‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’లో ఉర్దూ రచయిత్రుల నేపథ్యం, జీవితం, సాహిత్యం కనిపిస్తుంది. ముస్లిం స్త్రీల మనో భావాల్ని తమ కలం ద్వారా ప్రతిపాదించిన విధానాన్ని దేవరాజు చాలా సున్నితంగా ప్రస్తావించారు. ‘కలలో సుల్తానా’ అనే రచన రోకియా హుస్సేన్, ఉర్దూ పత్రికల ద్వారా సుఘ్ర హుమాయూన్ బేగం, ‘పర్దా’ అనే రచన ద్వారా నజర్ సజ్జాద్ హైదర్, తార్ లరజ్ రహే హై (తారలు తళుకు మంటున్నాయి) అనే కథానిక ద్వారా సిద్దిఖా బేగం వంటి ప్రసిద్ధ ముస్లిం రచయిత్రులు స్త్రీల కోసం చేసిన సేవలను కొనియాడారు. ముస్లిం స్త్రీల సంస్థను స్థాపించడం, స్త్రీలను ‘జనానా’ కింద జమకట్టి బానిసలుగా వంటింటికే పరిమితం చేస్తున్న వారిని చైతన్య పరచడం, మహిళల హక్కుల కోసం పోరాడటం, అధికారాలను అన్వేషించడం, ఘోషా పద్ధతిని ఖండించడం, పర్దాలో మగ్గిన ముస్లిం స్త్రీలలో చదువు స్వాతంత్ర్యాలు కొరబడిన విధానాన్ని అవగాహన చేసుకోవడం వంటివి వారి రచనల్లో కన్పిస్తాయని పేర్కొన్నారు. సాహిత్య సాంస్కృతిక సామాజిక కార్యకర్తల పిలుపు మేరకు బురఖా వదిలి, స్వేచ్ఛగా భారత స్వాతంత్రోద్యమంలో దూకిన సంఘటనలు కనిపిస్తాయని అన్నారు.
స్త్రీలను సమాజ పరంగా అదిమి పెట్టి ఉంచే పురుషాహంకారాన్ని ఖండించారని, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని ‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’ లో తెలుస్తుంది. దేవరాజు ఈ గ్రంథంలో కార్మికుల కల్పవల్లిగా మార్పిస్టు దృక్పథం గల రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా ఎదిగిన ‘సిద్దిఖా బేగం’ను పరిచయం చేశారు. రషీద్ జహన్ అనే ఉర్దూ రచయిత్రి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో చుట్టూ ఉన్న సామాజిక సమస్యల పట్ల సరైన అవగాహన కలిగి, వాటిని చర్చించి, కొత్త పరిష్కారాలను అందించగల స్థాయికి ఎదగ గలిగిందని అన్నారు. అభ్యుదయ సాహిత్య ఉద్యమాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు.
స్త్రీ విద్యాభివృద్ధి, స్వేచ్ఛయే గాక బేబీ కాంట్లే తన ఆత్మకథ ‘జీవం అమూచ’ లో బాల్య వివాహాల నేపథ్యం, అందులో ఆడపిల్లల దుస్థితిని వివరించారు. ముఖ్యంగా దేవరాజు బేబీ కాంబ్లే ఆత్మకథలోని ప్రధానమైన ఘట్టం తీసుకొని అత్తింటికొచ్చే కొత్త కోడలి కష్టాలను వివరించారు. బేబీ కాంబ్లేకు పెళ్లంటే ఆడపిల్లకు ఒక తుఫాను లాంటిదనే అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. నాటి సమాజాన్నంతటిని పాఠకుల ముందు ఉంచే అంశాలు ‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’ లో కనిపిస్తాయి. లోకం తెలియని అమాయక వయస్సులో పెళ్ళి చేయడం, తల్లిదండ్రులపై గల ప్రేమ వదలలేక అత్తింటికి రావడం, కుటుంబ సంప్రదాయాల పేరిట ఇంటి బాధ్యతలన్నీ కోడలిపై వేయటం వంటివి చాలా చిన్న వయస్సులోనే ఆడపిల్లల నెత్తినబడుతున్నాయి.
ఈ సహజ దృశ్యాలు నాటి సమాజ వ్యంగ్య వైఖరిని తెలియజేస్తాయి. అతి చిన్న వయసులో అత్తింటికి వచ్చిన బేబీ కాంబ్లే చిన్న చిన్న చేతులతో రొట్టెలు చేయడం, రొట్టె కాల్చడం కంటే తనే ఎక్కువగా చేతులు కాల్చుకోవడం, తెల్లవారు జామున ఏ మూడింటికో లేచి విసుర్రాయిని తిప్పడం, బరువైన రాళ్ళను తిప్పలేక చేతులు బొబ్బలెక్కడం, బావిలో నుంచి నీళ్ళు చేదడం, చివరకు అందరు తిన్న తర్వాత కాలినవో, మాడినవో ఉప్పు నంచుకొని తినడం వంటి అనేక బాధలు భరించిన సన్నివేశాలను రచయిత గుర్తుచేశారు. అందుకే తన ఆత్మకథ ద్వారా బాల్య వివాహాల వ్యవస్థ నిర్మూలించడానికి ఆమె ప్రయత్నించిందని దేవరాజు అభిప్రాయపడ్డారు.
ఈ గ్రంథంలోనే వితంతువుల స్థితిగతులను వివరిస్తూ, వాటి నుంచి బయట పడటానికి గల ప్రయత్నాలను, వితంతు ఆచార వ్యవస్థపై వ్యతిరేకతను దేవరాజు చాలా స్పష్టంగా తెలియజేశారు. వితంతువులైన ఇద్దరి జీవితాలను ఇక్కడ వివరించారు. ఒకరు తిరుమలాంబ, మరొకరి పేరు ప్రస్తావించలేదు కాని కేవలం ఒక విధవరాలి జ్ఞాపకాల కథగా తెలిపారు. తనను తాను ‘సభ’ పాత్రలో వ్యక్తీకరించుకొన్న తిరుమలాంబ ‘తన భవిష్యత్తేమిటి? చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవద్దు. పెద్ద వాళ్ళతో కలిసి మాట్లాడుకోవద్దు. ఎందుకు తనకీ శిక్ష? తను చేసిన తప్పేమిటి? ఆడపిల్లగా పుట్టడమేనా! తనకు ఊహ తెలియక ముందే పెళ్ళి చేశారు. ఊహ తెలుస్తున్న దశలో వితంతువునన్నారు.
ఒంటరిని చేశారు.” (పు. 31) అని అనుకుంది. వితంతువు జీవితంలోని అగాధాలు, వరకట్న సమస్యకు బలైన జీవితాలు, అర్ధం లేని బాల్య వివాహాలు వంటి తిరుమలాంబ రచనల్లో ప్రధానాంశాలుగా కనిపిస్తాయని దేవరాజు పేర్కొన్నారు. 1880 లోనే ఒక విధవరాలి జ్ఞాపకాల కథ అనే గ్రంథంలో నాటి ఉన్నత, ధనిక కుటుంబాలలో నమ్మకాల పేరిట, ఆచారాల పేరిట, చాదస్తాల పేరిట వితంతువుల మీద జరిగే ఘోరాన్ని తెలుసుకోవచ్చని దేవరాజు చెప్పారు.
ముఖ్యంగా సమాజంలో భర్త చనిపోయిన వెంటనే భార్య శరీరం మీద బలవంతంగా నగలు లాగేయడం, భర్త చావుకు భార్యే కారణం అయినట్లు రక్తసంబంధీకులు కూడా శాపనార్థాలు పెట్టడం, ఆమె నీడ ఏ ముత్తైదువ మీద పడకుండ చూసుకోవడం, శారీరక మానసిక అవస్థను ఏమి పట్టించుకోకుండా దహన కార్యక్రమాలు ఎంత దూరంలో ఉంటే అంత వరకు నడిపించుకొంటూ తీసుకొని పోవడం, దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వకపోవడం, బోడి గుండు చేసి తెల్ల చీర కట్టించడం, ఓ గదిలో కూర్చోబెట్టి డబ్బులు విసిరివేయడం, చివరకు ఆమె చనిపోతే కూడా ఏ ఆర్భాటాలు లేక తెల్లగుడ్డలో చుట్టి కాల్చేయడం వంటివి వితంతువు మీద జరిగే అత్యంత దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. ఈ స్థితిని సవాలుగా తీసుకొని వచ్చిన ఈ రెండు రచనలు 19వ శతాబ్దం నుంచే వితంతువు చైతన్యాన్ని కాంక్షించడానికి ప్రయత్నించాయని తెలుస్తుంది. వితంతువు చైతన్యం పట్ల, వితంతువు పునర్వివాహాల పట్ల దేవరాజుకు గల సానుకూల అభిప్రాయం ‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’ గ్రంథంలో కనిపిస్తుంది.
ఇంకా ఈ గ్రంథంలో దళిత నేపథ్యంలో అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన వారిని పరిచయం చేశారు దేవరాజు. అందులో సావిత్రీబాయి ఫూలే, ముక్తాబాయి, బేబీ కాంబ్లే లను గూర్చి తెలిపారు. మెహర్ మాంగులు మహారాష్ట్రలో అంటరాని జాతులుగా వెలివేయబడ్డారు. వారి అభ్యున్నతికి తోడ్పడుతున్న సావిత్రీబాయి పూలే తన అన్న అడిగిన ప్రశ్నకు సమాధానంగా “నీది చాలా సంకుచితమైన ఆలోచన. మీరు తోటి మానవులను అంటరానివారుగా చూస్తారు. మెహర్ లను, మాంగ్ లను ఇతర నిమ్న జాతుల వారినందరిని మేం మనుషులుగా భావిస్తాం.
వారికి అందని చదువును అందిస్తాం. బాలికలకు, మహిళలకు, వృద్ధులకు కూడా చదువు చెబుతాం. వారిలో ఒక నూతన చైతన్యాన్ని తెస్తాం” (పు. 32) అని తెలుపుతుంది. సావిత్రీ బాయి పాఠశాలలోనే చదువు నేర్చుకొన్న ముక్తాబాయి అంటరానితనాన్ని నిరసిస్తూ “మాంగ్ మహర్ చయ దుఃఖ విషయ’ (మాంగ్ మెహర్ దుఃఖ విషయాలు) అనే ఒక వ్యాసం రచించింది. 1855లో రచించబడ్డ ఈ వ్యాసం ఒక మాంగ్ మహిళ చేసిన తొలి రచనగా, తొలి దళిత రచయిత్రిగా ఆమెను దేవరాజు గారు పేర్కొన్నారు. అగ్రవర్ణం వారి నుంచి దోపిడీ చేయబడి, అణచబడి ఉన్న దళితుల నిరాశా నిస్పృహలే దళిత సాహిత్యంపై భారతీయ సాహిత్యంలో ప్రముఖస్థానం ఆక్రమించింది.
ముక్తాబాయి తన రచనలో వృద్ది పొందిన వర్గీయులను సూటిగా ప్రశ్నించిన మాటలను దేవరాజు ఈ గ్రంథంలో పొందుపరిచారు. ‘నిలువ నీడ లేని వాళ్ళం. గూడు లేని వాళ్ళం. మా బాగోగుల గురించి మీరెప్పుడైన ఆలోచించారా? చదువుకున్న బాబులు ఎవరైనా మా వాడల్లోకి వైద్యం చేయడానికి వచ్చారా? మానవతా దృక్పథంతో ఏదైనా మంచిపని చేయడానికొచ్చారా?” (పు. 43) తొలి దళిత మహిళగా బేబీ కాంబ్లే వెలువరించిన తన ఆత్మకథలో ఉన్నత వర్గాలలో దళిత కుటుంబాలు అస్పృశ్యలుగా ఏ విధంగా అణగదొక్కబడ్డాయో, మహిళలు ఎంతటి హింసకు గురి అయ్యారో వర్ణించారు. దళితుల జీవన నేపథ్యం కూడా ఆమె ఆత్మకథలో కనిపిస్తుంది.
(ఇంకా ఉంది)
– ఆచార్య వంగరి త్రివేణి





