అందరూ బీసీల మేలు కోరేవారే, వాటా మాత్రం…

“ఒక ప్రభుత్వ విధానం వల్ల బాధితులు, లేదా ఒక సామాజిక పరిణామం మీద నిరసన తెలియజేయదలచుకున్న ప్రజా సమూహాలు, లేదా ఆ బాధితుల తరఫున, సమూహాల తరఫున ప్రతిపక్షాలు బంద్ పిలుపు ఇస్తాయి. ప్రతిపక్షాలు ఇచ్చే బంద్ పిలుపును విఫలం చేయడానికి ప్రభుత్వాలు పోలీసులను రంగంలోకి దింపుతాయి. నిరసనకారులను అరెస్టు చేయడం, నిరసనకారుల మీద లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం, రబ్బరు బులెట్ల కాల్పులు, నిజమైన తుపాకి కాల్పులు దాకా నిర్బంధ చర్యలు ఉంటాయి. బంద్ సంపూర్ణంగా విజయవంతమైనా, ప్రభుత్వ అవరోధాల వల్ల పాక్షికంగా విజయవంతమైనా, పూర్తిగా విఫలమైనా ప్రతి బంద్ కూడా ఒక ప్రజాభిప్రాయ, ప్రజాగ్రహ ప్రకటనగా నిలిచిపోతుంది. అలా మన రాజకీయ, సాంఘిక చరిత్రలో బంద్ లకు చాలా ప్రాధాన్యత ఉంది.”

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు మొదటిసారిగా జరిగిన బంద్, శనివారం నాడు, అపారమైన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఎప్పుడో ఒకసారి మాత్రమే అరుదుగా జరిగే పరిణామంగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ బంద్ కు మద్దతు ప్రకటించాయి. బంద్ కు పిలుపు ఇచ్చినది బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అయినప్పటికీ, అధికార పార్టీతో సహా, అన్ని రాజకీయ పక్షాలు పాల్గొన్నాయి. స్వయంగా మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. అధికారపక్షమే, అంటే ప్రభుత్వమే బంద్ కు సహకరించింది గనుక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు రోడ్డు మీదికి రానేరాక పోవడంతో, విద్యా సంస్థలు మూతబడడంతో బంద్ వాతావరణం స్పష్టంగా కనబడింది. ధర్నాలు, ఊరేగింపులు, మానవహారాలు వంటి ప్రజా ప్రదర్శనలతో వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా మూతపడ్డాయి.

ఈ విస్తారమైన ప్రజాభిప్రాయ ప్రకటన రెండు రకాలుగా ప్రాముఖ్యత కలిగినది. మొదటిది, తెలుగు సమాజంలో, తెలంగాణ సమాజంలో మూడు నాలుగు దశాబ్దాల కింద విస్తృతంగా ఉండి, ప్రస్తుతం దాదాపు కనుమరుగైపోయిన బంద్ వంటి ప్రజాగ్రహ ప్రదర్శనా రూపం మళ్లీ విజయం సాధించింది గనుక దీని పూర్వాపరాలను, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. రెండు, సమాజమంతా ఇంతగా కోరుతున్నట్టయితే ఈ ఆకాంక్ష ఎందుకు సాకారం కావడం లేదు, అందరూ కోరుకునేవారే అయితే అడ్డుపడుతున్నదెవరు ఆలోచించాలి. అడ్డుపడుతున్నవారే బంద్ లో పాల్గొన్నారంటే, లేదా బంద్ లో పాల్గొన్నవారే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అడ్డుపడుతున్నారంటే, ఎంత తలకిందుల రాజకీయాలు, ఎంత కపటత్వం మన ప్రజాజీవితంలో రాజ్యం చేస్తున్నాడో కూడా అర్థం చేసుకోవలసిన సందర్భం ఇది.

బంద్ అనేది ఒక సత్యాగ్రహ ప్రకటన రూపం, ఒక పౌర శాసనోల్లంఘన రూపం, ఒక పౌర సహాయ నిరాకరణ రూపం. బంద్ అనే హిందీ మాటే దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్నదంటే ఈ రూపం ప్రత్యేకంగా భారతదేశంలో తయారైనదని అర్థమవుతుంది. బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమ కాలంలో ఈ రూపం ప్రాచుర్యంలోకి వచ్చి, వలసానంతర భారతదేశంలో కూడా కనీసం రెండు దశాబ్దాల కిందటి దాకా విస్తారంగా ఉండింది. విద్యా సంస్థలు, రవాణా సేవలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, సామాజిక పౌర జీవనం తాత్కాలికంగా ఒక రోజు కొరకు సంపూర్ణంగా ఆపివేసి, తద్వారా జరిగే ప్రజా జీవన స్తంభనతో ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం బంద్ లక్ష్యం.

అంటే బంద్ సాధారణంగా ప్రభుత్వ విధానాలకు, సాగుతున్న పరిణామాలకు నిరసనగా ప్రతిపక్షాలు ఇచ్చే పిలుపుగా ఉంటుంది. ఒక ప్రభుత్వ విధానం వల్ల బాధితులు, లేదా ఒక సామాజిక పరిణామం మీద నిరసన తెలియజేయదలచుకున్న ప్రజా సమూహాలు, లేదా ఆ బాధితుల తరఫున, సమూహాల తరఫున ప్రతిపక్షాలు బంద్ పిలుపు ఇస్తాయి. ప్రతిపక్షాలు ఇచ్చే బంద్ పిలుపును విఫలం చేయడానికి ప్రభుత్వాలు పోలీసులను రంగంలోకి దింపుతాయి. నిరసనకారులను అరెస్టు చేయడం,  నిరసనకారుల మీద లాఠీచార్జి,  బాష్పవాయు ప్రయోగం, రబ్బరు బులెట్ల కాల్పులు, నిజమైన తుపాకి కాల్పులు దాకా నిర్బంధ చర్యలు ఉంటాయి. బంద్ సంపూర్ణంగా విజయవంతమైనా, ప్రభుత్వ అవరోధాల వల్ల పాక్షికంగా విజయవంతమైనా, పూర్తిగా విఫలమైనా ప్రతి బంద్ కూడా ఒక ప్రజాభిప్రాయ, ప్రజాగ్రహ ప్రకటనగా నిలిచిపోతుంది. అలా మన రాజకీయ, సాంఘిక చరిత్రలో బంద్ లకు చాలా ప్రాధాన్యత ఉంది.

 “జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ అనేది ఒక ప్రజాస్వామిక సూత్రం. జనాభాను బట్టి రిజర్వేషన్ కల్పించడం అనేది రాజ్యాంగ నిర్ణయ సభ ఆమోదించిన సూత్రం. మొత్తం రిజర్వేషన్ 50 శాతానికి మించగూడదు అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజానికి ఈ ప్రజాస్వామ్య సూత్రానికి, జనాభాను బట్టి వాటా అనే సహజ న్యాయ సూత్రానికి వ్యతిరేకం. కనుక ఆ సుప్రీం కోర్టు తీర్పును సమీక్షించాలని, రద్దు చేయాలని అడగవలసిన అవసరం ఉంది. తెలంగాణలో మొన్న ఉమ్మడిగా బంద్ ను విజయవంతం చేసిన రాజకీయ పక్షాలకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీం కోర్టు తీర్పు విధించిన పరిమితిని రద్దు చేయాలని ఉమ్మడిగా సుప్రీం కోర్టుకు వెళ్లాలి. ఆ డిమాండ్ మీద ప్రజాందోళన నిర్మించాలి.”  

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తొలి రెండు దశకాలు ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన బంద్ లు, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు సందర్భంగా రాష్ట్రమంతటా, ప్రత్యేక తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల సందర్భంగా ఆయా ప్రాంతాలలో, లేదా స్థానిక సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద బంద్ లు అడపాదడపా జరిగి ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువలో, ముఖ్యంగా రమీజాబీ పై పోలీసుల అత్యాచారానికి విద్యార్థి యువజనుల నిరసన సందర్భంలో మొదలైన బంద్ లు 1990ల మధ్య దాకా విస్తృతంగా జరిగాయి. ముఖ్యంగా 1980 దశకం మొదటి సగభాగం రాడికల్, విప్లవ విద్యార్థి యువజనోద్యమాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో విపరీతంగా బంద్ లు జరిగాయి. 1992లో రాడికల్ విద్యార్థి, యువజన సంఘాల మీద నిషేధం, 1996 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంకు పాలనలోకి వెళ్లి, ఎటువంటి ఆందోళనలు, ప్రజా అసమ్మతి ప్రదర్శనలు లేని శాంతిమండలంగా మార్చాలని ప్రపంచ బ్యాంకు ఆదేశంతో బంద్ ల మీద ఉక్కుపాదం మొదలయింది.

సరిగ్గా అదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా ప్రపంచీకరణ పట్టు, కొత్త మధ్యతరగతి పెరుగుతూ పారిశ్రామిక సంస్థలలో, విద్యా సంస్థలలో, పౌర జీవితంలో బంద్ ల వంటి ప్రజా నిరసనలను విచ్ఛిన్నకర, అభివృద్ధి నిరోధక, తీవ్రవాద చర్యలుగా చూసే ఆలోచనా ధోరణి మొదలయింది. బంద్ లలో ప్రజాజీవన స్తంభన నిజంగానే కొందరికి ఇబ్బంది కలిగిస్తుంది గనుక, అంతకు ముందు కూడా కొందరు ఇబ్బంది పడేవారు ఉండేవారు. కాని వారు ఆ నిరసన లక్ష్యాన్ని అర్థం చేసుకుని, సమర్థించే స్థితి ఉండేది. నూతన సహస్రాబ్దిలో మారుతున్న సామాజిక విలువలలో బంద్ లో జరిగే ఆటంకాలే ప్రజలకు, ముఖ్యంగా వ్యక్తీకరణ శక్తి ఉన్న మధ్యతరగతికి చికాకుగా కనిపించడం ప్రారంభమయింది.

సరిగ్గా ఈ మారుతున్న సామాజిక అభిప్రాయానికి ప్రతిఫలనంగా సుప్రీం కోర్టు 1998 నుంచి బంద్ లకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం, తీర్పులు ఇవ్వడం మొదలు పెట్టింది. 2004లో బొంబాయిలో భారతీయ జనతా పార్టీ, శివసేన నిర్వహించిన బంద్ లో ప్రభుత్వ ఆస్తులకు, సామాజిక ఆస్తులకు నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని ఆ పార్టీలే భరించాలని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ సమయానికి ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రాబల్యంలో ఉండింది గనుక అడపాదడపా బంద్ లు జరుగుతూనే వచ్చాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం, తెరాస పాలనలోని విచ్చలవిడి పోలీసు నిర్బంధం, న్యాయమైన ప్రజా నిరసన ప్రకటనల మీద కూడా దారుణమైన ఆంక్షల విధింపు వల్ల బంద్ లు ఆగిపోయాయి. మొత్తం మీద తొమ్మిదిన్నర సంవత్సరాలలో రెండు మూడు రోజులైనా బంద్ జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఏదో ఒక రాజకీయ పార్టీ, ఏదో ఒక ప్రజా సంఘం బంద్ కు పిలుపు ఇస్తే కూడా దాన్ని భగ్నం చేయడానికి ప్రభుత్వం పోలీసులను మోహరించింది.

ఈ నేపథ్యంలో శనివారం నాటి బంద్ ను చూసినప్పుడు, అందులోనూ ప్రభుత్వమే, అధికార పక్షమే ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినప్పుడు న్యాయమైన నిరసన ప్రకటనలకు మంచి రోజులు, అవకాశాలు వస్తున్నాయా అని ఆనందించవచ్చు. లేదా ఒక రాజకీయ ఎత్తుగడగా మాత్రమే ఈ బంద్ కు మద్దతు తెలిపిన అధికారపక్షం ఇకముందు ఇలా ఉండబోదని వాస్తవాన్ని గుర్తించవచ్చు. కచ్చితంగా ఇకముందు ఇతర బాధిత వర్గాలు, సమూహాలు, రాజకీయపక్షాలు వ్యక్తీకరించే నిరసనల మీద ఈ ప్రభుత్వం మొన్న శనివారం తీసుకున్న సానుకూల వైఖరి తీసుకోబోదని గత చరిత్ర నుంచి నిర్ధారించవచ్చు.

ఇక రెండో విషయం, ఈ బంద్ కు మూల కారణం వెనుకబడిన వర్గాలకు, కచ్చితంగా చెప్పాలంటే బీసీలకు, శూద్ర కులాలకు, ఉత్పత్తి కులాలకు, శ్రామిక కులాలకు, వృత్తి కులాలకు న్యాయమైన వాటా ఇవ్వడానికి, 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నానికి అవరోధాలు కల్పిస్తున్నవారి మీద నిరసన. మరి ఆ ప్రయత్నం చేస్తున్నవారెవరు? ఆ ప్రయత్నం చిత్తశుద్ధితో జరుగుతున్నదా? అవరోధాలు కల్పిస్తున్నవారెవరు? వారూ వీరూ కూడా ఒకే గొడుగు కింద ఎలా చేరగలిగారు?

బీసీలకు విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో, ముఖ్యంగా స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని కాంగ్రెస్ చెప్పుకుంటున్నది. తనకు ఆ ఉద్దేశం ఉందని చూపడానికి ఒక ఆర్డినెన్సు, ఒక చట్టం, ఒక జీవో వంటి ప్రయత్నాలు చేసింది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అందుకు అనుకూలమైన మాటలు మాట్లాడుతున్నారు. కాని ఈ ప్రయత్నాలు, మాటలు నిజంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేవేనా? ఇవి పైపైన చూపడానికి మాత్రమే జరుగుతూ, వాస్తవంగా జరగవ్లసిన ప్రయత్నాలు జరగడం లేదా?

42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం సుప్రీం కోర్టు గత తీర్పుకు వ్యతిరేకమైనది గనుక అది కుదరదని, కాంగ్రెస్ అది తెలిసే, తన నిర్ణయం కొట్టుడుపోతుందని తెలిసే, ఉద్దేశపూర్వకంగానే కేవలం మాటలకోసం ఒక ఎత్తుగడగా ఈ పని చేసిందని కొందరు అంటున్నారు. అది ఉత్తుత్తి రిజర్వేషన్ మాత్రమేనని, రాజ్యాంగ వ్యతిరేకమని, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని కూడా అంటున్నారు. అంటే కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే సాంకేతికంగా తప్పుల తడక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ విమర్శల్లో ఏమాత్రం వాస్తవం ఉన్నా, కాంగ్రెస్ కు మొన్నటి బంద్ లో పాల్గొనే అర్హత లేదు.

కాంగ్రెస్ అర్హత సంగతి అలా ఉంచి, ఈ వాదనలలో సత్యం లేదు. జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ అనేది ఒక ప్రజాస్వామిక సూత్రం. జనాభాను బట్టి రిజర్వేషన్ కల్పించడం అనేది రాజ్యాంగ నిర్ణయ సభ ఆమోదించిన సూత్రం. మొత్తం రిజర్వేషన్ 50 శాతానికి మించగూడదు అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజానికి ఈ ప్రజాస్వామ్య సూత్రానికి,  జనాభాను బట్టి వాటా అనే సహజ న్యాయ సూత్రానికి వ్యతిరేకం. కనుక ఆ సుప్రీం కోర్టు తీర్పును సమీక్షించాలని, రద్దు చేయాలని అడగవలసిన అవసరం ఉంది. తెలంగాణలో మొన్న ఉమ్మడిగా బంద్ ను విజయవంతం చేసిన రాజకీయ పక్షాలకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీం కోర్టు తీర్పు విధించిన పరిమితిని రద్దు చేయాలని ఉమ్మడిగా సుప్రీం కోర్టుకు వెళ్లాలి. ఆ డిమాండ్ మీద ప్రజాందోళన నిర్మించాలి.

పైగా మొత్తం రిజర్వేషన్ 50 శాతానికి మించగూడదని తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఇడబ్ల్యుఎస్) పేరు మీద ఆధిపత్య కులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టి వేయలేదు. ఆధిపత్య కులాల రిజర్వేషన్ విషయంలో అడ్డురాని పరిమితి, బీసీల విషయంలో మాత్రమే ఎందుకు వస్తున్నదో దేశవ్యాప్త చర్చ చేసి, ప్రజాభిప్రాయాన్ని సంఘటితం చేసి, ఆ ఆందోళనను సుప్రీం కోర్టు దాకా తీసుకుపోవడం ఇవాళ బీసీల ముందు, అన్ని రాజకీయ పక్షాల ముందు ఉన్న కర్తవ్యం.

ఇక మొన్నటి బంద్ లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీకి ఆ అర్హత ఎంతమాత్రమూ లేదు. కాంగ్రెస్ తయారు చేసిన బిల్లును, జీవోను అడ్డుకున్నవారెవరు? ఆ నిర్ణయాన్ని అడ్డుకోవడంలో గవర్నర్ పాత్ర ఎంత? కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత? రాష్ట్రపతి పాత్ర ఎంత? న్యాయస్థానాల పాత్ర ఎంత? వెరసి మొత్తంగా భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత? ఇప్పుడు ఆ భారతీయ జనతా పార్టీయే బంద్ లో పాల్గొన్నదంటే అర్థం ఏమిటి?

కాంగ్రెస్, భాజపా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. వాటికైనా, అధికారంలో లేని మిగిలిన పాలక పక్షాలలో ఏ ఒక్కదానికైనా బీసీలకు నిజంగా మేలు చేయాలని, వారి న్యాయమైన వాటా వారికి అందేలా చూడాలని కోరిక లేదు. అదీ అసలు సంగతి. ప్రయత్నాలూ అవరోధాలూ అన్నీ నాటకాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page