చైనా తన సామ్యవాద అజెండాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పెట్టుబడిదారీ వ్యవస్థను ఏవిధంగా మోహరించిందో మనదేశ విధానకర్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం వుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం భారత్ నాలుగు రోడ్ల కూడలిలో ఉంది . వామపక్ష మరియు మితవాద పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరమన్న అంశాన్ని అంగీకరిస్తున్నప్పటికీ, అవి చూపుతున్న మార్గాలు మాత్రం భిన్నం. ప్రగతిశీల వామపక్షాలు మరింత స్వేచ్ఛతో కూడిన సరళీకృత ప్రజాస్వామ్యాన్ని కోరుతున్నాయి. అదే సంప్రదాయ మితవాద పార్టీలు మరింత స్వేచ్ఛాయుత మార్కెట్ పెట్టుబడిదారి వ్యవస్థ కావాలని కోరుతున్నాయి. ఇందుకోసం స్వేచ్ఛపై కొన్ని పరిమితులు విధించినా ఫరవాలేదనేది వాటి ఉద్దేశం. ఇక మధ్యేవాదం గందరగోళంలో పడటం సహజమే!
20వ శతాబ్దంలో విభిన్న ఆర్థిక భావజాలాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న మాట వాస్తవం. ముఖ్యంగా సామ్యవాదం వర్సెస్ పెట్టుబడిదారి వ్యవస్థలు పరిపాలనలో తమదైన శైలిని ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా సంఘర్షించాయి. మరోరకంగా చెప్పాలంటే సరళీకృత ప్రజాస్వామ్యం, నిరంకుశ పాలన అనే రెండు పద్ధతు ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. 1991లో నాటి యు.ఎస్.ఎస్.ఆర్. పతనం తర్వాత యు.ఎస్. ప్రతిపాదిత స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడి దారీ వ్యవస్థ ఘనవిజయం సాధించిందని అప్పట్లో ప్రకటించుకున్నారు. 1991లో భారత్ అనుసరించిన సంస్కరణల్లో అమెరికా విధానాలనే నమూనాగా తీసుకోవడం జరిగింది. మొత్తంమీద సామ్యవాదానికి , అప్పటివరకు అనుసరించిన దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహక విధానాలకు తిలోదకాలిచ్చి, విదేశీ కంపెనీలకు దేశీయ మార్కెట్లను బార్లా తెరిచారు. అంటే ఎటువంటి సాంకేతిక బదలాయింపులు లేకుండా విదేశీ కంపెనీలకు దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశం లభించింది.
చైనా పాలన పూర్తిగా వికేంద్రీకృతం. స్థానిక సమాజాలకే తమ సమస్యలను పరిష్కరించుకునే స్వేచ్ఛ ఉంటుంది . సామాజిక పురోగతి సంతృప్తిగా కొనసాగుతున్నదాన్ని బట్టి స్థానిక పార్టీ నాయకుల పనితీరును అంచనా వేస్తారు. చైనా నాయకులు, ఆర్థికవేత్తలు వ్యవస్థ గురించే ఆలోచిస్తారు. వీరి దృష్టిలో ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ట సామాజిక వ్యవస్థలో ఒక భాగం. సామాజిక సంక్షేమమే, ఆర్థిక ప్రగతి ప్రధాన లక్ష్యం. ప్రత్యేకించి బలహీన వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమం ప్రధానం. ఎప్పుడైతే ఈ లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థ విఫలమవుతుందో అప్పుడు సంస్కరణలు చేపట్టి సామ్యవాద పంథాలోకి తిరిగి పట్టాలెక్కిస్తారు. ఈ నేపథ్యంలో భారత్ గుడ్డిగా ఇటు పశ్చిమ దేశాలు అటు చైనాను అనుసరించకుండా, తనకు అనువైన మార్గంలో ముందుకెళ్లడం అవసరం.
ఇదే సమయంలో చైనా అభివృద్ధి నిజంగా ఒక అద్భుతమని ఆర్థిక వేత్తలు చెబుతారు. 1980 ప్రాంతంలో భారత్, చైనాల ఆర్థిక వ్యవస్థలు తలసరి ఆదాయపరంగా దాదాపు సమానంగా ఉండేవి . మరిప్పుడు మనదేశంతో పోలిస్తే చైనా తలసరి ఆదాయం, జీడీపీ ఐదు రెట్లు ఎక్కువ! హైటెక్ తయారీ రంగం చైనాలో 48 రెట్లు విస్తరించింది. తన ఆర్థిక సూత్రాన్ని అనుసరించకపోయినా, చైనా సాధించిన అద్భుత ఆర్థిక ప్రగతి యు.ఎస్.ను. భయపెట్టింది. ఇదే సమయంలో పెట్టుబడి దారీవ్యవస్థ విజయంపై యు.ఎస్.లో అప్పటివరకు వ్యక్తమైన ఏకాభిప్రాయం క్రమంగా బీటలువారడం మొదలైంది. ముఖ్యంగా యు.ఎస్. కార్మికుల్లో క్రమంగా పెరిగిన అశాంతి ఈ సైద్ధాంతిక ఏకాభిప్రాయం దెబ్బతినడానికి ప్రధాన కారణం.
ఇదేసమయంలో భారత్‌ను తనవైపు తిప్పుకోవడానికి అమెరికా ఒత్తిడిని తీవ్రతరం చేసింది. కానీ భారత్ అందుకు లొంగకుండా జాగ్రత్తగా అడుగులు ముందుకేస్తోంది. ముఖ్యంగా చైనాతో విస్తారమైన సరిహద్దును కలిగివుండటం, ఇరుదేశాల సైనికుల మధ్య తరచుగా సంఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో భారత్ గతంలో కంటే చాలా వేగంగా స్వయం సమృద్ధిని సాధించాలన్న నిర్ణయానికి వచ్చింది. దేశీయ పరిశ్రమలు బలోపేతం కావాలన్నా, ప్రజల ఆదాయం గణనీయంగా పెరగాలన్నా సంస్కరణలు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో మనదేశ విధాన కర్తలు ఇప్పటికే విఫలమైన పశ్చిమ దేశాల ఆర్థిక విధానాలను పట్టుకొని వేలాడకుండా, చైనా పద్ధతిపై అధ్యయనం కొనసాగించడం చాలా అవసరం.
ఇటీవల విడుదలైన మూడు పుస్తకాలు, సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానాలను కలగలిపి చైనా ఏవిధంగా అభివృద్ధి సాధించిందనే అంశాన్ని లోతుగా విశ్లేషించాయి. మార్కెట్ సంస్కరణలు మరియు షాక్ చికిత్స నుంచి చైనా తప్పించుకున్న విధానంపై జరిగిన చర్చలో పాల్గొన్న జర్మనీ రాజకీయ ఆర్థిక వేత్త ఇసాబెల్లా మాట్లాడుతూ, చైనా నాయకులు అద్భుతమైన నిరంతర అధ్యయన శీలురని ప్రశంసించారు. మహాత్మాగాంధీ మాదిరిగానే వీరు ఎల్లప్పుడూ విభిన్న ఆలోచనా రీతులను అన్నివైపులనుంచి స్వాగతిస్తారు. వీరు పశ్చిమ దేశాల ఆర్థికవేత్తలు చెప్పేది జాగ్రత్తగా వింటారు. కానీ చైనాకు ఏది అనుకూలమో దాన్నే అనుసరిస్తారు. హార్వర్డ్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త డాని రోడ్రిక్, ”పశ్చిమ దేశాల ఆర్థికవేత్తలు ఎవరైనా లేదా వారు చేసిన పరిశోధనల్లోని ఏ కొంత భాగమైనా చైనా ఆర్థిక ప్రగతికి దోహదం చేసిందా?” అని ప్రశ్నించుకొని, తనకు తానే ఈవిధంగా సమాధానం చెప్పారు. ”సంప్రదాయిక రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రతయత్నిస్తే ఎక్కడా అటువంటి పాత్ర వహించినట్టు కనిపించదు.”
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చైనా ఆర్థికవేత్త కెయు జిన్ దేశ అభివృద్ధిపై ఇచ్చే వివరణ ఆసక్తికరంగా ఉంది . చైనా ఆర్థిక, రాజకీయ వ్యవస్థ అనేది సామ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థల పరిధికి ఆవల పనిచేస్తుందనేది ఆమె అభిప్రాయం. పశ్చిమదేశాల ఆర్థిక నమూనాలు, సాంస్కృతిక మరియు సామాజిక శక్తులను ఆర్థిక వ్యవస్థనుంచి ఏవిధంగా పక్కన పెట్టిందీ ఆమె చక్కగా వివరించారు. ఇటువంటి వ్యవస్థలు చైనా పనితీరును అవగాహన చేసుకోవడం కష్టమనేది ఈమె అభిప్రాయం. స్వేచ్ఛా మార్కెట్‌ను ప్రతిపాదించే ఆర్థిక వేత్తలు వివరించలేని “అదృశ్య హస్తాన్ని ” ఈమె దృశ్యమానం చేయగలిగారు. ఆర్థిక మార్కెట్లను, ప్రైవేటు రంగాల కళ్లేలను పట్టుకొని చైనా ప్రభుత్వాలు ఎందుకని నియంత్రిస్తాయో ఆమె చక్కగా వివరించారు. ముఖ్యంగా సమాజంలోని అన్నివర్గాల సంక్షేమం ముఖ్యంగా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొనే చైనా ప్రభుత్వం తన విధానాలను అమలు చేస్తుందని ఆమె విశ్లేషించారు. నిజం చెప్పాలంటే చైనాలో ఆర్థిక సంక్షోభాలు ఇప్పటివరకు ఎన్నడూ ఎదురు కాలేదు. దేశ ఆర్థిక ప్రగతి నిరంతరం కొనసాగుతున్నప్పటికీ చైనా స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పనితీరు ప్రదర్శిస్తున్నదిగా పశ్చిమదేశాల అభిప్రాయం.
చైనా ప్రభుత్వం జీడీపీతోపాటు పౌరుల సంతృప్తి, పర్యావరణ సుస్థిరతను, తన పనితీరుకు ప్రమాణంగా తీసుకుంటుంది. 2000 నుంచి 2019 మధ్యకాలంలో చైనాలో ప్రైవేటు పరిశ్రమలు తొమ్మిది రెట్లు పెరిగాయి. అంతేకాదు ప్రైవేటు కంపెనీలు రిజిస్టర్ చేసుకున్న పెట్టుబడిలో 1/3వ వంతు ప్రభుత్వ వాటా కొనసాగడం, ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల మధ్య ఈక్విటీ పరంగా కొనసాగుతున్న అనుసంధానతకు నిదర్శనం. ఇదే చైనా కార్పొరేట్ రంగంగా రూపొందింది. చైనా ప్రభుత్వం, క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను తగ్గించివేసింది. ప్రైవేటు సంస్థలు తమ లాభాలను సామాజిక లక్ష్యాల సాధనకు ఉపయోగించాలని కోరుతోంది. ఇదే సమయంలో సామ్యవాద మార్గంనుంచి పక్కకు తప్పుకున్న అతపెద్ద సంస్థలు, ప్రైవేటు ఆస్తులు, టెక్ కంపెనీలను ప్రభుత్వం పక్కన పెట్టేసింది.
రాచరిక కాలంనుంచి నేటి కమ్యూనిస్టు పాలన వరకు చైనా అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ప్రజా సంక్షేమానికే. ఎక్కువ యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించిన వారికంటే ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చిన పాలకుడినే ఉత్తమ చక్రవర్తిగా పరిగణించారు. చైనా రాజకీయ శాస్త్రవేత్త జెంగ్ యంగ్‌నియాన్ మాట్లాడుతూ, ప్రస్తుత కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నది కేవలం ప్రజాసంక్షేమ విధానాలే నన్నారు.
చైనా పాలన పూర్తిగా వికేంద్రీకృతం. స్థానిక సమాజాలకే తమ సమస్యలను పరిష్కరించుకునే స్వేచ్ఛ ఉంటుంది . సామాజిక పురోగతి సంతృప్తిగా కొనసాగుతున్నదాన్ని బట్టి స్థానిక పార్టీ నాయకుల పనితీరును అంచనా వేస్తారు. చైనా నాయకులు, ఆర్థికవేత్తలు వ్యవస్థ గురించే ఆలోచిస్తారు. వీరి దృష్టిలో ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ట సామాజిక వ్యవస్థలో ఒక భాగం. సామాజిక సంక్షేమమే, ఆర్థిక ప్రగతి ప్రధాన లక్ష్యం. ప్రత్యేకించి బలహీన వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమం ప్రధానం. ఎప్పుడైతే ఈ లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థ విఫలమవుతుందో అప్పుడు సంస్కరణలు చేపట్టి సామ్యవాద పంథాలోకి తిరిగి పట్టాలెక్కిస్తారు. ఈ నేపథ్యంలో భారత్ గుడ్డిగా ఇటు పశ్చిమ దేశాలు అటు చైనాను అనుసరించకుండా, తనకు అనువైన మార్గంలో ముందుకెళ్లడం అవసరం.

–అరుణ్ మైరా,
పూర్వ ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యులు, .
( ‘మింట్’ సౌజన్యం తో )





