ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఐదు గ్రామాలు-పురుషోత్తపట్నం, గుండాల, ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు- నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ పెరుగుతుండటం తాజా పరిణామం. ఈ గ్రామాలను తమకు తిరిగి అప్పగించాలని తెలంగాణ కోరడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చెందిన 880 ఎకరాల భూములు ఈ ఐదు గ్రామాల్లో ముఖ్యంగా పురుషోత్తపట్నంలో ఉన్నాయి. రామాలయానికి వొచ్చే భక్తులకు వసతి గృహాలు, కల్యాణమండపాలు లేదా ఇతర సౌకర్యా లు కల్పించాలన్నా ఈ భూములే ముఖ్యం. ప్రస్తుతం ఈ భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టలేకపోతున్నది. గోదావరికి వరదలు వొచ్చినప్పుడు భద్రాచలంతో పాటు ఈ ఐదు గ్రామాలు కూడా ముంపునకు గురవుతాయి. పట్టణాన్ని రక్షించడానికి కరకట్టను పొడిగించాలంటే ఈ గ్రామాలకు చెందిన భూములు అవసరం. అధికార యంత్రాంగం రెండు రాష్ట్రాల్లో ఉండటం వల్ల సమన్వయం కొరవడుతోంది.
ఈ గ్రామాలకు చెందిన గిరిజనులకు భద్రాచలం కేవలం 3 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు వీరు ప్రభుత్వ పనుల మీద జిల్లా కేంద్రమైన పాడేరు లేదా ఇతర కార్యాలయాల్లో పనుల కోసం 200 కిలోమీటర్లు పైగా దూరం వెళ్లాల్సి వొస్తోంది. చిన్నపనికి కూడా ఇంత దూరం ప్రయాణించాల్సి రావడం నిరుపేద గిరిజనులకు తలకు మించన భారంగా, బోలెడంత సమయం వృధా అవుతోంది. ఈ ప్రాంత గిరిజనులు తమ పిల్లల చదువులు, నిత్యావసరాలు, వైద్యం వంటి అవసరాలకోసం భద్రాచలం పైనే ఎక్కువగా ఆధారపడతారు. ఇప్పుడు ఈ గ్రామాలు భద్రాచలం ఐటీడీఏ నుంచి విడిపోవడంతో సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రామాలయానికి చెందిన సింహభాగం భూములు పురుషోత్తపట్నం లోనే ఉన్నాయి. గుండాల పవిత్రమైన ఉష్ణగుండాలకు ప్రసిద్ధి. ఏటపాక భద్రాచలానికి అనుకొని ఉన్న కీలకమైన గ్రామం. భద్రాచలం పట్టణ విస్తరణకు భౌగోళికంగా కన్నాయిగూడెం చాలా అవసరం. రవాణా, మౌలిక సదుపాయాల అనుసంధానతకు పిచ్చుకలపాడు కీలకం.ఈ నేపథ్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూములు ఉన్న భద్రాచలం సమీప గ్రామాలైన ఈ ఐదింటిని ఏపీలో కలపడం చారిత్రక తప్పిదంగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ వొచ్చిన చిక్కేమిటంటే ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేయాలి. ఇందుకోసం రెండు రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది.
ఈ గ్రామాలను లేదా రామాలయ భూములనైనా తెలంగాణకు బదిలీ చేయాలన్న డిమాండ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా మారింది. అయితే ఈ గ్రామాలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలంటే ఇరు రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానంతో పాటు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. ముఖ్యంగా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేపట్టాలి. ఇందుకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సిందే! ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 5న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాస్తూ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణలో ఈ గ్రామాల విలీనం బిల్లును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.
మరి ఇప్పటివరకు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఈ విషయంపై ఎందుకు తీర్మానం చేయలేదన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. తెలంగాణకు ఈ ఐదు ఊళ్ళు ఇవ్వాలంటే, హైదరాబాద్‌పై తమకు హక్కులు లేదా ఇతర రాయితీలు ఇవ్వాలని ఆంధ్రకు చెందిన కొందరు రాజకీయ నాయకులు కోరుతున్నారు. నిజానికి ఈ ఐదు గ్రామాలను ఆంధ్రలో కలపడానికి ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు. అందువల్ల ఈ ప్రాజెక్టు భద్రత, ముంపు నిర్వహణ దృష్ట్యా ఈ ఐదు గ్రామాలను వదులుకోవడానికి ఏపీ ప్రభుత్వం సంకోచిస్తోంది. ఈ గ్రామాలను మరో రాష్ట్రానికి మార్చడం వల్ల వోటర్ల సంఖ్య, నియోజకవర్గ సరిహద్దుల్లో కొన్ని మార్పులు వొస్తాయి. ఈ మార్పులకు సంబంధించిన స్పష్టత లేకపోవడం కూడా అంసెబ్లీలలో తీర్మానం ఆమోదించడానికి ఆలస్యం కావడానికి ఒక కారణం.
అయితే ఏప్రిల్ నెల వొచ్చేసరికి ఈ గ్రామాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిలు భేటీ అయినప్పుడు ఈ గ్రామాల విలీన ప్రస్తావన వొచ్చిందని, అందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వొచ్చాయి. అంతే కాదు గత ఫిబ్రవరిలో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏపీ ముఖ్యమంత్రిని అమరావతిలో కలిసినప్పుడు దీని ప్రస్తావన తేగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు కూడా మీడియాలో వార్తలు వొచ్చాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానాల ఆమోదం లేదా కేంద్రం నుంచే నేరుగా చట్టం అమల్లోకి వొచ్చే అవకాశం ఉందంటున్నారు.





