(2014-2023)
(గత సంచిక తరువాయి భాగం)
దిలావర్ రాసిన ‘రాళ్ళూరప్పలు’ (2014) కథ గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి పేరిట యాంత్రీకరణ వలన పనుల కోసం వెళ్ళిన కోయ స్త్రీలు మైదాన ప్రాంత వాసుల చేతిలో చిక్కి అత్యాచారాలకు గురవుతున్న వైనాన్ని చిత్రించింది. గిరిజనులు నివసించే మారుమూల కోయగూడెం ప్రాంతంలో అభివృద్ధి పేరున పెద్ద పెద్ద యంత్రాలతో పనులు మొదలవుతాయి. యంత్రాలను నడిపే డ్రైవర్లు, కార్మికులు తాత్కాలికంగా గుడారాలు వేసుకొని ఉంటారు. కోయ స్త్రీలు ఆ డేరాలలో కసువు చిమ్మడం, నీళ్ళు తేవడం, బోళ్ళు తోమడం వంటి పనులకు వెళ్తుంటారు.
గిరిజనేతరులను చూసి గిరిజనులు కూడా మారుతుండటం నేర్చుకున్నాక పడక సుఖానివ్వడానికి కూడా ఉపయోగపడుతారు. అట్లా ఓ డ్రైవర్ మాయ మాటలకు మోసపోయిన సమ్మక్క గుడారం ముందుకు వచ్చి ‘డ్రైవర్ బాబు’ అని పిలుస్తుంది.
ఒంటిపై బట్టలు సర్థుకొని వచ్చిన ఆ డ్రైవర్… ‘డ్రైవరంటే ఏ డ్రైవరు?’ అని అడుగుతాడు. మా డ్రైవర్ బాబు నన్ను మనువాడుతానన్న బాబు అని అంటుంది సమ్మక్క. ‘‘ఇక్కడ అందరం డ్రైవర్లమే, అందరం పెళ్ళి చేసుకోవాలా నిన్ను? పో పోమ్మా… నీ అసుంటోల్లు మాకు రోజుకొక్కరు చొప్పున వస్తరు. ఆల్లందర్నీ పెళ్ళి చేసుకుంటూ పోతే ఒక్కొక్కనికి పది పదిహేను మంది పెళ్ళాలైతరు…వెళ్ళు.. వెళ్ళు.. అంటూ వెటకారంగా మాట్లాడుతూ లోనికి దూరుతాడు. అన్ని డేరాల ముందు సమ్మక్కకు ఇదే అనుభవం ఎదురవుతుంది. ఇట్లా ఆదివాసులు తాము సేద్యం చేస్తున్న భూముల్ని కోల్పోయి, వాళ్ళ భూముల్లోనే కూలీలుగా మారి, చివరకు మైదాన ప్రాంత వాసుల వలలో చిక్కి అత్యాచారాలకు గురవుతున్న వైనాన్ని ఈ కథ చిత్రించింది.సమ్మెట ఉమాదేవి రాసిన ‘దివిలి’ (2014) కథ అమాయక గిరిజన స్త్రీలు గిరిజనేతరుల చేత మోసపోయి అత్యాచారానికి గురై బతుకు కడతేరుతున్న వైనాన్ని చిత్రించింది.
ఈ కథలో లంబాడీ తండాకు మత ప్రచారం కోసం వచ్చి పాస్టర్ పార్వతిపై అత్యాచారం చేస్తాడు. బలవంతంగా అబార్షన్ చేయించగా ఆమె పిచ్చిదానిగా మారుతుంది. జాన్సీ ఫారెస్టు ఆఫీసర్ బారిన పడి అత్యాచారానికి గురవుతుంది. తండా ఆడవాళ్ళ మీద జరుగుతున్న దురాగతాల గురించి యువకులకు చెప్పాలనుకున్న ఎ.ఎన్.ఎం. భయంతో ఏమి చెప్పడానికి సాహసించదు. అట్లే చాలా హుషారుగా పెరిగిన దివిలి అత్యాచారానికి గురై గర్భవతి అవుతుంది. ఎవరూ మోసం చేశారో చెప్పమని ఆమెను ఎన్ని విధాలుగా బుజ్జగించిన నోరు విప్పదు. చెప్పడానికి నిన్నెవరైనా బెదిరిస్తున్నారా అని అడిగితే జవాబు ఇవ్వదు. ఇదంతా చేసింది ఎవరో చెబితే కాళ్ళు పట్టుకునయినా పెళ్ళి చేయిస్తా అని అనడంతో… ‘పెళ్ళి చేస్తారా? ఎవరితో చేయిస్తరు? పశుబలంతో దాష్టికం చేసినా పేరుగాని బయటకు చెప్తే మీ అమ్మ నాయినలకు నిలువ నీడ లేకుండా చేస్త… మీ అన్నను ఖతం చేస్తాను అన్నాక ఇంక ఏం చెప్పాలి? అంతకు దగ్గ దౌర్బాగ్యుడి గురించి ఎట్లా చెప్పాలి’’ అంటూ ఏడుస్తుంది.
చావు బతుకుకు మధ్య కొట్టు మిట్టాడుతూ.. ఏడ్పే తప్ప మరో దారి లేక అమ్మ నాయనలతో తన్నులు, తిట్లూ తింటూ కళ్ళ ముందు వాళ్ళు పడుతున్న నరక యాతనను చూస్తూ చావలేక బతుకుతున్నదని ఎట్లా చెప్పాలి? అంటే దివిలి వాపోతుంది. తనమీద జరిగిన అఘాయిత్యానికి బాధతో తిండి, నిద్ర మాని ఏడవ నెలలోనే ప్రసవమై రక్తహీనతతో దివిలి చనిపోతే, ఆచారాల పేరిట ఆమె శవాన్ని తండాలోనికి తేనివ్వకుండ లంబాడీ పెద్ద మనుషులు అడ్డుకుంటారు. ఇట్లా అగ్రవర్ణపు దౌర్జన్యానికి గిరిజన యువతి జీవితం బలి అయినట్లు ఈ కథ వ్యక్తం చేసింది.
(మరో రెండువారాల్లో ముగింపు)





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల