తెలుగు పాటకు విప్లవ బాటను చూపిన గద్దర్

“1970 నుంచి గద్దర్‌ ఒగ్గుకథలు, బుర్రకథల రూపంలో ఆయనలో మొగ్గ తొడిగిన సాంస్కృతిక చైతన్యం కాలక్రమంలో పోరాట గీతికగా రూపుదిద్దుకుంది. ప్రజాచైతన్యమే లక్ష్యంగా పాటను ఉద్యమబాట మళ్లించి ప్రజాయుద్ధనౌకగా చెరగని ముద్రవేశారు. చిన్ననాటి నుంచే ప్రజాజీవితాన్ని ప్రారంభించిన గద్దర్‌ తుదివరకూ పీడితవర్గ పక్షపాతిగానే జీవనం సాగించారు. నడుముకు తెల్లని పంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు గజ్జెలు, తలకు ఎర్రటి వస్త్రంతో గద్దర్‌ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు. తర్వాత వస్త్రధారణ మార్చినా తనదైన శైలిని మాత్రం కొనసాగించారు.”

డా. ముచ్చుకోట. సురేష్ బాబు.

1984 నుంచి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ యువజన సంఘం,విరసం, జన నాట్య మండలి, పీడబ్ల్యూజి తదితర సంఘాలు ఏర్పాటు చేసిన సభలలో గద్దర్ పాల్గొనేవాడు. ఆదిలాబాద్ నుంచి అనంతపురం లోని ఉరవకొండ వరకు పలమనేరు నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు ములుగు నుంచి రాయచూరు వరకు గద్దర్ పాటలు వినని వారు ఉండరు. పాట పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకొని వారుండరు. టేప్ రికార్డర్ ఉన్న ప్రతి ఇంట్లో గద్దర్ పాటల క్యాసెట్ ఉండేది. గద్దర్ పాట ఎందరినో ఉద్యమం వైపు ప్రేరేపితం చేసింది. పీడిత తాడిత వర్గాలకు ఒక ఆలంబన, ఓదార్పు గా ప్రతీకగా నిలిచింది. పాట కర్తవ్యం వైపు ఆలోచింపచేసింది. పాటకు శృతి లయ శిల్పం ఇవి కాకుండా కేవలం ప్రజల కష్టాలను, కన్నీటిని, అణచివేత, అసమానతలు అంశాలుగా పాటకు ప్రాణం పోసారు. ఒకటా రెండా దాదాపు మూడు వేలకు పైగా పాటలకు రూపమిచ్చారు.

మెదక్ జిల్లా తూఫ్రాన్‌‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జనవరి 31 న 1949లో ఆయన జన్మించారు. గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్‌ కాగా కొంతకాలానికి రావుని తొలగించుకుని గుమ్మడి విఠల్‌గా మారారు. బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో మొదటి పాట ‘ఆపర రిక్షా’ అని రాశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రచనల సందర్భంగా తాను రాసిన పాట కింద పేరు రాయాల్సి వచ్చినప్పుడు గుమ్మడి విఠల్‌ కాకుండా వేరే పేరు రాయాలని భావించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక వెలుగు వెలిగిన గదర్‌ పార్టీ పేరును స్ఫూర్తిగా తీసుకొని తన పేరును మార్చుకున్నారు. ప్రింటింగ్‌లో పొరపాటుగా గద్దర్‌గా ప్రచురితమై నాటి నుంచి అదే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. దాదాపు అరవై వసంతాలు పైగా ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట పాట ద్వారా ఊపిరి నింపిన విప్లవకారుడు.

నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం ఇలా అన్ని ఉద్యమాలలో తన పాటలతో ప్రజా జీవితాలను ప్రభావితం చేశారు. ప్రభుత్వాలను కదిలించారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావ్ కొడకో నైజాము సర్కరోడా అని రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కొరకు గళమెత్తారు. 1980 లో చాల ఇళ్లల్లో భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న పాట, మదన సుందరి, భారత దేశం భాగ్య సీమ రా సకల సంపదలు గల్ల దేశమున దరిదరమెట్లుందో నాయన, నీతి గల్ల మన దేశంలో న అవినీతేందుకు పెరిగిపోయార పాట . చుండూరు దళితుల ఊచకోత వ్యతిరేకంగా, జ్ఞానం ఒక్కరి సొత్తు కాదన్న అది సర్వ జాతుల సంపదోరన్న, దళిత పులులమ్మా అనే పాట తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా’ పాట ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. ఒరేయ్ రిక్షా సినిమాలోని మల్లెచెట్టుకు పందిరి ఓలే పాటకు, జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న ప్రొద్దు మీద నడుస్తున్న గానమా పాటకు నంది అవార్డులు వచ్చిన తృణప్రాయంగా తిరస్కరించారు.

1970 నుంచి గద్దర్‌ ఒగ్గుకథలు, బుర్రకథల రూపంలో ఆయనలో మొగ్గ తొడిగిన సాంస్కృతిక చైతన్యం కాలక్రమంలో పోరాట గీతికగా రూపుదిద్దుకుంది. ప్రజాచైతన్యమే లక్ష్యంగా పాటను ఉద్యమబాట మళ్లించి ప్రజాయుద్ధనౌకగా చెరగని ముద్రవేశారు. చిన్ననాటి నుంచే ప్రజాజీవితాన్ని ప్రారంభించిన గద్దర్‌ తుదివరకూ పీడితవర్గ పక్షపాతిగానే జీవనం సాగించారు. నడుముకు తెల్లని పంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు గజ్జెలు, తలకు ఎర్రటి వస్త్రంతో గద్దర్‌ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు. తర్వాత వస్త్రధారణ మార్చినా తనదైన శైలిని మాత్రం కొనసాగించారు. ఒగ్గుకథ, బుర్రకథ, ఎల్లమ్మ కథలను ప్రజలకు చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించిన గద్దర్‌ క్రమంగా ప్రజలు ఇతివృత్తంగా ఉండే సమస్యలు, వివక్షపై కలం ఝళిపించారు. కుటుంబ నియంత్రణ, కుల వివక్ష, అస్పృశ్యత, దోపిడీ, ప్రపంచీకరణ ప్రభావం, వెనుకబాటు తనం, పల్లెల అమాయకత్వంపై అనేక రూపాల్లో పాటలు పాడారు.

విద్యార్థి దశ నుంచే గద్దర్‌ ప్రజా జీవితంలో సాగారు. శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం, విప్లవకారులైన వెంపటాపు సత్యం తదితరుల ప్రభావం గద్దర్‌పై బలంగా ఉంది. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్లారు. 1970వ దశకంలో విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. తెలుగు సమాజంలో జరిగిన అన్ని ప్రత్యామ్నాయ ఉద్యమాల్లో ఆయన భాగస్వాములయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అజ్ఞాతంలో గడిపారు. ఎమర్జెన్సీలో 1985 వరకు సాంస్కృతిక ఉద్యమం నడిపించి, 1990 దాకా అండర్‌గ్రౌండ్‌ ఉద్యమంలో పోరు సాగించారు. 1990 ఫిబ్రవరి 19న ఆరేళ్ల అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 1997 ఏప్రిల్‌ 6న ఆయనపై తూటాల వర్షం కురిసింది. తీవ్రంగా గాయపడినా కోలుకున్నారు. 2004లో ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన శాంతి చర్చల్లోనూ పాల్గొన్నారు. 2010 అక్టోబరు 9న దాదాపు 107 ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను స్థాపించి రెండేళ్లు అధ్యక్షుడిగా కొనసాగారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేకంగా నిలిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఉద్యమానికి కొత్త రూపుని ఇచ్చి ముందుకు తీసుకెళ్లాయి. తుది శ్వాస విడిచే వరకు జనం కోసమే గద్దర్‌ పాట, ఆట కొనసాగింది. డా బిఆర్ అంబేడ్కర్ , జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, గౌతమ బుద్ధుడు, కార్ల్ మర్క్స్, లెనిన్ తనకు ఆదర్శమని వారి ఆశయాలకు అనుగుణంగా తాను గళముంటుందని పలు సభల్లో చెప్పారు. తెలుగు పాట ఉన్నంతవరకు గద్దర్ పాట సజీవంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *