కేయూ మాజీ వీసీ ‘లింగమూర్తి ‘మానవతావాది’ ..!

“తెలంగాణ ఏర్పాటు ప్రకటన, వెనక్కి తీసుకున్న క్రమంలో సాగుతున్న ఉద్యమకారుల, పోలీసుల వైరుధ్యంలో నా విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగుపెడితే నా ఉపకులపతి పదవికి రాజీనామా చేస్తానని,ఉద్యమకారుల, విద్యార్థులు పక్షాన నిలిచి తన ఆకాంక్షను జయశంకర్ శిష్యుడుగా నిలబడ్డారు.”

సామాజిక హక్కుల నేత, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స లర్ ప్రొఫెసర్‌ నాగిశెట్టి లింగ మూర్తి కి యావత్ తెలంగాణ సమాజం కన్నీటి వీడ్కోలు పలికింది.సామాజిక ఉద్యమ సంఘాలు, హక్కుల నేతలు, రాజకీయ నాయకులు, పూర్వ విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులు ,నగర ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి కడసారిగా నివాళులర్పించి సాగనంపారు. కాకతీయ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగానికి చెందిన విశ్రాంత ఆచార్యులు లింగమూర్తి తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ కు ప్రియమైన శిష్యుడుగా పేరొందినారు.

ఆచార్య లింగమూర్తి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయం గడ్డమీద  నినాదాలతో మారు మ్రోగుతున్న 2007 నుండి నవంబర్ 2010 వరకు కాకతీయ విశ్వవిద్యాలయ 10వ వైస్ చాన్సలర్‌గా సేవలందించారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన, వెనక్కి తీసుకున్న క్రమంలో సాగుతున్న ఉద్యమకారుల, పోలీసుల వైరుధ్యంలో  నా విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగుపెడితే నా ఉపకులపతి పదవికి రాజీనామా చేస్తానని,ఉద్యమకారుల, విద్యార్థులు పక్షాన నిలిచి తన ఆకాంక్షను జయశంకర్ శిష్యుడుగా నిలబడ్డారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నడూ జై తెలంగాణ అనని ఆచార్యులకు,పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ వాణి వినిపించని ఆచార్యులకు కేసీఆర్ పెద్దపీట వేసి,ఉద్యమంలో జెండాలు మోసిన నా బోటి వాళ్ళను ఎందరినో నిర్లక్ష్యం చేసినారని,నాతో ఆవేదన వ్యక్తం చేసారు.

హుస్నాబాద్ (పాత) మండలం, చౌటపల్లి గ్రామంలో అతిపేద గాండ్ల కుటుంబంలో నాగిశెట్టి సోమయ్య,నాగిశెట్టి మాణిక్యమ్మ దంపతుల ఐదుగురు సంతానంలో నాల్గవ సంతానం లింగమూర్తి 28 జూన్ 1952లో జన్మించారు. లింగమూర్తికి చిన్నతనంలోనే అంజలితో వివాహం అయ్యింది,ఆయనకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. లింగ మూర్తి ప్రాథమిక విద్యాభ్యాసం చౌటపల్లి, అంతకపేట్, హుస్నాబాద్, కరీంనగర్ లో పీయూసీ, డిగ్రీ పూర్తీ చేసుకొని, ఉస్మానియా యూనివర్సిటీ 1975 ఎకనామిక్స్ లో పీజీ పూర్తి చేసారు. విశ్వవిద్యాలయంలో చదువుతున్న కాలంలో బేరే జనార్దన్, బొబ్బిలి, స్వదేశ్, నల్లా మల్లారెడ్డి లాంటి ప్రాణ స్నేహితులు ఉండేవారు.

పీజీ పూర్తయిన వెంటనే  వరంగల్ చందాకాంతయ్య మెమోరియల్ జూనియర్ , డిగ్రీ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా చేరడం,ఆ సమయంలో తెలంగాణ ఉద్యమనేత జయశంకర్, విప్లవ కవి వరవరరావు పరిచయం అభ్యుదయ భావాలను రంగరించుకొని, ఎంతోమందికి సహకారం అందించారు. నిరంతరం బోధనలో పట్టు సాధించి, కంచుకంఠం తో విద్యార్థులను ఆకర్షించేవారు. సార్ అనుభవం,సబ్జెక్టు మీద పట్టుదల 1981లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రావడానికి తొలిమెట్టు అయ్యింది.1992లో జయశంకర్ వీసీగా ఉన్నకాలంలోనే ఆచార్యులుగా పదోన్నతి పొంది, అధ్యాపకుడిగా విద్యార్థులకు బోధన చేస్తూనే సామాజిక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు.ఈ గడ్డ నీళ్లు అంటేనే ప్రజలపక్షం, ఇక్కడ అధ్యాపకులకు, కవులకు, రచయితలకు సామాజిక ఉద్యమాల నెలవు కావడం వల్ల రెండు దశాబ్దాలవరకు ఈ ఒరవడి వారసత్వంగా కొనసాగింది.

ఆచార్య లింగమూర్తి జీవితాన్ని నేటితరం అధ్యయనం చేసి, ఆదర్శాలను అందిపుచ్చుకోవాలి.జాతీయ,అంతర్జాతీయ సదస్సుల్లో అయన వాక్చాతుర్యం, ఉత్తేజిత ప్రసంగాలే ఆయనను ప్రజాకర్షక ఆచార్యులుగా తీర్చిదిద్దాయి. మానవతామూర్తి 35 సంవత్సరాలు టీచింగ్ అనుభవంతో రాణించి, నిర్వహించిన ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు. పరిశోధనలో 25 సంవత్సరాల అనుభవం,అయన పర్యవేక్షణలో 12మందికి డాక్టరేట్స్, 23 మందికి ఎం ఫిల్ డిగ్రీలు రావడానికి కృషి చేశారు. అంతర్జాతీయంగా హాంకాంగ్,సింగపూర్,సౌత్ ఆఫ్రికా,దుబాయ్ లాంటి దేశాలలో సదస్సులకు హాజరై కాకతీయ విశ్వవిద్యాలయ, అర్థశాస్త్ర విభాగం యొక్క ప్రతిష్టను పెంచారు.అయన 7 పుస్తకాలను పబ్లిష్ చేసారు. ఆచార్యులు పరిశోధనలు వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని అనేక మార్లు ఆవేదన పడ్డారు.

2004లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందించి సత్కరించింది.అయన ప్రతిష్టాత్మకమైన న్యాక్ టీం మెంబరుగా పనిచేసారు.  విద్యార్థులతో మమేకం కావడం చాల ఇష్టపడేవాడు.విశ్వవిద్యాలయంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్‌గా, యూజీసీ యూనిట్ సమన్వయాధికారిగా, దూర విద్యా కేంద్ర సంచాలకుడిగా, ఎకనమిక్స్ విభాగాధిపతిగా, సోషల్ సైన్సెస్ విభాగాల డీన్‌గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, అలాగే ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. 2011 సంవత్సరంలో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుండి కూడా సామాజిక ఉద్యమాల్లో తన నిబద్ధతను చాటి, బీసీ ఆచార్యులతో కల్సి ఊడిగం చేస్తూనే వచ్చారు.

నాడు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రజాపాలన శాస్త్రం, అర్థశాస్త్ర విభాగాలకు ప్రపంచ స్థాయి విశిష్టత ఉండేది.ఈ సమూహంలో కొందరు ఆచార్యులు అనుకున్నట్లుగానే స్త్రీ పక్షపాతిగా,అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడుతుండేవారు. నేను విద్యార్థిగా 1984 నుండి కీ.శే. బియ్యాల జనార్ధన్ రావు, సీతారామారావులతో ,బొబ్బిలితో అప్పుడప్పుడు ఆచార్య శివరామకృష్ణ, ఆచార్య లింగమూర్తి లను కలుస్తూ ఉండేవాడిని,వారి కలయిక ఒక వైభవోజ్వల శకం.సార్ జేబులో చిల్లిగవ్వ లేకున్నా ఎదుటివాడి ఆకలి, దప్పుల గూర్చి ఆరాటపడిన మహనీయుడు లింగమూర్తి. సార్ కి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు నేను కుటుంబ సభ్యునిగా రవీంద్రభారతి వెళ్ళినాను. డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనను సత్కరిస్తున్న క్షణాలు,ఆతిధ్యం నేను ఇప్పటికి మర్చిపోను.

ఇక నేను భోజన ప్రియుడనని తెలుసు కాబోలు అందుకే  ‘ఇందు’ హోటల్ లో .. మల్లేశ్వర్ నీకు నచ్చినది  తిను, ఇక్కడ  గురు శిష్యుల ప్రోటోకాల్ ఏమిలేదు .. ఇష్టం వచ్చినట్టు తిను అని, వేటర్ ను పిలిచి నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చి తినిపించాడు.అనంతరం నేను పాన్ తినడం నేరం అన్నట్లుగా ఉండేవాడిని, కానీ నాకు ‘స్వీట్’ పాన్ అలవాటు చేసింది నా అభిమాని లింగమూర్తి అనే విషయాన్నీ మీకు చెప్పక తప్పదు. జయశంకర్ సార్ అంటే ఎనలేని గౌరవం నెలముందే సార్ పుట్టిన రోజు గురించి గుర్తు చేస్తుండేవాడు. ఈ స్నేహశీలి,మానవతా మూర్తి (లింగమూర్తి )  గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడి,14 మార్చి 2026 మధ్యాహ్నం 12.30 గంటలకు హనుమకొండలోని  తన స్వగృహంలో కన్నుమూశారు.

జోహార్లు జయశంకర్ శిష్యుడా …బాధతప్తహృదయాలతో ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *