“ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబుల్ కేవలం సైన్స్ లో మాత్రమే కాదు విభిన్న మైన రంగాల్లో తన విలక్షణశైలితో అత్యంత ప్రతిభగల వ్యక్తిగా రాణించాడు. ఈ కారణం వలనే నోబెల్ బహుమతిని వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రతీ ఏటా బహూకరిస్తారు.అయితే డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రాకులాడడం విచిత్రంగా ఉంది. ప్రపంచ శాంతి సాధన కోసం పాటు పడుతున్నానని ప్రగల్భాలు పలికే డోనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి శాంతి లేకుండా చేస్తూ,నోబెల్ శాంతి బహుమతి కోసం వెంపర్లాడడం హాస్యాస్పదం. ఒకవైపు తన అహంకారంతో యుద్ధాలకు ఉసిగొల్పుతూ మరో వైపు శాంతి ప్రవచనాలు పలుకుతూ,నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించడంలో ఎలాంటి ఔచిత్యం కానరాదు. నోబెల్ పురస్కారం కోసం ట్రంప్ పైరవీలు చేస్తున్నారనే వార్తలు విభ్రాంతి కలిగిస్తున్నాయి.”
ఇటీవలి కాలంలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డుల గురించి తరచూ వార్తలో ఎక్కువగా చదువుతున్నాం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపించడమే ఇందుకు కారణం. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి కోసం 338 మంది నామినేట్ చేయబడ్డారు. 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల విలువ గల నోబెల్ బహుమతి ప్రస్తుత విలువ భారతీయ కరెన్సీ లో 8.9 కోట్ల రూపాయలకు సమానం. నోబెల్ బహుమతులను ఆశించే వారంతా భారీ మొత్తంలో లభించే నజరానా కోసం తపించడం లేదు. తమ ప్రతిభకు, వివిధ రంగాల్లో తాము చేసిన సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు,గౌరవం దక్కాలనే లక్ష్యంతోనే నోబెల్ పురస్కారాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు.భౌతిక,రసాయన,వైద్య,ఆర్ధిక శాస్త్ర రంగాలతో పాటు సాహిత్య విభాగంలోను ఏటా బహూకరించబడుతున్న నోబెల్ పురస్కారాల పరంపరలో ప్రపంచ శాంతి కోసం పాటు పడ్డ వ్యక్తులకు కూడా నోబెల్ బహుమతిని ప్రధానం చేయడం ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశం.
స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త, డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ప్రతీ ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా నోబెల్ అవార్డులను వివిధ రంగాలకు చెందిన ప్రజ్ఞావంతులైన ప్రముఖులకు నోబెల్ ఫౌండేషన్ ద్వారా ప్రధానం చేయడం జరుగుతున్నది.స్వీడన్ కు చెందిన ఆల్ఫెడ్ నోబెల్ తన జీవిత కాలంలో ఎన్నో ఆవిష్కరణకు ఆద్యుడయ్యాడు. “డైనమైట్” నోబుల్ అనన్య సామాన్యమైన ప్రతిభకు నిదర్శనం. డైన్ మైట్ తో పాటు అనేక ఆవిష్కరణలను చేపట్టి, 355 పేటెంట్ హక్కులు కలిగిన నోబెల్ తన మేధస్సును వినియోగించి కనిపెట్టిన డైనమైట్ వలన పలు దేశాలు పేలుడు పదార్థాల కర్మాగారాలను ఏర్పాటు చేసాయి.శాంతియుత ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించవలసిన డైనమైట్ ను యుద్ధాలలోను,విధ్వంస కార్యక్రమాల కోసం వినియోగించడాన్ని ఆల్ఫ్రెడ్ నోబెల్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తన ఆవిష్కరణ దుష్ఫలితాలకు దారితీయడం పట్ల ఎంతో మధనపడ్డాడు. ఆ పశ్చాత్తాపమే తన సంపదను వివిధ రంగాల్లోని ప్రముఖుల ప్రతిభకు ప్రోత్సాహంగా వినియోగించడానికి ఉపకరించే వీలునామా కు దారితీసింది.నోబెల్ తన మరణానంతరం నోబెల్ బహుమతుల కోసం తన ఆస్తిపాస్తులను వినియోగించాలని సూచించిన మేరకు నోబెల్ ఫౌండేషన్ ఏర్పడింది.
ఎంత శాస్త్రవేత్త అయినా ఎన్ని పరిశోధనలు చేసినా,ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించినా రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో అణు బాంబుల తయారీకి,వాటిని ఇతర దేశాలపై వినియోగించడానికి వ్యతిరేకంగా గళం విప్పిన సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. ఆల్ ఫ్రెడ్ నోబెల్ కూడా తన ఆవిష్కరణల వలన ప్రపంచానికి నష్టం చేకూరడం పట్ల తీవ్రంగా మనోవ్యాకులతకు గురైనాడు. నోబెల్ లోని మానవాతావాది మేల్కొన్నాడు. విధ్వంసకరమైన పేలుడు పదార్థాల వినియోగం పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేసాడు. ఈ పరిణామ ఫలితమే నోబుల్ ట్రస్ట్ ఏర్పాటుకు నాంది పలికింది. నోబెల్ మరణానంతరం ప్రధానం చేయబడుతున్న నోబెల్ బహుమతుల ఎంపిక కోసం ఎంతో విస్తృతమైన మేధోమధనం జరుగుతుంది. నోబెల్ అవార్డుల బహూకరణ ఒక సుదీర్ఘ ప్రక్రియ.రాయల్ స్వీడిష్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ భౌతిక,రసాయన శాస్త్రాల్లోను, స్టాక్ హోం కు చెందిన కరోలిన్స్కా సంస్థ వైద్య విభాగంలోను, స్వీడిష్ అకాడమీ సాహిత్య విభాగం లోను, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నియమించిన ఎకానమిక్ కమిటీ ఆర్ధిక శాస్త్రంలోను నోబెబ్ బహుమతులకు ఎంపిక కార్యక్రమం చేపడుతుంది.
వ్యక్తుల గుణగుణాలు, శాంతి స్థాపన కోసం చేసిన ప్రయత్నాలను వాస్తవిక దృక్పథంతో పరిశీలన జరిపిన తర్వాత నార్వేజియన్ నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలను ఎంపిక చేస్తుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా బహూకరించే నోబెల్ పురస్కారాలు ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాలుగా పరిగణిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబుల్ కేవలం సైన్స్ లో మాత్రమే కాదు విభిన్న మైన రంగాల్లో తన విలక్షణశైలితో అత్యంత ప్రతిభగల వ్యక్తిగా రాణించాడు. ఈ కారణం వలనే నోబెల్ బహుమతిని వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రతీ ఏటా బహూకరిస్తారు.అయితే డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రాకులాడడం విచిత్రంగా ఉంది. ప్రపంచ శాంతి సాధన కోసం పాటు పడుతున్నానని ప్రగల్భాలు పలికే డోనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి శాంతి లేకుండా చేస్తూ,నోబెల్ శాంతి బహుమతి కోసం వెంపర్లాడడం హాస్యాస్పదం. ఒకవైపు తన అహంకారంతో యుద్ధాలకు ఉసిగొల్పుతూ మరో వైపు శాంతి ప్రవచనాలు పలుకుతూ,నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించడంలో ఎలాంటి ఔచిత్యం కానరాదు. నోబెల్ పురస్కారం కోసం ట్రంప్ పైరవీలు చేస్తున్నారనే వార్తలు విభ్రాంతి కలిగిస్తున్నాయి.
వ్యక్తుల గుణగుణాలు, శాంతి స్థాపన కోసం చేసిన ప్రయత్నాలను వాస్తవిక దృక్పథంతో పరిశీలన చేసి, విస్తృత మేధోమధనం జరిపిన తర్వాత నార్వేజియన్ నోబెల్ కమిటీ శాంతి బహుమతి గ్రహీతలను ఎంపిక చేస్తుంది. డిసెంబర్ లో ప్రధానం చేయబడే నోబెల్ శాంతి బహుమతి కి ఎంపికయ్యేదెవరో? నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ కు దక్కితే, ఈ అవార్డుకున్న ప్రాధాన్యత కోల్పోవడం ఖాయం. శాంతి బహుమతికి ట్రంప్ కున్న అర్హత లేమిటి?గాజాలో హమాస్ ఇజ్రాయిల్ మధ్య సంధి కుదిర్చానని, ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చానని,భారత్ పాక్ లను బెదిరించి సీజ్ ఫైర్ కు ఒప్పించానని చెప్పుకుంటున్న ట్రంప్ రష్యా- ఉక్రెయిన్ల మధ్య సయోధ్య ఎందుకు కుదర్చలేదు? పైగా బెదిరింపులేమిటి? రష్యా ఆయుధాలు కొనవద్దని,రష్యా చమురు దిగుమతి చేసుకోవద్దని భారత్ ను బెదిరించడమేమిటి? రష్యా కు భాగస్వామ్యమున్న గుజరాత్ రిఫైనరీ పై ఆంక్షలు విధించడమేమిటి? రష్యా- ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి అంగీకరించాలని పుతిన్ ను ట్రంప్ హెచ్చరించడం ప్రపంచాన్ని తన నియంతృత్వం క్రిందకు తీసుకు రావాలని అమెరికా చేసే దుష్ట ప్రయత్నాలకు పరాకాష్ట.
అమెరికా ఇతర దేశాలపై బలవంతంగా తన నిర్ణయాలను రుద్దడం శాంతికి సంకేతమా? డోనాల్డ్ ట్రంప్ కేవలం అమెరికా కు మాత్రమే అధ్యక్షుడు,ప్రపంచానికి కాదు. భారత్ పై ఏ అధికారంతో ట్రంప్ రెచ్చిపోతున్నాడు.. ఇరాన్ పై ప్రత్యక్ష దాడికి దిగిన అమెరికా అధ్యక్షుడు శాంతి బహుమతికి అర్హుడా? గాజాను స్వంతం చేసుకుంటానని, కెనడా అమెరికా లో విలీనం కావాలని, పనామా కాలువ తనదేనని, గ్రీన్ లాండ్ తనదేనని,మెక్సికోను శాసించాలని కోరుకునే ట్రంప్ శాంతి కాముకుడా? శాంతి భక్షకుడా? గాజా లోని లక్షలాది మంది పాలస్తీనీయులను ఖాలీ చేయించి, గాజాను ఒక పర్యాటక ప్రాంతంగా మార్చాలని వాంఛించడం దేనికి నిదర్శనం? ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కొద్ది రోజుల వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పై విరుచుకు పడ్డ ట్రంప్ ఇప్పుడు రష్యా పై దాడులను పెంచాలని, అందుకు తాను ఆయుధాలు సమకూర్చుతానని చెప్పడం శాంతి కాముకుడి లక్షణమా? రష్యాకు మిత్రదేశమైన భారత్ పై నూరు శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పడం,నాటో దేశాలు కూడా భారత్ పై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడం దేనికి సంకేతం? ఈ ఆధునిక ప్రపంచంలో ఈ అరాచకం ఏమిటి? ఈ నియంతృత్వం ఎందుకు? ఒకవైపు జెలెన్ స్కీ కి మద్దతునిస్తూ,మరొక వైపు రష్యా 50 రోజుల్లో యుద్ధాన్ని ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తానని చెప్పడం సంధి ప్రయత్నమా? శాంతి ప్రతిపాదనా?