“ప్రస్తుతం బంగ్లాదేశ్ యావత్తు మతోన్మాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సుఫీ ప్రార్థనా మందిరాలను, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం లేదా పాడు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మహిళ లను ఫుట్ బాల్ ఆడనివ్వడంలేదు. సంగీతం, సాంస్కృతిక కార్యకలాపాలపై మతోన్మాదులు నిషేధం అమలు చేస్తున్నారు. మత ఛాందసవాదులు దేశంలో బహుళ సమాజాన్ని ఎంతమాత్రం అంగీకరించడం లేదు. వీరిలో భారత వ్యతిరేకత నరనరానా జీర్ణించుకు పోవడంతో, భారత అనుకూలురన్న వారిపై అమానవీయ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల రెండు మీడియా సంస్థ లపై జరిపిన దాడులు కేవలం అవి భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నా యన్న ఆరోపణలపైనే కావడం ఇందుకు నిదర్శనం!”
మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం, యూనస్ ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గరినుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితులు నానాటికీ దారుణ స్థాయికి దిగజారిపోతున్నాయి. యూనస్ మతఛాందస జామాత్`ఇ`ఇస్లామీ సంస్థపై నిషేధాన్ని ఎత్తేయడం, ఉగ్రవాదులను మంత్రి మండలిలో చేర్చుకోవడం దేశ పరిస్థితి హింసాత్మకంగా మారడానికి ప్రధాన కారణం. తాజాగా యువనేత ఉస్మాన్ హాదీ హత్యలో ప్రభుత్వ ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ప్రభుత్వాన్ని ప్రస్తుతం చిక్కుల్లో పడేస్తున్నాయి. యువ నాయకుడు, ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హదీ (32) హత్యతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతవారం బంగ్లాదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంగా గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇతను మరణించాడు. ఈ హత్యతో పేట్రేగిపోయిన రాడికల్ గ్రూపులు ఢాకాలోని భారత రాయబార కార్యాలయం వైపునకు దూసుకు రాగా, భద్రతా బలగాలు నిలువరించాయి. చిట్టగాంగ్‌లోని భారత హైకమిషన్ భవనంపై అల్లరిమూకలు రాళ్లు విసిరాయి. ఒకవైపు ఈ హత్యకు ప్రధాన కారణం హసీనా మద్దతుదారులేనని హదీ అనుచరులు ఆరోపిస్తున్నారు. మరోవైపు హదీ సోదరుడు ఒమర్ చేసిన ప్రకటన అధ్యక్షుడు యూనస్ ప్రభుత్వానికి ఎసరు తెచ్చేదిగా ఉంది . ‘‘మా సోదరుడిని హత్య చేసింది మీరే. ఈ సాకుతో వచ్చే ఫిబ్రవరి 12న జరగాల్సిన ఎన్నికలను వాయిదావేయాలన్న దుష్టం సంకల్పం మీది. ఈ హత్యపై ప్రభుత్వం తక్షణం విచారణ జరపాలి. 30 రోజుల్లోగా దోషులను నిర్ధారించి కఠిన శిక్ష విధించక పోతే, మీరు కూడా హసీనా మాదిరిగానే దేశాన్ని విడిచి పారిపోయే పరిస్థితు లు ఏర్పడతాయని’’ చేసిన హెచ్చరిక ఇప్పుడు యూనస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.
హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఉస్మాన్ హదీదే కీలకపాత్ర. ఇదిలా వుండగా హసీనా నాయకత్వంలోని అవామీలీగ్ పార్టీపై బంగ్లా ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో బేగం ఖలీదా జియా నాయకత్వంలోని బాంగ్లాదేశ్ నేష నలిస్ట్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ మత ఛాందస జామాతే ఇస్లామీ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ఈ పార్టీ ఫిబ్రవరిలోగా మరిన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడి భయోత్పాతం సృష్టించి పరిస్థితిని తనకు అనుకూలం గా మలచుకోవడానికి ప్రయత్నించక మానదు. ఇందుకోసం దేశంలో భారత వ్యతిరేకతను మరింత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశాలే ఎక్కువ.
ఇదిలావుండగా అవామీలీగ్‌పై నిషేధం విధించకపోతే ఆపార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్న సంగతి యూనస్‌కు బాగా తెలుసు. నిషేధాస్త్రం ప్రయోగానికి ప్రధాన కారణం ఇదే. ఈ నిషేధంపై అమెరికా తాజాగా ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడం యూనస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇటీవల డైలీ స్టార్, ప్రోథమ్ అలో మీడియా సంస్థలపై దాడులు చేసిన రాడికల్ గ్రూపులు, తాజాగా గ్లోబల్ టీవీ అధినేత నాజ్నిన్ మున్నీని తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించడంతో బంగ్లాదేశ్‌లో ఇప్పటికే అట్టడుగుకు దిగజారిన సెక్యులరిజం మరింత పతన పథంలోకి ప్రయాణిస్తోందని స్పష్టమవుతోంది. నిజం చెప్పాలంటే ఉస్మాన్ హదీ హత్య తర్వాత అక్కడి మతతత్వ శక్తులు భారత్‌పై తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే మతోన్మాదులు దీప్‌చంద్రదాస్ అనే 27 ఏళ్ల హిందూ యువకుడిని దైవదూషణ పేరుతో దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ఢాకా మైమన్ గంజ్ హైవే మీదకు లాక్కెళ్లి అక్కడ ఒక చెట్టుకు వేలాడదీసి బహిరంగంగా తగులబెట్టారు. ఇతను మైమెన్ సింగ్ పట్టణంలోని ఒక బట్టల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అంతా జరిగిన తర్వాత అతను దైవ దూషణ చేసినట్టు ఆధారాలు లేవని తాపీగా పోలీసులు చెప్పడం వారి తీవ్ర నిర్లక్ష్య వైఖరిని వెల్లడిస్తోంది. అంతేకాదు దాస్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని యాంటీ క్రైం ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్‌ఏబీ) స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ సంఘటకు సంబంధించి ఆర్‌ఏబీ పన్నెండు మందిని అరెస్ట్ చేసింది. ఫ్యాక్టరీ సీనియర్ మేనేజర్ ‘‘అల్లరి మూకను శాంతింప జేసేందుకు దాస్ చేత ఉత్తిత్తి రాజీనామా చేయించాం.
ఈ చర్య సహోద్యోగులను, మతోన్మాదులను శాంతిపజేయలేకపోయింది’’ అని చెప్పడం బంగ్లాలో మతోన్మాదం ఏస్థాయి లో ఉన్నదీ చెప్పకనే చెబుతున్నది. తర్వాత ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చట్టోగ్రామ్ ప్రాంతంలో నివసిస్తున్న జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే భారతీయ హిందూ కుటుంబంపై మతతత్వ అల్లరి మూకలు దాడికి ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న హిందువులు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు ఆపకపోతే, మీ ఆస్తులు, వ్యాపారాలు, నివాసాలను వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఒక హెచ్చరిక నోట్‌ను బెంగాలీ భాషలో రాసి ఈ ప్రాంతంలో అంటించారు.
ఈవిధంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిజం చెప్పాలంటే ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 258 మైనారిటీలపై దాడుల సంఘటనలు చోటు చేసుకోగా వీరిలో అధికశాతం మంది హిందువులే ఉన్నట్టు తేలింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌లో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. దిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాన్ని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ముట్టడిరచడం తాజా పరిణామం. ఈ పరిణామాలు ఒకవైపు కొనసాగుతుండగానే, బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన మహమ్మద్ మోతేలాబ్ సికిదార్‌ను ఈనెల 22 ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో బుల్లెట్లు చెవిని చీల్చుకుంటూ వెళ్లాయి. అతని ప్రాణానికి ప్రమాదం లేదని చెబుతున్నారు. పార్టీకి చెందిన శ్రామిక్ శక్తి విభాగంలో సెంట్రల్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నాడు. ఖులానా మెట్రోపాలి టన్ యూనిట్‌లో ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తుండగా అతనిపై దుండగులు కాల్పులు జరిపారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ యావత్తు మతోన్మాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సుఫీ ప్రార్థనా మందిరాలను, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం లేదా పాడు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మహిళ లను ఫుట్ బాల్ ఆడనివ్వడంలేదు. సంగీతం, సాంస్కృతిక కార్యకలాపాలపై మతోన్మాదులు నిషేధం అమలు చేస్తున్నారు. మత ఛాందసవాదులు దేశంలో బహుళ సమాజాన్ని ఎంతమాత్రం అంగీకరించడం లేదు. వీరిలో భారత వ్యతిరేకత నరనరానా జీర్ణించుకు పోవడంతో, భారత అనుకూలురన్న వారిపై అమానవీయ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల రెండు మీడియా సంస్థ లపై జరిపిన దాడులు కేవలం అవి భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నా యన్న ఆరోపణలపైనే కావడం ఇందుకు నిదర్శనం!
-జమలాపురం విఠల్ రావు
సీనియర్ జర్నలిస్ట్





