సృజనాత్మక పోరాటాల ప్రజలు, పాత పనిముట్ల ప్రభుత్వాలు

“2019లో ఆర్టికల్‌ 370ను నిర్వీర్యం చేసి, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ను లెజిస్లేచర్‌తో కూడిన కేంద్రపాలితప్రాంతంగాను, లద్దాఖ్‌ను లెజిస్లేచర్‌ లేని కేంద్రపాలితప్రాంతంగాను చేశారు. తమ ప్రాతినిధ్యం మరింతగా దిగజారిందని, ఒక్క పార్లమెంటు సభ్యత్వంతో జాతీయస్థాయిలో తమ గొంతుకే లేకుండా పోయిందని లద్దాఖ్‌ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రప్రతిపత్తి కావాలని, ప్రాంతాన్ని ఆరోషెడ్యూల్‌ కింద చేర్చి ఆదివాసీప్రాంతాలకు ఉండే ప్రత్యేకరక్షణలు కల్పించాలని, కనీసం రెండు లోక్‌సభ నియోజకవర్గాలు కావాలని ఆ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వారు చేస్తున్న ప్రజా ఉద్యమానికి సోనమ్ వాంగ్‌ చుక్‌ అనే పర్యావరణ వాది నాయకత్వం వహిస్తున్నారు.”

ముగిసిపోయినట్టు కనిపిస్తుంది కానీ, ఏదీ దుంపనాశనం అయిపోదు. తలలు కత్తిరించినా సరే, మళ్లీ మళ్లీ ఏదో తలెత్తుతూనే ఉంటుంది. ఒక పక్కన చితులు కాలుతూ ఉంటాయి. మరొకపక్క బారసాలలు జరుగుతాయి. రిలేపరుగులో ఒకచోట ఆగిపోయిన కాగడా మరొకచేతిలోకి ఒదిగిపోతుంది. పతనం తరువాతి ప్రయాణం మరింత ఉన్నతంగా ఉంటుంది. చీకటి తరువాత వేకువ వంటి ఆశాభావం మాత్రమే కాదు, ఇది మానవజీవిత సారం కూడా. ఎప్పుడూ ఏదో పెనుగులాట, అసహనం మనిషికేమీ సంతోషం కాదు కానీ, నిలవనీటి నిశ్చలత్వం ఆదర్శం కూడా కాదు.

దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల మధ్యలో లద్దాఖ్‌ పరిణామాలు ఒకింత ఆశ్చర్యమే కలిగిస్తాయి. మహాబలశాలి రాజ్యం ముందు చిట్టెలుకల ధిక్కారం దుస్సాహసమే అయినా, సామూహిక మానవస్పందనల తర్కం భిన్నమైనది. సుదీర్ఘకాలం సహనంతో సంయమనంతో చేస్తున్న న్యాయమైన విన్నపాలను పాలకులు ఖాతరుచేయడం లేదనిపించినప్పుడు, తమ ఆకాంక్షలను మరింత దృఢంగా, తీవ్రంగా ప్రకటించాలని ప్రజలు అనుకున్నారు. ఆ ఉధృతిలో కొన్నినిప్పురవ్వలు కూడా రగిలాయి. సమస్యలను పరిష్కరించడంలో సృజనాత్మకత లోపించిన ప్రభుత్వాలు ఏమి చేస్తాయి? పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం జపిస్తాయి. ప్రచ్ఛన్నహస్తాన్ని చూస్తాయి. విదేశీనిధులను కనుగొంటాయి. మూలకారణాలలో అరబ్‌ వసంతం నుంచి నేపాలీ యువగర్జన దాకా ప్రేరణలను కనుగొంటాయి.

భారత దేశంలో తమకు మరింత ప్రతిపత్తి కావాలనడం దగ్గర నుంచి స్వతంత్రత కావాలనడం దాకా డిమాండ్లున్న ఒకనాటి జమ్మూకశ్మీర్‌లో, కశ్మీర్‌ లోయ ఆధిపత్యంలో తమకు తగిన గుర్తింపు, స్వయంపాలనాహక్కులు దొరడం లేదని గొంతెత్తిన ప్రాంతాలు లే, లద్దాఖ్‌. పర్వతప్రాంతాల పాలనాకౌన్సిల్‌ సాధించుకున్నా, అందులోనూ పరిమితమైన ప్రాతినిధ్యహక్కులే దొరకడంతో వారి అసంతృప్తి కొనసాగింది. 2019లో ఆర్టికల్‌ 370ను నిర్వీర్యం చేసి, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ను లెజిస్లేచర్‌తో కూడిన కేంద్రపాలితప్రాంతంగాను, లద్దాఖ్‌ను లెజిస్లేచర్‌ లేని కేంద్రపాలితప్రాంతంగాను చేశారు. తమ ప్రాతినిధ్యం మరింతగా దిగజారిందని, ఒక్క పార్లమెంటు సభ్యత్వంతో జాతీయస్థాయిలో తమ గొంతుకే లేకుండా పోయిందని లద్దాఖ్‌ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రప్రతిపత్తి కావాలని, ప్రాంతాన్ని ఆరోషెడ్యూల్‌ కింద చేర్చి ఆదివాసీప్రాంతాలకు ఉండే ప్రత్యేకరక్షణలు కల్పించాలని, కనీసం రెండు లోక్‌సభ నియోజకవర్గాలు కావాలని ఆ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వారు చేస్తున్న ప్రజా ఉద్యమానికి సోనమ్ వాంగ్‌ చుక్‌ అనే పర్యావరణ వాది నాయకత్వం వహిస్తున్నారు.

ఈ సోనమ్‌ వాంగ్‌ చుక్‌ ఎవరు? ఈయన ఒక ఇంజనీర్‌, విద్యాసంస్కరణవాది, వాతావరణమార్పుల మీద పనిచేసే కార్యకర్త, కొత్త సాంకేతికతలను రూపొందించే సృజనశీలి. లద్దాఖ్‌ లోనే కాదు, మొత్తంగా హిమాలయప్రాంతాలలో పర్యావరణ విధ్వంసాన్ని నిరోధించాలని ఆయన ఉద్యమిస్తున్నారు. హిమగిరిసానువులను కరిగించే పారిశ్రామిక కాలుష్యాన్ని, పచ్చిక మైదానాలను పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టడాన్ని, మితిమీరిన టూరిజాన్ని ప్రోత్సహించడాన్ని, పర్యాటకపరిశ్రమలో స్థానికేతరులను అనుమతించడాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నారు. స్థానిక సంస్కృతిని, సంప్రదాయాలను, ప్రాకృతిక సంపదను పరిరక్షించే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. లద్దాఖ్‌ కోసం విద్యా, సాంస్కృతిక విద్యార్థి ఉద్యమం (సెక్‌మోల్‌) అనే సంస్థను స్థాపించి, విద్యావ్యవస్థలో మార్పులు సాధించారు. సెక్‌మోల్‌ కేంపస్‌ లో పర్యావరణ హిత సౌరవిద్యుత్‌ సరఫరాను ఆయన డిజైన్‌ చేశారు. లద్దాఖ్‌ విద్యావిధానంలో మౌలికమయిన మార్పులు తెచ్చినందుకు 2018 లో ఆయనకు రామన్‌ మెగససే అవార్డు వచ్చింది. ఘనీభూత లే, లద్దాఖ్‌ లలో నాట్ల సీజన్‌లో నీరు లభ్యమయ్యే విధంగా మంచుస్థూపాల టెక్నిక్‌ ను ఆయన రూపొందించారు. నిరాహారదీక్షలు, ఊరేగింపులు, నిరసనల ద్వారా ఆయన లద్దాఖ్‌ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రపంచం దృష్టికి తేవడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. గత ఏడాది ఆయన చేసిన 16 రోజుల నిరాహారదీక్ష లద్దాఖ్‌ సమస్యల వైపు తక్కిన దేశం దృష్టి మళ్లించగలిగింది. ఈ నెలలో కూడా ఆయన పదిహేనురోజుల దీక్ష ప్రారంభించారు. ఉద్యమం హింసాత్మకమైన మలుపు తీసుకోవడంతో దాన్ని ముగించవలసివచ్చింది.

“ప్రభుత్వవ్యతిరేకమని భావించే ఆందోళనలకు, ఉద్యమాలకు ఒక మూసపద్ధతి, ఆచరణ పరికరాలు ఉంటాయని, వాటిని ఒకరి నుంచి ఒకరికి సంక్రమింపజేసి, కార్యక్రమాలను విస్తరింపజేస్తారని ఒక నిందాపూర్వక ప్రచారం గత దశాబ్దంలో జరిగింది. టూల్‌ కిట్‌ ఉద్యమాలు అని వాటికి పేరుపెట్టి, ఆ పేరుతో నేరాభియోగాలు కూడా చేశారు. ఉద్యమాలకు టూల్‌ కిట్‌ లు ఉంటాయో లేదో కానీ, ప్రభుత్వ సంస్థల ప్రతిస్పందనలకు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఒక ప్రజాఉద్యమం బలపడితే, దాన్ని విదేశీ ప్రేరితం అనాలి. దాని నాయకుడికి విదేశీ నిధులు అందుతున్నాయని, ఈ మధ్యనే ఆయన పాకిస్తాన్‌ సందర్శించాడని చెప్పాలి. ప్రసంగంలోని కొన్ని మాటలకు, బయట జరిగిన కొన్ని సంఘటనలకు ముడిపెట్టాలి. ఉద్యమాన్ని, దాని నాయకత్వాన్ని అగౌరవపరచాలి. పర్యావరణ రక్షణ అంటే అభివృద్ధి నిరోధకమని, జాతి వ్యతిరేకమని అనాలి. ఈ టూల్‌ కిట్‌ నే సోనమ్‌ వాంగ్‌ చుక్‌ పైన, లద్దాఖ్‌ ఉద్యమం పైన ప్రయోగించడం విశేషం. కాకపోతే, ఇందులో ఏమీ కొత్తదనం లేకపోవడం మరింత విశేషం.”

శాంతియుత, ప్రజాస్వామిక పద్ధతులలో జరుగుతున్న ఆందోళన, ఎందుకు ఆగ్రహాత్మకంగా మారిందో ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ముప్పై ఆరుసంవత్సరాలుగా నడుస్తున్నది లద్దాఖ్‌ హక్కుల ఆందోళన. లే ప్రాంతానికి చెందిన బౌద్ధులు, కార్గిల్‌ ప్రాంతానికి చెందిన ముస్లిములు తమ ప్రాంతీయసంఘాల ద్వారా ఉమ్మడిగా చేస్తున్న ఉద్యమం ఇది. కశ్మీర్‌ ప్రత్యేకప్రతిపత్తితో పాటు, లద్దాఖ్‌ప్రాంత రక్షణలుకూడా పోయాయి. ఇక మునుపు పర్వతప్రాంత కౌన్సిల్‌ ద్వారా అందిన నామమాత్రపు ప్రతిపత్తి కూడా లాభదాయకంగా లేదు. లెజిస్లేచర్‌లేని కేంద్రపాలిత ప్రాంతంగా పాలనలో ప్రజాభాగస్వామ్యమే లేదు. ఇదే అదనుగా, లద్దాఖ్‌లో ప్రాకృతికవనరులను పెట్టుబడుదారులకు కట్టబెడుతున్నారు. ప్రజల అసంతృప్తి ఆవేశంగా వ్యక్తం కావడానికి ఇంకేమి కారణాలు కావాలి? వాంగ్‌చుక్‌ వంటి విద్యావంతుడు, పర్యావరణవాది, ప్రజాస్వామికవాది ని కూడా జాతీయభద్రతాచట్టం కింద అరెస్టు చేస్తే, ప్రజాకాంక్షలను వ్యక్తం చేయడానికి అర్హత కలిగిన నాయకులు ఎవరు? ఏ మాత్రం పసలేని ఆరోపణలతో ఆయనను అపఖ్యాతి పాలుచేస్తే, అతని వ్యక్తిత్వం తెలిసిన ప్రజల దృష్టిలో ప్రభుత్వం ప్రతిష్ఠ ఏమవుతుంది? అరబ్‌ వసంతాన్ని, నేపాల్‌ తిరుగుబాటును ప్రస్తావిస్తేనే అపచారమైతే, సిపాయిల తిరుగుబాటును, భారత జాతీయోద్యమాన్ని గొప్పగా చెబితే కూడా ఉగ్రవాదులనో తీవ్రవాదులనో అంటారా? లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలను మేం నెరవేర్చేపనిలోనే ఉన్నాము, ఇంతలోనే తొందరపడి వాంగ్‌చుక్‌ దౌర్జన్యానికి పాల్పడ్డారని పాలకులు ఇప్పుడు కొత్తరాగం తీస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధంగా తమ సమస్యలను, కోర్కెలను ప్రభుత్వానికి విన్నవించుకోవాలని భావించే ప్రజలకు ఈ వైఖరి వల్ల ఏమి సందేశం అందుతోంది?

కార్పొరేట్ల కోసం అడవులను ఖాళీచేస్తున్నారని విన్నాము, చూస్తున్నాము. ఇప్పుడు హిమాలయాలకు కూడా అదే గతి పడుతున్నది. సకలసేనలను మోహరించి, కశ్మీర్‌ను కట్టుదిట్టం చేయగలిగారు కానీ, ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపు ద్వారా స్థానికులకు, స్థానిక వనరులకు దక్కిన రక్షణలు పోయాయని జమ్మూలోనూ, ఇప్పుడు లద్దాఖ్‌ లోనూ వ్యక్తమవుతున్న నిరసనలను వ్యక్తం కాకుండా ఆపగలుగుతున్నారా? కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎంతదూరమైనా వెడుతుందని, ఆందోళనలను తీవ్రంగా అణచివేస్తుందని తెలిసినా, లద్దాఖ్‌ జనం ఎందుకు మౌనంగా ఉండలేదు? ఉండలేరు. ఒకచోట అణచివేసినంత మాత్రాన, మరోచోట కూడా అణగారిపోతుందని చెప్పలేము. ఏ ఆయుధాలూ పట్టకుండా ప్రభుత్వం మీద నైతిక ఒత్తిడి తీస్తున్న ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ పోతే, అంతిమంగా నైతికత శూన్యమయ్యేది ఎవరికి?

ప్రభుత్వవ్యతిరేకమని భావించే ఆందోళనలకు, ఉద్యమాలకు ఒక మూసపద్ధతి, ఆచరణ పరికరాలు ఉంటాయని, వాటిని ఒకరి నుంచి ఒకరికి సంక్రమింపజేసి, కార్యక్రమాలను విస్తరింపజేస్తారని ఒక నిందాపూర్వక ప్రచారం గత దశాబ్దంలో జరిగింది. టూల్‌ కిట్‌ ఉద్యమాలు అని వాటికి పేరుపెట్టి, ఆ పేరుతో నేరాభియోగాలు కూడా చేశారు. ఉద్యమాలకు టూల్‌ కిట్‌ లు ఉంటాయో లేదో కానీ, ప్రభుత్వ సంస్థల ప్రతిస్పందనలకు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఒక ప్రజాఉద్యమం బలపడితే, దాన్ని విదేశీ ప్రేరితం అనాలి. దాని నాయకుడికి విదేశీ నిధులు అందుతున్నాయని, ఈ మధ్యనే ఆయన పాకిస్తాన్‌ సందర్శించాడని చెప్పాలి. ప్రసంగంలోని కొన్ని మాటలకు, బయట జరిగిన కొన్ని సంఘటనలకు ముడిపెట్టాలి. ఉద్యమాన్ని, దాని నాయకత్వాన్ని అగౌరవపరచాలి. పర్యావరణ రక్షణ అంటే అభివృద్ధి నిరోధకమని, జాతి వ్యతిరేకమని అనాలి. ఈ టూల్‌ కిట్‌ నే సోనమ్‌ వాంగ్‌ చుక్‌ పైన, లద్దాఖ్‌ ఉద్యమం పైన ప్రయోగించడం విశేషం. కాకపోతే, ఇందులో ఏమీ కొత్తదనం లేకపోవడం మరింత విశేషం.

నేపాల్‌ కానీ, లద్దాఖ్‌ కానీ, ప్రపంచానికి, ఉద్యమసమాజాలకు ఏవో సందేశాలు ఇస్తున్నాయి. దౌర్జన్యపూరితంగా దాడులుచేయమనో, దహనకాండకు పాల్పడమనో అవి చెప్పడం లేదు. వ్యవస్థలు కుళ్లిపోతున్నప్పుడు ప్రేక్షకప్రాయంగా ఉండవద్దని, కల్పించుకొమ్మని నేపాల్‌ ఉదంతం చెబితే, దీర్ఘకాలిక సంయమనంతో తమ వాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని, ఐకమత్యంతో శక్తిని చాటాలని లద్దాఖ్‌ చెబుతోంది. ప్రభుత్వాలకు కూడా అవి సందేశాలు ఇస్తున్నాయి. గ్రహించడం వాటి వాటి బాధ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *