పేపర్‌ బాయ్‌ నుండి ముఖ్యమంత్రి దాకా..

 “చైనా యుద్ద సమయంలో అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, యశ్వంత్‌రావు చవాన్‌ను ప్రత్యేకంగా దిల్లీకి రప్పించుకొని రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించడంతో మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మారొతిరావు కన్నంవార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఒక తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు.  20 నవంబర్‌ 1962 నుండి 24 నవంబర్‌ 1963 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.”
స్వయం కృషి, పట్టుదల, చిత్తశుద్ధి, కఠోర పరిశ్రమ ఉంటే మనిషికి అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. పేదరికం వల్ల బాల్యంలో పేపర్‌లు అమ్మే స్థాయి నుండి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడం వెనక ఎంతటి ప్రయాస, అంకిత భావం ఉంటుందో అర్థం చేసుకోవాలంటే మారొతిరావు (మారుతిరావు) సదాశివో (సదాశివ) కన్నంవార్‌ చరిత్ర తెలుసుకోవాలి. ఎమ్‌.ఎస్‌.కన్నంవార్‌గా ప్రసిద్ధి చెందిన మారొతిరావు 10 జనవరి, 1900 రోజున  బ్రిటిష్‌ ఇండియాకు చెందిన బెరార్‌ ప్రొవిన్స్‌లోని సావ్‌లీ లో జన్మించారు. ఆయన పూర్వీకులు మహారాష్ట్ర తెలంగాణా సరిహద్దు జిల్లాల నుండి వలస వచ్చిన తెలుగు కుటుంబానికి చెందినవారు. మహారాష్ట్ర ప్రజలు ఆయన్ని ప్రేమగా, గౌరవంగా ‘దాదాసాహెబ్‌’ అని పిలుచుకుంటారు. ఎమ్మెస్‌ కన్నంవార్‌ కంటే దాదాసాహెబ్‌ కన్నంవార్‌గానే ఆయన సుప్రసిద్ధులు.
తన కొడుకు ఏదైనా ఉద్యోగం చేయాలని మారొతిరావు తండ్రి కోరుకున్నాడు. కానీ, ఒకరి చేతికింద పనిచేయడం, లొంగిపోయి ఉండడం మారొతిరావుకు చిన్నప్పట్నుండే ఇష్టం ఉండేది కాదు. అందుకే దినపత్రికలతో పాటు స్వరాజ్య, తిలక్‌, వందేమాతరం, యంగ్‌ ఇండియా, మరాఠీ నవజీవన్‌ లాంటి పత్రికలు అమ్మే వ్యాపారంలోకి చేరిపోయారు. దాంతో ఆగకుండా, ఆగస్ట్‌ 1947 లో నవసందేశ్‌ అనే వారపత్రికను ప్రారంభించారు. అందులో ఆయన రాసిన వ్యాసాలు సంచలనాత్మకంగా ఉండేవి. ఆయన విద్యార్థి దశ నుండి కాంగ్రెస్‌ పార్టీ అనుయాయుడే అయినా, ‘పేదల పట్ల అన్యాయం జరుగుతూ ఉంటే కాంగ్రెస్‌ పార్టీ కమిటీలెందుకు..? వ్యర్థం..!’ అని 1948లోనే రాశారు. మారొతిరావు కన్నంవార్‌ లోక్‌సేవక్‌, గ్రామ సేవక్‌, పంచాయితీరాజ్‌ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు.
మారొతిరావుకు పరాయి పాలన పై వ్యతిరేకత విపరీతంగా ఉండేది. విద్యార్థి దశనుండే కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆ తర్వాత 1941 నుండి 1945 వరకు జైలు జీవితం గడిపారు. 1938లోనే అఖిల భారత కాంగ్రెస్‌ కమిటి కార్యదర్శిగా పనిచేశారు. మహారాష్ట్ర ప్రొవిన్సియల్‌ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షులుగా 1952 వరకు పని చేశారు. గాంధేయుడైన కన్నంవార్‌ మహాత్మ గాంధీ గురించి ఆరు పుస్తకాలు రచించారు. రచయితగా, సంపాదకుడిగా ఆయన లబ్దప్రతిష్ఠులు. ఆయనకు బాగా నచ్చిన రంగం విద్యారంగం..! పలు విద్యాసంస్థల్ని స్థాపించారు.
మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడక ముందే ఆయన 1952లో చాందా నుండి ఎన్నికై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం విశేషం. 1957లో సావ్‌లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్‌ తరఫున ఎన్నికై క్యాబినెట్‌ మంత్రిగా విధులు నిర్వహించారు. మే, 1960లో మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిరది. కన్నంవార్‌ 1961 ఎన్నికల్లో గెలిచిన తర్వాత యశ్వంతరావు చవాన్‌ మంత్రి మండలిలో ఉప ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. ఈ రకంగా మహారాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకెక్కారు.
అయితే, చైనా యుద్ద సమయంలో అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, యశ్వంత్‌రావు చవాన్‌ను ప్రత్యేకంగా దిల్లీకి రప్పించుకొని రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించడంతో మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మారొతిరావు కన్నంవార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఒక తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు.  20 నవంబర్‌ 1962 నుండి 24 నవంబర్‌ 1963 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముంబై ఉపనగరాల్లో ఒకటైన విక్రోలిలో కన్నంవార్‌ నగర్‌ పేరుతో ఒక పెద్ద కాలనీ ఏర్పాటయింది. ఆయన ప్రజల మనిషి. నాగ్‌పూర్‌లో ఒక ఇంజినీరింగ్‌ కాలేజీకి ‘కర్మవీర్‌ దాదాసాహెబ్‌ కన్నంవార్‌’ అని పేరు పెట్టారు. చంద్రపూర్‌లోని కాంగ్రెస్‌ భవన్‌కు కూడా ఆయన పేరే పెట్టారు. నాగ్‌పూర్‌ సమీపంలోని ఎన్‌హెచ్‌ 6 రహదారిపై యాబై కిలోమీటర్ల దూరం పాటు ఆయన పేరే పెట్టారు. కన్నంవార్‌ పేరుతో చంద్రాపూర్‌లో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి లాంటి ఉన్నత పదవితో పాటు ఎన్నెన్నో పదవులు అధిరోహించినప్పటికీ మారొతిరావ్‌ జీవితాంతం సాధారణ జీవితాన్నే గడిపారు. ఆయన హయాంలో రాష్ట్రంలో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఆయన 24 నవంబర్‌ 1963 నాడు పరమపదించారు. పదవిలో ఉండగా మరణించిన ఏకైక ముఖ్యమంత్రిగా కూడా ఆయన చరిత్ర పుటల్లో నమోదయ్యారు. ఆయన మరణించిన తర్వాత ఆయన సతీమణి గోపికాబాయి కుటుంబ నిర్వహణ కోసం టీకొట్టు పెట్టుకోవడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి, నిజాయితీకి, మచ్చలేని జీవితానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు..!
– సంగెవేని రవీంద్ర,
 ముంబై, మొబైల్ : 99871 45310

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *