45 సంవత్సరాల క్రితం 1977నుండి 79 వరకు సుమారు రెండున్నర సంవత్సరాలు నేనున్నప్పటి పాల్వంచ గ్రామం గురించీ, అక్కడి నా అనుభవాల గురించీ తెలిపే ముందు నేను అక్కడికి చేరుకున్న కారణం ముందుగా తెలుపుతాను. 1976 లో బీ ఎచ్ ఇ ఎల్ (రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్) హైదరాబాద్ వారు సికిందరాబాద్ లోని మనోహర్ టాకీసు దగ్గర వున్న అప్పటి వారి ఆఫీసులో నిర్వహించిన ఇంటర్వ్యూ లో సెలెక్ట్ ఐన మాకు (15 మంది దాకా), బీ ఎచ్ ఇ ఎల్ పవర్ ప్రాజెక్ట్స్ డివిజన్, మద్రాసు నుండి జూనియర్ ఎక్జిక్యూటివ్ గా వచ్చిన అప్పాయింట్ మెంట్ ఆర్డర్లు తీసుకొని డిసెంబర్ 30 నాడు అప్పటి హైదరాబాడ్ మద్రాస్ ఎక్స్ ప్రెస్ లో బయలు దేరి మరునాడు ఉదయం 5.00 గంటలకు మద్రాస్ సెంట్రల్ కు చేరి స్టేషన్ ప్రక్కనే వున్న సెంట్రల్ లాడ్జ్ లో దిగాను. 8.30 వరకల్లా తయారై బీ ఎచ్ ఇ ఎల్ ఆఫీస్ వున్న కరుణానిధి బిల్డింగ్, నందనం కు ఎట్లా పోవాలని ఎంక్వైరీ చేస్తే అక్కడి నుండి సైదాపేటకు పోయే 18 వ నంబర్ బస్ ఎక్కితే అరగంటలో చేరవచ్చని చెప్పారు. సరే అని 20 పైసల టికట్ తో మౌంట్ రోడ్ పై 12 కిలొమీటర్లు పయనించి బస్సు దిగితే ఎదురుగా 8 అంతస్థుల ఎత్తైన భవనం, దాని పైన పెద్ద బీ ఎచ్ ఇ ఎల్ చిహ్నం బిగించ బడి వుంది.

కొత్తగూడెం లో గల రైల్వే స్టేషన్ ను ‘భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్’ అంటారు
15 మందిలో మొదటిగా రిపోర్ట్ చేసింది నేనే. ఒక వారం రోజుల్లో అందరూ వచ్చాక మమ్మల్ని వివిధ విభాగాలుగా విభజించారు. నాకు మరొక ఐదుగురికి ‘బాయిలర్ ఎరెక్షన్’ విభాగం కేటాయించి రెండు నెలల కోసం బాయిలర్లను తయారు చేసే బీ హెచ్ ఇఎల్ తిరుచురాపల్లి కి పంపించారు. మొత్తం దేశంలో పవర్ బాయిలర్లు తయారు చేసే ఏకైక పరిశ్రమ ఇది. 10 వేల మంది దాకా పని చేసే వారు. దాదాపు అన్ని రకాల వెల్డింగ్ లు చేసే పరిశ్రమ కాబట్టి భారత ప్రభుత్వం ప్రక్కనే ‘వెల్డింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ కూడా నెలకొల్పింది. అక్కడ శిక్షణ పొందిన తర్వాత నన్ను కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, పాల్వంచకు బదిలీ చేసారు. ఆ విధంగా నేను మార్చ్, 11 నాడు పాల్వంచ ‘కె టీ పీ ఎస్’ నిర్మాణ స్థలంలో గల మా ‘బీ హెచ్ ఇఎల్ ‘ సైట్ రెసిడెంట్ ఇంజినీరు గారికి రిపోర్ట్ చేసాను.
అప్పుడు కె టీ పీ ఎస్ లో 120 మెగావాట్ల రెండు (7, 8) యూనిట్ల ఎరెక్షన్ పని జరుగుతున్నది. ఇందులో 7 వ యూనిట్ పని దాదాపు ఐపోయింది. దానికి థర్మల్ ఇన్సులేషన్ పని మిగిలి పోయింది. ఆ పని నాకు అప్పగించారు. సంబధిత కాంట్రాక్టర్ కు చెందిన ఇంజినీర్ అయ్యర్ తో కలిసి ఇద్దరం 7వ నంబర్ యూనిట్ పైకి ఎక్కాము. ఇది 14, 15 అంతస్తుల భవనం ఎత్తులో వుంటుంది. పైన బాయిలర్ డ్రమ్ము వుంటుంది. తర్వాత బాయిలర్ నుండి టర్బైనుకు చేరే అధిక పీడన నీటి ఆవిరి పైపులను పరిశీలించాము. ఇవి దాదాపు 540 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగి వుంటాయి తర్వాత స్టోర్స్ కు పోయి థర్మల్ వూల్, దానిపై కప్పే గాల్వనైజ్ద్ షీట్స్ తగు పరిమాణంలో వున్నాయో లేవో (అంటే డ్రాయింగుల ప్రకారం) సరి చూసాము.
నా క్దెందుకో డ్రాయింగ్ లో చూపిన పరిమాణం సరిపోదు కావచ్చ్గు అనిపించింది. తర్వాత రెండు మూడు రోజులు బాయిలర్ భాగాల కొలతలను ను ఒక్కొక్కటిగా పరిశీలించి కాగితం మీద లెక్కలు గట్టి అన్ని వివరాలను తెలుసుకున్న తర్వాత తక్కువ బడే క్వాంటిటీని ఒక పట్టిక లో సూచించాను. తర్వాత మా రెసిడెంట్ ఇంజినీర్ తో ఈ విషయం చర్చించి ఈ వివరాలను పొందుపరుస్తూ మద్రాసు లో వున్న మా హెడ్ ఆఫీసుకి ఒక లేఖ పంపించాము. దాని ఒక కాపీని బీ హెచ్ ఇ ఎల్ తిరుచిరాపల్లి సంబంధిత డిజైన్ డిపార్ట్మెంటుకు పంపించాము. మరునాడు ప్రొద్దున్నే కొబ్బరికాయ కొట్టి అయ్యర్ బృందం పని ఆరంభించింది. మరో లేబర్ గ్రూపును పెట్టి పైన వుండే రిఫ్రాక్టరీ సిమెంట్ కప్పు పనిని కూడా ప్రారంభించాలని సూచించాను. ముందు అతడు నసిగినా మా రెసిడెంట్ ఇంజినీర్ తో చెప్పించి రెండు రోజుల తర్వాత రెండు పనులు సమాంతరంగా జరిగేటట్లు చూసాను.
కొత్తగూడెం, పాల్వంచ ల మధ్య మూరెడు వాగు
ఇక ఆ సాయంత్రం ‘సీ’ కాలనీలో వున్న మా బ్యాచెలర్ ఇంజినీర్స్ వున్న క్వార్టర్ లో వెంకట రాఘవన్, ధనరాజ్ లతో కలసి మా రూం కు చేరాను. ఇది డబుల్ రూం క్వార్టర్. ముందుగా వరండా, తర్వాత పెద్ద హాల్. అందులోనే పెద్ద డైనింగ్ టేబుల్, విడిగా వంట గది. ఒక రూం లో పై ఇద్దరు మిత్రులు. నాకు మరొక గది. అందులో ఒక బెడ్డు ఖాళీ. మా ప్రక్క క్వార్టర్లో మా రెసిడెంట్ ఇంజినీరు గారు కుటుంబ సహితంగా వుంటున్నారు. దూరంగా వున్న మూడు క్వార్టర్లలో ముగ్గురు బీహెచ్‌ఇఎల్ ఇంజినీర్లు కుటుంబ సహితంగా వుంటున్నారు. అక్కడి క్వార్టర్లలో ఇవే పెద్దవి. కొత్తగూడెం నుండి భద్రాచలం పోయే మెయిన్ రోడ్డుకు (30 కిలోమీటర్లు) ఆనుకుని వుంటాయి ఈ క్వార్టర్లు. పాల్వంచ కొత్తగూడెం నుండి భద్రాచలం కు పోయే మెయిన్ రోడ్డుపై రెండు వైపుల నుండి సమాన దూరం18 కి.మీ. దూరంలో వుంటుంది. ఇవి కాకుండా న్యూ ప్రాజెక్ట్ హాస్టెల్ లో మూడు గదులు, ‘బీ’ క్వార్టర్లలో కొన్ని మా బీహెచ్‌ఇఎల్ స్టాఫ్ కు ఇచ్చారు. మా క్వార్టరుకు ఒక లోకల్ వంట మనిషి (కృష్ణ) వుండే వాడు. ప్రతి ఆదివారం మేము ముగ్గురం మా కంపెనీ జీప్ లో కొత్తగూడెం పోయి ఇంటి సామాను తెచ్చే వాళ్ళం. ఖర్చు ముగ్గురం సమం గా పంచుకునే వాళ్ళం.అప్పటి పాల్వంచ సుమారు 10000 జనాభా కలిగి వుండేది అనుకుంటా. శ్రీ వనమా వెంకటేశ్వర రావు గారు అప్పటి పంచాయితీ సమితి ప్రెసిడెంట్. కె టి పి ఎస్ కాకుండా ‘ఏ పీ స్టీల్స్ కర్మాగారం, ‘నవ భారత్ అల్లాయ్స్’ ఫేక్టరీ రెండూ కూడా వుండటం వల్ల జనాభా అధికుల్లో కార్మిక వర్గం వుండేది. రెండు సినిమా టాకీసులు వుండేవి. పెద్ద హోటల్స్ ఎమీ వుండేవి కావు. ఏవరైనా పెద్ద అధికారులు వుండవలసి వస్తే కొత్తగూడెం లో వుండేవారు. అన్నట్తు కొత్తగూడెం దాటగానే పాల్వంచ వచ్చే మెయిన్ రోడ్ కు అడ్డంగా ‘ముర్రేడు ‘ వాగు వుండేది. వర్షాకాలం లో ఎప్పుడైనా భారీ వర్షాలకు పొంగి ముర్రేడు వాగు నీరు రోడ్డు మీదుగా. ప్రవహించినపుడు కొత్తగూడెం నుండి పాల్వంచ- భద్రాచలం కు రాకపోకలు బంద్. అలా ముర్రేడు వాగు పొంగినపుడు జనం గుంపులుగా వచ్చి సందర్శించే వారు.
(మేము కూడా ఒక సారి వెళ్ళి చూడటం జరిగింది).ఇక పోతే కొత్తగూడెం రైల్వే స్టేషన్ పేరు ‘‘భద్రాచలం రోడ్ ‘. ఒక సారి మాకు అర్జెంటు గా కావల్సిన ఒక ముఖ్య భాగం కొరకు మొత్తం స్టోర్స్ లో నాలుగైదు సార్లు వెదికినా అది కనబడలేదు. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషను లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళ దగ్గరకు వచ్చినట్లు లేదు. బీహెచ్‌ఇఎల్, తిరుచిరాపల్లి కి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు పంపించినట్లు రసీదు వుందని తెలిపారు. నాలుగైదు సార్లు ప్రశ్నించి ఆ రసీదు నంబరు, పంపించిన అడ్రస్ తెలపమంటే చివరకు తేలిందేమిటంటే పంపించిన అడ్రస్ లో రైల్వే స్టేషన్ పేరు ‘కొత్తగూడెం రైల్వే స్టేషన్’ అని రాసారు. కాబట్టి ఆ భాగం ఉత్తర ప్రదేశ్ లో వున్న ‘కత్తగూడెం (కె జి ఎం)’ అనే రైల్వే స్టేషన్ చేరిందని తెలిసింది. సరే అప్పటికి మరో భాగాన్ని లారీ ద్వారా అర్జెంటు గా తెప్పించుకున్నాం. ఆ రోజుల్లొ సింగరేణి ప్యాసిజర్ రైల్ ఒక్కటే భద్రాచ్గలం రోడ్ కు వచ్చేది. మేము హైదరాబాద్ లేదా మద్రాస్ పోవాలంటే ఖమ్మం రైల్వే స్టేషన్ రావల్సిందే!
(మిగతా రేపటి సంచికలో ..)
-శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు