రక్తం పంచుకున్న బంధాలపై మత్తు దాడి.!

చీకటి రాజ్యంలో చిన్నారులు.. నైతికత నాశనం! 
bumaiah
వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ 9848559863

​ప్రతి ఇంటికి ఒక కల ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులవ్వాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిరంతరం శ్రమిస్తారు. చదువులో చురుకుగా ఉన్న బిడ్డలను చూసి ఆనందించని అమ్మానాన్న ఉండరు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటే ఉపాధ్యాయులు గర్వపడతారు. కానీ, నేడు ఈ సంతోషం ఆవిరైపోతోంది. అనేక కుటుంబాలలో ఈ ఆశలు, కలలు గంజాయి, మాదక ద్రవ్యాల (డ్రగ్స్) రూపంలో వికటాట్టహాసం చేస్తున్న వ్యసనం కారణంగా ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఇది కేవలం మనిషిని కాదు, అతని గుణాన్ని నిట్టనిలువునా చంపేస్తోంది, అతనితో ఉన్న ప్రతి సంబంధాన్ని నాశనం చేస్తోంది.

​ఈ వ్యసనం మొదట్లో సరదాగా, ‘ఒకసారి రుచి చూస్తే ఏమవుతుంది’ అనే ఆలోచనతో ప్రారంభమై, క్రమంగా ఆ కుటుంబాన్ని కల్లోలంలోకి నెడుతుంది. మత్తుకు బానిసైన కొడుకు ప్రవర్తనలో వచ్చే విపరీత మార్పులు, వికృత చేష్టలు చూసి తల్లి భయపడుతుంది. చిన్న చిన్న అవసరాల కోసం, చివరికి వ్యసనం కోసం డబ్బు కావాలని తెలిసి, నాన్న జేబులో డబ్బులు మాయం చేయడం, విలువైన వస్తువులు దొంగిలించడం ఆరంభమవుతుంది. ఈ నేరం క్రమంగా స్నేహితుల సెల్‌ఫోన్లు, అమ్మ నగలు, బైకులు దొంగిలించేంత వరకు వెళుతుంది. ‘జేబులో పెట్టిన డబ్బులు తీసేస్తున్నది కన్న కొడుకే’ అని తెలిసినప్పుడు ఆ తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఈ విషాదకర పరిస్థితి తల్లిదండ్రులకు కంటి నిండా నిద్రను దూరం చేస్తోంది బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం వారిని నిత్యం వెంటాడుతోంది.
​కుటుంబంలో మునుపటి నవ్వులు, ఆటలు, సంతోషాలు పూర్తిగా మాయమై, మౌనం ఆవహిస్తుంది. భార్యాభర్తలు కన్న అందమైన ప్రపంచం అదృశ్యమవుతుంది. విద్యార్థులు తమ ఏకాగ్రతను, లక్ష్యాలను కోల్పోయి చదువులను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల గారాల కొడుకులు సైతం అత్యున్నత టెక్నాలజీ కాలేజీలలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, ఈ వ్యసనం కారణంగా వారి లక్ష్యం నీరుగారిపోతోంది. బెంగళూరులో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువకులు సైతం, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో ఇంటి వద్ద పనిచేసే అవకాశం ఉన్నా, వ్యసనాన్ని కొనసాగించడం కోసం ఇంటికి రాకుండా గదికే పరిమితమై మత్తులో జోగుతున్నారు. ఈ దృశ్యాలు వారి తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాయి.
​వ్యసనం కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేయడమే కాక, సామాజిక విలువలను నాశనం చేస్తోంది. అన్న/తమ్ముడి ప్రవర్తన చూసి చెల్లి/అక్క రాత్రుళ్లు ఒంటరిగా నిద్రపోలేకపోతున్నారు. తాడేపల్లి వంటి ప్రాంతాలలో జరిగిన విషాద సంఘటనలు, అంటే వ్యసనానికి అలవాటైన కొడుకు ప్రవర్తనతో కలత చెందిన తండ్రి మరణించడం, ఆ తరువాత కొడుకుని మార్చలేక తల్లి ఆత్మహత్య చేసుకోవడం… ఈ వ్యసనం ఒక కుటుంబాన్ని ఎంతలా ఛిన్నాభిన్నం చేస్తుందో తెలియజేస్తున్నాయి. అంతకుమించి, మత్తులో ఉన్న కొందరు పిల్లలు వావి వరసలు మరిచిపోయి ప్రవర్తించి, తోబుట్టువులను గర్భవతులను చేసేంత సమాజం సిగ్గుపడే దారుణాలకు పాల్పడుతున్నారు.
​వ్యసనం తీవ్రరూపం దాల్చినప్పుడు నేరాలు కూడా పెరుగుతాయి. దొంగతనాలతో మొదలైన నేరం, క్రమంగా దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు వంటి తీవ్ర నేరాలకు దారితీస్తుంది. మత్తులో ఉండి తల్లిదండ్రులపై దాడి చేయడం, బంధువులతో, తోబుట్టువులతో అనుచితంగా ప్రవర్తించడం చాలా సాధారణంగా మారుతోంది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పోలీసు రికార్డుల ప్రకారం, కరీంనగర్ , నిర్మల్, హైదరాబాద్,విజయవాడ, కృష్ణలంక, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో నమోదవుతున్న నేరాల్లో నిందితులు అధికంగా మాదకద్రవ్యాలు వినియోగించేవారే. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. యువత సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో మొదట విక్రయానికి, ఆపై వినియోగానికి అలవాటు పడుతున్నారు.
​ఈ వ్యసనం బారిన పడిన వారు ఇతరులకే కాదు, తమకు తామే హాని చేసుకోవడానికి వెనుకాడడం లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస ఆత్మహత్యల కేసుల్లో డ్రగ్స్ వినియోగించే వారివే అధికంగా ఉన్నాయి. తమ కళ్ల ముందే ముక్కుపచ్చలారని పిల్లలు నాశనమైపోతుంటే ఆ ఉపాధ్యాయులు పడే బాధ వర్ణనాతీతం. డ్రగ్స్ నిల్వలు, అక్రమ రవాణా, వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈ వ్యసనం ఒకరి జీవితాన్నే కాదు, అతని కుటుంబాన్ని, వారి ఆశలని నేలమట్టం చేస్తోంది. కూలిపోతున్న ఇంట్లో తల్లిదండ్రుల కన్నీళ్లు, భయం గుప్పెట్లో తోబుట్టువుల కాలం గడపడం… భవిష్యత్తు తుడిచిపెట్టుకుపోతున్న భయంకర దృశ్యం.
​మనం ఎటు ప్రయాణిస్తున్నాం?
​చివరికి, ఈ వ్యసనానికి బలౌతున్న కుటుంబాలను చూసినప్పుడు, ఒక భయంకరమైన అయోమయం చుట్టుముడుతుంది. ఈ మత్తు అనేది తమ బిడ్డలను తమ నుండే దూరం చేస్తోంది, వారి లక్ష్యాలను, ఆశలను దహించివేస్తోంది. ఒకప్పుడు చదువుల గురించి, ఉద్యోగాల గురించి కలలు కన్న సమాజం, నేడు కేవలం ‘మా బిడ్డ బతికి ఉంటే చాలు’ అనే స్థితికి చేరుకుంది. ఈ వ్యసనపు కోరల్లో చిక్కుకున్న యువతను వెనక్కి తీసుకురావడానికి కఠిన చట్టాలు, పునరావాస కేంద్రాలు, కౌన్సిలింగ్, పోలీసుల కృషి అవసరం. కానీ, ఎన్ని చేసినా, ఎన్ని జీవితాలు నాశనమైనా… ఈ గంజాయి గ్రీన్‌హౌస్‌ల వికటాట్టహాసం ఆగుతుందా? కుటుంబ బంధాలు పూర్వ స్థితికి చేరుకోగలవా? ఈ సామాజిక విచ్ఛిన్నం ఆగి, తిరిగి మన పిల్లలు ఆనందంగా నవ్వే రోజు వస్తుందా? లేక ఈ మత్తు రక్కసి మన భవిష్యత్తును పూర్తిగా కబళించేస్తుందా? అనే భయంకరమైన ప్రశ్న మాత్రమే మిగులుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *