“ప్రస్తుత రాష్ట్ర స్థూల ఉత్పత్తి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు. అది ఇరవై ఒక్క సంవత్సరాలలో అంతగా ఎదగాలంటే సాధారణ అంక గణితపు లెక్క వేసినా, వార్షిక వృద్ధి రేటు 20 శాతం ఉండాలి. ప్రాతిపదిక (బేస్) పెరిగిన కొద్దీ వృద్ధి రేటు తగ్గుతుంది గనుక బహుశా ఈ వృద్ధి రేటు ఇంకా ఎక్కువగా ఉండాలి. అలాగే డాలర్ – రూపాయి మారకంలో రూపాయి విలువ ఇంకా పడిపోతుంది గనుక అసలు మొత్తం స్థూల ఉత్పత్తే ఇంకా ఎక్కువ కావలసి ఉంటుంది. ప్రపంచంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలైనా ఇప్పటివరకూ 14-15 శాతం వార్షిక వృద్ధి రేటును మించలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 7-8 శాతం దాటలేదు. ఒక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు రెట్లు పెంచుతానని, తుపాకి వెంకటరాముడు తప్ప మరెవరూ అనలేరు.”
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలో విడుదల చేసిన విజన్ 2020 అనే పత్రంలో విద్యను వ్యాపారంగా లెక్కిస్తాము అని స్పష్టంగానే రాశారు. అంటే విద్యకు ఉండే సామాజిక శ్రేయస్సు లక్ష్యాన్ని పక్కనపెట్టి, లాభ నష్టాల ఇరుకు లెక్కలలోకి కుదిస్తాము అని అర్థం. ఇరవై ఏడు సంవత్సరాల కింద వెలువడిన ఆ పత్రం అప్పుడే తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. అది వాగాడంబరంతో ప్రకటించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. అవన్నీ ప్రజలను మాయ చేయడానికి చెప్పిన అబద్ధాలని తేలిపోయింది.
చిరకాలం చంద్రబాబు నాయుడు శిష్యుడుగా ఉండిన (ఇప్పటికీ ఉన్నాడని కొందరు ఆరోపిస్తున్న) రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో కూడా సరిగ్గా అటువంటి ప్రగల్భాల వాగాడంబరపు పత్రం మరొకటి వచ్చింది. దాని పేరు ‘తెలంగాణ మీన్స్ బిజినెస్స్, విజన్ 2047’. గురువు 1998లో విజన్ 2020 విడుదల చేసి, 1999 నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు అది అమలులో ఉంటుందని అనగా, శిష్యుడు 2025లో విడుదల చేసి, 2026 నుంచి సరిగ్గా ఇరవై ఒక్క సంవత్సరాలే ఇది కూడా అమలులో ఉంటుందని అంటున్నారు.
రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో కాక, చైనా, జపాన్ లతో పోటీలో నిలిపి అభివృద్ధి చేస్తాననీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాననీ ఆకుకు అందని పోకకు పొందని ప్రగల్భాలతో ఈ విజన్ 2047 పత్రం నిండి ఉంది. ఇది ఎంత అబద్ధాల పత్రమో చెప్పాలంటే ఈ ఒక్క గణాంకం చాలు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల (మూడు లక్షల కోట్ల డాలర్ల) ఆర్థిక వ్యవస్థగా మారుతుందంటే అర్థం ఇవాళ్టి ద్రవ్య మారకంతో లెక్కవేసినా, అది రెండు కోట్ల డెబ్బై లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ అవుతుందన్నమాట. ప్రస్తుత రాష్ట్ర స్థూల ఉత్పత్తి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు. అది ఇరవై ఒక్క సంవత్సరాలలో అంతగా ఎదగాలంటే సాధారణ అంక గణితపు లెక్క వేసినా, వార్షిక వృద్ధి రేటు 20 శాతం ఉండాలి. ప్రాతిపదిక (బేస్) పెరిగిన కొద్దీ వృద్ధి రేటు తగ్గుతుంది గనుక బహుశా ఈ వృద్ధి రేటు ఇంకా ఎక్కువగా ఉండాలి. అలాగే డాలర్ – రూపాయి మారకంలో రూపాయి విలువ ఇంకా పడిపోతుంది గనుక అసలు మొత్తం స్థూల ఉత్పత్తే ఇంకా ఎక్కువ కావలసి ఉంటుంది. ప్రపంచంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలైనా ఇప్పటివరకూ 14-15 శాతం వార్షిక వృద్ధి రేటును మించలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 7-8 శాతం దాటలేదు. ఒక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు రెట్లు పెంచుతానని, తుపాకి వెంకటరాముడు తప్ప మరెవరూ అనలేరు. సరే, ఆ 160 పేజీల విజన్ 2047 పత్రంలో అటువంటి విమర్శనీయమైన, హాస్యాస్పదమైన, ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు లెక్కలేనన్ని ఉన్నాయి గాని, ఇవాళ్టి కాలమ్ లో విజన్ 2047 విద్యారంగం గురించి ఏమి చెపుతుందో, తెలంగాణ విద్యారంగానికి 2047 నాటికి ఏమవుతుందో మాత్రమే చూద్దాం.
“ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రభుత్వ విద్య పునరుద్ధరణ ఒక ప్రధాన నినాదంగా వినిపించింది. కాని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, పదేళ్లకు పైగా కాలంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ వ్యయం క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయించే వాటా దేశ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉంది. మొత్తం రాష్ట్ర ఆదాయంలో విద్యపై ఖర్చు సుమారు 2 శాతం చుట్టూనే తిరుగుతోంది. ఈ స్థాయి పెట్టుబడులతో “ప్రపంచస్థాయి విద్య” ఎలా సాధ్యమవుతుందో విజన్ పత్రం చెప్పదు.”
విజన్ 2047 పత్రంలో విద్యారంగం గురించి ప్రత్యేక అధ్యాయం ఏమీ లేదు. కాని విద్యారంగ ప్రస్తావన చాలా చోట్ల జరిగింది. అసలు మొత్తం పత్రమే సామాజిక శ్రేయస్సును ఆశించే ఒక ప్రజా విధాన పత్రంలా కాక, కార్పొరేట్ ప్రయోజనాల పత్రంలా కనిపిస్తుంది. ప్రజలను భ్రమల్లో ముంచడానికి రంగురంగుల పదజాలం, ఆకర్షణీయమైన లక్ష్యాలు, అంతర్జాతీయ ప్రమాణాల ఊహలు, ఆడంబరమైన వాగ్దానాలు గుప్పించారు. ముఖ్యంగా విద్యా రంగం విషయంలో అయితే మాటలకు కొదవ లేదు. ఆ మాటలన్నీ కుప్పపోస్తే ప్రపంచంలోని అత్యున్నత స్థాయి ప్రమాణాలతో నడుస్తున్న విద్యా వ్యవస్థలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ ఎందుకూ కొరగావు. కాని మింగడానికి మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అనే సామెత గుర్తు చేసుకుంటే, ఆ ప్రగల్భాలన్నీ నీటి బుడగలని తేలిపోతుంది. పత్రంలో విద్యారంగ అభివృద్ధి గురించి ఆడంబర, ఆకర్షణీయ పదజాలం చదివిన వెంటనే ఒక ప్రశ్న వెంటాడుతుంది: ఈ విజన్ లక్ష్యాలకూ, ఇవాళ కునారిల్లుతున్న తెలంగాణ విద్యా వ్యవస్థ వాస్తవాలకూ ఏమైనా సంబంధాం ఉన్నదా?
ఇవాళ తెలంగాణ విద్యా వ్యవస్థ పరిస్థితి చూస్తే, 2047కు స్వర్గానికి చేరుకోవడం కాదు, 2025–26 విద్యా సంవత్సరంలో ఉట్టిని అందుకోగలమా, నేలబారున ఉన్న ఈ స్థితిని కొన్ని అంగుళాలైనా పైకి లేపగలమా అని సందేహం కలుగుతుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే తెలంగాణలో వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తీవ్రంగా పడిపోయింది. కొన్ని నివేదికల ప్రకారం వెయ్యికి పైగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సున్నా. గుండు సున్నా. మరెన్నో పాఠశాలల్లో 10 మంది లోపే విద్యార్థులు ఉన్నారు. ఇది సహజమైన జనాభా మార్పు వల్ల వచ్చిన పరిస్థితి కాదు; ఇది ప్రభుత్వ పాఠశాలల పట్ల రాజకీయ నిర్లక్ష్యానికి, ఉద్దేశపూర్వక విధ్వంసానికి ప్రత్యక్ష ఫలితం.
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రభుత్వ విద్య పునరుద్ధరణ ఒక ప్రధాన నినాదంగా వినిపించింది. కాని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, పదేళ్లకు పైగా కాలంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ వ్యయం క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయించే వాటా దేశ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉంది. మొత్తం రాష్ట్ర ఆదాయంలో విద్యపై ఖర్చు సుమారు 2 శాతం చుట్టూనే తిరుగుతోంది. ఈ స్థాయి పెట్టుబడులతో “ప్రపంచస్థాయి విద్య” ఎలా సాధ్యమవుతుందో విజన్ పత్రం చెప్పదు.
విజన్ 2047లో ప్రభుత్వం విద్యను “ఆర్థిక వృద్ధికి వెన్నెముక”గా పేర్కొంటుంది. కాని ఆ వెన్నెముకను మోసే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను ప్రభుత్వం వాస్తవంగా జీవచ్ఛవంలా మార్చింది. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుండగా, 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున పాఠశాల విద్య ప్రైవేటీకరణ జరిగిన నేపథ్యంలో ఏ వెన్నెముకను నిలబెట్టడం గురించి ప్రభుత్వ పత్రం ప్రగల్భాలు పలుకుతున్నది? ఇవాళ గ్రామీణ, పట్టణ పేద కుటుంబాలు సైతం అప్పులు చేసి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఫలితంగా తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల వాటా వేగంగా పెరుగుతోంది, ప్రభుత్వ పాఠశాలలు కేవలం అత్యంత పేదల కోసం మిగిలిపోయాయి – అవి కూడా క్రమంగా ఖాలీ అవుతున్నాయి. ఈ దుస్థితిని ప్రస్తావించకుండా, చర్చించకుండా, మార్చే వ్యూహాల గురించి ఆలోచించకుండా కేవలం “వెన్నెముక” అని పూలదండ వేయడం, శవానికి వేసే పూలదండ లాంటిదే.
“ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా, ఉన్నత విద్యా రంగంలో ఖాలీలు భర్తీ చేయకుండా, విద్యారంగ మౌలిక సాధన సంపత్తిని మెరుగు పరచకుండా, విద్యా రంగానికి నిధుల కేటాయింపును పెంచకుండా, విద్యను సామాజిక హక్కుగా పునర్నిర్వచించకుండా, ఎన్ని విజన్ పత్రాలు రాసినా ఫలితం ఉండదు. 2047 అనేది సుదూర భవిష్యత్తేమీ కాదు; అది వర్తమాన విధానాల నుంచి ప్రవహించే సహజ ఫలితం మాత్రమే, అది ఎలా ఉంటుందో చూడడానికి ఇవాళ అధికారంలో ఉన్నవారు లేకపోవచ్చు, పరిశీలకులు కూడా ఉండకపోవచ్చు. కాని ఏం జరిగిందో, ఎలా జరిగిందో చరిత్ర నమోదు చేస్తుంది.”
విజన్ 2047 పత్రంలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారంలు, లర్నింగ్ డ్యాష్‌బోర్డులు వంటి పదాలు విరివిగా వెదజల్లారు. కాని ఇదే సమయంలో ప్రభుత్వ నివేదికల ప్రకారమే అనేక పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు కాదు, అసలు మరుగుదొడ్లు లేవు, ముఖ్యంగా బాలికల పాఠశాలల్లో ఇది పెద్ద సమస్య. కొన్ని జిల్లాల్లో తాగునీటి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేదు. విద్యుత్ సరఫరా సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భవనాలు సక్రమంగా చాలినాన్ని లేవు. ఈ మౌలిక వసతులే లేని పరిస్థితిలో డిజిటల్ విప్లవం గురించి మాట్లాడటం క్రూరమైన పరిహాసం. ఆత్మవంచన. పరవంచన.
ఉపాధ్యాయుల అంశం అయితే మరింత తీవ్రమైనది. తెలంగాణలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాలీగా ఉన్నాయి. సంవత్సరాల తరబడి నియామకాలు జరగకపోవడం వల్ల అనేక పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయులు అన్ని తరగతులూ బోధించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు, ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికలు, సర్వేలు, పరిపాలనా పనుల పేరుతో తరచూ తరగతుల నుంచి దూరం చేస్తున్నారు. విజన్ 2047లో ఉపాధ్యాయులను “నాలెడ్జ్ ఫెసిలిటేటర్లు”గా అభివర్ణించినా, వారి పనితీరు మీద, బోధనా సామర్థ్యం మీద నిఘా పెట్టడానికి ఆన్ లైన్ టూల్స్ సమకూరుస్తామని వాగ్దానం చేసినా, అంతకన్నా మౌలికంగా వారికి కావలసిన పని పరిస్థితులు, వృత్తిపరమైన గౌరవం గురించి స్పష్టత లేదు.
విద్యా నాణ్యత విషయానికి వస్తే, ఏసర్ నివేదిక వంటి జాతీయ స్థాయి అధ్యయనాలు తెలంగాణలో ప్రాథమిక స్థాయి చదవడం, గణితం నేర్చుకునే సామర్థ్యంలో పడిపోతున్న ధోరణిని సూచిస్తున్నాయి. ఇది కేవలం కోవిడ్ కాలపు ప్రభావం కాదు; దీర్ఘకాలిక విధాన వైఫల్యం. విజన్ పత్రం ఈ వాస్తవాన్ని అసలు పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నేరుగా భవిష్యత్తు కలల్లోకి దూకుతుంది.
ఉన్నత విద్య రంగంలో కూడా పరిస్థితి ఇదే. తెలంగాణలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక స్థానాలు భారీగా, వేలాదిగా ఖాలీ పడి ఉన్నాయి. అనేక విభాగాలు అతిథి అధ్యాపకులపై ఆధారపడి నడుస్తున్నాయి. పరిశోధనకు కావలసిన నిధులు, మౌలిక వసతులు పరిమితంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దే కనీస ఆలోచనలు, కనీస బడ్జెట్ కేటాయింపులు లేవు గాని, తెలంగాణను “జ్ఞాన ఆర్థిక వ్యవస్థ”గా మార్చుతామన్న వాస్తవ దూరమైన వాగాడంబరం మాత్రం ఉంది.
విజన్ 2047లో ఉన్నత విద్యను స్కిల్, ఇండస్ట్రీ లింకేజ్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లతో ముడిపెట్టారు. వినడానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ మాటల అసలు అర్థం, విద్యను పూర్తిగా మార్కెట్ అవసరాలకు, కార్పొరేట్ ప్రయోజనాలకు లోబర్చడం మాత్రమే. అది ఒక ప్రజాస్వామ్య సమాజానికి ప్రమాదకర సంకేతం. విద్య అంటే కేవలం ఉద్యోగానికి పనికొచ్చే స్కిల్ తయారీ కాదు; అది విమర్శాత్మక ఆలోచన, సామాజిక బాధ్యత, పౌర చైతన్యం పెంపొందించే ప్రక్రియ. ఈ కోణం విజన్ పత్రంలో పూర్తిగా గల్లంతైంది.
సామాజిక న్యాయం విషయానికి వస్తే, తెలంగాణలో విద్య ఇప్పటికీ కుల, వర్గ, ప్రాంత అసమానతలతో ముడిపడి ఉంది. గ్రామీణ–పట్టణ వ్యత్యాసం పెరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అవసరమైన మద్దతు వ్యవస్థలు బలహీనంగానే ఉన్నాయి. విజన్ 2047లో “సమ్మిళిత విద్య” అనే మాట ఉన్నప్పటికీ, దానికి తగిన బడ్జెట్ హామీలు, అమలు వ్యూహాలు మాత్రం లేవు.
మొత్తానికి, విజన్ 2047 లో విద్యారంగ ప్రస్తావనలు రాజకీయ ఉద్దేశాలతో జరిగినవే తప్ప, నిజంగా సామాజిక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని జరిగినవి కావు. ఆ పత్రం ఇవాళ తెలంగాణ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారం సూచించడం అలా ఉంచి, అసలు ఉన్న సంక్షోభాన్ని చూడనేదలచుకోలేదు, చూపనే దలచుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా, ఉన్నత విద్యా రంగంలో ఖాలీలు భర్తీ చేయకుండా, విద్యారంగ మౌలిక సాధన సంపత్తిని మెరుగు పరచకుండా, విద్యా రంగానికి నిధుల కేటాయింపును పెంచకుండా, విద్యను సామాజిక హక్కుగా పునర్నిర్వచించకుండా, ఎన్ని విజన్ పత్రాలు రాసినా ఫలితం ఉండదు. 2047 అనేది సుదూర భవిష్యత్తేమీ కాదు; అది వర్తమాన విధానాల నుంచి ప్రవహించే సహజ ఫలితం మాత్రమే, అది ఎలా ఉంటుందో చూడడానికి ఇవాళ అధికారంలో ఉన్నవారు లేకపోవచ్చు, పరిశీలకులు కూడా ఉండకపోవచ్చు. కాని ఏం జరిగిందో, ఎలా జరిగిందో చరిత్ర నమోదు చేస్తుంది.





ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!