“ఇప్పుడు దర్యాప్తు జరగబోతున్న కథనం పూర్తి అబద్ధమూ, కల్పనా కావచ్చు, లేదా ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారం కావచ్చు. అది అబద్ధమైనా, ఎంతో కొంత నిజం ఉన్నా జర్నలిజానికి సంబంధం లేని వ్యక్తుల సొంత విషయం. దాన్ని బైటికి లాగడం వ్యక్తిత్వ హననం. ఒకవేళ వారి మధ్య నిజంగా సంబంధం ఉన్నా, సమాజానికి అది అనవసరం. దాన్ని వార్తా కథనంగా ప్రసారం చేయడం ఆ వార్తా సంస్థ నీచ సంస్కృతికి మాత్రమే నిదర్శనం. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు రాష్ట్ర మంత్రీ, మరొకరు ఉన్నతాధికారీ అయినప్పటికీ, వారి వ్యక్తిగత విషయాలు బజారుకు ఈడ్వవలసిన అవసరమేమీ లేదు. అలా ఈడ్వడం వాయరిజం (బాత్ రూమ్ తలుపు సందులోంచి లోపలికి తొంగిచూసే నీచమైన ప్రవృత్తి) కన్నా ఎక్కువ కాదు. ఇంత చౌకబారు, హీనమైన, దుర్మార్గమైన ప్రవృత్తిని జర్నలిజం అనడానికి కూడా మనస్కరించడం లేదు.”
లోకం గురించి వార్తలు రాసే జర్నలిజం తెలంగాణలో ఈ వారంలో తానే వార్త అయింది. ఒక మంత్రికీ, ఆ జిల్లాలో పని చేసిన మహిళా ఐఎఎస్ అధికారికీ మధ్య ఫ్రేమాయణం నడుస్తున్నదని ఒక కథనాన్ని ఒక ఛానల్ ప్రసారం చేసింది. ఇతర ఛానళ్లు, పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లు కూడా అందుకున్నాయి. ఆ వార్తను ఆ మంత్రి ఖండించారు. ఐఎఎస్ అధికారుల సంఘం కూడా ఖండించడం మాత్రమే కాక, పోలీసు ఫిర్యాదు కూడా ఇచ్చింది. ప్రభుత్వం ఈ ఫిర్యాదునూ, నారాయణపేట్ జిల్లాలో ఒక వాట్సప్ గ్రూప్ మీద వచ్చిన ఫిర్యాదునూ కలిపి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. ఆ ఛానల్ క్షమాపణ ప్రకటించింది. ఇది రాస్తున్న సమయానికి ముగ్గురు జర్నలిస్టుల అరెస్టుతో సిట్ దర్యాప్తు మొదలయింది.
జర్నలిస్టులను అరెస్టు చేసినప్పుడు, విధి నిర్వహణలో భాగంగా జరిగిన భావ ప్రకటన మీద ప్రభుత్వం దాడి చేసినప్పుడు ఖండించడం సాధారణమైన ప్రజాస్వామిక సంప్రదాయం. ఇవాళ అరెస్టయిన ముగ్గురూ జర్నలిస్టులే, వారు నిర్వహించిన ఉద్యోగ బాధ్యతల వల్లనే ఇప్పుడు అరెస్టయ్యారు. ఏ జర్నలిస్టునైనా అరెస్టు చేయడం ఖండించదగినదే. వారిని వెంటనే విడుదల చేయాలి. వారు ఆ కథనం ప్రసారం చేయడానికి నిజంగా వెనుక ఉన్నది ఎవరో దర్యాప్తు చేసి, వారి మీద విచారణ జరపాలి.
ఆ ప్రజాస్వామిక ఆకాంక్ష ప్రకటిస్తూనే, వారు చేసిన పని జర్నలిజమేనా అని ప్రశ్నించక తప్పదు. అసలు “వారు చేసిన పని” అనడం కూడా సరి కాదేమో. ఇవాళ యజమానులు, యజమానుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు వండించే వార్తలే తప్ప, అంటే యాజమాన్యం చేయించే పనులే తప్ప, జర్నలిస్టులు స్వయంగా చేసే పనులు సాధారణంగా ఉండడం లేదు. ఈ సందర్భంలో తెలంగాణలో జర్నలిజం గురించీ, వ్యక్తుల గోప్యతా హక్కులను భంగపరిచే హక్కు జర్నలిస్టులకు ఉందా అనే అంశం గురించీ చర్చ జరగవలసి ఉంది.
“సరే, వాళ్ల రాజకీయ కుతంత్రాలు ఏవైనప్పటికీ, ఎద్దుల కొట్లాటలో లేగదూడల కాళ్లు విరిగినట్టు, అమాయకుల వ్యక్తిగత హననాలు జరిగిపోతున్నాయి. అబద్ధాలే వార్తలుగా చలామణీ అవుతున్నాయి. సంబంధం లేని వారిని అవమానానికీ అపారమైన వేదనకూ గురి చేస్తున్నాయి. సామాజిక విలువలే ధ్వంసమైపోతున్నాయి. కనుక ఇదేదో వారి సొంత వ్యవహారం అనీ, రాజకీయం అనీ ఊరుకుంటే లాభం లేదు. ఈ ఒక్క కథనమే కాదు, ఇటువంటి అనేక కథనాల వెనుక ఉన్న భావజాలం వల్ల బాధితులుగా మిగులుతున్న స్త్రీలు, అసహాయులు, పేదలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలు ఎందరో ఉన్నారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఆయా వర్గాల వ్యక్తుల మీద ఏమైనా రాయవచ్చు, ఏదైనా ప్రసారం చేయవచ్చు, ఎంత బురద అయినా చల్లవచ్చు, ఎంతగా వ్యక్తిత్వ హననం అయినా చేయవచ్చు అనే ఒక సామాజిక విలువ విషపు తీగ మన మనసు నిండా అల్లుకుపోతున్నది. అదీ అసలు సమస్య.”
ఇప్పుడు దర్యాప్తు జరగబోతున్న కథనం పూర్తి అబద్ధమూ, కల్పనా కావచ్చు, లేదా ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారం కావచ్చు. అది అబద్ధమైనా, ఎంతో కొంత నిజం ఉన్నా జర్నలిజానికి సంబంధం లేని వ్యక్తుల సొంత విషయం. దాన్ని బైటికి లాగడం వ్యక్తిత్వ హననం. ఒకవేళ వారి మధ్య నిజంగా సంబంధం ఉన్నా, సమాజానికి అది అనవసరం. దాన్ని వార్తా కథనంగా ప్రసారం చేయడం ఆ వార్తా సంస్థ నీచ సంస్కృతికి మాత్రమే నిదర్శనం. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు రాష్ట్ర మంత్రీ, మరొకరు ఉన్నతాధికారీ అయినప్పటికీ, వారి వ్యక్తిగత విషయాలు బజారుకు ఈడ్వవలసిన అవసరమేమీ లేదు. అలా ఈడ్వడం వాయరిజం (బాత్ రూమ్ తలుపు సందులోంచి లోపలికి తొంగిచూసే నీచమైన ప్రవృత్తి) కన్నా ఎక్కువ కాదు. ఇంత చౌకబారు, హీనమైన, దుర్మార్గమైన ప్రవృత్తిని జర్నలిజం అనడానికి కూడా మనస్కరించడం లేదు. నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిజంతో ఉన్న సంబంధం వల్ల ఈ కథనం జర్నలిజం అనాలంటే సిగ్గుగా, అవమానంగా ఉంది. కాని ఇవాళ దాదాపు అన్ని పత్రికల, ఛానళ్ల యాజమాన్యాలు అటువంటి దిగజారుడుతనాన్నే జర్నలిజంగా ఊరేగిస్తున్నాయి. ఆ దిగజారుడుతనానికి యాజమాన్యాల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు జత కలుస్తున్నాయి. ఎంతగా పాఠకులలో, వీక్షకులలో నీచ ప్రవృత్తులను రెచ్చగొడితే అంతగా ఆకర్షణీయత ఉంటుందని, ఆదరణ దొరుకుతుందని, అంటే అంతగా డబ్బులు వస్తాయని తెలుగు సినిమా నేర్పిన తప్పుడు పాఠాన్ని తెలుగు టెలివిజన్ అక్షరాలా పాటిస్తున్నది. తామరతంపరగా పుట్టుకొచ్చిన ఆన్ లైన్ పత్రికలూ, యూట్యూబ్ ఛానళ్లూ దాన్నే అనుసరిస్తున్నాయి. ఇది మొత్తంగా మన సామాజిక విలువల సమస్య.
ఆ కథనం ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ లో, హైదరాబాద్ నడిబొడ్డున ఏటేటా కార్తీక మాసోత్సవాలు జరిపి, లక్షలాదిగా ప్రజలను ఆకర్షించి, భక్తి రసాన్ని డ్రైనేజి స్కీము లేకుండా పొంగి పొర్లించే ఛానల్ లో, స్వయంగా ముఖ్యమంత్రితో సహా ఎందరెందరో అధికార, ప్రతిపక్ష నాయకులందరికీ అనుంగు మిత్రుడైన యజమాని నడిపించే ఛానల్ లో వెలువడింది. సాధారణంగా యజమానులే తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ కథనాలు ప్రసారం చేయాలో, ఏవి చేయగూడదో నిర్దేశిస్తున్నారు గనుక, ఈ కథనంలో కూడా ఇప్పుడు అరెస్టయిన జర్నలిస్టుల పాత్ర కన్నా ఎక్కువ పాత్ర యజమానికి ఉండవచ్చు. కాని ఇప్పటికి యాజమాన్యం దగ్గరికి సిట్ దర్యాప్తు బృందం వెళ్లినట్టు వార్తలు కూడా లేవు. అసలు ఇంత పెద్ద, సంచలనాత్మక వార్త తన మంత్రివర్గ సహచరుడిని దెబ్బ తీయడానికి ముఖ్యమంత్రే స్వయంగా అందజేశాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అలా చూపుడు వేలు ఛానల్ యజమాని వైపూ, ముఖ్యమంత్రివైపూ ఉన్నప్పటికీ సిట్ ఆ విషయం అసలు దర్యాప్తే చేయకపోవచ్చు.
అసలు పత్రికలూ, ఛానళ్లూ అన్నీ కూడా రాజకీయ పక్షాల, రాజకీయ నాయకుల వ్యక్తిగత ఎజెండాలను తీర్చడానికి వార్తల సృష్టీ, ప్రచారమూ సాగిస్తున్న సాధారణ వాతావరణంలో ఒకానొక వార్త ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అని దర్యాప్తు చేయడం గొంగట్లో తింటూ వెంటుకలు ఏరడం లాంటిదే. జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొందరిని తప్పించి, ఆ స్థానంలో మరి కొందరిని తీసుకోవడం కోసం, స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే తీసివెయ్య దలచుకున్న మంత్రుల మీద ఆరోపణలు పత్రికలకూ ఛానళ్లకూ పొక్కేలా చేస్తున్నదని ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఆ రకంగా కొందరు మంత్రుల మీద అపోహలు, వ్యతిరేకత ప్రచారం చేసి, వ్యక్తిత్వ హననం చేసి, ఆ కారణాలవల్లనే తొలగించానని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ ఉంది. నిజానికి మంత్రివర్గ విస్తరణ అనేది ఎప్పటికప్పుడు జరగవలసిందే, కొందరిని తప్పించి, కొందరు కొత్తవారిని తీసుకోవలసిందే. అది పాలకపార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి, తొలగించదలచుకున్న వారితో ప్రజాస్వామికంగా సంభాషణ జరిపి, ఒప్పించి చేయవచ్చు. కాని ప్రజాస్వామ్యం అనేదే, సంభాషణ అనేదే ఇక్కడ ఎంతమాత్రమూ దొరకని దినుసు అయినప్పుడు ఇటువంటి దొంగచాటు, దగాకోరు పద్ధతులే రాజ్యం ఏలుతాయి.
“ప్రముఖ వ్యక్తుల అనుమతి లేకుండా, సుదూరం నుంచి టెలీ లెన్సుల సహాయంతో, వారి ఫొటోలు, వారు చూపదలచుకోని ఫొటోలు తీసి అమ్ముకోవడం అనే ఒకానొక స్వతంత్ర ఫొటోజర్నలిజం వృత్తిగా మొదలైన పాపరాజి, చివరికి ప్రిన్సెస్ డయానా, ఆమె సహచరుడు దోడి ఫాయెద్ లను వెంటాడి, వేటాడి, వారి కారు ప్రమాదానికి గురి అయ్యేలా చేసి, వారి ప్రాణాలు బలి తీసుకున్న వ్యవహారం మనకు తెలుసు. ఇప్పుడు సాంప్రదాయక పాపరాజి లేకుండా పోయింది గాని, ప్రధాన స్రవంతి అని చెప్పుకునే పత్రికలూ ఛానళ్లూ, కొత్తగా పుట్టుకొచ్చిన సామాజిక మాధ్యమాలూ పాపరాజి దుష్ట సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. ఇవాళ నిందితురాలి స్థానంలో ఉన్న ఛానల్ ఒక కొత్త పాపరాజి. దీనికి రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి గనుక పాపరాజి కన్నా హీనం.”
సరే, వాళ్ల రాజకీయ కుతంత్రాలు ఏవైనప్పటికీ, ఎద్దుల కొట్లాటలో లేగదూడల కాళ్లు విరిగినట్టు, అమాయకుల వ్యక్తిగత హననాలు జరిగిపోతున్నాయి. అబద్ధాలే వార్తలుగా చలామణీ అవుతున్నాయి. సంబంధం లేని వారిని అవమానానికీ అపారమైన వేదనకూ గురి చేస్తున్నాయి. సామాజిక విలువలే ధ్వంసమైపోతున్నాయి. కనుక ఇదేదో వారి సొంత వ్యవహారం అనీ, రాజకీయం అనీ ఊరుకుంటే లాభం లేదు. ఈ ఒక్క కథనమే కాదు, ఇటువంటి అనేక కథనాల వెనుక ఉన్న భావజాలం వల్ల బాధితులుగా మిగులుతున్న స్త్రీలు, అసహాయులు, పేదలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలు ఎందరో ఉన్నారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఆయా వర్గాల వ్యక్తుల మీద ఏమైనా రాయవచ్చు, ఏదైనా ప్రసారం చేయవచ్చు, ఎంత బురద అయినా చల్లవచ్చు, ఎంతగా వ్యక్తిత్వ హననం అయినా చేయవచ్చు అనే ఒక సామాజిక విలువ విషపు తీగ మన మనసు నిండా అల్లుకుపోతున్నది. అదీ అసలు సమస్య.
ఒకప్పుడు సంపూర్ణమైన, నిస్సందేహమైన సాక్ష్యాధారాలు లేకుండా వార్తా కథనాలు రాయగూడదనీ, ఆ కథనంలో ఎవరి మీద ఆరోపణలున్నాయో వారి అభిప్రాయం కూడా కథనంలో భాగం చేయాలనీ, జర్నలిజానికి వస్తుగత తటస్థత ప్రాణప్రదమనీ విలువలు ఉండేవి. ఇప్పుడు వేగం పెరిగిపోయిన, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలే మిగిలిన ప్రసార మాధ్యమాలకు సాక్ష్యాలు అవసరం లేదు, ఆధారాలు అవసరం లేదు, ప్రభావిత వ్యక్తుల అభిప్రాయం అవసరం లేదు. ఉట్టి పుకారును కథనంగా మార్చవచ్చు. ఏమీలేని చోట, గోరంత కూడా లేనిచోట కొండంత కల్పన తయారు చేయవచ్చు. ఎంతో కొంత ఉన్నచోట, ఒక్క వాక్యం ఆధారాన్నే పదే పదే వందసార్లు చెప్పి, దానికి చెవులు బద్దలు గొట్టే బ్యాంగ్ లు వేసి అదే నిజమని భ్రమ కల్పించవచ్చు. నిప్పు లేకుండా పొగ వస్తుందా అనే సామెతను దుర్వినియోగం చేస్తూ, మనమే నిప్పూ కనిపెట్టవచ్చు, ఊరు కమ్మేసే పొగా సృష్టించవచ్చు. ఒకచోట నిరాధారంగా తయారు చేసిన వార్త వంద ఛానళ్లూ, యూట్యూబ్ ఛానళ్లూ తిరిగి తిరిగి వచ్చి, మొదట తయారు చేసినవారికే దిగ్భ్రాంతికరమైన ఆధారంగా మారవచ్చు.
‘వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిగ్గా నిలబడితే ఏమైనా అంటాం’ అని శ్రీశ్రీ అన్నాడు గాని, దాని అర్థం పబ్లిగ్గా నిలబడినవారి ప్రైవేటు బతుకులను బహిరంగం చేయమని కాదు. అవి వారి సొంతం అనే మాట ముందే ఉంది. ఆ మంత్రి నడిపే రాజకీయాలు, ఆయన మంత్రిత్వ శాఖలో జరిగిన, జరగని పనులు, విధానాలు, ఆ మహిళా అధికారి విధి నిర్వహణ మంచీ చెడూ – ఇవీ జర్నలిజానికి అవసరమైన ప్రమేయాలు, పరిధులు. ఆ పరిధి దాటి దాన్ని జర్నలిజం అని బుకాయించడం తప్పనిసరిగా ఖండించవలసిందే. ఎందుకంటే ఆ పరిధి దాటడం ద్వారా, ఆ కథనం వ్యక్తిగత అంశాల్లోకి ప్రవేశించింది, వ్యక్తిగత గోప్యతా హక్కును భంగపరిచింది, ముఖ్యంగా మహిళల విషయంలోనైతే కొనసాగుతున్న సామాజిక విలువల వల్ల, పితృస్వామ్య, పురుషాధిక్య, స్త్రీ వ్యతిరేక భావజాలం వల్ల నైతికత చర్చలోకి వస్తుంది. ఏమీ లేని చోట గాసిప్ మొదలవుతుంది. చౌకబారు ఆరోపణలు మొదలవుతాయి. అది బాధితుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వారి సామాజిక వ్యక్తిత్వం అవమానాల పాలవుతుంది. సమాజంలో ఉన్న ఈ స్థితి మిగిలినవారికన్నా జర్నలిస్టులకు ఎక్కువ తెలుసు గనుక మహిళల మీద, మొత్తంగా అణగారిన వర్గాల వారి మీద ఆరోపణల వార్తలు, కథనాలు తయారు చేసేటప్పుడు చాలా జాగరూకతతో ఉండాలి. అటువంటి జాగరూకత లేకపోవడం పాశ్చాత్య దేశాలలో ఎల్లో జర్నలిజంగా, పాపరాజిగా పేరు పడిన తప్పుడు ధోరణులతో సమానం అవుతుంది.
ప్రముఖ వ్యక్తుల అనుమతి లేకుండా, సుదూరం నుంచి టెలీ లెన్సుల సహాయంతో, వారి ఫొటోలు, వారు చూపదలచుకోని ఫొటోలు తీసి అమ్ముకోవడం అనే ఒకానొక స్వతంత్ర ఫొటోజర్నలిజం వృత్తిగా మొదలైన పాపరాజి, చివరికి ప్రిన్సెస్ డయానా, ఆమె సహచరుడు దోడి ఫాయెద్ లను వెంటాడి, వేటాడి, వారి కారు ప్రమాదానికి గురి అయ్యేలా చేసి, వారి ప్రాణాలు బలి తీసుకున్న వ్యవహారం మనకు తెలుసు. ఇప్పుడు సాంప్రదాయక పాపరాజి లేకుండా పోయింది గాని, ప్రధాన స్రవంతి అని చెప్పుకునే పత్రికలూ ఛానళ్లూ, కొత్తగా పుట్టుకొచ్చిన సామాజిక మాధ్యమాలూ పాపరాజి దుష్ట సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. ఇవాళ నిందితురాలి స్థానంలో ఉన్న ఛానల్ ఒక కొత్త పాపరాజి. దీనికి రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి గనుక పాపరాజి కన్నా హీనం.
కనుక దర్యాప్తు చేయవలసిందీ విచారించవలసిందీ ఒక ఛానల్ నో, ఒక వాట్సప్ గ్రూపునో మాత్రమే కాదు, దిగజారుతున్న సామాజిక విలువలను. అందులో భాగమే స్త్రీల పట్ల చిన్నచూపు చూసే, అవమానించే, కేవలం లైంగిక వస్తువుగా, భోగ వస్తువుగా చూసే దృక్పథం. నటుడు శివాజీ అన్న దుర్మార్గమైన మాట మీద, అంతకు ముందునుంచే సామాజిక మాధ్యమాలలో మహిళలను అవమానిస్తున్న లెక్కలేనన్ని ట్రోల్స్ మీద, తెలుగు సినిమా రంగంలో మొత్తంగా కొనసాగుతున్న అవమానకరమైన సంస్కృతి మీద జరపవలసి ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్.





