(అయిదు వారాల ధారావాహిక)
20వ శతాబ్దం – ఆధునిక సమాజంలో స్త్రీ పరమైన ఆలోచనలకు బలమైన వాదాన్ని వినిపించింది. స్త్రీ పురుషుల మధ్య సమానమైన ప్రతిపత్తిని ఆశించింది. అన్నిరంగాల్లో స్త్రీ ప్రతిభను విస్తరిస్తూ నూతన ప్రస్తానానికి శ్రీకారం చుట్టింది. అయితే సాంద్రమైన ఈ శతాబ్దంపై 16వ శతాబ్దం నుంచి కూడా ప్రభావ రేఖలున్నాయి. వీటన్నింటిని భారతీయ జీవిత కథల నేపథ్యంలో “స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం” గా అందించారు దేవరాజు మహారాజు. ఈ గ్రంథం ఆధునిక స్త్రీ వాదానికి ప్రాథమిక పునాది. ఆధునిక స్త్రీ జీవితానికి స్ఫూర్తిదాయకం. విభిన్నయుగాల్లో, విభిన్న ప్రాంతాల్లో, విభిన్న భాషల్లో, విభిన్న సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన అక్షర తపస్వినుల జీవన గీతపు రాగ మాలిక. స్త్రీ విజయ గాథా సంపుటం. దేవరాజు మహారాజు తెలుగు సాహిత్యంలో భారతీయ స్త్రీల జీవితపు విజయ గాథలను సంకలనంగా ప్రచురించారు. ఇందులోని వ్యాసాలన్నీ 1994 నుంచి 2001 వరకు ఆంధ్రభూమి దినపత్రికలో నిర్వహింపబడిన ‘సాహితీ సుమాలు’ అన్న శీర్షిక నుంచి వెలువడ్డాయి.
దేవరాజు గ్రంథంలో కనిపించే ముఖ్యమైన విషయం భాషా వైవిధ్యం. భారతీయ భాషలన్నింటి మధ్య ఉన్న నేపథ్యంలోని స్త్రీల జీవితాలను అధ్యయనం చేశారు. అత్యంత ప్రాచీనమైన భాష సింధినీ మొదలుకొని ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, కన్నడం, ఆంగ్లం, తెలుగు, పంజాబీ, గుజరాతీ, తమిళం వంటి భాషల్లోని స్త్రీ జీవితాలను తెలుగులోకి అనువదించారు. చారిత్రక, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నింటిని విభిన్న భాషల్లో పరిశీలించి, దానికి అనుగుణమైన స్త్రీ జీవితాలను తెలుగు భాషలో వ్యాఖ్యానించారు. ఈ గ్రంథంలో స్త్రీల పుట్టుక, పూర్వోత్తరాలు, సామాజిక ఆర్థిక నేపథ్యం, వారిని ప్రోత్సహించిన పరిస్థితులు గానీ, వ్యక్తులు గానీ, వారి వారి జీవితాలను మలుపు తిప్పిన సంఘటనలు కానీ, వివిధ రంగాలలో వారి కృషి పట్టుదల, సామాజిక కార్యకర్తలుగా, రచయితలుగా సాధించిన ప్రగతిని భాషా పరంగా వెలువరించడం కేవలం దేవరాజుకే సాధ్యమైంది.
దేవరాజు దృష్టిలో ఫస్ట్ ఫెమినిస్ట్ పురుషుడు. ఎందుకంటే ఈ గ్రంథంలో కనిపించే స్త్రీ జీవితాల వెనుక ప్రధాన భూమికను వహించింది పురుషుడు. ఆధునిక స్త్రీ ఈ స్థితికి రావడానికి కుటుంబ సభ్యులు, గురువులు, సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తలు, యుగ కర్తలు, బంధు మిత్రుల ప్రోత్సాహం వంటిని చాలా ప్రభావాన్ని చూపాయి. స్త్రీలు వారి వారి జీవితాల్లో ముందడుగు వేయడానికి విలువైన పుస్తకాలు, సందేశాలు కూడా తోడ్పడ్డాయి. ఉదాహరణకు ఈ గ్రంథంలో కనిపించే సులేఖా సన్యాల్ ‘రామ్ తాను లాహిరి’ ప్రభావం వల్ల అన్యాయాన్ని సహించక పోవడం, మానవత్వాన్ని అన్ని విధాల సంరక్షిస్తూ ఉండటం వంటి గుణాలను ఏర్పరచుకుంది. బేబీ కాంబ్లే అనే మరాఠీ రచయిత్రి బాబా సాహెబ్ అంబేద్కర్ చేపట్టిన ఉద్యమాల వల్ల ప్రభావితమైంది. ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో బాల్య దశలో ఉన్న బేబీ కాంబ్లే, ఉద్యమ రూపంగా పెరుగుతూ వచ్చింది. తాను పోరాడవలసినవి ఏమిటో తెలుసుకుంది. చాలా చిన్న వయస్సులోనే బాల వితంతువుగా మిగిలిన తిరుమలాంబను ఆమె తండ్రి ప్రోత్సహించి చదవడం, రాయడం నేర్పించారు. ఉత్తమ కావ్యాలు, మత గ్రంథాలు పఠించారు. ఈ విధంగా స్త్రీ జీవితాలను సున్నితంగా స్పృశిస్తూ, వారి విజయ గాథల వెనుక కొన్ని ప్రభావ నేపథ్యాలను మహారాజు వర్ణించారు.
దేవరాజు గ్రంథంలో కనిపించే మరొక ముఖ్య విషయం స్త్రీ జీవితాలపై యుగ ప్రభావం. యుగాలు మారిన స్త్రీ తలరాత మారలేదనేది ఎంత సత్యమైనా, ఆయా యుగాలలో స్త్రీల జీవన వ్యక్తిత్వాలు మారుతూ వచ్చాయనేది అంతే సత్యం. 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు, రాచరిక పాలన నుంచీ ప్రజాస్వామ్య పాలక వరకు మధ్యయుగం నుంచి ఆధునిక యుగం వరకు స్త్రీ తన జీవితాన్ని సవాలుగా స్వీకరించిందని ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. 16వ శతాబ్దానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ దేవరాజు మొఘల్ రాజు వంశీయులలో స్త్రీలను గూర్చి వివరించారు. హుమాయున్ సోదరి ‘గుల్ బదన్ బేగం’ పర్షియన్ భాషలో రచించిన “హుమాయున్ నామా” లోని హమీదా జీవితాన్ని కొంత వరకు స్పృశించారు. రాచరికపు కట్టుబాట్లను, సంప్రదాయపు ఛాయలకు తిరస్కరించిన విధానంలో హమీదా పాత్రను పరిచయం చేశారు. హుమాయున్ చక్రవర్తిని భర్తగా స్వీకరించడానికి ఇష్టపడని “హమీదాబాను” వ్యక్తిత్వాన్ని చాలా ఉత్సాహవంతంగా గుల్ బదన్ బేగం వర్ణించారు.
ముస్లిం మత సంప్రదాయాల్లో ఇలాంటి తిరస్కార భావం నాటి కాలంలో కనిపించక పోవచ్చు. కాని అప్పటికే అనేక వివాహాలు చేసుకున్న హుమాయున్ ను వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ప్రకటించడం ‘హమీదా’ చేసిన గొప్ప సాహసం. ‘హుమాయున్ నామా’ రచించిన గుల్ బదన్ బేగమే స్వయంగా హుమాయున్ సోదరి అయి ఉండి కూడా తన వదిన హమీదా వ్యక్తిత్వాన్ని శ్లాఘించింది. హమీదాలోని వివేకవంతపు ఆలోచనలను అనేక సందర్భాల్లో సమర్థించింది. రచయిత్రిగా గుల్ బదన్ బేగం, సాహసవనితగా హమీదాయే గాక మొగల్ రాజ్య వంశీకుల్లోని స్త్రీలు తెలివిలో, దార్శనికతలో, పాలనా దక్షతలో, సాంకేతిక నిపుణతలో అత్యంత ప్రతిభను కలిగించారని “స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం” అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. వారి జీవితాలను నాటి కాలంలో పర్షియన్, అరబిక్ భాషల్లో గ్రంథస్థం చేశారని, కాని వాటికి సంబంధించిన అనువాదాలు లేకపోవడం వల్ల ఎక్కువ సమాచారం లభించడం లేదని దేవరాజు విచారం వ్యక్తం చేశారు. నాటి కాలంలో స్త్రీలు కూడా కుటుంబ సమేతంగా మక్కా యాత్ర చేసి వచ్చేవారని తెలియజేస్తూ “హుమాయున్ నామా” లోని ముఖ్య చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా దేవరాజు గుర్తు చేశారు. 16వ శతాబ్దపు స్త్రీ చైతన్యం నేటికీ స్ఫూర్తి దాయకం.
(ఇంకా ఉంది)
-ఆచార్య వంగరి త్రివేణి





