రాజకీయ వాస్తవాల ప్రతిబింబం..లొంగుబాటు ..!

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు ఉద్యమానికి చెందిన నలుగురు కీలక అగ్రనేతలు లొంగిపోవడం సాధారణ భద్రతా సంఘటనగా చూడలేని పరిణామం. మావోయిస్టు పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ నాయకుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్ల రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కా రావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహా రెడ్డి అలియాస్ గంగన్న లొంగుబాటు ఒక ఉద్యమం ఎదుర్కొంటున్న రాజకీయ, సిద్ధాంత, వ్యూహాత్మక సంక్షోభాన్ని బహిర్గతం చేసింది. ఇది కేవలం పోలీసు విజయమా  లేక భారతదేశంలో వామపక్షపంథా సాయుధ ఉద్యమాల భవిష్యత్తుపై ఒక నిర్ణాయక మలుపా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి.

తెలంగాణ ప్రాంతం చరిత్రను పరిశీలిస్తే రైతాంగ తిరుగుబాట్లు, సామాజిక న్యాయం కోసం పోరాటాలు ఈ నేలతో విడదీయరాని సంబంధం .. నిజామ్ కాలంలోని రైతు పోరాటాల నుంచి నక్సల్బరీ ప్రభావం వరకు ఈ ప్రాంతం తిరుగుబాటు రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. భూసంస్కరణల లోపం, దళిత-ఆదివాసీ వర్గాలపై దోపిడీ, అరణ్య సంపదపై నియంత్రణ సమస్యలు ఆయుధ పోరాటానికి బలం చేకూర్చాయి. మావోయిస్టు ఉద్యమం ఒక దశలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ అధికార నిర్మాణాన్ని కూడా సృష్టించింది. గ్రామ సభలు, ప్రజా న్యాయస్థానాలు, భూవిభజన చర్యలు ప్రజల్లో ప్రభావాన్ని చూపాయి. కానీ అదే ఉద్యమం కాలక్రమేణా ప్రజల నుంచి దూరమవుతుందని విమర్శలు పెరిగాయి.ఈ నేపథ్యంలో పోలిట్‌బ్యూరో స్థాయి నాయకుడు దేవ్ జి సహా కీలక నాయకత్వం లొంగిపోవడం ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.

తెలంగాణ పోలీసు వ్యవస్థ గత దశాబ్ద కాలంగా మావోయిస్టు కార్యకలాపాలను అణిచివేయడంలో సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది. నిఘా సాంకేతికత, డ్రోన్లు, కమ్యూనికేషన్ ట్రాకింగ్, కేంద్ర బలగాలతో సమన్వయం వంటి అంశాలు అడవుల్లో  కార్యకలాపాలను  నియత్రించగలిగాయి . డీజీపీ బి. శివధర్ రెడ్డి నాయకత్వంలో అమలు చేసిన “పోరు వొద్దు ..ఊరు ముద్దు ” కార్యక్రమం  కూడా కీలక పాత్ర పోషించింది. కేవలం ఎన్‌కౌంటర్ రాజకీయాల కన్నా చర్చలు, పునరావాసం అనే ద్వంద్వ వ్యూహం మావోయిస్టు కేడర్‌లో ఆలోచనకు దారి తీసింది. అయితే ఈ లొంగుబాటు వెనుక కేవలం పోలీసు ఒత్తిడి మాత్రమే కారణం కాదు  ఉద్యమం అంతర్గతంగా ఎదుర్కొంటున్న సిద్ధాంతపరమైన సంక్షోభం కూడా సమానంగా ప్రభావం చూపింది.

మావోయిస్టు సిద్ధాంతం ప్రధానంగా వర్గపోరాటం, గ్రామీణ తిరుగుబాటు ఆధారంగా నిర్మితమైంది. కానీ భారతదేశంలో గత రెండు దశాబ్దాల్లో సామాజిక-ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారాయి. గ్రామీణ సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ కార్యక్రమాలు, రోడ్లు, విద్య, డిజిటల్ కనెక్టివిటీ పెరగడంతో ప్రజలు ప్రభుత్వాన్ని,రాజ్యాంగాన్ని  పూర్తిగా తిరస్కరించే స్థితి తగ్గింది. అదే సమయంలో ఎన్నికల రాజకీయాలు అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాయి. గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు కొత్త నాయకత్వం ఎదిగింది. ఈ మార్పులు ఆయుధ పోరాటానికి సామాజిక మద్దతును తగ్గించాయి. యువతలో కూడా విప్లవ సిద్ధాంతాల కన్నా ఉద్యోగాలు, వలస అవకాశాలు, టెక్నాలజీ రంగం ఆకర్షణ పెరిగింది. అరణ్యాల్లో జీవితం కన్నా నగరాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం కొత్త తరానికి సహజ మార్గంగా మారింది.

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో జరిగిన భారీ ఆపరేషన్లు మావోయిస్టు నాయకత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం, కేడర్ తగ్గిపోవడం, ఆర్థిక వనరులు పరిమితం కావడం వంటి అంశాలు ఉద్యమాన్ని బలహీనపరిచాయి. తెలంగాణ భౌగోళికంగా కీలక కారిడార్‌గా ఉన్నప్పటికీ ఇక్కడ స్థిరంగా కార్యకలాపాలు కొనసాగించడం కష్టమవుతోంది. సరిహద్దు జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు నాయకత్వాన్ని ఒంటరిగా మిగిల్చాయి.

అరణ్యాల్లో దశాబ్దాలుగా జీవించిన నాయకులు ఆరోగ్య సమస్యలు, వయస్సు, కుటుంబాల నుంచి దూరం వంటి అంశాలతో అలసటకు గురయ్యారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. నిరంతర అండర్ గ్రౌండ్  జీవితం ఒక దశ తర్వాత సాధ్యం కాదు. దేవ్ జి వంటి పోలిట్‌బ్యూరో స్థాయి నాయకుడు లొంగిపోవడం ఉద్యమంలో మానసిక మార్పుకు సంకేతంగా కూడా భావించవొచ్చు. నాయకత్వం మారితే కేడర్ ఆలోచన కూడా మారే అవకాశముంది.

లొంగుబాటు కార్యక్రమం విజయంగా కనిపించినా అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభమవుతుంది. పునరావాసం కేవలం నగదు సహాయం కాదు. భద్రత, సామాజిక అంగీకారం, ఉపాధి అవకాశాలు, కుటుంబ స్థిరత్వం కల్పించాలి. గతంలో పలు రాష్ట్రాల్లో సరైన పునరావాసం లేక తిరిగి ఉద్యమంలో చేరిన ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. మావోయిస్టు ఉద్యమానికి పునాది వేసిన అంశాలు పూర్తిగా పరిష్కారమయ్యాయని చెప్పలేం. భూమి హక్కులు, అరణ్య చట్టాల అమలు, ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాలు ఇంకా చాలాచోట్ల పరిమితంగానే ఉన్నాయి. అభివృద్ధి పేరుతో ఖనిజ ప్రాజెక్టులు, భూసేకరణలు కొత్త అసంతృప్తులకు కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి భద్రతా విజయంతో పాటు సామాజిక న్యాయం అవసరం.

ఆయుధాల నుంచి ప్రజాస్వామ్యానికి మారిన నాయకత్వం సమాజానికి ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది. చర్చల  ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని ఈ పరిణామం చెబుతోంది.లొంగిపోయిన నాయకులు తమ అనుభవాలను ఉపయోగించి యువతను హింస నుంచి దూరంగా ఉంచే పాత్ర పోషిస్తే అది పెద్ద మార్పుకు దారి తీస్తుంది.  తెలంగాణలో గ్రామీణ రాజకీయాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశముంది. గతంలో మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఎన్నికల రాజకీయాలకు కొత్త అవకాశాలు తెరుచుకోవొచ్చు.

డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట పోలిట్‌బ్యూరో స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ నాయకత్వం వరకు నలుగురు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు తెలంగాణలో భద్రతా పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని  సూచిస్తోంది. ఇది ఒక పోలీసుల  విజయం మాత్రమే కాదు — మారుతున్న రాజకీయ వాస్తవాల ప్రతిబింబం. అయితే శాంతి సుస్థిరం కావాలంటే  అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆదివాసీ హక్కులు అనే మూడు అంశాలు సమస్యలుగా మారకూడదు . ఉద్యమానికి కారణమైన  పరిస్థితులే తిరిగి అసంతృప్తికి కారణం కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలి. లేకపోతే అరణ్యాల్లో మళ్లీ కొత్త ఉద్యమాలు  మొదలయ్యే ప్రమాదం ఎప్పటికీ పూర్తిగా తొలగిపోదు. తెలంగాణకు ముందున్న అసలు సవాలు ఇదే — శాంతియుత వాతావరణానికి కావలసిన భద్రతను కాపాడుతూ న్యాయబద్ధమైన అభివృద్ధి మార్గాన్ని నిర్మించడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *