ఏ దేశ అభివృద్ధిలోనైనా విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, ఉన్నత విద్య యొక్క పరిమాణం, నాణ్యత అందించే విద్యా కార్యక్రమాల ఔచిత్యము శ్రేష్ఠత పెంపొందించేందుకు నియంత్రణ మండలి, న్యాక్ ఎన్బీఏ లాంటి అక్రిడేషన్ సంస్థలు ప్రవేశపెట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థలు, విద్యా సంస్థలు తమ పనితీరును నిర్దేశించిన పరమితులకు అనుగుణంగా ఆత్మపరిశీలన ద్వారా విద్య వనరులు, బోధనా పద్ధతులు నాణ్యమైన విద్య, సామాజిక సమగ్రత, శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగాభివృద్ధి, వినూత్న బోధనా పద్ధతులు అందించే ప్రక్రియ ద్వారా అంచనా వేయడానికి న్యాక్ ఏర్పాటు చేయబడింది. విద్యాసంస్థలు ఇచ్చిన సమాచారంతో కూడిన సమీక్ష ప్రక్రియ ద్వారా సంస్థ తన బలాలు, బలహీనతలు అవకాశాలను తెలుసుకోవాలి. ఉన్నత విద్యా సంస్థలకు స్వయంప్రతిపత్తి కలిగిన అక్రిడిటేషన్ ఏజెన్సీ, నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఐదు సంవత్సరాల పాటు సర్టిఫికేషన్ కోసం దరఖాస్తును సమర్పించకుండా నిరోధించింది.
న్యాక్ ఇన్ఫెక్షన్ లో కేఎల్ కు ఏ++ గ్రేడ్ పొందడానికి లంచాలు చెల్లించారనే ఆరోపణలకు సంబంధించి సీబీఐ కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ వీసీ, డైరెక్టర్, వైస్ చైర్మన్ ను అదుపులోకి తీసుకున్న వారం తర్వాత ఇది జరిగింది. పీర్ బృందంలోని ఏడుగురు సభ్యులు అసెస్‌మెంట్‌లలో లేదా ఇతర న్యాక్ కార్యకలాపాలలో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధించాలని కూడా నిర్ణయించింది. అంతేకాకుండా, ఫలితాలు ఇంకా ప్రకటించబడని ఉన్నత విద్యా సంస్థలు కు ఏడుగురు సభ్యులు ఇటీవల చేసిన సందర్శనలలో దేనినైనా సమీక్షిస్తారు. అటువంటి ఉన్నత విద్యా సంస్థల పరిశోధన ఫలితాలు గోప్యంగా ఉంచబడతాయి ఫలితాలు బహిరంగంగా ప్రకటించే ముందు న్యాక్ స్టాండింగ్ కమిటీ ఒక క్లిష్టమైన మూల్యాంకనాన్ని నిర్వహించవచ్చు. గత సంవత్సరం సందర్శనలు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే అదనపు చర్య కోసం ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ కు సమర్పించాలని న్యాక్ ఒక ప్రకటనలో పేర్కొంది. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు అనుగుణంగా, న్యాక్ 2025 ఏప్రిల్-మే లో ప్రాథమిక అక్రిడిటేషన్ ను ప్రారంభిస్తుంది. దీని తర్వాత మెచ్యూరిటీ ఆధారిత గ్రేడెడ్ లెవల్స్ ఉంటాయి.
దేశ ఉన్నత విద్యా వ్యవస్థలో జరిగిన భారీ అవినీతి బయటపడింది. ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అనుకూల గ్రేడ్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే డబ్బులు తీసుకుని నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వంటి ఘటనలు మరవక ముందే మళ్లీ నాక్ గ్రేడ్ కోసం కోట్ల రూపాయాల డబ్బులను డిమాండ్ చేయడం బయటపడింది. జేఎన్‌యూ ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా కేయల్ యూనివర్సిటీకి నాక్ తనిఖీ నివేదికను తారుమారు చేయడానికి క్యాంపస్‌లోని తన నివాసంలో లంచం కోసం చర్చలు జరిపారు. అనుకూలమైన అక్రిడిటేషన్ గ్రేడ్ ఇవ్వడానికి నాక్ బృందం సభ్యులు కేఎల్ఈఎఫ్ నుంచి రూ.1.8 కోట్లు డిమాండ్ చేశారు. చర్చల తర్వాత, రూ.28లక్షలకు ఒప్పందం ముగిసింది. ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా ప్రధాన వాటాను సొంతం చేసుకున్నారు. సీబీఐ సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసింది. ప్రొఫెసర్ సిజారియాతో సహా మొత్తం పది మందిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
అనుకూల గ్రేడ్‌ల కోసం లంచం ఇవ్వడం, తీసుకోవడం దారుణం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలనలో పెంచి పోషించిన అవినీతి వ్యవస్థ ప్రత్యక్ష ఫలితమే ఈ ఉదంతం. అర్హత లేని పార్టీ విధేయులు ఉన్నత విద్యా సంస్థల్లో కీలకమైన స్థానాల్లో ఉన్నారు, సంస్థలను మోసం, పక్షపాత కేంద్రాలుగా మారుస్తున్నారు. ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా చాలా కాలంగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వ్యక్తి. ప్రస్తుత యూజీసీ చైర్మెన్, జేఎన్‌యూ మాజీ వైస్ ఛాన్సలర్ మామిడాల జగదీశ్ కుమార్ వ్యక్తిగతంగా నియమించుకున్నారు. విద్యారంగంలో అకస్మాత్తుగా ఎదగడానికి ముందు, సిజారియా కిర్లోస్కర్ జనరేటర్లకు సేల్స్‌మ్యాన్‌గా ఉన్నాడు. తర్వాత ప్రయివేట్ బిజినెస్ స్కూల్స్‌లో చేరాడు. 2020లో మామిడాల జగదీష్ కుమార్ ఆయనను జెఎన్‌యులో ఫ్యాకల్టీ సభ్యుడిగా నియమించారు. 2023 నాటికి ప్రస్తుత విసి శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఆధ్వర్యంలో డీన్ పదవికి ఎదిగాడు. ఆయన విద్యాపరమైన ప్రతిభ ఆధారంగా కాకుండా రాజకీయ ప్రోత్సాహం ఆధారంగా ఎదిగారు. ఆయన 2016లో యూపీలోని మీరట్‌లో ఏబీవీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మామిడాల జగదీశ్ కుమార్.. సిజారియాకు జేఎన్‌యూలో పదోన్నతి కల్పించడమే కాకుండా బీహెచ్‌యూ కోర్టు, ఏఐసీటీఈ సలహా కమిటీ, నిట్, ఐఐఈఎస్‌టీ శిబ్‌పూర్, ముఖ్యంగా నాక్‌లో కూడా పదవులు పొందారు. ఆయన ఇప్పుడు అవినీతి సామ్రాజ్యాన్ని నియమించుకున్నాడు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విద్యా సంస్థలలోకి చొరబడిందని అని చెప్పడానికి చక్కని తార్కాణం. ఇలాంటి నేర చరిత్ర గడ్డి తినే స్వభావం ఉన్నవారు ఇటీవల కాలంలో కేంద్ర సంస్థలలో అధినేతలు గా చలామణి అవుతున్నారు.
ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇచ్చే సమయంలో యూజీసీ కొన్ని కఠిన నిర్ణయాలు తూచా తప్పకుండా పాటించాలి, లేనిచో ఇంకోసారి ఆ విశ్వవిద్యాలయాలకు గుర్తింపు రద్దు చేస్తారు. కానీ ఇలాంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు ప్రో వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, బోర్డు మెంబర్ లు అందరు గతంలో యూజీసీ లోను / ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవులు వెలగబెట్టిన వారే. ప్రైవేటు విశ్వవిద్యాలయాల వెబ్సైట్ పరిశీలిస్తే ప్రతి ప్రైవేటు విశ్వవిద్యాలయంలో యూజీసీ, ఏఐసీటీఈ, న్యాక్, ఎన్బీఏ లో డైరెక్టర్లు, సలహాదారులు, పేరెన్నిక కలిగిన విశ్వవిద్యాలయాలలో ఉపకులపతిగా పనిచేసినవారు ఉంటున్నారు. వీరందరూ రిటైర్ అయిన తరువాత తమ కుటుంబంతో గడుపుతుంటారు తప్ప అక్కడకు వెళ్ళేది కేవలం రెండు నెలలకు ఒకసారి. వీరంతా మా బలమని ఈ విశ్వవిద్యాలయాలు విర్రవీగు తుంటాయి. వారికైతే ప్రభుత్వ మరియు యూజీసీ వివిధ విభాగాలలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నందిని పంది గా సులభంగా మార్చవచ్చు. కంచె చేను మేస్తే కాపు ఏమి చేయగలరు. ఇటువంటి అనైతిక పద్ధతులతో మన ఉన్నత విద్యా వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయి. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి విద్యా నైపుణ్యం ప్రమాణాలు నిలబెట్టడానికి త్వరిత నిర్ణయాత్మక చర్య అవసరం.
డాక్టర్ . యం. సురేష్ బాబు,
విద్య పరిరక్షణ కమిటీ





