“ఆకర్షణీయమైన, ప్రశంసాపూర్వకమైన శీర్షికలు వాస్తవరూపం ధరిస్తాయా, ఈ ప్రగల్భాల అంకెలు నిజంగా అమలవుతాయా అనే మామూలు ప్రశ్నలు బడ్జెట్ వార్తలు రాసిన విలేఖరులకు గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులకు గాని వచ్చినట్టు లేదు. “బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు” అని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్న మాట గీటురాయిగానైనా ఆ అంకెలను పరిశీలించాలని ఎవరూ అనుకోలేదు.”
రానున్న ఆర్థిక సంవత్సరం 2026-27కు గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మొన్నటి శుక్రవారం నాడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినతర్వాత మూడో బడ్జెట్. ఈ బడ్జెట్ గురించి పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే మన జర్నలిజం పూర్తిగా ప్రభుత్వం ఏమి చెపితే అదే ప్రచురిస్తున్నదని అనిపిస్తున్నది. బడ్జెట్ లో అంకెలను ఎలా అధ్యయనం చేయాలి, ఆ అంకెల వెనుక ఏమి ఉంది, బడ్జెట్ కేటాయింపులను ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కేటాయింపుల పర్యవసానాలేమిటి వంటి మౌలిక విషయాలు తెలియకపోవడమో, తెలిసినా ప్రజలకు తెలియజేప్పే బాధ్యత తమ మీద ఉందనే స్పృహ లేకపోవడమో జరుగుతున్నట్టుంది.
బడ్జెట్ గురించి ప్రధాన దినపత్రికలు “సకల జనులపై వరాల జల్లులు”, “సంక్షేమానికి నవోదయం”, “పేదల విద్యకు పెద్దపీట”, “అందరికీ బీమా ఆహార ధీమా”, “బడ్జెట్ లో కొత్త పథకాలు” “పట్టాలపైకి ప్రభుత్వోద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకం”, “దేశంలోనే తొలిసారిగా ఉద్యోగులకు ప్రమాద బీమా స్కీమ్”, “యువతకు ఉపాధి” లాంటి ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టాయి. రు. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధికి రు. 33,000 కోట్లు, విద్యా రంగానికి రు. 26,000 కోట్లు, నీటి పారుదలకు రు. 22,000 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రు. 23,000 కోట్లు, పట్టణాభివృద్ధికి రు. 17,000 కోట్లు, వైద్య ఆరోగ్య రంగాలకు రు. 13,000 కోట్లు అని భారీ అంకెలతో ఊదర కొట్టాయి. యథావిధిగా ఇదంతా అంకెల గారడీ అని ప్రతిపక్షాలు చేసిన విమర్శనూ ప్రకటించాయి.
కాని ఆ ఆకర్షణీయమైన, ప్రశంసాపూర్వకమైన శీర్షికలు వాస్తవరూపం ధరిస్తాయా, ఈ ప్రగల్భాల అంకెలు నిజంగా అమలవుతాయా అనే మామూలు ప్రశ్నలు బడ్జెట్ వార్తలు రాసిన విలేఖరులకు గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులకు గాని వచ్చినట్టు లేదు. “బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు” అని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్న మాట గీటురాయిగానైనా ఆ అంకెలను పరిశీలించాలని ఎవరూ అనుకోలేదు.
బడ్జెట్ అనేది రానున్న సంవత్సరం కాలంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టిక. ఆ ఆదాయం ఏయే మార్గాలలో వస్తుందో, వచ్చిన ఆదాయాన్ని ప్రజా ప్రయోజనం కోసం ఏయే మార్గాలలో ఖర్చు పెట్టదలచుకున్నారో వివరించే పత్రం. సమాజంలో ప్రతి మనిషీ, ప్రతి వర్గమూ శ్రమద్వారా, పోగుచేసిన సంపద ద్వారా, పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎంతో కొంత చేరుస్తారు. అలా పోగుపడిన మొత్తం సంపదను మళ్లీ ఆయా వర్గాలకూ మనుషులకూ ఏ నిష్పత్తిలో పంచాలని ప్రభుత్వం రచించే ప్రణాళికే బడ్జెట్. అంటే అది ప్రధానంగా వర్గాల మధ్య, ప్రజా సమూహాల మధ్య సేకరణ-పంపిణీ ప్రణాళిక. సేకరణ సక్రమంగా, న్యాయంగా, ఎవరి తాహతుకు బట్టి వారి దగ్గరి నుంచి జరుగుతున్నదా లేదా, పంపిణీ సక్రమంగా, న్యాయంగా, ఎవరి అవసరాన్ని బట్టి వారికి అందుతున్నదా లేదా అనే లోతైన రాజకీయార్థిక చర్చ ఎప్పుడైనా ఏ బడ్జెట్ గురించి అయినా చేయవలసి ఉంటుంది.
“ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు. కాని అదంతా భవన నిర్మాణాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు. అంటే కాంట్రాక్టర్లకు, అక్కడి నుంచి రాజకీయ నాయకుల ముడుపులకు! కట్టిన భవనాలలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఉండాలి గదా. వారి కోసం యూనివర్సిటీకి ఇచ్చే బ్లాక్ గ్రాంట్ లో రు. 42 కోట్లు కోత విధించారు. అంటే భవనాలు పెరుగుతాయి గాని అధ్యాపకులు, విద్యార్థులు తగ్గుతారు!”
అయితే అసలు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టే ప్రభుత్వానికీ, దాని ప్రభావం నిజంగా అనుభవించే ప్రజలకూ కూడా గంభీరంగా పట్టించుకోవలసిన అంశం కాకుండా పోయి చాలా రోజులయింది. పత్రికలకూ ప్రసార మాధ్యమాలకూ అది ఒక రోజు వార్త, ఒకరోజు చర్చకు అవకాశం ఇచ్చే అంశం. అంతే తప్ప ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో ప్రతి రోజూ, ప్రతి ఆర్థిక కార్యకాలాపం మీద, ప్రతి మనిషి మీదా ప్రభావం వేస్తుందని ఎవరికీ పట్టని వ్యవహారం అయిపోయింది. ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది అనే సామెతకు సరిపోయేలా తయారయింది. అందువల్ల బడ్జెట్ గురించి లోతైన, గంభీరమైన విషయాలు అలా ఉంచి, కనీసమైన, అవసరమైన విషయాలైనా చర్చించాలి. ప్రజల దృష్టికి తేవాలి. మొట్టమొదట, బడ్జెట్ గురించి ప్రభుత్వం ఏమి చెపితే అది, ఆర్థిక మంత్రి బడ్జెట్ ఉపన్యాసంలో ఎన్ని ప్రగల్భాలు పలికితే అన్నీ యథాతథంగా అచ్చువేయడం, నమ్మడం మానుకోవాలి. ఆ మాటలకూ, ఆ తర్వాత చెప్పే అంకెలకూ, ఆ అంకెల అమలుకూ, ఆ అంకెల అమలు పర్యవసానాలకూ ఎంత మాత్రం సంబంధం ఉండకపోవచ్చు అనే కఠోర సత్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
రెండు, బడ్జెట్ లో ఫలానా శాఖకు ఇన్ని వేల కోట్లు, ఫలానా రంగానికి అన్ని వేల కోట్లు అని ఆర్థిక మంత్రి చెప్పిన అంకెలను యథాతథంగా స్వీకరించడం కాక, ఆ అంకెలను నిశితంగా పరిశీలించాలి. మన బడ్జెట్లు తయారయ్యే పద్ధతిలో నాలుగు అంకెలు ఇస్తూ ఉంటారు: ప్రతిపాదిత బడ్జెట్ అంచనా, గత సంవత్సర బడ్జెట్ అంచనా, సవరించిన అంచనా, అంతకు ముందు సంవత్సర వాస్తవ గణాంకాలు. ఇప్పుడు బడ్జెట్ లో 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్, 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్, 2024-25 ఆక్చువల్స్ అని నాలుగు అంకెలు ఉంటాయి. పత్రికలు పతాక శీర్షికల్లో వేసే ఆర్భాటపు అంకె రానున్న సంవత్సరంలో ఇంత సంపాదిస్తాము, ఇంత ఖర్చు పెడతాము అని ప్రభుత్వం చెప్పే అంకె మాత్రమే. ఇది చెరువులో బర్రెను నిలబెట్టి చేసే బేరం లాంటిది. నీళ్లలో మునిగి ఉన్న బర్రె కొమ్ములు కనబడతాయి గాని ఆ కొమ్ములు పాలు ఇవ్వవు. కనుక ఇప్పుడు ప్రకటిస్తున్న అంకెలో ఎంత నిజంగా వచ్చింది, ఎంత నిజంగా ఖర్చయింది అనే సంగతి ఈ సంవత్సరం అంతా గడిచిపోయాక గాని తెలియదు. దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ (సవరించిన అంచనా) అంటారు. మరొక సంవత్సరం గడిచాక అసలు సంగతి తెలుస్తుంది.
మూడు, ఇప్పుడు వెయ్యి కోట్లు కేటాయింపు అనగానే పొంగిపోయి డబ్బా కొట్టడం కాకుండా, గత సంవత్సరం ఎంత కేటాయించారు, అందులో ఎంతకు సవరించారు, అంతకు ముందు సంవత్సరం ఎంత కేటాయించి, ఎంతకు సవరించి, ఎంత వాస్తవికం అని తేల్చారు అని చూడవలసి ఉంటుంది. ఆలాచూస్తే పేజీ పేజీకీ అబద్ధాలు కనబడతాయి. పంచపాండవులంటే నాకు తెలియదా, మంచం కోళ్లోలె ముగ్గురు కాదా అని రెండు వేళ్లు చూపెట్టి, గోడ మీద ఒకటి అంకె రాసినట్టు అనే పాత సామెతా, ఆధునిక ప్రభుత్వాల బడ్జెట్ల తీరూ ఒకటే. ఇందులో ఏ రాజకీయ పార్టీకీ మినహాయింపు కూడా లేదు. అన్ని పార్టీలూ ఒకే తానులో ముక్కలు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తాజా బడ్జెట్ విషయానికే వస్తే రాబడి విషయంలోనూ అవే అబద్ధాలు, కేటాయింపు విషయంలోనూ అవే అబద్ధాలు. ప్రచారసాధనాల్లో ఆదాయ అంకెలూ కేటాయింపుల అంకెలూ బడ్జెట్ లో చెప్పినట్టుగా భారీగా కనబడతాయి గాని, లోపల చిన్న అంకెల్లో సవరించిన అంచనా కాలమ్ చూసినా, వాస్తవ గణాంకాల కాలమ్ చూసినా అసలు వాస్తవం బైటపడుతుంది. ఉదాహరణకు గత సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో రు. 2,29,720 కోట్లు రాబడి వస్తుందని వేసిన అంచనా, ఇప్పుడు సవరించిన అంచనాలో రు. 2,03,970 కోట్లుగా తరిగిపోయింది. అంటే ఇక్కడే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు, పది శాతానికి పైగా తగ్గింది. అయినా ఇప్పుడు ప్రతిపాదిస్తున్న బడ్జెట్ అంచనాలో రాబడి రు. 2,41,263 కోట్లు ఉండబోతుందన్నారు. అది ఏడాది తిరిగేసరికి ఎంత తగ్గుతుందో తెలియదు. గత సంవత్సరం తరుగుదలలో ఒక ప్రధాన భాగం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రు. 22,782 కోట్లు వస్తాయని అంచనా వేయగా, వాస్తవంగా వచ్చింది రు. 11,161 కోట్లు మాత్రమే. అయినా ఇప్పుడు రానున్న సంవత్సరం రు. 24,166 కోట్లు వస్తాయని లెక్క చూపడం గాలిలో దీపం పెట్టి, ప్రజలను నమ్మించడమే.
“పత్రికలు పతాక శీర్షికల్లో వేసే ఆర్భాటపు అంకె రానున్న సంవత్సరంలో ఇంత సంపాదిస్తాము, ఇంత ఖర్చు పెడతాము అని ప్రభుత్వం చెప్పే అంకె మాత్రమే. ఇది చెరువులో బర్రెను నిలబెట్టి చేసే బేరం లాంటిది. నీళ్లలో మునిగి ఉన్న బర్రె కొమ్ములు కనబడతాయి గాని ఆ కొమ్ములు పాలు ఇవ్వవు. కనుక ఇప్పుడు ప్రకటిస్తున్న అంకెలో ఎంత నిజంగా వచ్చింది, ఎంత నిజంగా ఖర్చయింది అనే సంగతి ఈ సంవత్సరం అంతా గడిచిపోయాక గాని తెలియదు. దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ (సవరించిన అంచనా) అంటారు. మరొక సంవత్సరం గడిచాక అసలు సంగతి తెలుస్తుంది.”
ఇక కేటాయింపుల ఆర్భాటం విషయానికి వస్తే, గత సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రు. 600 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల ప్రకారం ఖర్చు పెట్టినది రు. 55 కోట్లు. పది శాతం కన్నా తక్కువ. అయినా సరే, ఈసారి బడ్జెట్ లో రానున్న సంవత్సరానికి మళ్లీ రు. 600 కోట్లు కేటాయించారు. అది చూసి ప్రచార సాధనాలు ‘అబ్బ ఎంత గొప్ప కేటాయింపులో’ అని డప్పు కొడుతున్నాయి.
ప్రకటించిన ప్రతి భారీ అంకెనూ గత సంవత్సరపు బడ్జెట్ అంచనా అంకెతో, గత సంవత్సరపు సవరించిన అంచనా అంకెతో పోల్చి చూసినప్పుడు మాత్రమే వాస్తవం బైట పడుతుంది. ఉదాహరణకు ఈసారి వ్యవసాయానికి భారీ అంకె కేటాయించినప్పటికీ, గతంతో పోలిస్తే 1260 కోట్ల రూపాయలు తగ్గాయి. నీటి పారుదలకు రు. 740 కోట్లు తగ్గాయి. అలాగే ఒకే పద్దులో ఒక అంశంలో పెరుగుదల ఉన్నప్పటికీ, మిగిలిన అంశాలతో దాన్ని పోల్చి చూడాలి. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు. కాని అదంతా భవన నిర్మాణాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు. అంటే కాంట్రాక్టర్లకు, అక్కడి నుంచి రాజకీయ నాయకుల ముడుపులకు! కట్టిన భవనాలలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఉండాలి గదా. వారి కోసం యూనివర్సిటీకి ఇచ్చే బ్లాక్ గ్రాంట్ లో రు. 42 కోట్లు కోత విధించారు. అంటే భవనాలు పెరుగుతాయి గాని అధ్యాపకులు, విద్యార్థులు తగ్గుతారు!
అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన, హాస్యాస్పదమైన విషయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల గురించి పగటి కలలు. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందట. ప్రస్తుత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (స్థూల రాష్ట్ర ఆదాయం) పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు. డాలర్ రూపాయి మారకం స్థిరంగా ఉంటే (ఉండదు, కాని లెక్క సౌలభ్యం కోసం ఉంటుందనుకుంటే) 18 లక్షల కోట్ల రూపాయల నుంచి ఎనిమిదేళ్లలో 90 లక్షల కోట్ల రూపాయలకు, ఇరవై ఏళ్లలో 270 లక్షల కోట్ల రూపాయలకు ఎదుగుతుందని పాలకులు ప్రజలను నమ్మిస్తున్నారు. ఈ బహు అంతస్తుల పేకమేడలు బాగున్నాయి గాని, ఈ అంకెలు నిజం కావాలంటే వార్షిక వృద్ధి రేటు 14-22 శాతంగా మారాలి. అటువంటి వృద్ధి రేటు ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ఆర్థిక వ్యవస్థా చూడలేదు. ప్రస్తుత తెలంగాణ ఆర్థిక వ్యవత వాస్తవ వృద్ధి రేటు ప్రభుత్వ ప్రకటన ప్రకారమే 8 శాతం. అది రెట్టింపో, మూడు రెట్లో కావాలి! స్వర్గానికి చేరుతామో లేదో గాని కనీసం ఉట్టిని అందుకుంటామా?





