‘ఏటమ్మా యిది! బంగారంలాంటి వయిసిన గుంటకి గుండు సేస్సినారు? లచ్చిందేవిలాగ వుండీది పిల్ల…’ ముసల్ది ముక్కున వేలేసుకుంది. ‘ఏం లేదు, సిమ్మాచలం మొక్కువున్ను గదా?!’ అని ఆ పిల్ల అమ్మమ్మ గబుక్కున ఆ పిల్లని యింట్లోకి తీసుకువెళ్ళిపోయింది. నూతి దగ్గర నీళ్ళబిందె యెత్తుకుంటుంటే, ‘అవునే కోడలా పిర్రలు దాటి కొండసలవలాగ వుండీది జుట్టు, గుండేమే?’ నల్లగ ముఖం పెట్టుకుంది అత్తకాని అత్త.
‘పేలూ యీలూ పుట్టలు పెట్టిస్తే యేటి సెయ్యడం మరి?’ ఆ పిల్ల తల్లి కూతురువెంట తనూ వో బిందె పట్టుకొని ఆగకుండా అడుగులు వేసింది.
‘నువ్వా, యెవులో అనుకున్నాను, గుండేమి? రేపో మాపో పెళ్ళికావలిసిన పిల్లకి?’ కిరాణా దుకాణం షావుకారి షాకయి చూసినాడు. ‘ఏమిలేదు, తల్లో పుల్లయిపోయినాయి, యెన్ని మందులు వాడినా తగ్గకపోతే యేటి సెయ్యడం?’ అనేసి సరుకులు అందుకొని పిల్లని తీసుకొని వురుకూ పరుగులతో అక్కడినుండి నడిచాడు పిల్ల తండ్రి.
‘ఏంట్రా మీ అక్కకి గుండేట్రా? మగోలు చేసుకుంటే పర్లేదు, ఆడోళ్ళకి బాగో…’ నేస్తగాడి నోట్లో మాట నోట్లోనే వుంది. ‘మా అక్కకి జుట్టు విపరీతంగా రాలిపోతంది, మాడుకి మందు రాయమని డాక్టరు చెప్పినాడు.’ అనేసి ఆ పిల్ల చెయ్యి పట్టుకొని పరుగులాంటి నడకతీశాడు తమ్ముడు.
రాత్రిపూట ఆ పిల్ల అద్దంలో తనని తాను చూసుకుంది. వత్తైన జుట్టు. దువ్వుకుంది. విరబూసుకుంది. జడల్లుకుంది. విప్పింది. సిగేసుకుంది. జారిన సిగ నల్లని మేఘమయ్యింది. ‘నీ ముందు నేనెంత?’ అన్నట్టు చందమామ సిగ్గుపడి దాక్కుంది. ‘ఇవాళ రేపు అందం కూడా ప్రమాదమే, వెళ్తుంటే కుర్రాళ్ళు రోడ్లమీదా యెక్కడపడితే అక్కడ కాపుకాసి వెంటపడుతున్నారు. ఈ నాల్రోజులూ పరీక్షల వరకైనా కాలేజీకి వెళ్ళాలి కదా?’
ఆ పిల్ల కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అద్దంలోని తనని గుర్తుపట్టడానికి కళ్ళు తుడుచుకుంది!
-బమ్మిడి జగదీశ్వరరావు





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల