ఈ ‌తీర్పులు రాజ్యాంగ మౌలిక తత్వాన్ని ప్రతిబింబిస్తాయా!?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ ‌వెలువడ్డప్పటి నుండి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నియామక ప్రక్రియలో భాగంగా జీఓ  55 కు బదులుగా తెచ్చిన కొత్త జీఓ  29 మీద దాఖలైన వివిధ కేసులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ఇటీవల ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిటిషన్లు ఆలస్యంగా వేయడాన్ని తప్పు పడుతూ జస్టిస్‌ ‌సుజోయ్‌ ‌పాల్‌,‌జస్టిస్‌ ‌జి.రాధా రాణి ధర్మాసనం మొత్తంగా దాఖలైన ఏడు పిటిషన్‌ ‌లను కొట్టివేసింది. రూల్‌ ఆఫ్‌ ‌రిజర్వేషన్లు ప్రిలిమ్స్ ‌లోనూ, మెయిన్స్ ‌లోనూ వర్తింపచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ ‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను పూర్తిస్థాయిలో విన్న తర్వాత ‘‘ఆలస్యం’’ అయ్యిందనే కారణంతో అన్ని పిటిషన్లను కొట్టివేయడం విస్మయాన్ని కలిగించిందని పలువురు న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘‘ఆలస్యం’’ కారణంగా న్యాయ పరిశీలన చేయాలా?వద్దా? అనే సరికొత్త అంశం తెరపైకి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2022లో తొలిసారిగా గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ ‌విడుదల కావడం, ప్రిలిమ్స్ ‌పరీక్ష నిర్వహించడం, అది కాస్త లీకేజీ కారణంగా రద్దవ్వడం, ఆ తర్వాత నిర్వహించిన రెండవ ప్రిలిమ్స్ ‌సైతం నిబంధనలు పాటించలేదనే కారణంతో మళ్లీ అది రద్దు కావడం జరిగింది. తిరిగి ప్రిలిమ్స్ ‌నిర్వహించమని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌ ‌ను పూర్తిగా రద్దుచేసి 2024 ఫిబ్రవరిలో మరో 60 పోస్టులను అదనంగా కలిపి మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌ ‌లోని  జీఓ  55 స్థానంలో జీఓ  29 ను తీసుకురావడం జరిగింది. జీఓ  55 ద్వారా రిజర్వేషన్ల వారీగా 1:50 చొప్పున మెయిన్స్ ‌కు ఎంపిక జరగగా జీఓ  29 ద్వారా మొత్తం పోస్టులకు 1:50 చొప్పున మెయిన్స్ ‌కు ఎంపిక చేస్తూ ఆయా రిజర్వేషన్లలో తక్కువగా ఉన్న అభ్యర్థులను అదనంగా తీసుకోవడం జరిగింది.

ఓపెన్‌ ‌కేటగిరిలో ఎంపికయిన రిజర్వేషన్‌ అభ్యర్థులను రిజర్వేషన్‌ ‌కేటగిరీ కింద పరిగణించరాదని సౌరవ్‌ ‌యాదవ్‌ ‌కేసులో పేర్కొనగా, అన్ని స్థాయిలలో సామాజిక రిజర్వేషన్లు అమలు పరచాలని దీపేందర్‌ ‌యాదవ్‌ ‌కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జీఓ  29 సుప్రీంకోర్టు తీర్పులకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని పేర్కొంటూ రాంబాబు అనే అభ్యర్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ ‌ను పరిశీలించి, క్షుణ్ణంగా ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత కూడా తుది తీర్పులో ‘‘న్యాయశీలత’’ను వ్యక్త పరచకుండా ‘‘ఆలస్యం’’ గా కోర్టును ఆశ్రయించారు అనే కారణంతో పిటిషన్లను కొట్టివేయడం జరిగింది. జీఓ  29 విడుదల చేసినప్పుడు పబ్లిక్‌ ‌డొమైన్‌ ‌లో పెట్టలేదని ప్రిలిమ్స్ ‌ఫలితాలు వెలువడ్డ తర్వాతనే బహిర్గతం చేశారని, అప్పుడే దాని ప్రభావాన్ని అంచనా వేయగలిగామని, అప్పుడే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం జరిగిందని అలాంటప్పుడు ఆలస్యమైనదని ఎలా భావిస్తామని పిటిషన్‌ ‌తరపు న్యాయవాది వాదించిననూ దానిని పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. పిటిషన్లు దాఖలు అయిన సమయంలోనే ఆలస్యం అయినదా?లేదా? అనే విషయం సంబంధిత న్యాయమూర్తులకు తెలుసు కదా! అలాంటప్పుడు ఇరుపక్షాల వాదనలు వినడం దేనికి? విన్న తర్వాత జీఓ  29 మీద నిర్ణయాన్ని వెలిబుచ్చకుండా తుది తీర్పులో ‘‘ఆలస్యం’’ అనే మాట చేర్చి పిటిషన్‌ ‌లను కొట్టివేయడంలో ఆంతర్యం ఏమిటని రాజ్యాంగ నిపుణులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఆలస్యం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రతిబింబిస్తుందా! అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా ‘‘ఆలస్యం’’గా కోర్టులను ఆశ్రయించినంత మాత్రాన ‘‘న్యాయ పరిశీలన’’ ను విస్మరించరాదని, ఆలస్యం అనే కారణంతో పిటీషన్‌ ‌ను కొట్టివేయరాదని జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్త, జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ఉజ్జల్‌ ‌భుయాన్‌ ‌తో కూడిన సుప్రీం కోర్ట్ ‌త్రిసభ్య ధర్మాసనం అంతకుముందే తీర్పు వెలువరించింది. అంతేకాక రామ్‌ ఆథూర్‌ ‌సింగ్‌ ‌యాదవ్‌ ‌వర్సెస్‌ ‌ది స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర ప్రదేశ్‌ ‌కేసులోనూ ప్రాథమిక హక్కులు మరియు రాజ్యాంగం దృష్ట్యా  ‘‘ఆలస్యం’’మరియు ‘‘ఉద్దేశపూర్వక అలసత్వం’’ అనే కారణాలతో పిటిషన్లను కొట్టివేయరాదని డిసెంబర్‌ 4, 2024 ‌న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతకుముందు అశోక్‌ ‌కుమార్‌ ‌వర్సెస్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ‌బీహార్‌ ‌కేసులోనూ, అభిమీత్‌ ‌సిన్హా కేసులోనూ, మనీష్‌ ‌కుమార్‌ ‌షాహి కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పులకు ఇటీవల తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు విరుద్ధంగా ఉన్నది. ఇలా విరుద్ధమైన తీర్పులు వెలువడిన నేపథ్యంలో తుదకు అత్యున్నత న్యాయస్థానం తీర్పే చెల్లుబాటు అవుతుందనేది రాజ్యాంగం తెలుపుతుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలన చేసి కిందిస్థాయి కోర్టులు తీర్పు ఇవ్వవలసి ఉండేదని న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. హైకోర్టులో చుక్కెదురైన అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు.

మరోపక్క 2011 గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్ష ‘కీ’లో దొర్లిన రెండు తప్పిదాల దృష్ట్యా అప్పటికే మెయిన్స్ ‌పరీక్షలు నిర్వహించబడి ఇంటర్వ్యూలు సైతం పూర్తి చేసుకుని సెలక్షన్‌ ‌లిస్టు ప్రచురించిన తర్వాత కూడా జస్టిస్‌ ‌జాస్తి చలమేశ్వర్‌ ‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రక్రియను రద్దు చేస్తూ తిరిగి మెయిన్స్ ‌పరీక్షలు నిర్వహించమని ఆదేశించింది. ఆ తీర్పులో ‘కీ’ లో తప్పిదాలు జరగడం వల్ల నియామక ప్రక్రియ సహేతుకంగా ఉండదని అభిప్రాయపడుతూ ‘కీ’ని సరిచేసి మెయిన్స్ ‌జాబితాను పునరుద్ధరించి పరీక్షలు నిర్వహించమని పేర్కొంది. కానీ ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్ష ‘కీ’ విషయంలో 14 తప్పులు దొర్లాయని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వాటిని ఏమాత్రం పరిశీలన చేయకుండా ఒకట్రెండు తప్పులు జరగడం సహజమని అంతమాత్రాన ప్రక్రియను ఆపలేమని ఆ పిటిషన్లను ఆదిలోనే కొట్టివేసింది. నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రిలిమ్స్ ‌పరీక్షలో దొర్లిన తప్పిదాల విషయంలో ఇలా విభిన్నమైన తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఏది సరైనదో వివరణ ఇవ్వాలని అటు అభ్యర్థులు, ఇటు సగటు పౌరులు మొరపెట్టుకుంటున్నారు.

పైన పేర్కొన్నట్లు ‘‘ఆలస్యం’’ అనే కారణంగా పిటిషన్‌ ‌లను కొట్టివేయడం, న్యాయశీలతను పరిశీలించకపోవడం అనేది రాజ్యాంగ మౌలిక తత్వాన్ని ప్రదర్శిస్తున్నదా? అనేది అత్యున్నత న్యాయస్థానం తేల్చాల్సి ఉన్నది. రాజేష్‌ ‌కుమార్‌ ‌దారియా కేసు లో వికలాంగుల కోటాను సమాంతరంగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్‌ ‌కోటాను వర్టికల్‌ ‌గా భర్తీ చేయడాన్ని హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌లో సవాలు చేస్తూ వేసిన మరో పిటిషన్‌ ‌ను కూడా హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. అట్లే పరీక్ష ‘కీ’ లో తప్పులు ఉన్ననూ నియామక ప్రక్రియను కొనసాగించవచ్చా? అనే విషయంలో కూడా అత్యున్నత న్యాయస్థానమే స్పష్టతను ఇచ్చి న్యాయవ్యవస్థ స్వతంత్రతను ఏకీకృత లక్షణాన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఉన్నదని న్యాయ నిపుణులు కోరుతున్నారు.
– భాస్కర్‌ ‌యలకంటి
సోషల్‌ ఎనలిస్ట్, ‌చరవాణి:8919464488

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *