దాశరథి ‘సమైక్య’ కవిత

తెలుగు కవిత్వానికి అంగారాన్ని, శృంగారాన్ని అద్దిన దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987) శతజయంతి సంవత్సరం ఇది. నూరువసంతాల కింద పుట్టిన దాశరథి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని(1946-1951) అగ్నికంఠంతో అక్షరీకరించాడు. బతికినంత కాలం తెలంగాణ కోసం ఒళ్ళంతా నోరుజేసుకొని కొట్లాడాడు. సినిమాలకు పాటలు రాసి రసహృదయుల మనస్సులను చూరగొన్నాడు. ‘నిప్పుపూలు’లాంటి తెలంగాణ ఆత్మను పట్టిచూపే కథలు కూడా రాశాడు. రైతాంగ సాయుధ పోరాటం నాటి తెలంగాణ ప్రజల కన్నీటిధారను ‘అగ్నిధార’గా కురిపించాడు. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’అని సగర్వంగా పలికాడు. తెలంగాణ ప్రకృతి, తెలుగుభాష, తన మనసంతా నిండిన ప్రియురాలు ఈ మూడు  దాశరథికి అత్యంత ఇష్టమైనవి.

తెలంగాణ నేలమీద, తెలంగాణ ప్రజలమీద, తెలంగాణ సంస్కృతిమీది ఎంతో గౌరవాన్ని ప్రకటించిన దాశరథి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకో వ్యతిరేకించాడు. ఎన్నో పోరాటాల తరువాత కలిసిన ఆంధ్రప్రదేశ్‌ అనే తెలుగురాష్ట్రం విడిపోవడం అతనికి సుతరామూ ఇష్టంలేదు. ఆనాడు అప్పుడప్పుడే కలం పట్టి కవితలు రాస్తున్న ఎంతోమంది తెలంగాణ యువకవులు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆమోదించారు. ఉద్యమ భావజాలాన్ని విస్తృతం చేయడానికి విలువైన కవితలు రాశారు. కాని ఆనాటి ప్రధానస్రవంతికి చెందిన సీమాంధ్రకవుల్లాగే తెలంగాణ ప్రధానస్రవంతి కవులు  డా. సి.నారాయణరెడ్డి, వానమామలై వరదాచార్యులు, ఎల్‌. ఎస్‌. కనపర్తి, మేరెడ్డి యాదగిరి రెడ్డి, సిహెచ్‌. రాజలింగం, పోలాడి లింగారావు, గోవు సరోజ లాంటి కవులు, కవయిత్రులు ఆంధ్రప్రదేశ్‌ అనే పచ్చని పందరిలో చిచ్చుపెట్టవద్దని, ఆంధ్రప్రదేశ్‌ విడిపోవద్దని కవిత్వం రాశారు. వీరిలో దాశరథి మరింత మొండిగా వాదించిన సమైక్యవాది.

దాశరథికి తెలుగుభాషన్నా, తెలుగువాళ్లన్నా, తెలుగు సంస్కృతి అన్నా విపరీతమైన అభిమానం. ఎన్నో ఏండ్ల కృషివల్ల ఏర్పడిన తెలుగురాష్ట్రం విడిపోతుందంటే ఆయన అసలే సమర్థించలేదు. ‘ఆంధ్రప్రదేశ్‌’ఏర్పడుతున్న సమయంలో ‘మహాంధ్రోదయం’ (1955) కావ్యాన్నే రాశాడు. తెలుగువాళ్లంతా కలిసే ఉండాలని తీర్మానించాడు. కలిసుంటేనే కలదు సుఖమని చాటిచెప్పాడు. ఆనాటి ప్రధానస్రవంతి కవుల సరసన నిలబడాలనే ఉబలాటంతోనో, సినిమా అవకాశాలు తగ్గిపోతాయనే ఆలోచనతోనో కరుడుగట్టిన తెలంగాణవాది అయిన దాశరథి ప్రత్యేక తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించాడు. తెలుగువాళ్లంతా ఒక్కటి! ఒక్కటి! ఒక్కటి!! అని గట్టిగా నినదించాడు. ఐక్యతలోనే తెలుగువాళ్ల అభివృద్థి మరింత పెరుగుతుందని ఆశపడ్డాడు.‘తెలుగు నేనే -వెలుగు నేనే’ అని ప్రకటించాడు.

‘‘తెలుగువాని తెలుగువాడు ద్వేషించాలా?/ కళ్లు తడిసి ఇల్లు విడిచి వెళ్లిపోవాలా?/ యెన్ని వందలేండ్లకు మనమేకమైతిమి?/ యెన్నెన్ని పిశాచములను మనమెదిరించితిమి?…/ఒక్క పుష్కరమైనదేమొ ఒక ఇల్లై ఉంటిమి/ కలత లేమిలేక ఒక్క కంచములో తింటిమి/ గోదావరి దివ్య జనని నీది నాది కాదా?/ కృష్ణానది ప్రియసోదరి నీది నాది కాదా?/ రానున్న తరాల వారు రాక్షసులంటారు మనను/ విడగొట్టిన పాపానికి తిడుతూ ఉంటారు మనను/ కలిసియుండు మార్గాన్నే కనుగొనవలయును/ విడిపోయే ఆలోచన విడిచివేయవలెను” (దాశరథి – ‘ఒక్క తెలుగు ` ఒక్క వెలుగు’, కవిత, ఆంధ్రప్రభ, 14 ఫిబ్రవరి 1969)

తెలుగు వాళ్లమంతా ఒక దేహం, ఒక గేహం అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించాడు దాశరథి. మన కంట్లో మనమే పొడుచుకుంటే ఎలా? కుడిచేతిని ఎడమ చేయి నరికేస్తే ఎలా? మన ఇల్లును మనమే కాల్చుకుంటే ఎలా? అని ప్రశ్నించాడు. కుంటికాలితో ఎక్కువ దూరం నడవగలమా? జంటను వీడి బతుకుటలో శాంతి ఉన్నదా? అని తెలంగాణ ప్రజలను నిలదీశాడు. వసుధైక కుటుంబం అనే భావనను, విశాలతను మరిచిపోయి తెలంగాణ ప్రజలు వెర్రితలలు వేయవద్దని చెప్పాడు. మహాంధ్ర దేవాలయాన్ని మట్టిపాలు చేయకండి. శాంతిదేవతను సమరానికి లాగకండి. పరిష్కారాన్ని త్వరలోనే కనుగొందాము. తెలుగువెలుగు ఒక్కటేనని చాటిచెప్పుదాము అని ప్రాధేయపడ్డాడు.‘‘ఇప్పటికైనా అంతా తప్పు తెలుసుకున్నారు/ తెలుగుజాతి నొక్కటిగా నిలుపదలుచుకున్నారు/ విడిపోవుట చెడిపోవుట విడిపోవుట పడిపోవుట/ కలిసియుంట గెలుచుకొనుట తెలుగు విలువ తెలిసికొనుట…/  సమగ్రాంధ దీపావళి సమైక్యాంధ్ర దీపావళి/ విడిపోయేతత్వంపై విరుచుకుపడు కోపావళి” (దాశరథి – ‘సమైక్యాంధ్రము’ కవిత, ప్రజాకవి దాశరథి సాహిత్యం -2. పుట. 118, 119)

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాదాపుగా ముగిసిపోయిన తరువాత వచ్చిన దీపావళి పండుగ సందర్భంలో రాసిన కవిత ఇది. ఇప్పటికైనా తెలుగుప్రజలు తమ తప్పు తాము తెలుసుకొని తెలుగుజాతిని ఒక్కటిగా నిలపదల్చుకున్నారనే సంతోషంలో రాసిందీ కవిత. ఏదో రాజకీయం మన ఎదలమీద రాక్షసిలా కూర్చుందని అందుకే తెలంగాణ విడిపోదామనే పోరాటం మొదలైందని భావించాడు. ఇక ఇప్పుడు సమైక్యదీపాలు వెలిగించామని, కోపాలను తొలగించామని ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘తెగిన గాలిపటం కాదు తెలంగాణ/ తెలంగాణ తేనె సొన తెలంగాణ దివ్య వీణ/ తెలంగాణ నవకవితల నజరానా/ తెలుగు జాతి ఒక్కటి/ భరతజాతి ఒక్కటి/ ప్రపంచమే ఒక్కటి/ శశిబింబం ఒక్కటి/ రవిబింబం ఒక్కటి/ నవంబరు ఒక్కటి/ మనమంతా ఒక్కటి” (దాశరథి – ‘నవంబరు ఒక్కటి’ కవిత, ప్రజాకవి దాశరథి సాహిత్యం -2. పుట. 143)

తెలుగుభాష అనగానే దాశరథికి వీరావేశం ఆవహిస్తుంది. అందుకే తెలంగాణను తెలుగుజాతికి ముడిపెట్టి తెలుగువాళ్లమంతా ఒక్కటేనని పదేపదే చెప్తాడు. విభేదాల దుమ్మును దులిపేద్దాం. వివాదాల ముడతలు విప్పేద్దాం. విషాదాల చలిని తొలగిద్దాం అని ఉత్సాహంగా ప్రతి నవంబర్‌ ఒక్కటిని ఉత్సవంగా భావించాడు. రెండుగ చీల్చే మొండితనం వద్దు. మనసులనేకం చేసే మంచితనం కావాలని ఆకాంక్షించాడు. హైద్రాబాద్‌ మనదే. విజయవాడ మనదేనని మురిపెంతో పొంగిపోయాడు. ‘‘అన్నలార! తమ్ములారా!/ ఆంధ్రజనని కన్నులారా!/ రెండు కళ్లు చూపు ఒకటి/ రెండు కాళ్లు నడక ఒకటి/ కలసి కూర్చుని మనమందరము/ కలతలు తొలగించుకుందాము” (దాశరథి – ‘ఐకమత్య గీతం’ కవిత, ప్రజాకవి దాశరథి సాహిత్యం -2. పుట. 194)

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం అంటే దాశరథి గుండె నిండా పండుగ వచ్చినవేళ. అందుకే ‘నవంబర్‌ ఒకటి ఏమంటున్నది? నా తెలుగుజాతి ఒకటి అంటున్నది’అని ఐకమత్య గీతం రాశాడు. కవులంతా కలాలెత్తి, గళాలెత్తి ఐకమత్య గీతాలే రాయాలని విన్నవించుకున్నాడు. మనలోమనకు మనస్పర్థలు వద్దు, కోపతాపాలు వద్దు. ‘కొత్తకిటికీలోంచి అవలోకించండి. కొత్తప్రపంచాన్ని అర్థం చేసుకోండి’అని సమైక్యరాష్ట్రాన్ని అక్కున చేర్చుకోవాలని కోరాడు. తెలుగువాళ్లంతా ఏకతా సందేశం వినిపించాలని విజ్ఞప్తి చేశాడు.

కవెప్పుడూ బలహీనుల పక్షం వహించాలనే మౌలిక విషయం తెలిసినా తెలుగుభాష ఔన్నత్యం  ముందు అది పనిచేయలేదు. ఒకింత నష్టమైనా, మరెంతో కష్టమైనా కలిసి ఉంటేనే తెలుగు వెలుగుతుందని దాశరథి భావించాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ఆత్మగౌరవహీనత, సహజవనరుల దోపిడీ, తెలంగాణలోని మిగులు బడ్జెట్ ఆంధ్రాకే కేటాయించడం, ఉద్యోగ నియామకాల్లో ఆంధ్రుల ఆధిపత్యం తదితర ఎన్నో దురాగతాలు కళ్ళెదుట కనిపించినా అవేవీ తెలుగువారందరూ ఒక్కటేననే విశాలభావన ముందు నిలబడలేకపోయాయి. తెలుగుజాతి సమైక్యత, భవిష్యత్‌ ఆశయాలు, సాంస్కృతిక వైభవం అతడిని సమైక్యత వైపే నెట్టివేశాయి.

మలిదశ తెలంగాణ ఉద్యమం (1996-2014) ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఆకాంక్షను మరోసారి చరిత్రపుటల మీద మంటలై చెలరేగేలా చేసింది. ప్రజల పోరాటం ముందు, ఆకాంక్షల ముందు కవుల తేనెపూతల కవితలు, ఆక్రోశపు వాక్యాలు, బలవంతపు భాషాబంధాలు, సమైక్యరాగాలు నిలబలేవని నిరూపించబడ్డాయి. ప్రజాకవులు కూడా ఒక్కోసారి తప్పులో కాలు వేస్తారని, ప్రజలనాడిని పట్టుకోవడంలో విఫలమవుతారని చెప్పడానికి దాశరథి ‘సమైక్య’ కవితలే సాక్ష్యం. హిందీ మాట్లాడే ప్రజలకు అన్ని రాష్ట్రాలున్నప్పుడు తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలుంటేనేం అని అనుకొని ఉద్యమానికి మద్దతు పలకలేకపోయాడు. ఇన్ని దశాబ్దాలు గడిచిపోయిన తరువాత దాశరథి వైఖరి చారిత్రక తప్పిదంగా కనిపించవచ్చు. కాని కవయః నిరంకుశః అని సరిపెట్టుకోవాలేమో!

-డా. వెల్దండి శ్రీధర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *