత్రం లేవు. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి బీజింగ్ లోనే ఎం.బి.బి.యస్. పూర్తిచేసింది.
చైనాలో అధికార భాష ” మాండరిన్ “. ఎక్కువ మంది దానినే మాట్లాడుతారు. విద్యా విధానం చాలా వరకు మాండరిన్ భాషలోనే జరుగుతుందని గైడ్ జాన్ చెప్పాడు. దానిని పుటోన్ గువా అనికూడా అంటారు. దానితో పాటు కాంటోనీస్, వు,జియాంగ్, మిన్, గాన్,హక్కా లాంటి మాండలిక భాషలుకూడా వున్నాయి. ఇలా చైనా భాష అంటే ఒకే భాష కాదు, అనేక భాషల సమ్మిళితం అని చెప్పాలి.చివరగా అమెరికాతో చైనాను అస్సలు పోల్చకూడదు.ఎందుకంటే.. చైనాకు ఉన్న జనాభా, వేల యేళ్ళ అతి పురాతన చరిత్ర అమెరికాకు లేదు. అవి రెండూ ఉండి కూడా చైనా సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించింది. కాబట్టి ప్రపంచంలో చైనా అభివృద్ధిలో ముందు ఉన్న దేశమని నేను ప్రత్యక్షంగా చైనాను చూసివచ్చి అభిప్రాయ పడుతున్నాను.





