తను ప్రతిచోట ఇద్దరే
ఒక్కరిగా భయమని
ఇద్దరనే నటన నాటుకున్నారు
ఏ నిజం దాడి చేస్తుందోనని
ఒకరిని మార్చి ఇంకొకరులా
రోజూ యుద్ధమే లోపల
అందుకే
ఒకడి చేతిలో వల
మరొకడి చేతిలో తీయని రెండు మాటలు
ఒకడు ముఖాలపై చప్పుడుతో
మంచిని రంగు కలిపి పల్చగా చల్లుతాడు
ఇంకోడు తెలివిని మరిగించి
రుచి మార్చి ఆకలిని వెంట తిప్పుకుంటాడు
ఒకడి అడుగు గోతులు తీస్తుంటే
మరొకడి చేతులు విషానికి వేషం వేస్తున్నాయి
ఒకడి దారిలో పొగడ్తల మరకలు
ఇంకోడు దారిలో తిట్లతో ఊరేగింపు
ఒకడు తప్పులతో
తెలివిగా కలసి జీవిస్తుంటే
ఇంకొకడు కనిపించకుండా
ముసుగును ప్రేమిస్తాడు
ఒకడు దేవుడిని పూజలతో
వాటేసుకుంటాడు
ఇంకోకడు మంత్రాలనే మార్చి
దేవుడినే మాయ చేస్తాడు
కానీ ఒక్కరిలో ఇద్దరున్నా
నిజం ఏ ఒక్కరికి అర్దం కాలేదు
లోపాలని పాపాలుగా మోస్తూ
మనుషులు విరిగిపడుతుంటే
చూస్తూ కూర్చోడు
మనిషి రూపంలోనైనా వచ్చి
కాలాన్ని మాట్లాడిస్తాడు
ఎంతైనా
దేవుడూ చదువుకున్నాడు కదా
శ్రీ సాహితి





