UNO 1976 – 85 అంతర్జాతీయ మహిళా దశాబ్దిని ప్రకటించినాక ప్రపంచవ్యాప్తంగా స్త్రీల స్థితిగతులపై అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో స్త్రీల హోదాను అంచనా వేయడమే కాకుండా ఆయా రంగాలలో వారిపై కొనసాగుతున్న వివక్షను తగ్గించి స్త్రీ పురుష సమానత్వం సాధించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలనే డిమాండులు ముందుకొచ్చాయి. అంతర్జాతీయ మహిళా దశాబ్దం స్ఫూర్తి సాహిత్య రంగం మీద స్పష్టంగా కనిపించడం విశేషం. గతంలో స్త్రీలు సాహిత్యంలో తమదైన స్పృహతో రాస్తున్నప్పటికి సాహిత్యంలో స్త్రీవాదం అనే ధోరణి మాత్రం అంతర్జాతీయ మహిళా దశాబ్ది స్ఫూర్తితోనే ముందుకొచ్చి స్త్రీలు రాసే సాహిత్యంలో జెండర్ స్పృహ వ్యక్తమౌతుంది.
అయితే రాసే స్త్రీలందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, చర్చలతో ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యారని చెప్పలేము కానీ ఎన్. జీ. వోలు చాలావరకు దీనిపై ప్రచారం చేశాయని చెప్పొచ్చు. 80, 90 దశకాలలో వచ్చిన స్త్రీవాద సాహిత్యం కంటే గత రెండు దశకాల స్త్రీల సాహిత్యంలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. తొలిదశ స్త్రీవాద సాహిత్యం సమాజంలో స్త్రీలందరి హోదా, గుర్తింపు ఒకటే అన్న ధోరణిని ప్రదర్శిస్తే 2000 తర్వాత వస్తున్న స్త్రీల సాహిత్యం కులం, పితృస్వామ్యం మధ్య ఇంటర్ సెక్షనాలిటీ పైన కూడా ఫోకస్ చేస్తుంది. ఈ దశలో అణగారిన కులాల నుంచి చెప్పుకోదగిన స్థాయిలో రచయిత్రులు ముందుకొచ్చి స్త్రీవాద సాహిత్యంలో ఖాళీలను పూరిస్తున్నారు. దళిత, వెనుకబడిన, ఆదివాసీ, మైనారిటీ స్త్రీల ప్రత్యేక అదనపు సమస్యలు ఈ సాహిత్యంలో చర్చకు వచ్చాయి దీనికి కేవలం అంతర్జాతీయ మహిళా దశాబ్ద ప్రకటన మాత్రమే కాకుండా దళిత, బహుజన ఉద్యమాలు కూడా దోహదం చేశాయని చెప్పొచ్చు.





