- ఎంపిక ఉత్కంఠతకు తెరపడినట్లేనా ..?
- తెలంగాణా వ్యాప్తంగా గుర్తింపున్న నాయకుడు
- ఉద్యమ సమయంలో కేసీఆర్ తరువాత స్థానం
- బీసీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ని ఎదుర్కొనే సత్తా
- పార్టీలోకి ప్రముఖులను ఆకర్శించే శక్తి
( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత ఏడాది కాలంగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్లేనా అంటే ఇటీవల ఆ పార్టీ వర్గాల నుండి వొస్తున్న లీకులు అవుననే చెబుతున్నాయి. అందరు ఊహించినట్లే ఆ పార్టీకి చెందిన ఎంపి ఈటల రాజేందర్‌ను పార్టీ అధిష్టానవర్గం ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 26 లోపు జిల్లా అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుని పేరు వెలుగులోకి వొచ్చే అవకాశముంది. బిజెపి సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి, మండల స్థాయి ఎన్నికల అనంతరం జిల్లా అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. అయితే ఇప్పటికే జిల్లా అధ్యక్షుల జాబితా సిద్దమైందని చెబుతున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించి కనీసం యాభై శాతమైనా పూర్తి అవుతే రాష్ట్ర అధ్యక్షుని నియామకం జరుగుతుంది. అది కూడా ఈ నెల చివరిలోగా పూర్తి అయ్యే అవకాశాలున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మొత్తం మీద సంవత్సరకాలంగా నలుగుతున్న ఈ చర్చకు త్వరలో తెరపడే అవకాశం లేకపోలేదు.
ఏడాదికింద జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎంపీగా ఎన్నికైనప్పటినుండి రాష్ట్ర అధ్యక్షుడిపైన చర్చ జరుగుతున్నది. రెండు పదవులకు న్యాయం చేయలేనన్న భావనతో మరో కొత్తవ్యక్తిని అధ్యక్షపదవికి ఎంపికచేయాలన్న కిషన్‌రెడ్డి కోరికమేరకు అధిష్టానం సమర్థ నాయకుడికోసం వెతుకులాట ప్రారంభించింది. అయితే ఈ పదవిని అధిరోహించే విషయంలో అనేక మంది పోటీ పడుతూ వొచ్చారు. పార్టీని మొదటినుండి అంటిపెట్టుకుని ఉన్నవారు మొదలు ఇతర పార్టీల నుండి వొచ్చిన నాయకులు కూడా ఉండడంతో అధిష్టానం ఎవరికి ఆ పదవిని కట్టబెడుతుందన్న విషయంలో మల్లగుల్లాలు పడుతూ వొచ్చింది. వొచ్చే శాసనసభ ఎన్నికల్లోనైనా తెలంగాణ పైన కాషాయ జండాను ఎగురవేయాలన్నది బిజెపి ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకు సమర్దుడైన నాయకుడి కోసం ఏడాదికాలంగా పార్టీ అధినాయకత్వం అన్వేషిస్తున్నది. పార్టీ భావజాలం, సిద్దాంతాలను వడిసి పట్టుకుంటూ, రాజకీయ ఎత్తుగడలు వేయగలిగిన వ్యక్తి కోసం వెదుకుతూ వొస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ముందుగా రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్న పార్టీని కనీసం రెండవ స్థానానికైనా తీసుకు రావాల్సి ఉంది.
అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్‌ఎస్‌ను తోసి ఆ స్థానాన్ని మిగిలిన నాలుగేళ్ళ కాలంలో ఆక్రమించగలిగే సత్తా ఉన్న నాయకుడు కావాల్సి ఉంది. అలాగే అధికార కాంగ్రెస్‌ను ధీటుగా ఎదురుకోగల వ్యక్తి అవసరమన్నది ఆపార్టీ ఆలోచన. అందుకు పార్టీలో సీనియర్‌లకేమీ కొదవలేకపోయినా నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపై నడిపించేవారెవరన్న విషయంలోనే ఇంతకాలం తర్జనభర్జన కొనసాగింది. అలాంటివారిలో మొదటినుండి వినిపిస్తున్న పేర్లలో ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్, డికె అరుణ, మాజీ ఎంఎల్‌సి రాంచందర్‌రావులున్నారు. అయితే అధిష్టానం తీవ్ర వడపోతల అనంతరం ముగ్గురి పేర్లు మాత్రం బాగా ప్రచారంలోకి వొచ్చాయి. వారిలో ఈటల రాజేందర్, రఘునందన్‌రావు,ధర్మపురి అరవింద్‌లున్నారు. వీరిలో మొదటి ఇద్దరు ఇతర పార్టీలనుండి బిజెపిలో చేరినవారుకాగా అరవింద్ మొదటి నుండి బిజెపి నాయకుడిగా ఉన్నవ్యక్తి. దీంతో అధ్యక్ష పదవి అరవింద్‌కే దక్కుతుందనుకున్నారు. అయితే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాటలతో ఎవరినైనా అధ్యక్షుడిగా తీసుకునే అవకాశాలున్నాయన్నది రూఢీ అయింది. ఈ మధ్యనే జరిగిన ఒక మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ సమర్ధత గురించి కిషన్‌రెడ్డి ప్రస్తావించడం గమనార్హం.
సాధారణంగా ఆర్‌ఎస్‌ఎస్ లేదా బిజెపి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికే పార్టీలో ప్రాధాన్యతనిస్తారన్న వాదన ఉంది. అయితే అలాంటిదేమీలేదన్న కిషన్‌రెడ్డి మాటలతో ఇతర పార్టీలనుండి వొచ్చిన వారికి అవకాశం లభిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. అలాంటివారిలో ముందువరుసలో వినిపిస్తున్నది ఈటల రాజేందర్ పేరు.
ఈటలనే ఎందుకు ?
ఇతర నాయకులతో పోలిస్తే ఈటల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయమున్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమకాలంలో కెసిఆర్ తర్వాత స్థానంలో నిలిచినవ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి తగినట్లు ఆయనకు ఇతర రాజకీయ పార్టీ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు పన్నెండు శాతంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంతేగాక మొదటినుంచి బిజెపి బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న తరుణంలో బలమైన బిసీ నాయకుడిగా ఈటలకు పేరుంది. తెలంగాణ పైన కాషాయ జెండా ఎగురవేయాలన్న బిజెపి సంకల్పానికి బలమైన బిసీ నాయకుడిగా ఈటల చేదోడు ఆ పార్టీకి ఎంతో అవసరం. కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే ముందుగా బిఆర్‌ఎస్ ప్రాపకాన్ని తగ్గించాలి. మళ్ళీ ఎన్నికలు వొచ్చేలోగా బిఆర్‌ఎస్‌లోని ముఖ్యనేతలను ఆకర్షించగలగాలంటే అది ఈటలకే సాధ్యమన్నది గుర్తించడంవల్లే అధిష్టానం ఆయనకే అధ్యక్ష పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉందన్న ప్రచారం జరుగుతున్నది.





