చిన్నారుల మానసిక సంక్షోభం

atla sreenivas
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
స్పెషల్ ఎడ్యుకేటర్ | ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321

వినే చెవులు, అర్థం చేసుకునే హృదయాలు కావాలి

భయం, మౌనం, ఒత్తిడి… చిన్నారుల మనసులో పెరుగుతున్న కనిపించని సమస్యలు – తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సున్నితమైన స్పందనతోనే పరిష్కారం. ఆధునిక యుగంలో తల్లిదండ్రులు పిల్లల శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటున్నప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. స్కూల్‌లో ఒత్తిడి, ఇంట్లో గొడవలు, స్నేహితుల మధ్య పోలికలు .ఇవన్నీ పిల్లల మనసులో కనిపించని గాయాలను మిగులుస్తాయి. నా మనసు చెప్పాలనుకుంటున్నా… కానీ భయంతో మౌనంగా ఉన్నా… అని ఒక చిన్నారి చెప్పే మాట, మన సమాజం ఎంత వరకు పిల్లల భావోద్వేగాలను పట్టించుకుంటుందో ప్రశ్నిస్తుంది. మనం తరచుగా వారి బాహ్య ప్రవర్తనను మాత్రమే గమనిస్తాం. కానీ వారి అంతర్మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడంలో విఫలమవుతాం. ఇదే పరిస్థితి వారికి మానసిక సమస్యల దారితీసే మొదటి అడుగుగా మారుతుంది. పిల్లలు నిత్యం ఎదుర్కొంటున్న భావోద్వేగ ఒత్తిడులు, నిరసనలు, మౌనం ఇవన్నీ కనిపించని గాయాలుగా మిగిలిపోతున్నాయి. చీకట్లో నడిచేటప్పుడు నేను పట్టుకునే చేయి మీదే కావాలి అని తల్లిదండ్రులను కోరుకుంటున్న చిన్నారి మనసులు. పిల్లల మానసిక ఆరోగ్యం – కేవలం కనిపించేది కాదు, అనుభవించేది కూడా.

పిల్లల మనస్సు పచ్చని మొక్క
పిల్లల మనస్సు పచ్చని మొక్కలా సున్నితమైనది. ఒక చిన్న నిర్లక్ష్యం, కఠినమైన మాట, లేదా అశ్రద్ధ చూపు .ఇవి పిల్లల మనసులో భయం, ఆత్మనింద, నిరుత్సాహం వంటి విత్తనాలను నాటుతాయి. అవి పెరిగి పెద్ద మానసిక సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, భారతదేశంలో 13-17 ఏళ్లలోపు పిల్లల్లో కనీసం 15% మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఆందోళన, డిప్రెషన్ ప్రధాన సమస్యలుగా గుర్తించడం జరిగింది. మానసిక ఆరోగ్యం అనేది కేవలం సమస్య లేకపోవడం కాదు. అది పిల్లలు తమ భావాలను అర్థం చేసుకోవడం,కమ్యూనిటీ తో మంచి సంబంధాలు పెంచుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసంతో ఎదగడం ఇవే పిల్లల మానసిక ఆరోగ్యానికి సూచిక.

బాధను చెప్పలేరు
చాలా సార్లు పిల్లలు తమ బాధను చెప్పలేరు. కారణాలు అనేకం. నన్ను కోపంగా చూస్తారు అన్న భయం, నన్ను పిచ్చివాడిలా చూస్తారు అన్న అవమానం, భావాలను వ్యక్తపరచడానికి సరైన పదాలు తెలియకపోవడం, లేదా వాళ్లు వినరేమో అన్న నిరాశ. ఫలితంగా పిల్లలు మాట్లాడలేక మౌనంగా మారతారు, ఒంటరితనాన్ని ఎంచుకుంటారు లేదా ప్రతిఘటన ప్రవర్తనతో స్పందిస్తారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సంకేతాలను పట్టించుకోకపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. ఆకస్మిక మౌనం, నిద్రలేమి, తినే అలవాట్లలో మార్పులు, నేను మంచివాడిని కాదు అనే భావన. ఇవన్నీ గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు. పిల్లల ప్రవర్తనలో కనిపించే ఈ చిన్న మార్పులుగా కనిపిస్తాయి కానీ నిజానికి పెద్ద భావోద్వేగ సందేశాలే.

పిల్లల్లో భయం సహజమైనదే
భయం పిల్లల మౌన శత్రువు. చిన్న వయసులో భయం సహజమైనదే అది వారి యొక్క రక్షణ మెకానిజం. కానీ గుర్తించకపోతే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. స్కూల్‌లో స్టేజ్ మీద మాట్లాడే ముందు, పరీక్షల ముందు, ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు, లేదా చీకట్లో ఒంటరిగా ఉండేటప్పుడు పిల్లలు భయాన్ని అనుభవిస్తారు. పెద్దలు ఇంత చిన్నదానికే భయమా? అని చిన్నచూపు చూడటం, లేదా సిగ్గు పడాలి అని మందలించడం. ఇవన్నీ పిల్లల్లో భయం కంటే అవమానం, నేరపరచే భావనను పిల్లల్లో పెంచుతాయి. ఫలితంగా వారు సమస్యలను ఎదుర్కోవడం మానేసి తప్పించుకోవడం నేర్చుకుంటారు. ఇది స్కూల్ ఫోబియా, నిద్రలేమి, అభ్యాసం లో వెనుకబడి ఉండడం, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది.

భరోసా కల్పించడం అత్యవసరం
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల భయాలను అంగీకరించి, భరోసా కల్పించడం అత్యవసరం. నీకు భయం అనిపిస్తోందా? అని మృదువుగా అడగడం, వారి అనుభూతిని అర్థం చేసుకుంటున్నామనే భావన ఇవ్వడం, ఊహాజనిత భయాలను క్రమంగా వాస్తవానికి అనుసంధానం చేయడం. ఇవన్నీ పిల్లలకు ధైర్యం నింపుతాయి. ప్రతి రోజు కనీసం 15 నిమిషాలు పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడటం, వారు చెప్పే చిన్న విషయాలను గౌరవించడం, అవసరమైతే కౌన్సిలర్ సలహా తీసుకోవడం, ఇవి పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే చిన్న చిన్న చిట్కాలే కావచ్చు కానీ చాలా ప్రభావవంతమైన మార్గాలు గా పని చేస్తాయి.

భావోద్వేగ రక్షణ కూడా ముఖ్యమే
పిల్లల మానసిక సమస్యలు కనిపించకపోయినా, అవి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. వారు చెప్పకపోయినా, వారు బాధపడుతూనే ఉంటారు. వారి ఎదుగుదల బలహీనపడకుండా ఉండాలంటే పెద్దలు వినడం, అర్థం చేసుకోవడం, తీర్పుల్లేకుండా తోడుగా ఉండడం నేర్చుకోవాలి. చీకట్లో నడిచేటప్పుడు నేను పట్టుకునే చేయి మీరు కావాలి… అనే ఒక చిన్నారి మాట మనకు గుర్తు చేస్తుంది. పిల్లల భద్రత కేవలం భౌతిక రక్షణ కాదు, భావోద్వేగ రక్షణ కూడా అంతే ముఖ్యం. వారిని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వారు జీవితాంతం ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *