పులుల ఆవాసం కోసం ఆదివాసుల నిర్వాసం!

“ప్రభుత్వ గణాంకాల ప్రకారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 434 గ్రామాలుండగా అందులో 339 గ్రామాలు, అంటే 80 శాతం పులుల రిజర్వ్ లోకి వస్తాయంటే ఆ ఆదివాసీ జిల్లా స్వభావమే మారిపోతుందన్నమాట. అది ఆదివాసుల జిల్లా స్థానం నుంచి పులుల జిల్లా స్థానానికి మారుతుందన్నమాట. అలా జిల్లాను పులులకు వదిలేసినతర్వాత ఆదివాసులకు ఏమవుతుంది అనే ప్రశ్నకు 24 పేజీల జి.ఓ.లో ఒక్కటంటే ఒక్క వాక్యమైనా జవాబు లేదు. అది ఎంత భారీ మానవ విషాదమంటే జిల్లా మొత్తం జనాభా 5,15,812లో కనీసం నాలుగు లక్షల మంది నిర్వాసితులైనా కావలసి వస్తుంది. లేదా వారి జీవితాలు, ఉపాధి, ఆవాసం, భవిష్యత్తు పులి పంజా నీడన ఉండవలసి వస్తుంది. ఈ జి.ఓ. వెలువడిన నాటి నుంచీ జిల్లాలోను, పొరుగు జిల్లాల అటవీ ప్రాంతాలలోను ఆందోళన ప్రారంభమయింది. సరైన వివరాలు బైటపడని స్థితిలో ఆ ఆందోళన మరింత పెరిగింది. స్థానికంగా సభలు, సమావేశాలు, ధర్నాలు, అధికారులకు విజ్ఞప్తులు, నిరసన ప్రదర్శనలు వంటి అన్ని రూపాలకు ఆందోళన విస్తరించింది.”

తెలంగాణ ప్రభుత్వం మే 30న జి. ఓ. నం. 49 అనే ఆదేశం ద్వారా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని (టైగర్ రిజర్వ్) విస్తరించి కుమురం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించింది. ఆదివాసుల నుంచీ, పౌరసమాజం నుంచీ వచ్చిన వ్యతిరేకత వల్ల, చివరికి పాలకపక్షంలోని ఆదివాసి నాయకులు కూడా ఆ వ్యతిరేకతను అంగీకరించక తప్పకపోవడం వల్ల, జూలై 21న ప్రభుత్వ ఈ జి.ఓ.ను తాత్కాలికంగా పక్కనపెడుతూ (అబెయన్స్) మరొక మెమో విడుదల చేసింది. మొదటి ఆదేశం ఎక్కువ అధికారికమైన తెలంగాణ ప్రభుత్వ జి.ఓ. కాగా, రెండో ఆదేశం కేవలం అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మెమో. రెండో ఆదేశంలో తమ ఆలోచనను విరమించు కుంటున్నామనో, ఉపసంహరించుకుంటున్నామనో కాక, “తదుపరి ఆదేశాల వరకూ తాత్కాలికంగా పక్కన పెడుతున్నామ”ని మాత్రమే ఉన్నది. అంటే ప్రమాదం పూర్తిగా తప్పిపోయినట్టు కాదు. కాటేయబోయిన పామును బుట్టలో పెట్టినట్టు మాత్రమే. “తదుపరి ఆదేశాలలో” ఆ పామును మళ్లీ బైటికి తీయవచ్చు. అందువల్ల ఈ ప్రమాదం గురించి ప్రభావిత ఆదివాసులు మాత్రమే కాక, మొత్తం తెలంగాణ సమాజం తీవ్రంగా ఆలోచించవలసి ఉంది.

ఇంతకూ ఈ ప్రమాదం ఏమిటి? మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్, కన్హర్ గాం వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, టిపేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, చపరాలా వైల్డ్ లైఫ్ శాంక్చువరీలతో, ఛత్తీస్ గడ్ లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ తో  అనుసంధానం చేసి, ఒక సువిశాల పులుల కారిడార్ తయారు చేయడానికి వన్యప్రాణుల పరిరక్షణ చట్టం 1972 కింద ఈ ఆదేశం ఇచ్చామని ప్రభుత్వం చెపుతున్నది. ఈ ఆదేశం అమలులోకి వస్తే 1.49 లక్షల హెక్టార్ల (మూడు లక్షల డెబ్బై వేల ఎకరాల) అడవి ఈ పులుల కారిడార్ గా మారిపోతుంది. ఆసిఫాబాద్,  కెరమెరి, రెబ్బెన, తిర్యాని, కాగజ్ నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూరు, పెంచికలపేట రేంజిల అడవిలోని 339 గ్రామాలు, జనావాసాలు ఈ కారిడార్ లోకి వస్తాయి. జిల్లాలోని 339 గ్రామాలు, నివాస ప్రాంతాలు అని జి.ఓ. లోని పేరా 9 చెపుతుంది. కాని ఆ జి.ఓ. అనుబంధంలో ఇచ్చిన అటవీ శాఖ బీట్ లు, కంపార్ట్ మెంట్ల ప్రకారం చూసినప్పుడు ఆసిఫాబాద్ డివిజన్ లో 214, కాగజ్ నగర్ డివిజన్ లో 269, మొత్తం 483 ఉన్నాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 434 గ్రామాలుండగా అందులో 339 గ్రామాలు, అంటే 80 శాతం పులుల రిజర్వ్ లోకి వస్తాయంటే ఆ ఆదివాసీ జిల్లా స్వభావమే మారిపోతుందన్నమాట. అది ఆదివాసుల జిల్లా స్థానం నుంచి పులుల జిల్లా స్థానానికి మారుతుందన్నమాట. అలా జిల్లాను పులులకు వదిలేసినతర్వాత ఆదివాసులకు ఏమవుతుంది అనే ప్రశ్నకు 24 పేజీల జి.ఓ.లో ఒక్కటంటే ఒక్క వాక్యమైనా జవాబు లేదు. అది ఎంత భారీ మానవ విషాదమంటే జిల్లా మొత్తం జనాభా 5,15,812లో కనీసం నాలుగు లక్షల మంది నిర్వాసితులైనా కావలసి వస్తుంది. లేదా వారి జీవితాలు, ఉపాధి, ఆవాసం, భవిష్యత్తు పులి పంజా నీడన ఉండవలసి వస్తుంది.

ఈ జి.ఓ. వెలువడిన నాటి నుంచీ జిల్లాలోను, పొరుగు జిల్లాల అటవీ ప్రాంతాలలోను ఆందోళన ప్రారంభమయింది. సరైన వివరాలు బైటపడని స్థితిలో ఆ ఆందోళన మరింత పెరిగింది. స్థానికంగా సభలు, సమావేశాలు, ధర్నాలు, అధికారులకు విజ్ఞప్తులు, నిరసన ప్రదర్శనలు వంటి అన్ని రూపాలకు ఆందోళన విస్తరించింది. జిల్లాలో విస్తరిస్తున్న అసంతృప్తి, ఆందోళనల గురించి జూలై 11న జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు. ప్రభుత్వం కూడా అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయత్ రాజ్ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) లతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఈ సమస్య పరిశీలించి నివేదిక సమర్పించమని ఆదేశించింది. చివరికి జూలై 21న కుమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల నాలుగు జిల్లాల ఆదివాసులు ఈ ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఒక రోజు బంద్ సంపూర్ణంగా జయప్రదంగా జరిగింది. ఆరోజే మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు ప్రభుత్వం మెమో నం. 3602/ఫర్ I(1)/2025 అనే తాత్కాలిక ఉపశమనం ప్రకటించింది.

“వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలలో పర్యాటక సందర్శనల మీద 1972 చట్టం విధించిన నిషేధాన్ని ఈ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వమే ఉల్లంఘిస్తున్నది. ఈ సవరణ తర్వాత టైగర్ రిజర్వ్ అని ప్రకటించిన స్థలాలలో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ప్రవేశం ఉంటుంది, తరతరాలుగా అక్కడ జీవిస్తున్న ఆదివాసులకు మాత్రం ప్రవేశం ఉండదు. అట్లాగే ఆ అడవి ప్రభుత్వం చేతిలోకి వస్తుంది గనుక ఖనిజ వనరుల తవ్వకానికి కార్పొరేట్లకు అప్పగించడానికి కూడా అవకాశం వస్తుంది. పులుల సంరక్షణ పేరిట అడవిలోకి ప్రవేశించినా ప్రభుత్వ బలగాలు అక్కడి ఆదివాసీ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ ఉద్యమాన్ని, ఆ ఉద్యమానికి మద్దతుగా ఉన్న విప్లవోద్యమాన్ని అణచివేయడానికి కూడా ఈ విధానం ఉపయోగపడవచ్చు.”

మరి పులులు బతకొద్దా, పులుల జాతి అంతరించకుండా రక్షించొద్దా, నోరులేని మూగప్రాణులపట్ల మనుషులు జాలీ సానుభూతీ చూపించొద్దా లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. తప్పకుండా పులులను రక్షించాలి. పులి జాతి అంతరించిపోకుండా కాపాడాలి. పులికి క్రూరమృగం అని పేరు పెట్టింది మనిషే గాని అది క్రూరమృగమేమీ కాదు, నిజానికి మనిషిని మించిన క్రూరమృగమేదీ లేదు. ఇతర జీవజాతులు హింస చేసినా అవసరం కోసమే చేస్తాయి. మనిషి మాత్రమే అవసరం లేకపోయినా హింస చేసే జాతి. అంతే కాదు, ప్రకృతిలో అత్యవసరమైన జీవ వైవిధ్యం తప్పనిసరిగా కొనసాగాలి. ఏ ఒక్క జీవజాతీ అంతరించిపోగూడదు. ఆ వైవిధ్యాన్ని రక్షించడానికి మనుషులు తప్పకుండా చేయవలసిన పనులన్నీ చేయాలి. కాని ఆ పనులేవైనా మనుషులనే నిర్వాసితులను చేసేవిగా, బతుకు పోగొట్టేవిగా, భద్రత పోగొట్టేవిగా, భవిష్యత్తు ధ్వంసం చేసేవిగా ఉండగూడదు.

దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతున్నదనీ, క్రమంగా అది అంతరించిపోయే జాతుల్లో చేరుతున్నదనీ గుర్తించిన భారత ప్రభుత్వం 1973లోనే ప్రాజెక్ట్ టైగర్ అనే పులుల సంరక్షణ పథకంతో పులుల సహజ ఆవాసాలను పరిరక్షించడం, విస్తరించడం ప్రారంభించింది. దానితో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెపుతున్నాయి. పులుల సంఖ్యను గుర్తించే పద్ధతులను మార్చి, మరింత శాస్త్రీయ పద్ధతులు ప్రవేశపెట్టి 2006లో 1411 పులులున్నాయని తేల్చారు, ఆ సంఖ్య 2010 నాటికి 1706కూ, 2018 నాటికి 2967కూ, 2022 నాటికి 3682కూ పెరిగింది. ఇలా పెరుగుతున్న పులుల సంఖ్యకు తగినంత అడవి, ఆ అడవిలో వాటికి ఆహారంగా ఉపయోగపడే ఇతర జంతుజాలం కూడా పెరగవలసి ఉంటుంది.

అయితే పులుల సంఖ్య పెరుగుదల ఆశాజనకంగా ఉన్నది గాని దానికి చెల్లించిన మానవ మూల్యం చాలా ఎక్కువ. ఇలా పులులు పెరుగుతున్న సమయంలో ఆ అడవుల నుంచి 5,50,000 మంది ఆదివాసులను నిర్వాసితులను చేశారు. వీరిలో 2021 నాటికి ఉన్న 50 పులుల అభయారణ్యాలలో 2,54,794 మంది నిర్వాసితులు కాగా, 2021-24 మధ్య ప్రకటించిన ఆరు అభయారణ్యాలలో 2,90,000 మంది నిర్వాసితులయ్యారు. ఇప్పుడు ప్రకటిస్తున్న కుమురం భీమ్ పులుల కారిడార్ ప్రభావం నాలుగు లక్షల మంది మీద ఉంటుంది. వారిలో ఎందరిని తమ గూడాల నుంచి ఖాళీ   చేయిస్తారో, వారికి పునరావాసం కల్పిస్తారో లేదో, వారి వ్యవసాయ భూములకు, ఇళ్లకు, కోల్పోయిన జీవనోపాధికీ నష్టపరిహారం కట్టి ఇస్తారో లేదో ఏమీ తెలియదు. పైగా జి. ఓ 49లో ప్రభావిత 339 గ్రామాల ప్రజా సమూహాలకు ఈ పథకం గురించి చెప్పామనీ, వారందరూ తమ “మద్దతు తెలిపార”నీ రాశారు. ప్రభుత్వం “అతి జాగ్రత్తగా ఈ ప్రతిపాదనను పరీక్షించి, ఆమోదించింద”ని రాశారు. ఈ రెండూ పచ్చి అబద్ధాలని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మద్దతు తెలిపితే ఆందోళన ఎందుకు చేస్తారు? అంత జాగ్రత్తగా పరీక్షించిన ప్రతిపాదనను తాత్కాలికంగా ఎందుకు పక్కన పెడుతున్నారు?

అసలు ఆదివాసుల సహజ ఆవాసాలలో ప్రభుత్వం గాని, ఎవరైనా గాని ప్రవేశించి, వారిని అక్కడి నుంచి నిర్వాసితులను చేసి, నిర్మాణాలు చేపట్టేటప్పుడు, అది పూర్తిగా “స్వేచ్ఛాయుత, ముందస్తు, సమాచార సహిత ఆమోదం” (ఫ్రీ, ప్రయర్, ఇంఫార్మ్డ్ కాన్సెంట్ – ఎఫ్ పి ఐ సి) తో మాత్రమే జరగాలని అటవీ హక్కుల చట్టం 2006 సెక్షన్ 4 (2), వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1972 సెక్షన్ 38 వి (5), పంచాయత్ ఎక్స్ టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం 1996 (పీసా చట్టం) సెక్షన్ 4(i) నిర్దేశిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం అటవీ ప్రాంతాలలో చేపడుతున్న కార్యక్రమాలలో ఏ ఒక్కదానిలోనూ ఈ చట్టాలను గౌరవించలేదు. భయంకరంగా ఉల్లంఘిస్తున్నది. తన చట్టాలనే తాను పాటించబోనని చాటుకుంటున్నది. ఇప్పుడు జి.ఓ. 49 ద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ఉల్లంఘన ఘనకీర్తి సంపాదించాలనుకుంటున్నది.

ఇప్పటివరకూ ప్రకటించిన టైగర్ రిజర్వుల చరిత్ర చూస్తే, తరతరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసులను, ఇతర ప్రజలను బలవంతంగా వెళ్లగొట్టడం, వెళ్లిపోక తప్పనిస్థితి కల్పించడం, పులులు లేని చోట్ల కూడా మనుషులను ఖాళీ చేయించడం, సహాయం, నష్టపరిహారం, పునరావాసం, పునఃస్థిరీకరణ, కొత్త ప్రాంతాలలో ఉపాధి సౌకర్యాల కల్పన వంటివేమీ లేకుండానే ఆదివాసులను వెళ్లగొట్టి, బిచ్చగాళ్లుగా మార్చడం, వెళ్లిపోకుండా ఉన్నవారి మీద, ప్రతిఘటించినవారి మీద పెద్ద ఎత్తున బెదిరింపు, అణచివేత చర్యలు చేపట్టడం, ఉండిపోయిన ఆదివాసులను అరెస్టు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, చిత్రహింసలు పెట్టడం, ఆదివాసి స్త్రీలపై అత్యాచారాలు చేయడం వంటి ఎన్నో అక్రమాలు జరిగాయి.

పులుల రక్షిత స్థలాలుగా ప్రకటిస్తున్నవి వాస్తవంగా ఆదివాసులకు బహిరంగ జైళ్లుగా మారాయని 2024 జూలైలో యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా ఇండిజెనస్ రైట్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇనిషియేటివ్ తయారుచేసిన ‘ఇండియాస్ టైగర్ రిజర్వ్స్ : ట్రైబల్స్ గెట్ ఔట్, టూరిస్ట్స్ వెల్కమ్’ అనే సమగ్రమైన నివేదిక వ్యాఖ్యానించింది.

ఇది వాస్తవంగా ఆదివాసులను వెళ్లగొట్టి, పులులనూ, వాటిని సఫారీలలో చూసే సందర్శకులనూ ఆహ్వానించే ఎకోటూరిజం విధానం. నరేంద్ర మోదీ  ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టిన ‘అడవులలో, వన్యప్రాణి ప్రాంతాలలో పర్యావరణ పర్యాటక విధానం’ (పాలసీ ఫర్ ఎకోటూరిజం ఇన్ ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ ఏరియాస్) నిజానికి అడవుల నుంచి ఆదివాసులను వెళ్లగొట్టి వాటిని పర్యాటక కార్పొరేట్లకు అప్పగించే విధానం. దాన్నే ఇంకా విస్తరించి 2023లో అటవీ సంరక్షణ సవరణ చట్టం అని మోదీ  ప్రభుత్వం తెచ్చిన మరొక విధానంలో అడవులలో ప్రభుత్వం గాని, ప్రైవేటు సంస్థలు గాని జంతు ప్రదర్శనశాలలు, సఫారీలు ఏర్పాటు చేయవచ్చునని, ఎకోటూరిజం వసతులు (అంటే రిసార్టులు, హోటళ్లు, గెస్ట్ హౌజులు వంటివి) కల్పించవచ్చునని చేర్చారు. వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలలో పర్యాటక సందర్శనల మీద 1972 చట్టం విధించిన నిషేధాన్ని ఈ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వమే ఉల్లంఘిస్తున్నది. ఈ సవరణ తర్వాత టైగర్ రిజర్వ్ అని ప్రకటించిన స్థలాలలో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ప్రవేశం ఉంటుంది, తరతరాలుగా అక్కడ జీవిస్తున్న ఆదివాసులకు మాత్రం ప్రవేశం ఉండదు. అట్లాగే ఆ అడవి ప్రభుత్వం చేతిలోకి వస్తుంది గనుక ఖనిజ వనరుల తవ్వకానికి కార్పొరేట్లకు అప్పగించడానికి కూడా అవకాశం వస్తుంది. పులుల సంరక్షణ పేరిట అడవిలోకి ప్రవేశించినా ప్రభుత్వ బలగాలు అక్కడి ఆదివాసీ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ ఉద్యమాన్ని, ఆ ఉద్యమానికి మద్దతుగా ఉన్న విప్లవోద్యమాన్ని అణచివేయడానికి కూడా ఈ విధానం ఉపయోగపడవచ్చు.

వన్యప్రాణి రక్షణ పేరుతో ఖనిజ వనరుల, పర్యాటక కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ఆదివాసుల మీద సాగిస్తున్న ఈ దాడిలో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగం పంచుకోనుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *