విద్యా కమిషన్ నివేదిక పై విమర్శలు

తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇటీవల తన ప్రాథమిక నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా రూపొందించిన  ఈ నివేదికపై అటు ఆశలు, ఇటు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సంస్కరణల దిశగా అడుగులా లేక పాత చింతకాయ పచ్చడా ? అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత విద్యా రంగం ఒక కీలక మలుపులో ఉంది. ఒకవైపు ప్రపంచీకరణ సవాళ్లు, మరోవైపు అడుగంటిపోతున్న ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం విద్యా కమిషన్‌ను రంగంలోకి దించింది. అయితే, కమిషన్ సమర్పించిన నివేదికను నిశితంగా పరిశీలిస్తే, అది కొన్ని ఆశాజనకమైన అంశాలను ప్రస్తావించినప్పటికీ, మరికొన్ని ప్రాథమిక సమస్యలను గాలి కొదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కమిషన్ తన నివేదికలో స్కూల్ కాంప్లెక్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను సమీపంలోని పెద్ద పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా వనరులను సమర్థవంతంగా వాడుకోవచ్చని భావిస్తోంది. ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు మరియు నిపుణులైన ఉపాధ్యాయులు అందరికీ అందుబాటులోకి వొస్తారు అన్న ఆశాభావం ప్రకటించినప్పటికీ  గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు లేని చోట, పాఠశాలల విలీనం వల్ల పేద విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన ప్రయోగాలు చాలా చోట్ల డ్రాపౌట్స్ పెరగడానికి కారణమయ్యాయి.

రాష్ట్రంలోని వేల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ ఖాలీలను భర్తీ చేయడంపై కమిషన్ ఇచ్చిన సూచనలు అస్పష్టంగా ఉన్నాయనే వాదన ఉంది.  ఉపాధ్యాయుల వేతనాలను తగ్గించాలని సూచించడం సమంజసం కాదు.విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం చేసే ఖర్చును ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. టీచర్ రిక్రూట్ అవసరం లేదని కమిషన్  చెప్పడం విద్యా వ్యవస్థకు హానికరం అంతేకాదు  కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయులను నియమించాలని సూచించడం సరైన విధానం కాదు. కేవలం మౌలిక సదుపాయాలు పెంచితే సరిపోదు, బోధించే వారు లేకపోతే ఆ భవనాలు కేవలం శిథిలాలుగా మిగిలిపోతాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మరియు హేతుబద్ధీకరణ  వంటి అంశాల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టే స్పష్టమైన విధానాన్ని కమిషన్ సూచించ లేకపోయింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై కమిషన్ సానుకూలంగా ఉంది. అయితే, మాతృభాష  ప్రాముఖ్యత తగ్గుతుందనే ఆందోళన భాషా కోవిదుల నుంచి వ్యక్తమవుతోంది.చదువు కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదు, సంస్కృతి కాపాడటానికి కూడా ఉండాలి. ప్రాథమిక విద్య మాతృభాషలో లేకపోతే పిల్లల సృజనాత్మకత దెబ్బతింటుంది. డిగ్రీ, పీజీ పూర్తి చేసినా ఉద్యోగాలకు పనికిరాని పట్టభద్రులు తయారవుతున్నారని కమిషన్ గుర్తించింది. దీనికోసం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్పు చేయాలని ప్రతిపాదించింది. కేవలం కార్పొరేట్ సంస్థలకు ‘కూలీలను’ సరఫరా చేసే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలను మార్చకూడదు. సామాజిక శాస్త్రాలు, మానవీయ విలువలు మరియు స్వతంత్ర ఆలోచనా శక్తిని పెంపొందించే విద్య అవసరం.

విద్యా కమిషన్ ఎన్నో అద్భుతమైన సంస్కరణలను సూచించామని భావించినా , వాటి అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు గురించి ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయిస్తున్న వాటా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉంది. నిధులు లేని సంస్కరణలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి.

తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఒక మంచి ప్రయత్నం అనడంలో సందేహం లేదు. కానీ, ఇది కేవలం గతంలో వొచ్చిన కొఠారి కమిషన్ లేదా జాతీయ విద్యా విధానం  2020 అంశాలను తిరగరాయడం లాగా కాకుండా, తెలంగాణ భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం కమిషన్ నివేదికపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు మరియు మేధావులతో బహిరంగ చర్చ జరపాలి.  విద్యా వ్యవస్థలో ప్రైవేటు శక్తుల పెత్తనాన్ని తగ్గించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా నిధులు కేటాయించాలి. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు ఈ నివేదిక అమలుపైనే ఆధారపడి ఉంది. ఇది కేవలం అకడమిక్ వ్యాయామంలా మిగిలిపోకుండా, అక్షరాస్యత మరియు నాణ్యమైన విద్యలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *