కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం
అన్నికేసులపైనా ముమ్మర విచారణ
అవినీతి నేతలను ఎవరినీ వొదిలే ప్రసక్తే లేదు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది
కేబినేట్ విస్తరణ అధిష్ఠానం, సిఎం చూస్తారు
త్వరలోనే పార్టీ పునర్‌వ్యవస్థీకరణ
మీడియాతో ఇష్టాగోష్ఠిలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్
న్యూదిల్లీ,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని ప్రపంచానికంతా తెలిసిందని, అందుకే కెసిఆర్ కుటుంబ అవినీతిపై చర్యలకు సర్వత్రా డిమాండ్ పెరుగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అవినీతిపరులను ప్రభుత్వం విడిచిపెట్టదని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కాలేశ్వరం డిజైన్ మార్చి వ్యయం పెంచారని ఆరోపించారు. కమీషన్ల కోసం కాలేశ్వరం కట్టారని.. ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ జరపుతోందన్నారు. అన్యాయంగా ప్రభుత్వం ఎవరిపైనా కేసులు పెట్టదని.. అదే విధంగా తప్పు చేసిన ఎవరినీ వొదలదని హెచ్చరించారు. కేబినెట్ విస్తరణపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. శనివారం మీడియా ప్రతినిధులతో ఇష్టగోష్టిగా మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ, ముఖ్యమంత్రి కనుసన్నలలో జరుగుతుందని.. తాను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నానని అన్నారు. కేబినెట్ విస్తరణ పార్టీ హై కమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. త్వరలో పీసీసీ నూతన కార్యవర్గ నియామకం ఉంటుందని.. డీసీసీలుగా ఎమ్మెల్యేలతో పాటు సమర్థులకు కార్యవర్గంలో స్థానం ఉంటుందని అన్నారు. ఇతర పార్టీల నాయకుల చేరికలతో కొన్ని సమస్యలు తలెత్తాయని.. పాత కొత్త నేతలను సమన్వయం చేసుకోవాల్సి ఉందన్నారు. జీవన్ రెడ్డి సన్నిహితుడు మరణంతో మనస్తాపానికి లోనయ్యారని.. బాధతో ఆయన లేఖ రాశారన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకుడని.. ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పొలిటికల్ బాంబు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ స్పందిస్తూ.. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారి గురించే పొంగులేటి మాట్లాడారని భావిస్తున్నానని అన్నారు.
అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండా సురేఖ మాటలను పార్టీపరంగా సమర్ధించమన్నారు. వెంటనే కొండా సురేఖ తన మాటలు ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. వొచ్చే డిసెంబర్ నెలలో కొన్ని శుభవార్తలు వింటారని మహేష్ గౌడ్ అన్నారు. మరోవైపు.. 2029 ఎన్నికలు మాకు ఫైనల్ అని.. రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. బీసీ విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొంత డివియేట్ అవుతున్నారని.. ఆయనతో నేను, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపదాస్ మున్సి మాట్లాడామని.. అన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ కులగణనపై నవంబర్‌లో సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నామని.. ఆ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని కుమార్ గౌడ్ అన్నారు. వారు చేసిన తప్పులకు కేసీఆర్, కేటీఆర్‌లను రెండు, మూడేళ్లుకాదని.. పదేళ్ల జైలు శిక్ష కూడా తక్కువేనని అన్నారు. అలాగే విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు చాలా తక్కువధరకే విద్యుత్ దొరుకుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన లేదని అన్నారు.
కేసీఆర్‌కు ఉన్న ఆర్థిక వెసులుబాటు తమకు లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడినపుడు మిగులు బడ్జెట్‌తో ఉంది, కానీ పదేళ్లలో రూ.8 లక్షల కోట్లు కేసీఆర్ తెలంగాణపై అప్పు చేశారని విమర్శించారు. త్వరలోనే పథకాలను గ్రౌండ్ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కేసీఆర్ చేసిన అప్పులను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పథకాలను ఎగ్గొట్టాలనే ఆలోచన లేదని చెప్పారు. హైడ్రాలో ఒక్కటే పేదల ఇల్లు కూలిందని చెప్పారు. సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో యథేచ్ఛగా చెరువుల కబ్జా జరిగింది. వయనాడులో జరిగిన విధ్వంసం తెలంగాణలో జరగకూడదనే యుద్ధప్రాతిపదికన మూసీ ప్రక్షాళన చేపట్టాంమని వివరించారు. విడతల వారిగానే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం.హైడ్రాతో పేదవారికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటాం. హైడ్రా, మూసీపై రివ్యూ చేస్తున్నాం. పేద, మధ్యతరగతి వారికి అన్యాయం కలగకుండా చర్యలు ఉంటాయని అన్నారు. జీవో నెంబర్ 29పై ఎవరికి నష్టం జరుగదని అధికారులు చెప్పారు. మెరిట్ లిస్ట్‌లో ఎవరికి అన్యాయం జరగడం లేదు. జీవో నెంబర్ 29పై ఎవరు ఆందోళన చేశారో, ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. నెలలు అవుతుంది, ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయాడు. ప్రజల సమస్యలపై కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు.
కేసీఆర్‌కు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆయన చేస్తున్నది ఏంటని అన్నారు. సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లును కూల్చామనే చెప్పారు, కానీ కోర్టు డైరెక్షన్ వల్లే కూల్చలేదు. ప్రభుత్వానికి ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చు, అదాని ఇచ్చారు అంతే. ప్రతిపక్షాల రాద్దాంతంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు, అంతే తప్ప భవిష్యత్ తరాలకోసమే హైడ్రా, మూసీ ప్రక్షాళన అని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభావం ఉండదు. బీఅర్‌ఎస్‌లో ఏముందని చేరతారు. కేసీఆర్ కనబడటం లేదు, ఎవరిని చూసి బీఆర్‌ఎస్‌లో చేరతారు. ఏ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం లేదు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, భూ ఆక్రమణలు ఇలా అన్ని కేసుల విచారణ ఉంటుంది, ఫోన్ ట్యాపింగ్ పెద్ద వ్యవహారం. కేంద్రాచట్టలు వర్తిస్తాయి. కేసీఆర్ చేసినట్లు మేము మోసం చేయమనే క్లారిటీతో ప్రజలున్నారు.పార్టీలో ఉన్న నేతలను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని కొందరు చెప్పుకుంటున్నారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి. కేటీఆర్‌తో సన్నిహితంగా ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే