రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు గాను రూ.530 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ‘కొత్త కార్డుల్లో 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేస్తాం. తొలి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం.
పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లు చేర్చారు. 501 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభమైంది. మొదటి రోజు 20,336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదలయ్యాయి‘ అని తెలిపారు. ఈ ఏడాది రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇస్తామని పేర్కొన్నారు.
రైతులకు యాసంగికి పెట్టుబడి సాయం, కూలీలకు రూ.6 వేలు ఖాతాల్లో పడతాయని వివరించారు. సోమవారం నుంచి బ్యాంకుల్లో నగదు చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ఖజానా ఖాలీగా ఉన్నా రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. అందుకు రూ.21 వేల కోట్లు చెల్లించామని ప్రకటించారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని అన్నారు. అర్హులైన అందరికీ పథకాలు వస్తాయని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇళ్లు మంజూరవుతాయని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు.





