(గత సంచిక తరువాయి భాగం)
దిలావర్ రాసిన ‘పాటకు మరణం లేదు’ (2015) కథ రక్షకులే భక్షకులై గిరిజనుల జీవితాన్ని బుగ్గిపాలు చేయడాన్ని సూచిస్తుంది. అడవిలో పోడు వ్యవసాయం చేస్తూ, ప్రకృతితో మమేకమై పాటలు పాడుకునే కోయయువకుడిని పోలీసులు పట్టుకెళ్ళి స్టేషన్లో పెడుతారు. ఆ యువకుని చెల్లెలు చెంద్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే హెడ్ కానిస్టేబుల్ కన్నార్పకుండా చూస్తాడు. మన బోన్లకి జింక పిల్ల వచ్చిందని కానిస్టేబుల్ అనగానే, చెంద్రి అడవి అందాన్ని చూసి ఎస్సై తన కామానికి మొదట బలి చేస్తాడు. ఆ తర్వాత హెడ్డూ, రైటరూ, కానిస్టేబుల్, సెంట్రీ చెంద్రిపై లైంగిక దాడికి పూనుకుంటారు. భయంతో చెంద్రి పెట్టిన కేకలు, పెడ బొబ్బలూ, ఆర్తనాదాలూ ఆ గదికే పరిమితమవుతాయి.
అన్నమీద ఆశ చావక, తన మీద ఆశలు చంపుకొని మళ్ళీ, మళ్ళీ పులినోట్లో తల దూర్చుతుంది. మళ్ళీ చెంద్రికి పోలీస్ స్టేషన్లో అదే అనుభవం ఎదురవుతుంది. రక్షకభటుల కామవాంఛకు చెంద్రి ఋతుక్రమం గతి తప్పుతుంది. ఇట్లా రక్షకులే భోక్తలుగా మారి గరిజన స్త్రీపై అత్యాచారం చేసి గర్భవతిని చేయడం ఈ కథలో కన్పిస్తుంది.
రజిత కొమ్ము రాసిన ‘ఫెర్టిలిటీ’ (2018) కథ కడుపున పుట్టిన బిడ్డలను అమ్ముకునే లంబాడీల దైనాన్ని వివరిస్తుంది. ‘‘తండాల పరిస్థితి మరింత ఘోరం. అక్కడ కనీసం జీవించడానికి కూడా ఏ ఆదెరువు దొరకక అప్పుడే పుట్టిన కన్న పేగుల్ని అమ్ముకొని బతకాల్సిన దుస్థితి. ఫెర్టిలిటికి నోచుకోని కొందరు దేన్నయినా మారకపు సరకుగానే చూస్తారు. చివరికి పుట్టిన గుడ్డులనైనా సరే’’ (రివాజు, తెలంగాణ కథ ` 2018 ` సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్ ` పుట`89)
ఈ కథలో దివ్య, ఆమె భర్త ఇద్దరూ వెటర్నీ డాక్టర్లు. పెళ్ళైన ఏడేళ్ళకు దివ్యకు గర్భం నిలుస్తుంది. గర్భం జారకుండ స్టిచ్ వేయించుకోవలసి వచ్చి పెర్టిలిటీ సెంటర్‌కు వెళ్తుంది. అందులో అడ్మిన్ అయ్యాక ఆ రోజు అక్కడే ఉండాల్సివస్తుంది. అర్థరాత్రి గది బయట ఏదో చప్పుళ్ళు వినిపించి దివ్యకు మెలకువ వస్తుంది. టైం చూస్తే రెండు గంటలు కావొస్తుంది. దివ్యడోర్ తెరచి బయటికి వెళ్ళి చూసే సరికల్లా ముగ్గురు లంబాడీ స్త్రీలు, తలపాగాతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అంతా గోలగోలగా మాట్లాడుకుంటూ ఉండటం చూసి డెలివరి కేసేమోనని గదిలోకి వచ్చి బెడ్‌పై పడుకుంటుంది.
ప్రొద్దున్నే దివ్యకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి సర్జరీ చేస్తారు. సాయంత్రం రూంలోకి షిప్ట్ చేస్తారు. తన పక్క బెడ్ పైకి ఒక అమ్మాయి వస్తుంది. జీన్స్ వేసుకొని, పైన టాప్ వేసుకొని బెడ్‌లో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఒక గంట తర్వాత సిస్టర్ వచ్చి ఆ అమ్మాయితో ఏవో పేపర్లపై సంతకం చేయించుకొని వెళ్తుంది. ఆమె భర్త వచ్చి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, మార్నింగ్ పైవ్‌కి ప్లయిట్ అని చెప్తాడు. ఇద్దరూ సిస్టర్‌కు చెప్పి బయటికి వెళ్తారు. ఆ రోజు రాత్రి ఒకటిన్నరకు ఏడుపు చప్పుడు వినబడితే దివ్య నిద్రలేస్తుంది. పక్కగదిలోకి తొంగిచూస్తే నిన్నచూసిన పెద్దవయస్సు లంబాడి స్త్రీ మధ్యాహ్నం తన పక్కబెడ్‌పై కనిపించిన అమ్మాయి చేతుల్లో పసికందును పెడుతుంది.
ఆ అమ్మాయి కొద్ది నిముషాల్లోనే ఆ పసి బిడ్డను ఎత్తుకుని అక్కడి నుండి వెళ్తుంది. తెల్లవారాక దివ్య రాత్రి చూసిన విషయం గురించి రహస్యంగా సిస్టర్‌ను అడిగితే, వాళ్ళు పెద్ద కోటీశ్వరులు, మేనరికం మాత్రమే చేసుకుంటారు. పిల్లలు ఏదైనా లోపాలతో పుడితే ఎట్లా అని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వాళ్ళ బంధువులకు గుడ్డి పిల్లవాడు పుట్టాడు. ఇంక రిస్క్ ఎందుకని ఇట్లా కొంటారని చెప్తుంది. ఆ పసికందును వాళ్ళు రెండు లక్షలకు కొన్నారని దివ్య తెలుసుకుంటుంది. ఇట్లా నవమాసాలు మోసి, కని పురిట్లోనే డబ్బుల కోసం అమ్ముకోవలసి వస్తున్న లంబాడీల దుస్థితిని ఈ కథ తెలుపుతుంది.
చందు తులసి రాసిన ‘‘నీళ్ళబిందె’’ (2018) కథ పట్టణాలలో వలసకూలీ జీవితం గడుపుతున్న లంబాడీ స్త్రీలు గుక్కెడు నీళ్ళకోసం ప్రతిరోజూ యుద్ధం చేయాల్సి వస్తున్న స్థితిని చిత్రించింది. ‘‘జీవితం నదిలా కాకున్నా కనీసం మురికి కాలువలాగానైనా గడుస్తుందని ఆశపడి తండా నుండి నగరానికి చేరుకుంటే అక్కడ తాగడానికి కూడా చుక్క నీళ్లు దొరకక ‘పానిపట్టు’ యుద్ధంలో ఆడపడచులు పడే పెనుగులాట, సంఘర్షణను ‘నీళ్ళబిందె’లోనే చూడాలి’’ (రివాజు, తెలంగాణ కథ ` 2018 ` సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్ ` పుట` 116) ఈ కథలో సైదిది సూర్యాపేట దగ్గరలో లంబాడాలు నివసించే భీమ్లా తండా.
ఆమెకు హైదారాబాద్ సంబంధం కావడంతో సైది అమ్మా నాన్నలు బిడ్డ సుఖపడుతుందని, ఆటోనడిపే మేఘాతో పెండ్లి చేసి పంపిస్తారు. కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు సైదాబాద్‌లో చిన్నగది అద్దెకు తీసుకొని ఉంటారు. ఓలా, ఉబర్‌లు వచ్చినంక మేఘా ఆటోకు గిరాకీ తగ్గుతుంది. డిజిల్ మందం రాక పోవడంతో మేఘా ఆటోను పక్కన పెడుతాడు. రెండేళ్ళు గడిచే సరికి మేఘా లారీల మీది నుంచి ఇసుక దింపడానికి, ఆటో ట్రాలీలో ఇసుక నింపడానికి వెళ్తాడు. సైది కూడా ఇటుకలు మోయడానికి బిల్డింగ్ కంట్రాక్టర్ కింద పనులకు వెళ్తుంది. ఎక్కడ పని జరిగితే అక్కడ కంట్రాక్టర్ లేబర్ కోసం రేకుల పాకలు వేయిస్తే, అక్కడే ఉంటూ పనులకెళ్తారు.
(వచ్చేవారం ముగింపు)
-ప్రొఫెసర్ బన్న అయిలయ్య





