ఇంటింట సమ్మక్క సారక్కలు

“గిరిజనుల/ఆదివాసీల చారిత్రక నేపథ్యాన్ని   పరిగణనలోకి తీసుకుంటే పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజులు,సమ్మక్క సారక్కలు మరియు గిరిజన వీరుల మరణం నిజమని చెప్పక తప్పదు. పగిడిద్దరాజు, జంపన్న గోవిందరాజులు సమ్మక్క సారక్కల అమరత్వానికి సాక్షిగా శాసనాలు కాని,లిఖిత ఆధారాలు కాని లేకపోవచ్చు.చరిత్రకారులు,స్వామీజీలు పురాణ గాథలుగా,కావ్య సంఘటనలుగా భావించవచ్చు. కాని సమ్మక్క సారక్కలు అడవి సంరక్షణ కొరకు,ఆదివాసీల హక్కుల గురించి జరిగిన పోరాటంలో అమరులైన వాస్తవాలను దాదాపు గత ఏడువందల సంవత్సరాలుగా స్మరించుకుంటూ వస్తున్నారు.”
మేరుగు రాజయ్య
 మొబైల్  నంబర్ 9441440791.

తెలంగాణలో సమ్మక్క,సారక్కలకు సాకబోయని కుటుంబాలు అరుదుగా ఉంటాయి.మా చిన్నతనంల 1972 ప్రాంతంలో సమ్మక్క బంగారమమ్మా అంటూ  (బెల్లం) పంచి పెడితే తీసుకోవడానికి భయపడేవారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తీసుకోవద్దని హితవు చెప్పేవారు. ఎందుకంటే,? బంగారం తీసుకుంటే సమ్మక్క సారక్కలు మన ఇంట్లో కూడా కొలువైతరని వివరణను ఇచ్చేవారు.కాని ఇప్పుడు ఇంటింట సమ్మక్క సారక్కలను  కొలుస్తున్నారు.ఆరాధించి పండుగను చేసుకుంటున్నారు. రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి(సమ్మక్కల పున్నం)నుండి నాలుగు రోజులు జాతర జరుగుతుంది. ఒకప్పుడు మేడారంలోనే జాతర జరిగేది.కాని ఇప్పుడు తెలంగాణలోని 612 రెవిన్యూ మండలాలలో ఉన్న సమ్మక్క సారక్కల జాతరలకు లక్షల కుటుంబాలు పోయి మొక్కలు తీర్చుకుంటున్నారు.

ఇక ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారంలో జరిగే జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్,ఒడిశా రాష్ట్రాల నుండి దాదాపు 25 నుండి 35 లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా వాసికెక్కింది. గిరిజన తల్లీబిడ్డలైన సమ్మక్క సారక్కలు నేడు ప్రజల ఆపదలను,కష్టాలను తీర్చే జనదేవతలుగా  జనసామాన్యమైన ఆదరణకు పాత్రులవుతున్నారు. ప్రాచుర్యంలో మౌకిక  కథనం ప్రకారం  క్రీస్తు శకం 1260 — 1320 ల కాలంలో కాకతీయుల రాజ్యంలో ఇప్పటి జగిత్యాల జిల్లా పోలవాస గిరిజన ప్రాంతానికి మేడరాజు సామంత రాజుగా పాలించాడు.ఇతని మేనల్లుడైన పగిడిద్ద రాజు మేడారం గిరిజన ప్రాంతానికి సామంత రాజు. మేడరాజు కూతురు సమ్మక్కను ఇచ్చి వివాహాం చేశాడు.వాళ్లకు జంపన్న ,సారలమ్మ, నాగులమ్మలు జన్మించారు. కాలక్రమంలో మేడారం ప్రాంతం తీవ్ర కరువు కాటకాలకు గురై ప్రజలు బతకడమే కష్టమైంది.

కాకతీయ రాజుకు కట్టవలసిన కప్పం(పన్ను)భారమైంది.తాండవించిన కరువు వలన ప్రజలు పన్నులు చెల్లించడం కష్టమవుతుందని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడిని పగిడిద్దరాజు వేడుకుంటాడు.దానికి రాజధిక్కారంగా భావించి సామంత రాజైన పగిడిద్దరాజు పై యుద్ధానికి ఆదేశిస్తాడు. ఇరువురుల మధ్య జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజు,ఇతని అల్లుడు గోవిందరాజులు చనిపోతారు.కుమారుడు జంపన్నను చంపి సంపెంగ వాగు(నది)లో వేస్తారు.(కాని ప్రాచుర్యంలో మాత్రం నదిలో దుమికి ఆత్మహుతి చేసుకున్నాడని  అంటారు.బహుశా అది వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే గిరిజనులు నిండు నదిలో కూడా ఈదుతూ ప్రాణాలు దక్కించుకుంటారు. అదియుగాక మనిషి చనిపోయేంతగా నీళ్ల ప్రవాహం ఉండి ఉంటే కరువు తాండవించదు.

ఇక మిగిలింది సమ్మక్క, సారక్కలు. తల్లిబిడ్డలు మరియు చనిపోగా మిగిలిన గిరిజన సైన్యం.సమ్మక్క, సారక్కలకు కూడా యుద్ధ నైపుణ్యాలు,ధైర్యం,తెగువ,పోరాటపటిమ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యం రాజైన గణపతిదేవుడికి కుమారులు లేనందున కుమార్తె అయిన రుద్రమదేవిని కాకతీయ సామ్రాజ్య పాలనకు రాజును చేశాడు.రుద్రమదేవి 1262 నుండి 1289 వరకు 27 సంవత్సరాలు పాలన చేసింది.రుద్రమదేవి ప్రభావం,పోరాట స్ఫూర్తి సమ్మక్క, సారక్కలపై కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి సమ్మక్క, సారక్కలు యుద్ధ రంగంలోకి దిగి కాకతీయ సైన్యానికి ఎదురొడ్డి పోరాడారు.అట్టి  పోరాటంలో సారక్క చనిపోయింది. తల్లి సమ్మక్క
తీవ్ర గాయాలతో చిలుకల గుట్టకు పోయి అదృశ్యమైంది.తరువాత చెట్టు కింద పుట్ట దగ్గర “కుంకుమ భరణి”దొరికింది. తరువాత ప్రతాపరుద్రుడు సమ్మక్క సారక్కల ధైర్యసాహసాలకు ముగ్ధుడై పశ్చాతాపంతో కోయరాజులు కట్టవలసిన కప్పాన్ని మాఫీ చేశాడని చెపుతారు.
గిరిజనుల/ఆదివాసీల చారిత్రక   నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే పగిడిద్దరాజు,జంపన్న,గోవిందరాజులు,సమ్మక్క సారక్కలు మరియు గిరిజన వీరుల మరణం నిజమని చెప్పక తప్పదు. పగిడిద్దరాజు, జంపన్న గోవిందరాజులు సమ్మక్క సారక్కల అమరత్వానికి సాక్షిగా శాసనాలు కాని,లిఖిత ఆధారాలు కాని లేకపోవచ్చు.చరిత్రకారులు,స్వామీజీలు పురాణ గాథలుగా,కావ్య సంఘటనలుగా భావించవచ్చు. కాని సమ్మక్క సారక్కలు అడవి సంరక్షణ కొరకు,ఆదివాసీల హక్కుల గురించి జరిగిన పోరాటంలో అమరులైన వాస్తవాలను దాదాపు గత ఏడువందల సంవత్సరాలుగా స్మరించుకుంటూ వస్తున్నారు.. గత వారం రోజులుగా సమ్మక్క, సారక్కలను ఇండ్లల్లో కొలుచుకుంటున్నారు. బెల్లం,కొబ్బరి కుడుక, ఒడి బియ్యం,పసుపు,కుంకుమ పోకలు,ఖర్జూర పండ్లు,జాకెట్ ముక్క,చీరె పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు.ఎత్తు బంగారం(బెల్లం పంచదార) జోకి(వేమెంటు)ఇరుగు,పొరుగు కుటుంబాలకు పంచి పెడుచున్నారు.మేకను,లేదా కోడిని సాకబోసి బంధు మిత్రులతో ఆరగించుచున్నారు.2026 జనవరి 28 నుండి 31వరకు  మేడారంలో మరియు తెలంగాణలోని గ్రామాలలో జరిగే జాతరలలో కూడా మొక్కులు తీర్చుకోవడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
విప్లవ కవి గానం చేసినట్లుగా“ఆదివాసీల గుండెనమ్మా,అడుగుతున్న గొంతుతెరచి,
అంతరించూ అడవినమ్మా,చేతులెత్తి మొక్కుతున్న,
నడకలు నేర్పిన పోరుకు,నెత్తురు తడిచిన త్యాగాలకి,
నేడు తల్లడిల్లుతున్న గాయాలన్నీ,చెల్లిపోతున్న ఈనేలకి,
“అమ్మని అడవమ్మని ఆదివాసుల కన్నతల్లిని”
అంటూ మూలవాసులు కొలుచుకునే సమ్మక్క, సారక్కలను నేడు గ్రామ గ్రామాన ప్రజలు కొలుచుకుంటున్నారు.అంటే ప్రజలందరూ అడవులను,పర్యావరణాన్ని,జీవావరణాన్ని కాంక్షించుచున్నారు.ప్రభుత్వం కూడా సమ్మక్క,సారక్కల త్యాగాలకు,ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడవులను,అడవులలోని ఖనిజాలను కార్పోరేట్,బహుళజాతి సంస్థలకు అమ్మకుండా పర్యావరణ,జీవావరణ పరిరక్షణకు  తోడ్పడాలని కోరుకోవడం అత్యాశ కాదు. సహజ న్యాయం అవుతుంది.అట్టి కార్యాచరణకు పూనుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *