న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్ మాత్రమే కాదు తొలి భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ (34) ఎన్నిక కావడం నిజంగా చారిత్రాత్మకమనే చెప్పాలి. అంతేకాదు న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన చిన్న వయస్కుడిగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ఇదిలావుండగా వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన డెమోక్రట్ అభ్యర్థి గజాలా హష్మీ విజయం సాధించారు. ఈ రెండు విజయాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ ఇచ్చాయనే చెప్పాలి. అంతేకాదు ఇప్పటివరకు అమెరికాలోని ప్రధాన కార్పొరేట్ సంస్థలకు భారతీయులే నేతృత్వం వహిస్తుండగా, ఇప్పుడు రాజకీయంగా కూడా మనదేశ సంతతివారు విజయాలు నమోదు చేస్తుండటం విశేషం. కాగా మమ్దానీ మన భారతీయ సినీ దర్శకురాలు మీరానాయర్ కుమారుడు. ఆయన భార్య జోహ్రాన్ మామ్దానీ యానిమేటర్, కళాకారిణి, రచయిత్రి కూడా! తన భర్త విజయంలో ఆమె కృషి కూడా ఉంది .
ఎందుకంటే తన భర్తకోసం ప్రచారాన్ని ఆమె కొత్త పుంతలు తొక్కించారు. ఆమె రూపొందించిన లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ రంగుల్లోని బ్రాండింగ్ ప్రచారానికి కీలకంగా మారింది. డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీలో ఉన్న మామ్దానీ తన చురుకైన, పదునైన పదజాలంలో మొదట్నుంచీ దూసుకెళ్లారు. వామపక్షభావాలున్న మమ్దానీకి మేయర్ ఎన్నికల్లో 49.6శాతం వోట్లు రాగా, ప్రత్యర్థి క్యూమోకు 41.6శాతం వోట్లు మాత్రమే సంపాదించుకోగలిగారు. మమ్దానీకి దాదాపు లక్ష ఓట్ల మెజారిటీ లభించడం విశేషం. 1969 ఎన్నిక తర్వాత మేయర్ ఎన్నికలో ఇంతటి భారీ స్థాయిలో వోట్లు వేయడం ఇదే తొలిసారి! గత అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్, రిపబికన్ కర్టిస్ సైవా అనే సంస్థలు ప్రత్యర్థి క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడని వెల్లడించడంతో మమ్దానీ ఎన్నిక నల్లేరుమీద నడకలాంటిదేనని తేలిపోయింది.
ఇక తన సొంత నగరమైన న్యూయార్క్ మేయర్ విజయం కోసం డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా రంగంలోకి దిగాల్సివచ్చిందంటే మమ్దానీ ప్రభావం ఎంతగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక ట్రంప్ తన సహజ చపలచిత్త శైలిలో జోహ్రాన్ మమ్దానీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. న్యూయార్క్ నగరం వినాశనమవుతుందని ఆయన చేసిన హెచ్చరికలను ప్రజలు పట్టించుకోలేదు. నిజానికి అమెరికాలో అత్యంత కీలకమైన న్యూయార్క్ నగరం మేయర్ పదవి చేజారడం, ట్రంప్ విధానాలకు ప్రజల్లో మద్దతు లభించడంలేదన్నది సుస్పష్టమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఫస్ట్ పేరుతో అనుసరిస్తున్న విధానాలు, ఆంక్షల పేరుతో విదేశాలకు వేధింపులు వంటివి అమెరికన్లలోనే తీవ్ర వ్యతిరేకతను తెస్తున్నాయి. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు ఒకరకంగా ట్రంప్ పాలనకు కొలమానం వంటివని చెప్పక తప్పదు. ఇదిలావుండగా అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్లు వరుసగా వోటమి పాలైన నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, బ్యాలెట్ పేపర్‌లో నా ఫోటో లేదు, అమెరికా షట్‌డౌన్‌లో ఉంది . రిపబ్లికన్ల ఓటమికి ఇవే ముఖ్య కారణాలంటూ ట్రంప్ విచిత్ర వ్యాఖ్యానాలు చేయడంతో, సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్య సోషలిస్టు అయిన మమ్దానీది ఉన్నత కుటుంబ నేపథ్యం. జన్మించింది ఉగాండాలోనైనా తల్లిదండ్రులు మాత్రం భారత సంతతికి చెందినవారు. ఏడేళ్లనుంచి అమెరికాలో ఉంటున్న ఆయనకు 2018లో పౌరసత్వం లభించింది. 2021 నుంచి న్యూయార్క్ చట్ట సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈయన తండ్రిపేరు ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీ. తల్లి మీరానాయర్. మనదేశంలో దక్షిణాది రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉచిత బస్సు పథకాన్ని ఆయన కూడా ప్రకటించడం విశేషం. ఈ హామీ ఆయనకు గొప్ప పాపులారిటీ తెచ్చిపెట్టింది. అదేవిధంగా పిల్లల సంరక్షణ, సంపన్నులపై పన్నులు వంటి హామీలు కూడా సాధారణ, మధ్యతరగతి వర్గాల్లో అభిమానులను సంపాదించిపెట్టింది.
ప్రముఖ హిందీ సినిమాల క్లిప్‌లను అన్వయిస్తూ ప్రచారంలో ఈయన పొందుపరచిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. అయితే పాలస్తీనాకు మద్దతివ్వడం, పాలనానుభవం లేకపోవడం వంటివాటిని విమర్శకులు ఎత్తి చూపినా, ప్రజల్లో వాటి ప్రభావం ఎంతమాత్రం పడలేదన్న సంగతి ఎన్నిక ద్వారా స్పష్టమైంది. గుజరాత్ అల్లర్లలో ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు మాదిరిగా ప్రధాని నరేంద్రమోదీ కూడా యుద్ధ పిపాసి అంటూ మమ్దానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా భారత సంతతి వోటర్లు మమ్దానీ కి అండగా నిలిచారు .
వొచ్చే జనవరి 1న తాను ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు. న్యూయర్క్ వలసదారుల నగరంగానే ఉంటుందనీ ..ఆశ సజీవంగా ఉంటుందని స్పష్టం చేయడం ప్రస్తుతం ట్రంప్ వైఖరితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరంలోని విదేశీ వలసదారులకు ఊరటనిస్తుందనడం లో సందేహం లేదు. ఇది వలసదారుల చేతిలోనే ఉంటుందని మమ్దానీ ప్రకటించడం ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు పూర్తి విరుద్ధం. ఇక్కడి వలసదారులు ముఖ్యంగా భారతీయులకు ఇది ఆనందం కలిగించే అంశం. అంతేకాదు ఆయన తన తొలి ప్రసంగంలో భారత తొలి ప్రధాని నెహ్రూను గుర్తు చేసుకోవడమే కాకుండా, ఆయన చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని ప్రస్తావించడం విశేషం. ఏది యేమైనా ప్రస్తుతం వివిధ నగరాల్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలు వొచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంబోతున్నాయనేది స్పష్టం చేస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ చేసిన వాగ్దానాలు ఒక్కటీ అమల్లోకి రాకపోవడం స్థానిక అమెరికన్లలో నిరాశను కలిగిస్తోంది. ఆయన విధానాలు జాత్యహంకారాన్ని పెంచేవిగా ఉంటున్నాయి తప్ప, అమెరికా అభివృద్ధికి ఎంతమాత్రం దోహదపడేవిగా లేవన్నది సుస్పష్టమవుతోంది. ఆయన పుణ్యమాని డీడాలరైజేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. దేశీయంగా సామాన్యులు పెరిగిన ధరలతో నానా ఇబ్బందులు పడుతున్నారు! వీటన్నింటి ఫలితం ఇప్పుడు రిపబ్లికన్లను అనుభవిస్తున్నారు.