వలస.. నా రచనల ఊపిరి

ప్రవాస తెలంగాణం

వలస అనేది నాకు జరిగిన ఒక పెద్ద మానసిక సంక్షోభం. పుట్టిపెరిగిన ప్రాంతాన్ని, కుటుంబాన్ని వదిలి మరొక దేశానికి వెళ్లడం అనేది పైకి చూడటానికి సాధారణంగానే కనిపించవచ్చు, కానీ ఈ ప్రక్రియలో ఒక మనిషి తనలోతాను ఎన్నో అంతర్గత సంఘర్షణలకు గురవుతాడు. బహుశా, ఆ సంఘర్షణే నాలో ఉన్న రచయితను తట్టిలేపింది.
గల్ఫ్ రాకముందు, నేను సాహిత్యాన్ని ఆస్వాదించే ఒక పాఠకుడిని మాత్రమే. కానీ సౌదీ అరేబియాకు వలస వచ్చాకే, ఇక్కడి మన తెలంగాణ బిడ్డల కష్టాలను, వారి కన్నీటి గాథలను కళ్లారా చూశాను. ఆ వ్యధ, ఆ ఆవేదనే నన్ను రచయితగా మార్చింది. వారి జీవితాలను కథల రూపంలో రికార్డ్ చేయాలనే తపనతో, అఫ్సర్ గారి ప్రోత్సాహంతో, ‘సారంగ’ పత్రికలో “గల్ఫ్ బతుకు కథలు”  సీరీస్ ప్రారంభించాను. నా వలస నా రచనలలోకి కేవలం ‘ప్రవేశించడం’ కాదు, అదే నా రచనలకు ఊపిరి.

నేను 90వ దశకంలో పుట్టాను. నాకు రాజకీయ, సామాజిక చైతన్యం అంకురించే సమయానికి, తెలంగాణ ఉద్యమం కీలకమైన, తుదిఘట్టంలో (2008-2014) కొనసాగుతోంది. అప్పటికే దశాబ్దాల నిరీక్షణ, ఎన్నో ఆందోళనలు, త్యాగాలు ఉద్యమాన్ని పతాకస్థాయికి చేర్చాయి. ఆ సమయంలో నేను ఆంధ్రప్రాంతానికి చెందిన ఒక రెసిడెన్షియల్ కళాశాలలోచదువుకుంటూ ఉన్నాను. అందువల్ల  ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం నాకు లభించలేదు. అయితే, ఉద్యమస్పూర్తిని సాహిత్య రూపంలో, పరోక్షంగా చాలా దగ్గరగా చూశాను. వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే ఎడిటోరియల్స్, ఉద్యమనేపథ్య కథలు, ప్రత్యేకించి ప్రజా నాట్యమండలి వంటి కళాబృందాలు ప్రదర్శించిన పాటలు, విప్లవోద్యమకాలంలో పాటకు పట్టం కట్టిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న తెలంగాణ’ వంటి పాటలు నా భావోద్వేగాలకు ఆలంబనగా నిలిచాయి.

ప్రస్తుత  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందరో ఉద్యమకారుల, అమరుల భుజాలపై నిలబడి స్వాతంత్య్రాన్ని శ్వాసిస్తోంది. కాబట్టి, అటువంటి ఉద్యమకారులను, వారి చరిత్రను మనం తెలుసుకోవడం, మన తర్వాతి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బలంగా నమ్ముతాను. భవిష్యత్ తరాలు ఈ చరిత్రను తెలుసుకున్నప్పుడే, సాధించుకున్న తెలంగాణ విలువను, దానివెనుక ఉన్న కృషిని అర్థం చేసుకోగలుగుతాయి. ఆ ఉద్యమ సాహిత్యం, ఆ పాటల స్ఫూర్తి, మరియు ఉద్యమ చైతన్యం నా ఐడియాలజీలో పరోక్షంగా కనిపిస్తాయి. నా ఆలోచనలు, దృక్పథం, సామాజిక బాధ్యత పట్ల నాకున్న అవగాహన అన్నీ ఆ ఉద్యమ ప్రభావానికి లోనయ్యాయి. తెలంగాణ ఉద్యమం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కోసం జరిగిన పోరాటం కాదు, అది ఆత్మగౌరవం, అస్తిత్వం, మరియు సమానత్వం కోసం జరిగిన చారిత్రక పోరాటం. ఈ స్ఫూర్తి నా జీవితంలో, ఆలోచనా ధోరణిలో అంతర్భాగంగా నిలిచిపోయింది.

-సంజయ్ ఖాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *