సాహిత్యం చదవడం, రాయడంలోకి మిమ్మల్ని నడిపిన అంశాలు?
చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో పడుకుని ఆకాశంలో చందమామని చుక్కల్ని చూస్తూ అమ్మమ్మో నాయనమ్మో నక్కబావ కొంగబావ అంటూ కథలు చెబుతుంటే, ఊఁ.. కొడుతూ వినే కాలం ఒకటి ఉండేది కదా ఆ కాలపు ఆఖరితరం వాడిగా కథలమీద ప్రేమ ఏర్పడి ఉండొచ్చు. అలాగ వినడంతో మొదలైన ఆసక్తే చదవడంగా పరిణామం చెంది ఉండొచ్చు. ఇక రాయడం గురించి అయితే వేల ఏళ్ల కిందటి గుహ గోడల మీద చేతిగుర్తుల్ని, వేటాడే బొమ్మల్ని తమ ఉనికి తెలియజేయాలనే ఆదిమానవుల తపనగా చెబుతారు పరిశోధకులు. వాళ్లలాంటి తపనే ఏమో నాది. నేను చూస్తూ పెరిగిన మనుషుల కష్టసుఖాలు, నేను బతికిన క్షణాల చీకటి వెలుగులు వీటన్నిటి ఉనికిని తెలియజేయాలనే తపనే నన్ను రాయడంలోకి నడిపి ఉంటుంది.
చుట్టూ జీవితాల్లోని ఎటువంటి పెయిన్ ని రచనలలోకి తీసుకు రావాలనుకుంటారు?
ఎవరూ చెప్పేందుకు సాహసించని విషయాలను, కుహనా సంస్కారులు అసహ్యపడే కఠినసత్యాలను చెప్పాలి అనుకుంటాను. ఉదాహరణకి మా మండలంలోని ఒక పల్లెలో ఇంటికొక ఆడకూతురు లెక్కన హైవేలో వ్యభిచరించి కుటుంబాలను నిలబెట్టారు. ఓరోజు ఆ పల్లెలో ఒక తమ్ముడు తన అక్కని ఇంట్లో నుంచి బైటకి పోవే లంజా అన్నాడు. దానితో ఆ అక్క నేను లంజనేరా, లంజను కాకుండా సంసారినై ఉంటే ఏనాడో నా దారి నేను చూసుకొని ఉండనా ? నేను పొణుకోని సంపాయిస్తే తిన్న నా కొడుకువి ఈరోజు నన్నే బైటికి పొమ్మంటుండావా, తోడబుట్టినోడివంట్రా నువ్వా? అని భోరున ఏడ్చింది. తండ్రి గాలికొదిలేస్తే బస్టాండులో ముష్టెత్తి మతిస్థిమితం లేని తల్లిని పోషించారు ఇద్దరు చిన్నపిల్లలు. మతపిచ్చితో కాపురాన్ని నరకం చేసుకుంది ఓ ఇల్లాలు, మైనర్ బాలికను తల్లి తండ్రి మేనత్త కలిసి వ్యభిచారంలోకి దించారు.. ఇట్లాంటి జీవితాల్ని రికార్డు చేయడానికి మన సోకాల్డ్ సాహిత్యానికి చేవ ఎక్కడిది? ఐడిలాజికల్ రచయితలకు విశాలమైన చూపు ఎక్కడిది? అందుకే ఇటువంటి అట్టడుగు బతుకు కథలు రాస్తుంటాను.
మునికాంతపల్లి కతలు, సన్ ఆఫ్ జోజప్ప నవలలో మాండలిక భాషని ముఖ్య మాధ్యమంగా ఎంచుకోడానికి కారణాలు?
నేను పుట్టి పెరిగిన దిగువ పంటనాడు (నేటి తిరుపతి జిల్లా ప్రాంతం) మాండలికం ఇప్పటికీ నా నాలుక మీదనే ఉంది. నేటికీ లక్షలాది జనాలు మాట్లాడుతున్న మాండలికం అది. అన్ని మాండలికాలకు మల్లెనే ప్రత్యేకమైన పదసంపద ఉన్న మాండలికం కూడా మాది. దీన్నంతా వదిలేసి నా నెత్తురులోలేని చిలక పలుకుల్ని ఎవరి మెప్పుకోసం నేను అరువుగా పలకాలి? నాబోటి అరకొర రచయితలే లేకపోయి ఉంటే మాండలికాలన్నీ ఈపాటికి తెలుగు సాహిత్యంలో లేకుండా భాషా రాజకీయాలు రూపు మాపేసి ఉండేవి. మాండలికంలో రాస్తే పాఠకులు దొరకరు అని మేధావితనంతో సూత్రీకరిస్తూ కొత్తగా రాసేవాళ్లని దారి తప్పిస్తుంటారు మన తెలుగుసాహిత్యం పెద్దలు. ఉత్తరాంధ్ర మాండలికంలో సిపాయికథలు రాసిన శిష్ట్లా ఉమామహేశ్వరరావు, తెలంగాణా మాండలికంలో రాసిన గోరటి వెంకన్న, ఎగువ పంటనాడు మాండలికంలో రాసిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గొప్ప రచయితలు కారా? వాళ్లకి పాఠకులు లేరా? వాడుక భాషని కాదన్నది సామాన్య జనాల సాహిత్యం కూడా కాబోదు.
రచన చేసేపుడు పాఠకులు మీ దృష్టిలో ఉంటారా?
నేను డ్రాయింగ్ రూం పడకకుర్చీ రచయితని కాను కనుక నా రచనల్లో సంస్కర్తో బోధకుడో ప్రవక్తో ఉండడు. ఏరకమైన ఐడియాలజీ కూడా ఉండదు. వాక్యాన్ని అందంగా తీర్చిదిద్దాలనే వెఱ్ఱి లేదు. రచనలో జీవం లేనప్పుడు ఇలాంటి పై మెరుగులు అవసరపడతాయేమో, నా కథల నిండా మనచుట్టూ ఉండి కూడా మనకళ్లకి, అభిరుచికి ఆనని అధోలోకపు దీనులు, సమాజపు వక్రదృష్టికి హీనులైనవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరి గురించి రాయాలి అనే స్పష్టత తప్ప ఎవరి కోసం రాయాలనే ఆలోచన రాదు.
మీ రచనల మీద తరుచుగా వచ్చే విమర్శ ఏది?
నా రచనల్లో బూతులు విరివిగా ఉంటాయి అంటుంటారు. నిజానికి బూతులు అనే పదం తప్పు, ‘తిట్టు పదాలు’ అనాలి. అసలు విషయం ఏమిటంటే నాది నా పూర్వీకుల జానపద పంథా. తరం నుంచి తరానికి ప్రవహించిన దళిత అల్లిక సాహిత్యపు వీధి కళాకారుల వారసత్వం నాది. దళిత సాహిత్యానికి వెయ్యేళ్ల క్రితపు రాతి చెక్కింపుల శాసనాధారాలు ఉన్నాయి. వాటిమీద ఆంథ్రోపాలజీ స్టడీలు ఉన్నాయి. అందుకనే నేను గొప్పదైన నా జానపద పంథాలో కథలు రాస్తున్నాను. ఇవేవీ తెలుసుకోకుండా మాండలికాలు సాహిత్యంలో తక్కువ స్థాయివి అన్నట్టు, తామేదో తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరిస్తోన్న భాషా ప్రవీణులన్నట్టు మాట్లాడుతుంటారు కొందరు. లిపి ఉన్న భాషలో అంకెలు, పని పదాలు, పేర్లు, తిట్టు పదాలు, మాండలిక పదాలు, ఇలా అన్నీ రాతకు ఎక్కినప్పుడే దాన్ని సాహిత్య పరంగా ఎదిగిన భాష అంటారనీ, కాలాలుగా తెలుగుని తెలుగుగా నిలబెట్టింది మాండలికాలు, పల్లె సంచార సంగీత సాహిత్యాలే కానీ పండితుల సంస్కృత ఛందస్సు కావ్యాలు కాదనీ అంటారు ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ మరియు భాషా పరిశోధకులు స. వెం. రమేశ్ గారు. తమిళ సాహిత్యంలో తిట్టు పదాల్ని చేర్చి రాసే ఒరవడి ముప్పై ఏళ్ల క్రితమే మొదలైంది.
కన్నడ మరాఠీ ఆంగ్లభాషల్లో అంతకు ముందు నుంచే ఉంది. తెలుగులోనే బాగా ఆలస్యంగా 2020 నుంచి నాతో మొదలైంది. ఎందుకంటే నిన్నా మొన్నటి దాకా తెలుగు సాహిత్యం ఆధిపత్య కులాల అదుపాజ్ఞల్లోనూ, వింత వింత మూసల్లోనూ నడిచింది కనుక. దళితుల రచనల్లోనే బూతులు ఉంటాయనేది మరొక అపవాదు. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో విశ్వామిత్రుడు మేనకతో లంజా ఎంత కిందకు గుంజినావే అంటాడు. ప్రసిద్ధ కన్నడ రచయిత బైరప్ప గృహభంగ నవలలో ఓ బ్రాహ్మణ అన్న చెల్లెలి ఇంట్లో రాత్రి నిద్రపోయి తెల్లవారి తన దారిన పోతాడు. అత్తగారు కోడలిని రాత్రి మీ అన్న పక్కలో పడుకున్నావటే అని అడుగుతుంది. గురజాడ ఎన్నెన్ని అగ్రహారపు తిట్టుపదాల్ని తనకథల్లో నమోదు చేయలేదు, ప్రాచీన కవుల తెలుగు సంస్కృత కావ్యాలనిండా స్త్రీల అంగాంగాలను ఎంతెంత బూతుతో వర్ణించలేదు? కాబట్టి దళితులు బూతులు రాస్తారనడమూ, మాండలికంలోనూ పల్లె సాహిత్యంలోనూ బూతులు ఉంటాయనడమూ అజ్ఞానపు కువిమర్శలు.
ద్రావిడ భాషలలో మిమ్మల్ని పోలిన రచయితలు ఎవరైనా తారసపడ్డారా?
తెలుగులో వంశీధరరెడ్డి అద్భుతమైన రచయిత. నాకంటే ముందుగానే తెలుగులో సిటీ హైక్లాస్ చీకటి బతుకుల్ని, మొరటు మెట్రోభాషనీ గొప్పగా కథలు చేశాడు. అయితే నాలుగైదు రచనల తర్వాత ఎందుకనో ఆయన రాయడాన్ని పక్కన పెట్టాడు. గూండ్ల వెంకట నారాయణ తనకథల్లో పల్నాటి బతుకునీ భాషనీ ముసుగు లేకుండా చక్కగా రాస్తాడు. తమిళంలో కీరా మాస్టర్ అని పిలిచే కీ. రాజ నారాయణన్ గొప్ప రచయిత. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో పుట్టాడు. తమిళ మాధ్యమంలో చదవడంతో తెలుగు చదవడం రాయడం తెలియదు కానీ మాట్లాడటం మాత్రమే తెలుసు. ఆయన జానపద శైలిలో రాసిన తిట్టు కథల్ని సెలబ్రేట్ చేసుకున్నారు తమిళ పాఠకులు. ఆయన కథల్లోని పదాలతో ఏకంగా ఒక నిఘంటువునే రూపొందించారు ఆయన అభిమానులు. తన చిన్నతనంలో తన పెద్దల దగ్గరనే తిట్టు కథలు విన్నానని వాటినే రాశానని ప్రకటించాడు కీరా మాస్టర్. తాను తెలుగువాడు కనుక తన కథలు తెలుగుకి అనువాదం అయితే చూడాలని ఆశించేవాడు కానీ అనువాదకులు ధైర్యం చేయకపోవడంతో ఆ కోరిక తీరకనే వృద్ధాప్యంతో చనిపోయారు.
ఎటువంటి సాహిత్యం చదవడానికి ఇష్టపడతారు?
‘రాయడానికి మనకు ధైర్యమైనా, బలమైనా చాలని పుస్తకాన్నే మనం రాయాలి. ఆ పుస్తకం రాసిన మనల్నే మొదటిగా బాధించి వణికించి ఎర్రబార్చి రక్తమోడేలా చేయాలి’ అన్నారు ఫ్రెంచ్ రచయిత్రి హెలెనా సిక్సెస్. మంటో, అలెక్స్ హేలీ, చినువా అచెబె, మహాశ్వేతాదేవి అటువంటి పుస్తకాలు రాసినవారిలో కొందరు. అలాంటి సాహిత్యాన్ని ఇష్టంగా చదువుతాను.
– కె ఎన్ మల్లీశ్వరి





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల