“అంబేడ్కర్ తొలిసారి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నప్పుడు శంకర్రావు తాను కొంత విరాళాన్ని ప్రకటించి, మిత్రుల వద్ద మరికొంత సేకరించి మొత్తం 5 వేల రూపాయలు అంబేడ్కర్‌కు సహాయంగా అందించారు. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అంబేడ్కర్ ముందుగా శంకర్రావు ఇంటికి వెళ్ళి అభివాదం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారని చరిత్ర చెబుతోంది. శంకర్రావు ప్రోద్బలంతోనే అంబేడ్కర్ ‘బహిష్కృతి సమితి’ అనే సంస్థను స్థాపించి దళితోద్దారక ఉద్యమాన్ని నడిపించారు. ఆ సమితిలో శంకర్రావు కూడా సభ్యుడిగా ఉండి, అంబేడ్కర్‌కు మార్గదర్శిగా నిలిచారు.”
వలస ఒక వేదనే..! కానీ, పట్టుదల ఉంటే ఆ వేదన నుండి, ఆవేదన నుండి అభినవ వేదాలు రాయవచ్చని నిరూపించిన వ్యక్తి పర్శా శంకర్రావు. తెలుగువారికే కాకుండా మరాఠీయులకు కూడా ఆదర్శంగా నిలిచిన శంకర్రావు పూర్వీకులు నిజామాబాద్ నుండి మహారాష్ట్రకు 1800లో వచ్చి స్థిరపడ్డారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందిన శంకర్రావు, ప్రముఖ నాయకులుగా, సామాజిక మార్గదర్శులుగా, సమాజ సుధారకులుగా, పాలనా దక్షులుగా, త్యాగశీలిగా, తెలుగు సాహిత్యాభిమానులుగా, సాహితీవేత్తగా, ఉత్తమ సంపాదకులుగా జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. 10 సెప్టెంబర్, 1881 నాడు జన్మించిన శంకర్రావు పదవ తరగతి వరకు మాత్రమే చదివారు. నిరంతరం ప్రజా ఉద్యమాలలో చురుకుగా ఉండడమే కాకుండా, సామాజిక, ధార్మిక, రాజకీయ రంగాల్లో కూడా క్రియాశీలకంగా ఉండేవారు. ఈ ఉద్యమ స్ఫూర్తి ఆయనను లోకమాన్య బాలగంగాధర్‌కు సన్నిహితున్ని చేసింది. తిలక్ ప్రోద్బలంతోనే శంకర్రావు 1898లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు.
తిలక్‌తో పాటు శంకర్రావు కూడా దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్రిటిష్ వారి దమననీతికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా తిలక్ ప్రవేశపెట్టిన సార్వజనిక గణేశోత్సవాలలో శంకర్రావు కీలకంగా వ్యవహరించారు. తిలక్ స్థాపించిన కమాటిపురాలోని 13వ గల్లీ సార్వజనిక గణేశోత్సవ మండలికి శంకర్రావు కార్యదర్శిగా ఉంటూ స్వాతంత్య్ర పోరాటం చేశారు. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయిలో తెలుగువారి సమస్యల పరిష్కారానికై శంకర్రావు ‘తెలుగు మిత్ర మండలి’ అనే సంస్థను కమాటిపురాలో స్థాపించారు. దాంతో పాటు నగరంలో నలుమూలలా బ్రాంచి కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు.
శంకర్రావు గొప్ప పరిపాలనా దక్షత కలిగిన వారు. 1908లో హైదరాబాద్‌లో వచ్చిన తీవ్రమైన వరదల వల్ల బాధితులైన వారి సహాయార్థం శంకర్రావు ముంబయిలో ‘తెలుగు మిత్ర మండలి’ ద్వారా భారీ విరాళాలు సేకరించి పీడితుల్ని ఆదుకున్నారు. 1909లో ‘తెలుగు ఎడ్యుకేషన్ ఫండ్’ ను స్థాపించి సేకరించిన విరాళాలతో ఒక విద్యానిధిని ఏర్పాటు చేసి వేలాది మంది తెలుగు విద్యార్థులకు చేదోడు వాదోడుగా నిలిచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు.
తెలుగు భాషంటే ఎంతో అభిమానం ఉన్న పర్శా శంకర్రావుకు నిజానికి తెలుగు రాయడం, చదవడం అంతగా రాదు. అయినా తెలుగువారి చరిత్రల్ని, తెలుగు భాషాఔన్నత్యాన్ని ఇంగ్లీష్ పుస్తకాల్లో చదివి, వాటిని మరాఠీలోకి అనువదించి, హిందూ ప్రకాశ్, జ్ఞాన ప్రకాశ్ లాంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురించి, మరాఠీయులకు తెలుగు భాష శ్రేష్టత గురించి తెలియచేప్పేవారు. అంతేగాక, తెలుగు వాంగ్మయం, శ్రీకృష్ణదేవరాయ అనే రెండు గ్రంథాల్ని మరాఠీలోకి స్వయంగా అనువదించి తెలుగు తనాన్ని, కృష్ణదేవరాయ తత్వాన్ని మహారాష్ట్ర ప్రజలకు తెలియచెప్పి తెలుగు వారి గౌరవాన్ని పెంచారు పర్శా శంకర్రావు.
ముంబైలో తెలుగువారు కులాలు కులాలుగా విడిపోయి ఉండడాన్ని చూసి శంకర్రావు ఖిన్నుడయ్యేవాడు. తెలుగువారిలో ఐక్యతా భావాన్ని పెంచేందుకు, అప్పట్లో అహ్మద్‌నగర్ జిల్లా డిప్యూటి కలెక్టర్‌గా ఉన్న పోరెడ్డి సయాజీ అధ్యక్షతన ముంబయిలో, 1915లో, మొదటి తెలుగు సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ప్రముఖ తెలుగు నాయకులతో పాటు డా||అంబేడ్కర్, కేత్కర్ లాంటి గొప్ప నాయకులు కూడా పాల్గొన్నారు. తెలుగు వారిలో సంఘటిత శక్తిని పెంచేందుకు, అశాస్త్రీయ మూఢ విశ్వాసాలను రూపు మాపేందుకు, బాల్య వివాహాలు, అంటరానితనం లాంటి సామాజిక దుర్వ్యవస్థల నుండి ముక్తి కలిగించేందుకు పలు తీర్మానాలు చేశారు. అంతేగాక, తెలుగువారిలో సామాజిక స్పృహ పెంచేందుకు తెలుగు పత్రికలు నిర్వహించాలనీ నిర్ణయించారు. ఆ తీర్మానం ప్రకారమే 1917లో శంకర్రావు సంపాదకత్వంలో ‘తెలుగు సమాచార్’ అనే పత్రిక ఏర్పాటయింది. తర్వాతి కాలంలో తెలుగు సమాచార్ పత్రిక తెలుగు స్వాభిమాన పత్రికగా పేరుపొందడం చరిత్ర చెప్పిన సాక్ష్యం. ఇదే స్ఫూర్తితో ‘తెలుగు మిత్ర’ అనే పత్రిక కూడా వెలువడి తెలుగువారి అభిమానాన్ని చూరగొంది. ఈ పత్రికలు మరాఠీలిపిలో ఉండేవి. భాష మాత్రం తెలుగే ఉండేది.
1926లో సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు సమాచార్ ప్రత్యేక సంచిక విడుదల చేశారు. ఈ ప్రత్యేక సంచికలో తెలుగు భాషా, చరిత్ర తదితర అనేక అంశాలపై మరాఠీ భాషలో 140 పేజీలు, ఇంగ్లీష్‌లో 100 పేజీలు, తెలుగులో 30 పేజీలు … మొత్తం 270 పేజీల ఈ ప్రత్యేక సంచిక ఒక చరిత్రను సృష్టించింది. శంకర్రావు సంపాదకత్వ ప్రతిభకు, పట్టుదలకు, నిబద్దతకు, చిత్తశుద్ధికి ఈ ప్రత్యేక సంచిక పట్టం కట్టిందని చెప్పొచ్చు.
పర్శా శంకర్రావు నేతృత్వంలోనే 1925లో రెండవ తెలుగు సమ్మేళనాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. కమాటిపురాలోని మున్నూరువాడిలో నిర్వహించిన ఈ భారీ సమ్మేళనంలో ‘హైదరాబాద్ సంస్థాన్ ప్రజా పరిషద్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఈ పరిషద్ తెలుగువారి ఉద్యమ సంస్థగా పేరుపొందింది. ఈ సమ్మేళనంలో ముంబయి విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం ఉండాలనీ డిమాండ్ చేశారు. కానీ, ఆ డిమాండ్ ఇప్పటి వరకు కూడా నెరవేరక పోవడం విచారకరం.
రాజకీయాలకంటే శంకర్రావు సామాజిక సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ఆయన సోషల్ సర్వీస్ లీగ్, సర్వీస్ ఆఫ్ ఇండియా సొసైటీ, స్టూడెంట్స్ లిటరరీ సొసైటీ, సేవాసదన్ లాంటి పలు సంస్థల్లో సభ్యుడిగా ఉంటూ నిస్వార్థంగా సేవలందించేవారు. వెస్టర్స్ ఇండియా లిబరల్లో సభ్యుడిగా ఉండడం వల్ల గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్‌షా మెహతా, డా||బాబా సాహెబ్ అంబేడ్కర్, రావ్‌సాహెబ్ జరుకర్, కేత్కర్ లాంటి మహామహులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అంబేడ్కర్ తరచూ శంకర్రావు ఇంటికి వస్తూ ఉండేవారు. సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం వల్ల శంకర్రావుకు డా||సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, టంగుటూరి ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి, కాశీనాథుని నాగేశ్వరరావు, కట్టమంచి రామలింగారెడ్డి, పట్టాభి సీతారామయ్య, మాడపాటి హనుమంతరావు లాంటి ప్రముఖులతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. తిలక్ మరణానంతరం గాంధీజీ నేతృత్వం ముందుకు వచ్చింది. శంకర్రావు గాంధీజీ పిలుపునందుకొని కమాటిపురాలో ఉన్న మున్నూరుకాపు కులానికి చెందిన 7 మందిరాల్లో ఒకేసారి దళితులను ప్రవేశింపచేసినపుడు ముందు వరుసలో ఉన్నారు.
అంబేడ్కర్ తొలిసారి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నప్పుడు శంకర్రావు తాను కొంత విరాళాన్ని ప్రకటించి, మిత్రుల వద్ద మరికొంత సేకరించి మొత్తం 5 వేల రూపాయలు అంబేడ్కర్‌కు సహాయంగా అందించారు. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అంబేడ్కర్ ముందుగా శంకర్రావు ఇంటికి వెళ్ళి అభివాదం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారని చరిత్ర చెబుతోంది. శంకర్రావు ప్రోద్బలంతోనే అంబేడ్కర్ ‘బహిష్కృతి సమితి’ అనే సంస్థను స్థాపించి దళితోద్దారక ఉద్యమాన్ని నడిపించారు. ఆ సమితిలో శంకర్రావు కూడా సభ్యుడిగా ఉండి, అంబేడ్కర్‌కు మార్గదర్శిగా నిలిచారు.
భారత్‌భూషణ్ ప్రింటింగ్ ప్రెస్ కోసం స్థలాన్ని కెటాయించడమే కాకుండా ప్రింటింగ్ ప్రెస్‌కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా పర్శా శంకర్రావుతో పాటు మరికొందరు పూనుకొని అంబేడ్కర్‌కు అండగా నిలిచారు. 1930లో పరేల్‌లోని దామోదర్ హాల్లో జరిగిన ఒక సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ, తెలుగువారి సహాయం గురించి, ముఖ్యంగా శంకర్రావు గురించి ఎంతో ఆర్ధ్రంగా తన మనోగతాన్ని వెల్లడించారు. మహారాష్ట్రలో శంకర్రావును తెలుగు భీష్ముడిగా అభివర్ణిస్తారు. త్యాగశీలిగా, నిస్వార్థ, నిష్కామ, నిరాడంబర కర్మయోగిగా, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పర్శా శంకర్రావు 6 ఎప్రిల్, 1939 నాడు తన తనువును చాలించారు.
– సంగెవేని రవీంద్ర
– 99871 45310