“కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి గా వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలను విభజించి పాలించు అన్న విధానం ద్వారా అదుపులో పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాలు పైరవీ నాయకులను ప్రక్కన పెట్టుకొని ఉద్యోగులను ద్వితీయ జాతి పౌరులు గా చూడడం..వాళ్ళసమస్యలు అసలు పట్టించుకొనకపోవడం జరిగింది . గ్రామస్థాయిలో ఉన్న విఆర్ఓ లను ఒక్క కలంపోటుతో తొలగించి నెలల తరబడి ప్రక్కన పెడితే ప్రభుత్వం ను ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉద్యోగ సంఘాల నాయకులకు లేకుండాపోయింది. నెల మధ్య భాగం వరకు వేతనాలు ఇవ్వకపోయినా నోరుమూసుకుని కూర్చున్నారు… చివరకు అన్ని సిగ్గులు వదిలేసి కార్యాలయం లో తెలంగాణ సాంప్రదాయానికి భిన్నంగా పురుష ఉద్యోగులు కూడా బతుకమ్మలు ఆడించే దుస్థితికి పైరవీ నాయకులు ఉద్యోగులను దిగజార్చారు. ఇట్లాంటి స్థితిలో ఉద్యోగులు ప్రభుత్వం తో బేరమాడే స్థితి కోల్పోయి సహజసిద్దంగా, ఆటోమేటిక్ గా లభించే పెండింగ్ డిఏ ల కోసం ప్రభుత్వం వద్ద చర్చలు జరిపే దుస్థితి కి సంఘ చైతన్యం దిగజారింది.”

(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త),
సెల్:9441864514,
ఇమెయిల్: thirmal.1960@gmail.com
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యొగ భద్రత కల్పించే రాజ్యాంగం లోని311 ఆర్టికల్ ను నిరంకుశంగా తొలగించే ప్రయత్నం చేయడం తోపాటు,2025ఆర్థిక బిల్లు పేరుతో ఉద్యొగులు,పెన్షనర్ల హక్కులపై దాడి జరుగుతున్నా,మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల కు సంభందించి సుమారు 9వేల కోట్లురూపాయలు రిటైర్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా తెలియని స్థితిలో ఉద్యొగ, ఉపాద్యాయ సంఘాలు మీనమేషాలు లెక్కించడం లో ఆంతర్యం ఏమిటి? ఒక పట్టాన అంతుపట్టడం లేదు..చివరకు పోరాటాలు,పిలుపులు ఒకటి అర డిఏలవిడుదలతో సర్థుకుపోయో పరిస్థితి ఉద్యోగుల కు ఎందుకు వచ్చింది? ఉద్యోగుల కరువు భత్యం(డిఏ)ఎవరి దయాదాక్షిణ్యాల ప్రకారం ఇచ్చేది కాదు! తరుగుతున్న రూపాయి విలువ, పెరుగుతున్న ధరలసూచికకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మదింపు చేసి ప్రతి ఆరు మాసాలకు ఒకపర్యాయం కేంద్ర ప్రభుత్వమే నేరుగా తమ ఉద్యోగులకు ప్రకటిస్తుంది.కేంద్రం ప్రకటించిన కరువు భత్యం కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మదింపు చేసి రాష్ట్ర ఉద్యోగులకు పెరిగిన డిఏ కలిపి వేతనాలు ఇవ్వడం ఆనవాయితీ!ఇది ఉద్యోగుల చట్టబద్దమైన ఆర్థిక హక్కు! ఇలా పెరిగిన డిఏల మోత్తం ప్రతి ఐదేళ్లకు ఓసారి మూల వేతనం తో కలిపి వేతన స్కేలు ఇచ్చేవారు,ఆలస్యం అయితే ఐఆర్(ఇంటిరియమ్ రిలీప్)ప్రకటించి వేతన సవరణ నిర్ధారించిన పిట్ మెంట్ తో ఇచ్చే వారు.అంటే ఐదేంళ్ళలో పెరిగిన డిఏ ఇచ్చిన ఐఆర్ ఫిట్ మెంట్ శాతం)కలిపి వేతన సవరణ అవుతుంది.ఇదికూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక వేతనం సవరణ సంఘం వేసి, ఉద్యోగులు , ప్రభుత్వం తో చర్చించి మధ్యేమార్గంగా ఇచ్చిన సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ లో పెట్టి ఆమోదిస్తుంది.ఇది సాదారణ ప్రక్రియ.
అయితే ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలు, ఉపాద్యాయులకు ఉపాద్యాయ సంఘాలు ఉంటాయి. వీరంతా కలిసి వేతనం సవరణతో పాటు,తాము ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టి చర్చించడం.ప్రభుత్వంతో పట్టువిడుపులు తో బేరమాడడం,ప్రకటింపజేసుకోవడం రివాజుగా వస్తుంది.అయితే బార్గెయినింగ్ పవర్ అనేది ఉద్యోగుల సంఘటిత శక్తి మీద ఆధారపడి ఉండేది.1980దశకంలో ఉపాద్యాయ సంఘాలు ప్యాప్టోగా,యన్జీఓ సంఘాలు,నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం,కలిసి సంఘటిత శక్తితో తమ డిమాండ్ల ను నోటీసు రూపంలో ప్రభుత్వం ముందు ఉంచేవి.తదనుగుణంగా ఉద్యోగులు నిరసన రూపాయలు వ్యక్తం చేసేవారు.సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించేవారు.ప్రభుత్వంతోచర్చలుజరిపే తమ ప్రతినిధులకు మద్దతుగా బయటనుండి వివిధ పోరాట రూపాలు ఎంచుకొని ప్రభుత్వం పై వత్తిడి పెంచేవారు.ప్రభుత్వాలు తమసమస్యలపై మొండి కేస్తే ఒక్కోసారి సమ్మెలకు సైతం దిగేవారు.
ఎన్టీరామారావు ముఖ్యమంత్రి గా ఉండగా 45దినాలు ఉద్యోగుల సమ్మె చారిత్రాత్మక మైనది.అదేవిధంగా రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సైతం ఉద్యోగులు సమ్మె చేసి తమ డిమాండ్లను సాదించుకున్నారు.అంతవరకు బాగానే ఉంది.ఉద్యోగ నాయకులు ప్రభుత్వపెద్దలవద్ద పలుకుబడి కలిగిఉండడం.ఆ పలుకుబడి నుపయోగించి తమ సంఘం కు అనుకూలంగా కొన్ని పనులు చేయించుకోవడం జరిగేది.ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి లో ఆరుగురుఎన్నికైన ఉపాధ్యాయ యంయల్సీ లు ఉండేవారు. వారు పాఠశాలల స్థితి గతులు,తమ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు చట్టసభలో ప్రస్తావించి ప్రభుత్వం ను నిలదీసే వారు.ఈ ఉద్యోగుల సంఘటిత శక్తి ముందు ప్రభుత్వం తలవంచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, తెలంగాణా రాష్ట్రం అవతరణ ఉద్యమం సమయంలోనే ఉద్యోగుల చీలిక కు బీజం పడింది.తెలంగాణా ఉద్యోగులు సకలజనుల సమ్మెకు దిగడం ,ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్ నినాదాలు రావడంతో ఆంద్రా, తెలంగాణా ఉద్యోగసంఘాలు విభజన జరిగింది.అయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రిపదవులు, శాసనమండలి పదవులు కట్ట బెట్టడం తో తెలంగాణా ఉద్యోగ సంఘాల నాయకుల రాజకీయ దుగ్ధ కాస్తా ఉద్యోగులను ప్రభుత్వం ముందు పలచన చేసింది.సాగిలపడేలా చేసింది..
ఉద్యోగ నాయకుల పదవుల వెంపర్లాట ఉద్యోగులకు శాపంగా మారింది.ఉద్యోగుల సంఘటిత శక్తితో సమస్యలు సంపాదించడానికి బదులు పైరవీలు తో సమస్యలు పరిష్కారం పరిస్థితికి ఉద్యోగ సంఘాలు దిగజారాయి .తద్వారా ఉద్యోగ సంఘాల నాయకులు తనకు రాజకీయ లబ్ది జోరుగా,తన చుట్టూ ఉన్న అనుచరగణాలకు అవసరమైన పైరవీలతో ,చివరకు పోరాట చేవసచ్చిన పైరవీ సంఘాల స్థితికి దిగజారడం తో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు నాన్చుతూ వచ్చింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన మొదటి ఐదేండ్ల కాలం రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు ఉన్న నిబంధనలు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పటిమాదిరిగా అందించినప్పటికీ, వ్యూహాత్మకంగా ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58నుండి61 సంవత్సరాలకు పెంచి ఆర్థిక స్థిరత్వం, ఉపశమనం పొందింది. ఉద్యోగ సంఘం నేతలెవరూ ఈవిషయంలో నోరు మెదపలేదు..పైగా ప్రభుత్వం కుదురుకోవాలని కబుర్లు చెబుతూ వచ్చారు. రెండవసారి కేసీఆర్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత 61సంవత్సరాలు నిండిన ఉద్యోగుల కోట్లాది రూపాయల ఉద్యొగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ,దాచుకున్న భవిష్య నిధులు కూడా పెండింగ్ లో పెడుతూ వచ్చింది.
ఉద్యోగుల నెలసరి వేతనాలు ప్రతినెలా మొదటి తేదీకి ఇచ్చే సాంప్రదాయంకు గండికొట్టారు. వ్యవస్థా గతంగావి కేంద్రీకరించి బడి ఉన్న ఆర్థిక కెటాయింపులు తమ వద్ద కేంద్రీకరింపజేసుకొని,గత సాంప్రదాయం, ప్రాధాన్యతల కు భిన్నంగా ఉద్యోగులకు కడగొట్టు ప్రాధాన్యత ఇచ్చిఅవమానించారు. చాలాకాలంగా ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ లో పెట్టినా ఉద్యోగసంఘాలు పెద్దగా పట్టించుకొనక పోవడం జరిగింది. చివరకు రిటైర్మెంట్ ఉద్యోగులు న్యాయస్థానం మెట్లెక్కినా ఫళితం దక్కలేదు..ఇదిలా ఉండగా కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి గా వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలను విభజించి పాలించు అన్న విధానం ద్వారా అదుపులో పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాలు పైరవీ నాయకులను ప్రక్కన పెట్టుకొని ఉద్యోగులను ద్వితీయ జాతి పౌరులు గా చూడడం..వాళ్ళసమస్యలు అసలు పట్టించుకొనకపోవడం జరిగింది .గ్రామస్థాయిలో ఉన్న విఆర్ఓ లను ఒక్క కలంపోటుతో తొలగించి నెలల తరబడి ప్రక్కన పెడితే ప్రభుత్వం ను ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉద్యోగ సంఘాల నాయకులకు లేకుండాపోయింది. నెల మధ్య భాగం వరకు వేతనాలు ఇవ్వకపోయినా నోరుమూసుకుని కూర్చున్నారు… చివరకు అన్ని సిగ్గులు వదిలేసి కార్యాలయం లో తెలంగాణ సాంప్రదాయానికి భిన్నంగా పురుష ఉద్యోగులు కూడా బతుకమ్మలు ఆడించే దుస్థితికి పైరవీ నాయకులు ఉద్యోగులను దిగజార్చారు. ఇట్లాంటి స్థితిలో ఉద్యోగులు ప్రభుత్వం తో బేరమాడే స్థితి కోల్పోయి సహజసిద్దంగా, ఆటోమేటిక్ గా లభించే పెండింగ్ డిఏ ల కోసం ప్రభుత్వం వద్ద చర్చలు జరిపే దుస్థితి కి సంఘ చైతన్యం దిగజారింది.
ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పాత ముఖ్యమంత్రి అనుసరించిన సాచివేత ధోరణినే అనుసరిస్తున్నారు. పైగా ఉద్యోగులు పైకి ప్రజల్ని రెచ్చగొట్టే వింత ప్రవర్తన చూపిస్తున్నారు. సమైక్య రాష్ట్రం కు ముఖ్యమంత్రి గా ఉన్న ఎన్టీఆర్ లాంటి వారే అలాంటి ప్రయత్నం చేసి ఉద్యొగులు తమ ప్రభుత్వం లో అంతర్భాగమని తెలుసుకొని వేదింపులు విరమించుకున్నారు, కాంగ్రేస్ ప్రభుత్వం కేసీఆర్ తరహాలోనే రిటైర్మెంట్ వయస్సు మరికొంత కాలం పెంచాలనే యోచన సరైనది కాదు..! ఇటు ఉద్యోగులు,అటు నిరుద్యోగులు అలాంటి ఆలోచన జీర్ణించుకునే స్థితి లేదు. ఇప్పుడు ఆటోమాటిక్ గా ఇవ్వాల్సిన డిఏలకోసం మంత్రివర్గ ఉపసంఘం , ఉద్యోగ సంఘాలు చర్చించే విధానం చూస్తే పాకుడుబండపై కాలెట్టిన ఉద్యోగ సంఘాలనేతలు చేసిన నష్టం ,దింపుడు కళ్ళం ఆశలతో ఏదురుచూస్తున్న ఉద్యోగుల, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల దయానీయ స్థితి శత్రృవు కు కూడా ఎదురు కాకూడని పరిస్థితి. కనుక ఉద్యోగులు సహజ హక్కులైన డిఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ప్రభుత్వం కుంటిసాకులు చెప్పకుండా విడుదల చేసి ఆదుకోవాలి. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం అడుగులో అడుగేసి నడవకుండా మానవీయ దృక్పథం తో ఆలోచించాలని కోరుకుందాం. అవినీతికి పాల్పడే లేక ప్రజలకు దూరం అయిన ఉద్యోగులు నీటిబయట పారేసిన చేపలాంటివారే! ఇప్పటికైనా ఎక్కడ తమపోరాటశక్తి తాకట్టు పడిందో బార్గయినింగ్ శక్తి సన్న గిల్లిందో ఉద్యోగులు అర్థం చేసుకోవడం అవసరం. ఇప్పటికైనా ఉద్యొగ ఉపాధ్యాయులు తమ హక్కుల ను నిలబెట్టుకోవడం కొరకైన కేంద్రం నిరంకుశంచట్టలపైనా, రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం పైనా పోరాడాల్సిన అవసరం ఉంది.





