జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాయుధ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర భద్రతా ఆందోళన కలిగించింది. ఈ ఘటనకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రతీకార చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. అయితే ఈ సాహసోపేత చర్యలు ..తరువాత విరమణ వెనుక అసలు కథ ఏమిటో ఇంకా ప్రజలకు తెలియలేదు. పార్లమెంటులో జరిగిన చర్చలోనూ కీలకమైన నాలుగు ప్రశ్నలు మౌనంగా మిగిలిపోయాయి.
పహల్గామ్ ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు – ఇది మిలటరీ దృష్ట్యా భారీ భద్రత ఉండాల్సిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో భారీ స్థాయిలో ఉగ్రదాడి జరిగితే, అది అనుమానాలకు తావిస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాలు, RAW, IB, మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఏం చేశాయి? హై అలర్ట్‌లో ఉండాల్సిన ప్రాంతంలో దాడికి దారితీసిన విఫలతకు బాధ్యత ఎవరిది? ఇలాంటి ఘటనల తర్వాత తరచుగా కొన్ని మాధ్యమాలు “దాడిని ముందే తెలుసుకున్నామని” చెబుతాయి, కానీ చర్యల్లో ఆలస్యం ఎప్పుడూ జరుగుతుంది. ఇది వ్యవస్థలో అసమర్థతను సూచిస్తోంది. ఈ అంశంపై పార్లమెంటులో సభ్యులు ప్రశ్నించినా, హోం మంత్రిత్వ శాఖ నుండి స్పష్టత రాలేదు.
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత వైమానిక దళం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని కొన్ని ఉగ్రశిబిరాలపై దాడులు జరిపినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు దేశభక్తి నినాదాలు వినిపించాయి. కానీ ఈ దాడిలో భారత వైమానిక దళానికి జరిగిన నష్టాల వివరాలు పార్లమెంటులో చెప్పలేదు. మిలిటరీ విశ్లేషకులు సూచించిన విషయం ఏమిటంటే – ఈ ఆపరేషన్‌లో కొన్ని లక్ష్యాలను వదిలేసి వెనక్కి వచ్చారని, అది ప్రభుత్వం విధించిన ‘రాజకీయ పరిమితుల’ కారణంగా జరిగినదని. అంటే, పూర్తి స్థాయిలో ప్రతీకారం తీసుకోకుండా, ఓ బల ప్రదర్శన మాత్రమే చేసి తిరిగి వచ్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక్కడ ప్రధానంగా దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన అంశం – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘విరమణ’ (Ceasefire) ప్రకటనను భారత్, పాకిస్థాన్ ప్రకటించే కంటే గంట ముందే చేయడం. ప్రధాని మోదీ స్పష్టంగా “ప్రపంచంలో ఎవ్వరూ మమ్మల్ని ఆపలేదు” అని చెప్పారు. అప్పుడు ట్రంప్ ఎందుకు ముందుగా ప్రకటించారు? భారత విదేశాంగ శాఖ లేదా ప్రధాని కార్యాలయం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇది ఒక తీవ్రమైన అంతర్జాతీయ వ్యవహార పరిణామం. ఒక సంక్షిప్త యుద్ధాన్ని ప్రారంభించి, అమెరికా అధ్యక్షుడు మూడో పార్టీగా మద్యవర్తిత్వం చేయడం భారత సార్వభౌమత్వంపై ప్రభావం చూపే అంశం. భారతదేశం ఒక గ్లోబల్ ప్లేయర్‌గా ఉండాలంటే, ఇలాంటి అంశాలపై పారదర్శకత అవసరం ఈ అంశంపై తన దైన సహజ శైలి లో ప్రధాని మోదీ రెండు గంటలపాటు ప్రసంగించినా, అసలు ప్రశ్నలపై ఒక్క మాట పలకలేదు.
పైగా, చర్చ ప్రారంభమయ్యే ముందు సభకు రాలేకపోయారు. చర్చ ముగిసే వేళ సభలో ప్రవేశించడం స్పష్టంగా “పరిస్థితి నియంత్రణలో ఉంది” అనే రాజకీయం మాత్రమే. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతినిధిగా ఉన్న నేతల నుండి ఆశించేది కాదు. ఒక ప్రధాని, ప్రత్యేకించి జాతీయ భద్రత సంబంధిత అంశంలో పూర్తి స్పష్టత ఇవ్వాలి. ప్రజలు తెలుసుకోవాలనుకునే ప్రశ్నలకు బదులు ఇవ్వాలి. కానీ, మోదీ మాటల్లో ‘దేశభక్తి’, ‘శత్రువులపై గర్జన’ , మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ పై ఆరోపణలు వంటివే వినిపించాయి . ప్రతిపక్షాలు కొన్ని విషయాల్లో తప్పు చేస్తే తప్పును ఎత్తి చూపించాలి. కానీ అదే సమయంలో, అధికార పార్టీ స్పష్టత ఇవ్వకపోతే, ప్రజల నమ్మకాన్ని కోల్పోతుంది.
పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్, ట్రంప్ పాత్ర – ఇవన్నీ కలిపి 21వ శతాబ్దంలోని కీలకమైన భద్రతా సంఘటనలుగా గుర్తింపు పొందుతాయి. కానీ అవి చరిత్రలో నిలిచేందుకు, అవి ప్రజలకు ఎలా వివరించబడ్డాయి, అవి ఎలా పరిష్కరించబడ్డాయన్నది కీలకం. ప్రధాని మోదీకి గర్జించగల శక్తి ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ‘స్పష్టత’ అనే గర్జన కావాలి. ప్రతి దాడికి ప్రతీకారం కన్నా, ప్రతి తప్పిదానికి నివారణ ముఖ్యమవుతుంది.





