దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం  4

(2014-2023)
(గత సంచిక తరువాయి భాగం)
చందు తులసి రాసిన ‘‘నీళ్ళబిందె’’ (2018) కథ పట్టణాలలో వలసకూలీ జీవితం గడుపుతున్న లంబాడీ స్త్రీలు గుక్కెడు నీళ్ళకోసం ప్రతిరోజూ యుద్ధం చేయాల్సి వస్తున్న స్థితిని చిత్రించింది. ‘‘జీవితం నదిలా కాకున్నా కనీసం మురికికాలువలాగానైనా గడుస్తుందని ఆశపడి తండానుండి నగరానికి చేరుకుంటే అక్కడ తాగడానికి కూడా చుక్కనీళ్లు దొరకక ‘పానిపట్టు’ యుద్ధంలో ఆడపడచులు పడే పెనుగులాట, సంఘర్షణను ‘నీళ్ళబిందె’లోనే చూడాలి’’ (రివాజు, తెలంగాణ కథ- 2018 సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్‌, పుట 116)

ఈ కథలో సైదిది సూర్యాపేట దగ్గరలో లంబాడాలు నివసించే భీమ్లా తండా. ఆమెకు హైదారాబాద్‌ సంబంధం కావడంతో సైది అమ్మానాన్నలు బిడ్డ సుఖపడుతుందని, ఆటోనడిపే మేఘాతో పెండ్లిచేసి పంపిస్తారు. కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు సైదాబాద్‌లో చిన్నగది అద్దెకు తీసుకొని ఉంటారు. ఓలా,      ఉబర్‌లు వచ్చినంక మేఘా ఆటోకు గిరాకీ తగ్గుతుంది. డిజిల్‌ మందం రాకపోవడంతో మేఘా ఆటోను పక్కన పెడతాడు. రెండేళ్ళు గడిచేసరికి మేఘా లారీల మీది నుంచి ఇసుక దింపడానికి, ఆటో ట్రాలీలో ఇసుక నింపడానికి వెళ్తాడు. సైది కూడా ఇటుకలు మోయడానికి బిల్డింగ్‌ కంట్రాక్టర్‌ కింద పనులకు  వెళ్తుంది. ఎక్కడ పని జరిగితే అక్కడ కంట్రాక్టర్‌ లేబర్‌ కోసం రేకుల పాకలు వేయిస్తే, అక్కడే ఉంటూ పనులకెళ్తారు.

హైదరాబాద్‌ మణికొండలో బిల్డింగ్‌ పనులు జరుగుతుంటే, అక్కడే రేకులపాకలో తలదాచుకుంటున్న సైది, మేఘాలు ప్రొద్దున లేవగానే నీళ్ళకోసం వెదుకులాడాల్సి వస్తుంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం వేసిన పైప్‌లైన్‌ ఇండ్లు పెరిగిపోవడంతో ఆ బస్తీవాసుల అవసరాలు తీర్చలేకపోతుంది. ఒకరోజు తెల్లవారబోతుండగా నిద్రలేచిన సైది పడుతున్న ముసురులోనే తడుస్తూ, రెండు ఖాళీబిందెలతో రెండు బజార్లు తిరిగి వస్తుంది. నల్లాలున్న వాళ్ళు దగ్గరికి రానియ్యక పోవడంతో రెండుబిందెల నీళ్ళు ఎట్లా సంపాదించాలన్న ఆలోచనతోనే తిరుగుతుంది. ఒకబంగ్లా వద్దకు వెళ్ళగానే, నల్లానీళ్ళు వృధా పోతున్నట్లు వచ్చే చప్పుడును బట్టి గ్రహిస్తుంది. మెల్లగా గేటు తీసుకొని పిల్లిలా అడుగులేస్తూ నల్లా దగ్గరికిపోయి బిందె పెడుతుంది.

ఇంతలోనే ఎవడో రెండుచేతులతో సైదిని ఉడుం పట్టులా బిగించి, గోడచాటుకు లాక్కెళ్ళికింద పడేస్తాడు.
అనుకోని సంఘటనకు బిత్తరపోయిన సైది, తేరుకొని పెనుగులాడుతుంది. వాడు సైదిపై బడి కొండచిలువలా పాకుతుంటే, పట్టుకోసం అటూఇటూ చేతులతో వెదకగా సైది చేతికి స్టీల్‌ బిందె అందుతుంది. పిచ్చికోపంతో వాడిని బిందెతో కొడుతుంది. ‘చంపావ్‌ కదనే ముండా’ అంటూ కుప్పకలిపోతాడు వాడు. సైది వెంటనే లేచి బిందెలు పట్టుకొని గేటుదాటి బయట పడుతుంది. తాగిన మైకంలో పడుకున్న మొగుడు లేపినా లేవక పోవడంతో, ఆ రోజు వంట చేయకుండానే కాంట్రాక్టర్‌ పిలవడంతో పనికి వెళ్తుంది. పొద్దుగూకిన తర్వాత ఇంటికి వచ్చిన సైదికి ఏమి తినాలనిపించదు. తనబాధను ఎవరితో చెప్పుకొని ఏడవాలి అని ఆలోచిస్తూ చాపపై పడుకుంటుంది. ఎప్పుడో కన్ను మూతపడగా కుక్కల అరుపులకు మెలకువరాగా, ఖాళీగా పడి ఉన్న రెండుబిందెలను తీసుకొని ‘‘ఎలాగైనా రెండుబిందెల నీళ్లు సంపాదించాలి’’ అనుకుంటూ బయలు దేరుతుంది. ఇట్లా స్వరాష్ట్ర పాలనలో పట్టణవాసులైన కూలీలకు మురికివాడల ప్రజలకు గుక్కెడునీరు దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితిని ఈ కథ తెలుపుతుంది.

ఉదయమిత్ర రాసిన ‘‘అలివి వల’ (2019) కథ చెంచుల జీవానాన్ని చిత్రించింది. భూమే కాదు నదులమీద కూడా అధికారం మెల్లమెల్లగా కోల్పోతున్నాం. నీళ్ళు అందులోని చేపలు ఎక్కడికో చప్పుడు కాకుండా తరలిపోతున్నాయి. ఎవరో అడవి వల విసిరి అందర్ని బికారుల్ని చేస్తున్నారు. అంతా ఒక్కటై తిరగబడితే గాని ఆ వలనుండి తప్పించుకోలేం’’ (రూబిడి, తెలంగాణ కథ- 2019, సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్‌ పుట 15) మహబూబ్‌ నగర్‌ జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నిలిచే ప్రదేశానికి దగ్గర, అమరగిరి గ్రామానికి సమీపంలో మారుమూలలో చెంచులు అరవై కుటుంబాల వరకు ఉంటారు. వారికి రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు వాళ్ళు నలభై ఇండ్లు కట్టించారు. వారికి సెంటు భూమిలేదు. వారికి ఓటర్‌ కార్డులు, రేషన్‌ కార్డులు మాత్రం జారీ చేయబడ్డాయి.

నదిలో చేపలు పట్టడమే వారి జీవనాధారం. వాళ్ళు వారంరోజుల దాక చేపలు పట్టడానికి నదికిపోయి అక్కడే ఉంటారు. జంటలుజంటలుగా వెళ్ళి నది ఒడ్డున టెంట్లు వేసుకుంటారు. ఆ వారం రోజులు వంటావార్పు అక్కడే. వలలు కంపెనీవాడే ఇస్తాడు. ఇంత చేస్తే వాళ్ళకు నెలకు రెండునుంచి మూడు వేయిల రూపాయలు మాత్రమే వస్తాయి. ఒక పుట్టిలో ఒక జంట రాత్రిపూట వలలు వేయడానికి నదిలోకి వెళ్తారు. భార్య తెడ్డు వేస్తే, భర్త వలవేస్తాడు. రాత్రిపూట చీకట్లో పాములు, తేళ్ళు, ఎలుగుబండ్లు మున్నగు వానితో బెడద ఉంటే, వర్షాకాలం గాలివాన, ఆ తరువాత చలి, ఎండల నుండి తట్టుకొని చేపలు పట్టి తెస్తే, కంపెనీవాడు, తూకంతో, ధరతో దోచుకుంటాడు.

 

వాళ్ళ దోపిడిని ప్రశ్నించే ధైర్యం చెంచులకు లేదు. వాళ్ళు సంఘం పెట్టారని అనుమానించి మద్దిలేటి అనేవాడిని పోలీసులు చేత రక్తం కక్కుకునేటట్లు దాడి చేయించి కంపెనీవాళ్ళు చెంచుల్ని భయభ్రాంతులకి గురి చేస్తారు. ఆ సంఘటన జరిగాక మద్దిలేటి తల్లి పిచ్చిదై తిరుగుతుంది. తరతరాలుగా నదిలో చేపలు పట్టుకొని బతుకుతున్న చెంచులు ఒక నుంచి చేపలు పట్టరాదని ఓ వైపు రైతులమంటూ దళారులు, ఇంకోవైపు పోలీసులు, మరోవైపు కంపెనీవాళ్ళు దాడిచేయడం మొదలవుతుంది. చెంచుల్ని నదిలో గాలాలు కూడా వేయకుండా నిరోధిస్తూ కంపెనీ వాళ్ళు అలివి వలల తెస్తారు. ఒక్కసారి ఆ వలను నదిలో వేస్తే దాదాపు కిలోమీటర్‌ పొడవున ఉన్న మత్స్యసంపద పూర్తిగా హరించుకుపోతుంది. ఒక అలివివల పది చెంచువలలతో సమానం. ఒకసారి నదిలో వేస్తే మూడు నాలుగు టన్నుల మత్స్యసంపద ఖాళీ అవుతుంది. అలివివల వల్ల చెంచులు జీవనాధారం కోల్పోవలసి రావడంతో ఆ రోజు రాత్రి వాళ్ళ కంటికి కునుకు లేకుండా పోతుంది.

పన్నెండేళ్ళ గజ్జన్న ఆ రోజు తెల్లవారక ముందే నిద్ర లేస్తాడు. అందరి ఇండ్లను చుట్టి వచ్చి ముప్పై నలుబై మంది తన ఈడుపిల్లల్ని కలుసుకుంటాడు. కంపెనీ ట్రాక్టర్లు అమరగిరికి వస్తున్న తోవలో వీళ్ళంతా వంకరటింకరగా రాళ్ళు పేరుస్తారు. కూలీలు రోడ్డుకడ్డంగా ఉన్న రాళ్ళను తొలగిస్తుంటే గజ్జన్న తన సావాసగాళ్ళతో వచ్చి ట్రాక్టర్లను దిగ్బంధం చేస్తాడు. వాళ్ళు విల్లంబులు ఎక్కుపెట్టి నిలుచుంటారు.

ఓ డ్రైవర్‌ మీకు ఏమి కావాలిరా అని అడిగితే, మీరు వెళ్ళిపోవాలి, ఈ నది మాది, అలివివలలు వద్దు అంటూ అరుస్తారు. వాళ్ళ పట్టింపు, తెగువను కళ్ళారా చూసిన డ్రైవర్లు, కూలీలు మందడుగు వేస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడతారు. ఇట్లా నదులపై, అందులోని చేపలపై ప్రభుత్వాలు ప్రైవేట్‌ వ్యక్తులకు అధికారం కట్టబెడితే తరతరాలుగా వస్తున్న జీవనాధారాన్ని పేదలు కోల్పోవలసి వచ్చిన తీరును ఈ కథ స్పష్టంచేసింది. స్వరాష్ట్రంలో గిరిజనులు ఇంకా అనేకసమస్యలతో సతమత మవుతున్నట్లు, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలు కార్యరూపం దాల్చలేదని ఈ కథలు స్పష్టం చేస్తున్నాయి.
(వ్యాసం ముగిసింది)

-ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *