డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గాంధీ భవన్ లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతోనే భారత ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో చాచా నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రూ గురించి తెలియని కుహనా మేధావులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. భారతదేశ చరిత్ర, స్వాతంత్ర సంగ్రామం గురించి తెలుసుకుంటే నెహ్రూ పాత్ర ఏంటో అర్థం అవుతుందన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టిన నెహ్రూ దశాబ్ద కాలం పైబడి ఈ దేశం కోసం జైలులో మగ్గిన మహానుభావుడని కీర్తించారు.
నెహ్రూ ఈ దేశపు తొలి ప్రధాని కావడం మన అందరి అదృష్టమని అన్నారు. ఈ దేశంలో అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లు పెద్ద ఎత్తున నెలకొల్పుడంతోనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందన తెలిపారు. చంద్రమండలం, మార్స్ పైకి రకరకాల శాటిలైట్స్ పంపి సమాచార వ్యవస్థలో పోటీకి కారణం నాటి నెహ్రూ నిర్ణయాలేనని చెప్పారు. విద్యా విధానం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్న ఆయన నిర్ణయం, ఆలోచనల ఫలితంగానే మన దేశం నేడు బతుకుతుందన్నారు. శాస్త్రీయ అవగాహన లేని మూఢవిశ్వాసాలతో బతికే మోదీ వంటి వారు మొదట ప్రధానిగా ఉంటే ఈ దేశం మూఢవిశ్వాసాలతో ఎక్కడో వెనుకబడి ఉండేది అని అన్నారు. నెహ్రూ వేసిన పునాదుల ఫలాలు నేడు మనమందరం అనుభవిస్తున్నామన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బిఆర్‌ఎస్ దృష్టి
ప్రభుత్వ వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం.. రైతు రుణమాఫీ చేయడం.. ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు. మీరు అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అన్నారు. మేం కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్‌ఎస్ దృష్టి పెట్టిందని అన్నారు. స్కీములు పెరగాడానికే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని, కుల గణన చేస్తామని మాట ఇచ్చామని, ఇచ్చిన మాటను ఆచరించి చూపిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కుల గణన ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుందని తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే ప్రశ్నలు తయారు చేశామని, కుల గణన ఒక విప్లవాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.





