“అమెరికా న్యాయశాఖ గత సంవత్సరం చివరలో ఒకసారి, ఈ సంవత్సరం జనవరి చివరలో మరోసారి విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తొలి విడతలో బయటపడిన పేర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, రెండో విడతలో మరింత విస్తృత వివరాలు వెలుగులోకి రావడం ప్రపంచవ్యాప్తంగా విచారణలకు దారితీసింది. అనేక దేశాల్లో ప్రజా నిరసనలు, రాజీనామాలు, అధికార దర్యాప్తులు ప్రారంభమయ్యాయి. ఈ ఫైల్స్‌లో ప్రస్తావనకు వచ్చిన భారత ప్రముఖుల పేర్లు దేశంలో రాజకీయ చర్చకు దారితీయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, అనూహ్యంగా మౌనం నెలకొనడం గమనార్హం.”
ప్రపంచం కుదేలవుతుంటే భారత్‌లో మౌనం ఎందుకు?
యూరోపియన్ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా పలు అంతర్జాతీయ వేదికలపై జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనాత్మక ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సమయంలో, భారతదేశంలో మాత్రం అనూహ్యమైన స్తబ్దత నెలకొనడం అనేక అనుమానాలకు, చర్చలకు దారితీస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ప్రభావితం చేసిన ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తుండగా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం కదలాడే స్థితి ఏర్పడింది. దేశాధినేతలను, అంతర్జాతీయ కుబేరులను లక్ష్యంగా చేసుకుని జెఫ్రీ ఎప్స్టీన్ తన ఫామ్ ల్యాండ్‌ను కేంద్రంగా చేసుకుని సాగించిన అనైతిక, అమానుష కార్యకలాపాలు సాధారణ నేరాల పరిమితిని దాటి విస్తరించాయి. సంపన్నుల కోర్కెలను తీర్చడానికి పిరమిడ్ తరహా నెట్వర్క్ ద్వారా వేలాది మంది యువతులను, యుక్తవయస్కులను అక్రమంగా తరలించి, వర్జిన్ ఐలాండ్స్‌లో నిర్బంధించి 1998 నుంచి 2019 వరకు సాగించిన చీకటి వ్యవస్థ అంతర్జాతీయ మానవ హక్కుల చరిత్రలోనే మచ్చగా నిలిచింది.
అమెరికా న్యాయశాఖ గత సంవత్సరం చివరలో ఒకసారి, ఈ సంవత్సరం జనవరి చివరలో మరోసారి విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తొలి విడతలో బయటపడిన పేర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, రెండో విడతలో మరింత విస్తృత వివరాలు వెలుగులోకి రావడం ప్రపంచవ్యాప్తంగా విచారణలకు దారితీసింది. అనేక దేశాల్లో ప్రజా నిరసనలు, రాజీనామాలు, అధికార దర్యాప్తులు ప్రారంభమయ్యాయి. ఈ ఫైల్స్‌లో ప్రస్తావనకు వచ్చిన భారత ప్రముఖుల పేర్లు దేశంలో రాజకీయ చర్చకు దారితీయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, అనూహ్యంగా మౌనం నెలకొనడం గమనార్హం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి హార్దిక్ సింగ్ పూరి, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ, సినీ రంగ ప్రముఖులు నందితా దాస్, అనురాగ్ కశ్యప్, ఇండో-అమెరికన్ దర్శకురాలు మీరా నాయర్, వెల్నెస్ రచయిత దీపక్ చోప్రా తదితరుల పేర్లు ఫైల్స్‌లో ప్రస్తావనకు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో చర్చలు నడుస్తున్న వేళ, దేశీయ వేదికలపై ప్రశ్నలు గట్టిగా వినిపించకపోవడం గమనార్హం .
ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు కొనసాగుతున్న తరుణంలోనే భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు లేవనెత్తిన ప్రశ్నలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఫైల్స్ నేపథ్యంలో ఒత్తిళ్లు ఉన్నాయా? బ్లాక్ మెయిల్ రాజకీయాలు జరిగాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ప్రభావశీలురు అవమాన భారంతో పదవులు వదులుకుంటుండగా, అనేక దేశాల్లో దర్యాప్తు సంస్థలు విచారణలు ప్రారంభించాయి. టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించడాన్ని కూడా విమర్శలకు దారి తీసింది. అయినప్పటికీ ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దివంగత ఎలిజబెత్ రాణి-2, రెండో కుమారుడు ఆండ్రు కు ఉన్న యువరాజు బిరుదులను, రాజ్య కుటుంబ సభ్యుడి హోదాను, రాజు చార్లెస్ గత సంసత్సరం నవంబర్ 3 వ తేదినే రద్దు చేయగా, ఆ దేశ ప్రజల నుండి వస్తున్న నిరసనలకు తలోగ్గిన బ్రిటన్ పోలీసులు ఆండ్రూ ను గురువారం అరెస్ట్ చేసారు. కానీ భారత్‌లో మాత్రం బాధ్యతాయుత స్పందన కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మీరా నాయర్ పేరు ఫైల్స్‌లో ప్రస్తావనకు రావడంతో, ఆమె కుమారుడు మరియు న్యూయార్క్ రాజకీయ రంగంలో ఉన్న జోహ్రాన్ మమ్ధాని పై అక్కడి ప్రజాభిప్రాయం ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అక్కడి పౌర సమాజం పారదర్శకత కోరుతుండగా, భారత్‌లో అలాంటి ప్రజా చైతన్యం ఎందుకు కనిపించడంలేదన్న ప్రశ్న తలెత్తుతోంది.
దేశ అభివృద్ది విషయం లో జెఫ్రీ ఎప్స్టీన్‌ను పలుమార్లు కలిసినట్లు కేంద్రమంత్రి హార్దిక్ సింగ్ పూరి సమర్థించుకోవడం, ఆయన రాజకీయ దివాలాకోరుతనం ప్రస్పుటంగా కనిపిస్తుంది. అప్పటికే నేరాలను అంగీకరించి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తితో సంబంధాల ఉద్దేశం ఏమిటి? దేశ ప్రయోజనాల పేరుతో జరిగిన ఈ పరిచయాల వెనుక అసలు అంశాలు ఏమిటి? అన్న ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన పాలక వర్గాలు ఈ విషయంలో పూర్తి పారదర్శకతతో ముందుకు రావాలనే డిమాండ్ బలపడుతోంది. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా సమగ్ర విచారణ జరగాలని పౌర సమాజం కోరుతోంది. విశ్వగురువుగా అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందిన నాయకత్వం ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందంలో క్రూడ్ ఆయిల్ దిగుమతుల వ్యయంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు వందల కోట్ల డాలర్ల అదనపు భారం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకత లేకపోవడం, సమాచారం స్పష్టంగా వెల్లడి చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏ దేశ అభివృద్ధి అయినా చైతన్యవంతమైన పౌర సమాజంపై ఆధారపడి ఉంటుంది. ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని అణచివేయడం కాదు, నిజానిజాలు బయటపెట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత. ఎప్స్టీన్ ఫైల్స్‌లో వందలాది ప్రముఖుల పేర్లు ప్రత్యక్షంగా, మరెందరో పరోక్షంగా ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శక దర్యాప్తు ద్వారానే అనుమానాలకు ముగింపు పలకవచ్చు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టి చరిత్రలో నిలిచిన ఈ దశలో నాయకత్వంపై ఎలాంటి మచ్చ పడకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు సరైన మార్గం స్పష్టత, పారదర్శకత, నిష్పాక్షిక దర్యాప్తు మాత్రమే అన్న అభిప్రాయం బలపడుతోంది.
-పబ్బు శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్





