- అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి.
- ప్రతి గ్రామంలో లబ్దిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష
పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాల అమలు పై ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీశ్ వి. పాటిల్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వొచ్చిన తర్వాత యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం, మెస్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీల పెంపు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500లకేగ్యాస్ సిలిండర్ వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సన్నవడ్లకు రూ. 500 బోనస్ అందించామన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 కొత్త పథకాలను గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు.





