మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా తెలంగాణలో ఆటో ఎల్‌పీజీ కొరత తీవ్రమైంది. దీని ప్రభావం రాష్ట్రంలోని లక్షమంది ఎల్‌పీజీ ఆటోడ్రైవర్ల జీవనభృతిపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావం పడటంతో వారు తీవ్ర అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వీరు ఆందో ళనలకు దిగడం తాజా పరిణామం. రాష్ట్రంలో రోజువారీ ఎల్‌పీజీ డిమాండ్ 202 మెట్రిక్ టన్నులుండగా ప్రస్తుతం సరఫరా 147 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. అంటే ప్రతిరోజు 55 మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడుతోంది. గ్యాస్ కోసం ఆటోడ్రైవర్లు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద గంటల కొద్దీ క్యూల్లో వేచివుండాల్సి వొస్తున్నది. సగటున వీరు 4 నుంచి 5గంటలకు వరకు ఓపిగ్గా ఎదురు చూస్తే తప్ప ఆటోల్లో గ్యాస్ ఫిల్లింగ్ చేయించుకోలేకపోతున్నారు. దీనికి తోడు ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, బీపీసీఎల్ సంస్థలకు చెందిన ఫిల్లింగ్ స్టేషన్లలో లీటర్‌కు రూ.75లు ఉండగా , ప్రైవేటు బంకుల్లో రూ.93వరకు వసూలు చేస్తు న్నారు.
ఇది డ్రైవర్లకు భారంగా మారింది. వేధిస్తున్న గ్యాస్ కొరత తమ జీవన భృతిని దెబ్బతీస్తుండటంతో, గ్యాస్ కొరతను నిరసిస్తూ నగరానికి చెందిన ముగ్గురు ఆటోడ్రైవర్లు సెల్ టవర్ ఎక్కడం వీరిలో రగులుతున్న అసంతృప్తికి, రోజువారీ జీవనంపై పెరుగుతున్న అభద్రతా భావానికి దర్పణం పడుతోంది. వీరిలో ఒక ఆటోడ్రైవర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేయడంతో స్థానికులు, పోలీసులు అడ్డుకోవాల్సి వొచ్చింది. ప్రతి జీవికి సహజసిద్ధంగా ఉండే ప్రాణభయాన్ని కూడా లెక్కచేయకుండా తనువు చాలించాలనుకోవడం, దైనందిన జీవన ఒత్తిడి, ప్రాణభయం కంటే అధికంగా ఉండటమే కారణమని భావించాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తక్షణమే కల్పించుకొని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖరాయడం తాజా పరిణామం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం సామాన్యులపై ప్రత్యక్షంగా పడుతుం దనడానికి గ్యాస్ డీలర్ల వద్ద చాంతాడంత క్యూలే సాక్ష్యం. అంతేకాదు గ్యాస్ కొరత కారణంగా ఆటోలు లభ్యం కాక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడంలేదు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల సంఖ్యను మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రజల రవాణా అవసరాలను ఇవెంతమేరకు తీరుస్తాయన్నది ప్రశ్నార్థకమే.
ఎర్రసముద్రం ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల, అంతర్జాతీయంగా ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడి, దిగుమతులు ఆలస్య మవుతున్నాయి. ఫలితంగా తెలంగాణకు రావలసిన ఎల్‌పీజీలో 25-30% వరకు కోత పడింది. రోజువారీ డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ రాకపోవడంతో బంక్‌లు మూతపడుతున్నాయి. విచిత్రమేంటంటే చాలామంది ఆటో డ్రైవర్లు తమ ఆటోలను ఎల్‌పీజీ కిట్‌లతోనే నడుపుతున్నారు. వీరు మళ్లీ పెట్రోల్‌కు మారే అవకాశం లేకపోవడంతో, గ్యాస్ అయిపోగానే తమ ఆటోలను నిలిపివేయక తప్పడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం అధికార్లతో చర్చలు జరుపుతున్నది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చమురు కంపెనీల అధికార్లతో చర్చలు జరిపి, కొరత ఉన్న ప్రాంతాలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీచేశారు. కొద్దిరోజుల్లో ఈ ఇంధన సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికార్ల అంచనా.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లకు కొరత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సుమారు 1.25లక్షల ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు ఎస్సీ/ఎస్టీ యువతకోసం 90% సబ్సిడీతో విద్యుత్ ఆటోలను అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, వీటి రోడ్ టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి వందశాతం మినహాయింపునిస్తోంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి తెలంగాణలో కూడా వార్షికంగా ఇచ్చే సహాయాన్ని రూ.12వేల నుంచి రూ.15వేలకు పెంచాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.
పాత పెట్రోల్ లేదా ఎల్‌పీజీ ఆటో ఇంజిన్‌ను తీసివేసి దాని స్థానంలో విద్యుత్ మోటారును, బ్యాటరీ కిట్‌ను అమర్చడాన్ని ‘రెట్రో ఫిటింగ్’ అంటారు. దీనివల్ల పాత ఆటో, ఎలక్ట్రిక్ ఆటోగా మారుతుంది. ఈ విధంగా మార్పిడి చేయించుకున్న ఆటోలకు పన్ను మినహాయింపు, పర్మిట్ జారీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. గ్యాస్ లేదా పెట్రోల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ ఆటోను నడపడానికి కిలోమీటరుకు 50 పైసల నుంచి ఒక రూపాయి వరకు మాత్రమే ఖర్చవుతుంది. ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడానికి బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఖర్చవుతుంది. అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన (ఏఆరఏఐ సర్టిఫైడ్) ఏజెన్సీల ద్వారానే ఈ మార్పిడి చేయించుకోవాలి. చాలా కంపెనీలు బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఖాలీ అయిన బ్యాటరీని ఇచ్చి నిముషాల్లో ఫుల్ చార్జ్ ఉన్న కొత్త బ్యాటరీని తీసుకోవొచ్చు. ఆటోడ్రైవర్ల సమస్యకు ఇది తక్షణ పరిష్కారం.
కానీ ఖర్చుతో కూడినది కావడం వల్ల అసలే రోజువారీ జీవితం గడపడానికే కష్టపడుతున్న ఆటో డ్రైవర్లకు ఇంత పెట్టుబడిపెట్టి తమ వాహనాలను విద్యుత్‌కు మార్చుకోవడం తలకుమించిన భారమే అవుతుంది . ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 1.25లక్షల ఆటోలను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకొని, ఆయా ఆటో యజమానులకు బ్యాంకు రుణాలు ఇప్పించేం దుకు చర్యలు తీసుకుంటోంది. మధ్యప్రాచ్య సమస్య ఇప్పటికిప్పుడు ఏర్పడింది కనుక, తక్షణ పరిష్కారాలు లభించడం కష్టమైనా, దీన్నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఎదురైనా ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌కు మారడం తప్ప ప్రస్తుతానికి మార్గాంతరం కనిపించడంలేదు!





