(అయిదు వారాల ధారావాహిక)
దేవరాజు తన గ్రంథంలో ప్రస్తావించిన మరొక విషయం ప్రాంతీయ వైవిధ్యం, ఆయా యుగాలకు, భాషలకు చెందిన పరిస్థితులనే గాక, భౌగోళిక నేపథ్యాలను కూడా విశదీకరించారు. ప్రాంతీయ అస్తిత్వానికి, అస్మితానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తూ భారతదేశంలోని పంజాబ్ నుంచి మొదలుకొని తమిళనాడు వరకు కూడా విభిన్నమైన భౌగోళిక వాతావరణ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు అవి స్త్రీ జీవితంలో చూపిన ప్రభావాన్ని వివరించారు. ఆర్థికంగా వృద్ధి పొందిన ప్రాంతాల నుంచి మారు మూల ప్రాంతాల వరకు మహిళల చైతన్యం, దళితుల ప్రగతి, వారికి కావలసిన ప్రాథమిక సదుపాయాల కోసం సంఘర్షణ, సాగుతున్న ఉద్యమాలన్నింటిని అద్భుతంగా వర్ణించారు. ‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’ అనే గ్రంథంలో దేవరాజు వర్ణించిన ఆయా స్త్రీల జీవితాల్లోని సామాజిక సాహిత్యపు విజయ గాథలను పరిశీలిద్దాం. స్త్రీ ఆత్మ గౌరవాన్ని ప్రకటిస్తూ దేవరాజు స్త్రీ అస్మిత అస్తిత్వాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఉన్నతమైన స్త్రీల మనోభావాలను, సిద్ధాంతాలను, ప్రతిస్పందనలను వివరించారు.
!. విశేష రంగాలకు చెందిన స్త్రీలు:
• చక్రవర్తిని తిరస్కరించిన ‘హమీదా’
• ఆత్మను నివేదించుకొన్న ‘బహినాబాయి’
• అక్షర తపస్విని ‘రస సుందరీదేవి’
• అలుపెరుగని పోరాట వనిత “సావిత్రీబాయి”
• వితంతు జీవితానికి ప్రతీక “తిరుమలాంబ’
• తొలి దళిత రచయిత్రి’ ముక్తాబాయి’
• సభ్య సమాజాన్ని నిలదీసిన “రమాబాయి’
• ‘వినోదిని’ జీవితమే ఓ నాటక రంగం
• తొలి చరిత్ర పరిశోధకురాలు ‘బండారు అచ్చమాంబ’
• ‘ఘోషా’ను నిరసించిన ‘నజర్ సజ్జాత్’
• భిన్న సంస్కృతుల్ని ప్రతిబింబించిన ‘దేబ్ జానీ’.
• సాహిత్యకారులు: మోక్షదాయిని, లక్ష్మీబాయి తిలక్, శరత్ కుమారి, కాశీబాయి, ముల్లిన్స్, రస సుందరీ దేవి, నిరుపమా దేవి, ఇందిరా సహస్ర బుద్ధి, యం.కె. ఇందిర, హీరానందానీ
• సామాజిక కార్యకర్తలు: రమాబాయి, పుష్పాబెన్, విశ్వ సుందరమ్మ
• దళిత వాదులు: ముక్తాబాయి, సావిత్రీ బాయి ఫూలే, బేబీ కాంబ్లే,
• స్త్రీ వాదులు: తారాబాయి షిండే, రోకియా హుస్సేన్, సులేఖ సన్యాల్
• ముస్లిం స్త్రీలు: గుల్బదన్ బేగం, నజాద్ నజ్జాద్, సుఘ్రూ బేగం, సిద్ధిక బేగం
• న్యాయవాది: కొర్నిరియా సోరాబ్ది
బాల్య వివాహాల ప్రభావం వల్ల దాదాపు 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు స్త్రీల జీవితంలో చాలా విషమ పరిస్థితి చోటుచేసుకొంది. స్త్రీ అభ్యున్నతిని అగాథంలోకి దించి, వారి బాల్యాన్ని మొత్తం హరించి వేసింది. విద్యావృద్ధికి, సామాజిక అవగాహనకు ఆటంకంగా నిలిచింది. ఈ గ్రంథంలో కనిపించే స్త్రీలందరివి దాదాపు చాలా చిన్న వయసులోనే వివాహాలు జరిగాయి. ఉదాహరణకు సావిత్రీ బాయి పూలే, తారాబాయి, లక్ష్మీబాయి తిలక్ వివాహాలు 9, 10 సంవత్సరాల మధ్య జరిగాయి. తిరుమలాంబ అయితే 13 వ యేటకే వితంతువుగా మారిపోయింది. బాల్య వివాహాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ కాలంలో అదే స్థాయిలో వైధవ్యాన్ని అనుభవించిన స్త్రీలు కూడా ఉన్నారు.
వైవాహిక జీవితానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ భర్తకు సహధర్మచారిణిగా, ఆయన ఆలోచనలతో, సిద్ధాంతాలతో మమేకమైన స్త్రీలను గూర్చి అనేకసార్లు ప్రస్తావించారు దేవరాజు. అందులో లక్ష్మీబాయి తిలక్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో వచ్చిన పొరపొచ్చాలను సున్నితంగా పరిష్కరించడం, పిల్లల పెంపకంవంటి బాధ్యతను వహించడం, తన భర్త మహాకవిగా ఎదగడంలో సహకరించడం, వారిద్దరు కలిసి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటం, మతపరమైన అడ్డుగోడలను ఛేదించడం వంటివి లక్ష్మీబాయి తిలక్ దంపతులిద్దరినీ గూర్చిన విషయం ‘స్మృతి చిత్ర’ అనే జీవితకథ ఆధారంగా తెలుస్తుంది. అదేవిధంగా సావిత్రీబాయి పూలే జీవితం ఈ కోవలోకే వస్తుంది. అతిచిన్న వయస్సులో జ్యోతిరావు పూలేతో వివాహం జరిగిన సావిత్రీబాయి ఫూలే, భర్తదగ్గరే చదువు నేర్చుకొని, ఆయన అండదండలతో ప్రపంచాన్నే జయించింది. భర్తతో కలిసి అంటరానితనాన్ని అంతమొందించడంలో తీవ్ర ప్రయత్నం చేసింది. ఆమె తన మరాఠా ప్రాంతంలోనే గాక భారతీయ స్త్రీజాతి అంతా గర్వంగా చెప్పుకొనే ఉపాధ్యాయురాలిగా పేర్గాంచింది.
భర్త ప్రోత్సాహంతో 1848 లోనే మహిళల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి, ఆడపిల్లలకు మహిళలకు రాత్రింబవళ్ళు చదువు చెప్పింది. 1843 లో ‘సత్యశోధక మండల్’ ప్రారంభించి మహిళాభ్యుదయ ఉద్యమాన్ని అధికం చేసింది. స్త్రీ చైతన్యాన్ని కాంక్షిస్తూ దేవరాజు తన గ్రంథం ‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’లో అనేక స్త్రీల చరిత్రలను, వారు చేసిన కృషిని అభివర్ణించారు. ఒక విధంగా వీరు స్త్రీవాదులని చెప్పుకోవచ్చు. మొదటగా ‘మోక్షదాయిని’ని గూర్చి తెలుపుతూ రచయిత దేవరాజు ఆమె దేశ సాహిత్య, సాంఘిక, రాజకీయ రంగాల్లో చురుకుగా పాల్గొన్న స్థితిని వివరించారు.
ఆమె స్త్రీ విద్యావశ్యకతను స్పష్టపరుస్తూ చెప్పిన మాటలను ఈ గ్రంథంలో చూడవచ్చు. ‘బెంగాలు మహిళలు తమ స్వాతంత్ర్యాన్ని ఎవరో అహహరించారని బెంబేలు పడక, విద్యనార్జించి, ప్రపంచ జ్ఞానం సంపాదించి, పురుషులకు దీటుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సతీ సహగమనం, విధవా వివాహం, ఘోషా విధానం లాంటి సమస్యలన్నీ ఉన్నా, వాటి కోసం కొందరు కొన్ని ఉద్యమాల్ని తెస్తున్నా, స్త్రీలు చైతన్యవంతులై విద్యావంతులయినప్పుడు ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు వాటికవే లభించగలవు” (పు.39) ముఖ్యంగా స్త్రీలు విద్యావంతులు కావడం వల్ల సమాజ స్వరూపమే మారిపోతుందన్న స్థితిని తాత్కాలిక ప్రయోజనాలపై దృష్టి నిలుపక దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ‘మోక్షదాయిని’ పడిన తాపత్రయాన్ని దేవరాజు వివరించారు.
(ఇంకా ఉంది)