- 95 శాతం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి
- రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9 : ఇందిరమ్మ లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ ను తీసుకువచ్చామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఎలాంటి మధ్యవర్తులకు తావులేకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది. వీలైనంత త్వరితగతిన ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో 95 శాతం పూర్తి కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88 శాతం పూర్తయింది.
త్వరలో లబ్దిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టి సారించాలని, అలాగే అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని, రెండో దశలో ప్రభుత్వమే నివాస స్థలంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. మొదటి విడతలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్ధను రద్దు చేసి లబ్దిదారులే ఇండ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించామన్నారు. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇండ్లు నిర్మించుకోవచ్చని చివరి లబ్దిదారుని వరకు ఇండ్ల మంజూరు చేసి నిర్మించే బాధ్యత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి మరోమారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. కాగా కామారెడ్డి, మహబూబ్‌నగర్ నల్గొండ జిల్లాలలో 98 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, అధికారులు మంత్రికి వెల్లడించారు. అలాగే ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాలలో – 97శాతం, మహబూబూబాద్, జగిత్యాల, సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ, రంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, పెద్దపల్లి పది జిల్లాలలో- 96 శాతం పరిశీలన పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే