స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్‌ సన్నద్ధం

ప్రజాతంత్ర నెట్వర్క్,ఫిబ్రవరి 06:  రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడంద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రానున్న వరుస ఎన్నికలకు మార్గం సుగమమం చేసుకుంది. ఇటీవల ఖాళీ ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలతోపాటు స్థానికసంస్థల ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ పరంపరను కైవసంచేసుకునే దిశగా అధికారపార్టీ ప్రధానమైన ఈ రెండు అంశాలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణతోపాటు సమగ్ర సర్వే ఆధారంగా బిసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించి ఆ వర్గాలనుండి ప్రశంస లందుకుంది.  ఈమేరకు మంగళవారం హడావిడిగా ఏర్పాటుచేసిన మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదముద్రవేసింది. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అసెంబ్లీ సమావేశంలో ఈ అంశాలపై చర్చ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రజాభిప్రాయం మేరకే ఈ రెండు అంశాలపైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇది ఒకవిధంగా త్వరలో రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసివచ్చే అవకాశంలేకపోలేదు. ఇటీవల ఈ రెండు అంశాలకు సంబందించి ఆయావర్గాలు సభలు, సమావేశాలు జరుపడం వెనుకకూడా ప్రభుత్వ పెద్దల ఆలోచనే ఉండిఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బిసీల రిజర్వేషన్‌లకు సంబందించి తీర్మానంచేసి కేంద్రానికి పంపడంతోపాటు, ఎస్సీ వర్గీకరణకు సంబందించి అన్నిపార్టీల అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఏడాదిక్రితం జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా బిసీలకు ఇచ్చిన హామీలో భాగంగానే తామీ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్‌ ‌పేర్కొంటున్నది. 2023 ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డిలో ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ బిసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది.

స్థానిక సంస్థల్లో బిసీలకు 42 శాతం రిజర్వేషన్లను వర్తింపజేస్తామని ఆనాడు పేర్కొంది. ఇచ్చిన మాట ప్రకారం రానున్న స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ను కలిపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతోపాటు, జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌రంగం సిద్దంచేసుకున్నట్లేనంటున్నారు. కాగా ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ల అమలు విధివిధానాలను రూపొందించి గెజిట్‌ ‌జారీచేయాల్సి ఉంటుంది. అనంతరం ఎన్నికల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇస్తుంది. అయితే ఈ ప్రక్రియ అంతా మరో వారంరోజుల్లో పూర్తి కానుందనుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నది. అయితే ముందుగా జడ్‌పిటిసి, ఎంపిటీసిల ఎన్నికలు పూర్తిచేసి, సర్పంచ్‌ల ఎన్నికలు జరిపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఇప్పటికే తమ అభ్యర్ధులను సిద్దంచేసుకునేపనిలో ఉండగా, బిఆర్‌ఎస్‌లో ఇంకా ఆ హడావిడి కనిపించడంలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *