పక్షి వీక్షణం

“మహారాష్ట్రలోని బిగ్వాన్, సాస్వాద్, పంచ్గని అనే పక్షి ఆవాస ప్రదేశాలలో స్థానిక యువకులు 30 మంది గైడ్ లుగా పనిచేస్తున్నారు. వాళ్ళు గైడ్ లుగా మారిన క్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. మా గైడ్ అమోల్ చెప్పిన ప్రకారం .. వాళ్ళ తల్లిదండ్రులు చేపలు పట్టేవారు. పక్షి ప్రేమికులు వచ్చినప్పుడు ఆ బోట్లలోనే తీసుకువెళ్ళమని అడిగేవారు. దానిని వృత్తిగా మార్చుకుంటే బాగుంటుందనే ఆలోచన అక్కడి యువతకు వచ్చింది. అప్పుడు బిగ్వాన్ మాత్రమే సరిపోదు. అందుకని దగ్గరలో వున్న సాస్వాద్, పంచగని ప్రాంతాలలో ఏయే రుతువులలో ఏయే పక్షులు వస్తాయో పరిశోధన చేసి పక్షుల ఆవాస ప్రదేశాలను కనిపెట్టారు. ఈ మూడు ప్రదేశాలను కలిపి ప్యాకేజీ గా ఇస్తున్నారు. ఆయా పక్షి కూతలను రికార్డు చేసుకొని .. వాటిని ప్లే చేయడం ద్వారా బర్డ్ కాలింగ్ చేస్తున్నారు. పక్షులకు ఎలాంటి హాని జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్షి వీక్షకుల డిమాండ్ మేరకే హోటల్ నిర్మించినట్టు చెప్పాడు. వీళ్ళకు మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి వుంది. పక్షి కూత విని అది ఏ పక్షినో, ఎక్కడవుందో చెప్పగల నైపుణ్యం అమోల్ సొంతం. ఏ పని చేస్తున్నా ఆయన ధ్యాస ఆ వైపుగానే ఉంటుంది. బోట్ డ్రైవర్ గా వచ్చిన సౌరభ్ కూడా స్థానిక యువ గైడే .. అతనికీ పక్షులకు సంబంధించి అపారమైన జ్ఞానం ఉంది. ఉద్యోగాలంటూ ఊళ్లు వదిలి వెళ్ళకుండా స్థానికంగా ఉపాధి కల్పించుకోవడం తో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందించ దగ్గ విషయం.”

అనాదిగా సంచారం వల్లనే మనిషి ఈనాటి అభివృద్ధిని సాధించాడు. మనని మనం చట్రంలో బిగించుకోకుండా నాలుగు గోడలను దాటుకొని, విస్తృతంగా ప్రయాణించినప్పుడే మనం మరింత విస్తృతం అవుతాము. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు మనసును ఉత్సాహంగా వుంచుతాయి. అన్నిటికీ మించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. నామట్టుకు నాకు ప్రయాణం చేసివచ్చిన ప్రతిసారి వయసు కొంత తగ్గినట్లు అనిపిస్తుంది.ఈ మధ్య నేను చేసిన ఒక విభిన్నమైన ప్రయాణం గురించి పంచుకుంటాను. 85 యేళ్ళ యువకుడితో ( కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు .. అన్నాడు శ్రీశ్రీ ) ప్రయాణం చేయడం. ఆయన ఉత్సాహ స్ఫూర్తిని నేనూ కొంత ఆవాహన చేసుకున్నాను.

ఆయనే పక్షి ఛాయా గ్రాహకుడు (Bird Photographer) డా. సోమంచి శ్రీనివాస రావు గారు. వారితో పాటు ఒమ్మి రమేశ్ బాబు, సజయ (వాళ్ళిద్దరూ రచయితలు, జర్నలిస్టులు ) నలుగురం కారులో బయలుదేరాం. ముందుగా మహారాష్టలోని బిగ్వాన్ గ్రామానికి మా ప్రయాణం. హైదరాబాదు నుంచి సుమారు 427 కిమీ దూరం. ఏడుగంటల ప్రయాణం. మార్గమధ్యలో జహిరాబాద్ లో రచయిత్రి, డాక్టరు విజయలక్ష్మి ( ప్రగతి నర్సింగ్ హోం) గారింట్లో అల్పాహారం ముగించి, ఆమె చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకొని, ఆమెరాసిన   ‘ చిన్నోడికి ప్రేమతో ‘.. పుస్తకాన్ని బహుమతిగా తీసుకొని తిరిగి ప్రయాణమయ్యాం. గమ్యానికి 1.30.లకు చేరుకున్నాం.

ఫ్రెషై భోజనానికి వెళ్ళాం. రెండు జొన్నరొట్టెలు, రెండు కూరలు, పప్పు, పెరుగు, అన్నంతో భోజనం రుచిగా వుంది. కాసేపు విశ్రాంతి తీసుకొని పక్షి వీక్షణానికి బయలుదేరాం. హోటలు, వాహన యజమాని ఐన అమోల్ మమ్మల్ని చిన్నపాటి అడవిలోకి తీసుకువెళ్ళాడు. అది నేచురల్ హైడ్ ప్లేస్. విఠల్ వాడి అనే ప్రాంతం. కుంబార్ గ్రామం. ఒక వాటర్ బాడీ దగ్గర ప్రత్యేకమైన కెమెరాతో సిద్ధంగా ఉన్నాం. పక్షి వీక్షణానికి ఉదయం, సాయంత్రాలు అనువైన సమయాలు. బిగ్వాన్ ప్రత్యేకమైన పక్షి ఆవాస కేంద్రం.మూడు రుతువుల్లో విభిన్నమైన పక్షులు అక్కడ కనిపించడం విశేషం. వేసవిలో ఫ్లెమింగోలు వస్తాయి. మేం వెళ్ళింది వర్షాకాలపు పక్షి వీక్షణానికి. మరుసటి రోజు సిర్సుఫల్ అనే గ్రామ సమీపంలోని సఫారీకి వెళ్ళాం. లోపలికి వెళ్ళడానికి రోజుకు ఒకటి రెండు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. వెంట ఫారెస్టు గార్డు ఉండడం తప్పనిసరి. మాతో వచ్చిన ఫారెస్టు గార్డు పేరు వైభవ్.

పక్షి వీక్షణం మూడు స్థాయిల్లో వుంటుంది. I. Bird Watching ( మన అనాస ప్రాంతాల్లోకి వచ్చే పక్షులను గమనించడం. )   2. Birding ( మనం పక్షుల ఆవాస ప్రాంతాల్లోకి వెళ్ళి పరిశీలించడం.) 3. Bird Photography ( మనం పక్షుల ఆవాస ప్రాంతాల్లోకి వెళ్ళి, భిన్న రుతువులలో, భిన్న ప్రాంతాలలో వాటి కదలికలను కెమెరాలలో బంధించడం.) పక్షి ఛాయాగ్రహణం పైకి చూడడానికి తేలికగా అనిపించినా కష్టంతో కూడుకున్నది. సహనం చాలా అవసరం. కూర్చుని ఉండాలి. నిలబడితే పక్షులు దూరంగా ఎగిరి పోతాయి. కావలిసిన పక్షి  కొరకు గంటల తరబడి వేచి ఉండాలి. అది కనిపించినా ఫోటో తీసే లోపలే ఎగిరి పోతుంది. చిన్న పక్షులైతే ఒక పట్టాన కెమెరాకు చిక్కవు. కంటికి ఆనవు. వేగంగా ఎగిరి పోతాయి.

మేం మహారాష్ట్రలోని బిగ్వాన్, సాస్వాద్, పంచ్గని అనే పక్షి ఆవాస ప్రదేశాలలో మూడురోజులు పక్షి వీక్షణం, పక్షి ఛాయాగ్రహణం చేశాం. (శ్రీనివాస్ రావుగారు అరుదైన ఎన్నో పక్షులను ఫోటోలు తీశారు.) వర్షాకాలంలో అక్కడ ఐదు రకాల Rain quails (పక్షులు) ఉంటాయట. మాకు నాలుగు కనిపించాయి. బ్రౌన్ క్రెక్, గోల్డ్ ఓరియల్, బ్రాడ్ బటన్ క్వేల్,  ( ఇది 2016 తర్వాత 2025 లోనే కనిపించిందట. దేశంలో 1300 మాత్రమే ఉన్నాయట. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే బిగ్వాన్ లో ఉంటుదని గైడ్ చెప్పాడు.) గ్రే హెరాన్, కొత్వాల్ బర్డ్ ( ఇది పోలీసింగ్ చేస్తదట ), ఇండియన్ నెట్ జార్, రాక్ బుష్ క్వేల్, గ్రే ఫ్రాంక్లిన్, పెయింటెడ్ సాండ్ గ్రాస్ బర్డ్, (ఇది అరుదైన, అందమైన పక్షి. బ్రౌన్ కలర్ లో ఉన్న దాని మెడ చుట్టూ నెక్లెస్ లాగా తెలుపు రంగులో ఉంటుంది.)

బ్రాహ్మణి కైట్, సీటీ మార్, ( దీని కూత విజిల్ లాగా ఉంటుంది), ఇండియన్ కొరియర్ ( దాని పిల్లలు వెంటలేకుంటే వేగంగా ఉరికి పోతుంది ), రెడ్ మునియా, గ్రీన్ క్రీక్, క్రస్టెడ్ బంటింగ్, చిన్న ప్యారెట్, ట్రాగో బర్డ్ ( ఇది కన్నింగ్ బర్డ్. వివిధ పక్షుల ధ్వనులను అనుకరిస్తుంది.) జంగిల్ బుష్ క్వేల్ లాంటి స్థానికంగా అరుదుగా ఉండే పక్షులను చూశాం. బోటులో వెళ్ళి సౌతాఫ్రికా, యూరప్, లడక్ నుంచి వచ్చిన కొన్ని వలస పక్షులను చూశాం. స్పూన్ బెల్ అనే పక్షి ముక్కు స్పూన్ లాగా వుంటుందని స్థానికులు ఆ పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడ నేను పేర్కొన్న చాలా పక్షుల పేర్లు శాస్త్రీయమైనవి కాదు. స్థానికమైనవి. గైడ్లు చెప్పినవి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన పక్షులు మరికొన్ని రోజులలో పాకిస్తాన్ వెళ్ళి, అక్కడే గుడ్లు పెడతాయట. కృష్ణానదికి ఉపనది ఐన భీమా నది మీద నిర్మించిన ఉజిని డ్యాం బ్యాక్ వాటర్ ఉండడం వల్ల పక్షుల ఆవాసానికి అనుకూలంగా ఉంటుందని బోటు డ్రైవర్, గైడ్ సౌరభ్ చెప్పాడు. మాకు చింకారాలు, నక్కలు కూడా కనిపించాయి. మేం చూసిన అద్భుత దృశ్యం పక్షుల సంభోగం. అది చాలా అరుదుగా కనిపిస్తుందట.

స్థానిక యువకులు 30 మంది గైడ్ లుగా పనిచేస్తున్నారు. వాళ్ళు గైడ్ లుగా మారిన క్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. మా గైడ్ అమోల్ చెప్పిన ప్రకారం .. వాళ్ళ తల్లిదండ్రులు చేపలు పట్టేవారు. పక్షి ప్రేమికులు వచ్చినప్పుడు ఆ బోట్లలోనే తీసుకువెళ్ళమని అడిగేవారు. దానిని వృత్తిగా మార్చుకుంటే బాగుంటుందనే ఆలోచన అక్కడి యువతకు వచ్చింది. అప్పుడు బిగ్వాన్ మాత్రమే సరిపోదు. అందుకని దగ్గరలో వున్న సాస్వాద్, పంచగని ప్రాంతాలలో ఏయే రుతువులలో ఏయే పక్షులు వస్తాయో పరిశోధన చేసి పక్షుల ఆవాస ప్రదేశాలను కనిపెట్టారు. ఈ మూడు ప్రదేశాలను కలిపి ప్యాకేజీ  గా ఇస్తున్నారు.

ఆయా పక్షి కూతలను రికార్డు చేసుకొని .. వాటిని ప్లే చేయడం ద్వారా బర్డ్ కాలింగ్ చేస్తున్నారు. పక్షులకు ఎలాంటి హాని జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్షి వీక్షకుల డిమాండ్ మేరకే హోటల్ నిర్మించినట్టు చెప్పాడు. వీళ్ళకు మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి వుంది. పక్షి కూత విని అది ఏ పక్షినో, ఎక్కడవుందో చెప్పగల నైపుణ్యం అమోల్ సొంతం. ఏ పని చేస్తున్నా ఆయన ధ్యాస ఆ వైపుగానే ఉంటుంది. బోట్ డ్రైవర్ గా వచ్చిన సౌరభ్ కూడా స్థానిక యువ గైడే .. అతనికీ  పక్షులకు సంబంధించి అపారమైన జ్ఞానం ఉంది. ఉద్యోగాలంటూ ఊళ్లు వదిలి వెళ్ళకుండా స్థానికంగా ఉపాధి కల్పించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందించ దగ్గ విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *